Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాదైన ప్రపంచం

nadaina prapancham

గత సంచిక లోని  నాదైన ప్రపంచం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.....http://www.gotelugu.com/issue231/639/telugu-serials/naadaina-prapancham/nadaina-prapancham/

 

(గత సంచిక తరువాయి)... సర్వీస్ నెట్ కి కొట్టుకోవడం ఎంత అవమానమో అందరికీ తెలుసు. ఆటలో ఓనమాలు నేర్చుకునే వాళ్ళు చేసే మిస్టేకది. నిశ్చేష్టురాలై నిల్చుంది.

‘‘కీర్తనా! కమాన్ ఛీరప్....’’ మిగతా వాళ్ళు ఎంకరేజ్ చేశారు. ప్లేసు మారారు. అయిదారు సర్వీస్ లయ్యే సరికి తేలి పోయింది. హైదరా బాద్ టీమ్ లో వీక్ పాయింట్ ఎవరో.....

అయితే ఎవరూ జీర్ణించుకో లేని విషయం ఏంటంటే ఆ వీక్ పాయింట్ కీర్తన కావడం.....

అంతే! ఇక ఆమె మీదకి దాడి ప్రారంభమైంది. పదే పదే ఆమె మీదకే బాల్ విసురుతున్నారు.

త్వరగా అలసి పోతోంది కీర్తన. గేమ్ స్వరూపమే మారి పోయింది.

హైదరా బాద్ జట్టులో అందరిలో అసహనం ప్రారంభమైంది.

కృష్ణా టీమ్ ఫెయిర్ గేమ్ ఆడటం లేదు. అలాగని వాళ్ళు ఆడే గేమ్ తప్పు కాదు. రూల్స్ కి అనుగుణంగా ఆడుతున్నారు.

అయితే వీక్ పాయింట్ మీద పదే పదే బాల్ విసిరి పాయింట్స్ తెచ్చుకోవటం నైతికంగా సమర్ధనీయం కాదు. కానీ వాళ్ళు చెప్పే సామెత ఒకటే నువ్వు ఏం చేస్తావన్నది ముఖ్యం అని.....

అందరూ షాక్ నుంచి తేరుకునే లోపే ఫస్ట్ సెట్ 10`15తో ఓడి పోయారు.

పది నిమిషాలు రెస్ట్ దొరికింది. టీమ్ మేట్స్ అంతా డిస్టర్బ్ డ్ గా వున్నారు.

‘‘ఏమయింది కీర్తనా.....!?’’ ఒకమ్మాయి ఆపుకో లేక అడిగేసింది.

బేలగా చూసింది కీర్తన. తను మ్యాచ్ ఆడటం లేదు. తనలో ఆవహించిన భూతమేదో ఆడుతోంది. కీర్తనేనా ఇలా ఆడుతోంది. నేనెందుకిలా ఆడుతున్నాను. భయంగా వుంది.

‘‘ఏం ఫర్లేదు, అన్నీ మర్చిపో! మన లక్ష్యం ఏంటో గుర్తు తెచ్చుకో. అదే మనకి ముఖ్యం. ఇంకేమీ మైండ్ లోకి రానివ్వకు.’’ ఇంకో అమ్మాయి కౌన్సిలింగ్ చేస్తోంది.

రిఫరీ విజిల్ విన బడ గానే మళ్ళీ అందరూ గ్రౌండ్ లోకి ప్రవేశించారు.

తన ప్లేస్ లో నిల్చునిని వూపిరి భారంగా పీలుస్తూ కళ్ళు మూసుకుంది. మూసిన వెంటనే ఆకాష్ ప్రత్యక్షమయ్యాడు.

ఎదుటి జట్టు కెప్టెన్ చేసిన సర్వీస్ సెంటర్ లో ఉన్న తన వైపుకే దూసుకుని వస్తోంది...

గుడ్డిగా చేతులు అడ్డు పెట్టింది. అది చేతికి తగిలి ఇంతెత్తున లేచింది. రైట్ స్పైకర్ కోర్టు దాటి చాలా దూరం వెళ్ళి అతి కష్టం మీద దాన్ని మరలా కోర్టు లోకి పాస్ చేస్తే.....

బూస్టర్ దాన్ని నార్మల్ గా అవతలి కోర్టుకి పంపించింది. ఆ ఎటంప్ట్స్ లోనే వాళ్ళు దాన్ని తిరుగు లేని స్మాష్ గా మలిచారు.

టీమ్మేట్స్ కీర్తన వంక కోపంగా చూశారు. ఆ తర్వాత కూడా గ్రౌండ్ లో ఆమె కదలికలు చాలా మంద కొడిగా కనిపించాయి.

అప్పటికే 0`6 లీడింగ్ లో ఉంది కృష్ణా టీమ్. హఠాత్తుగా హైదరా బాద్ టీమ్మేట్స్ కి ఒకటే అనిపించింది. కీర్తన ప్లేస్ లో సబ్సిట్యూట్ పెడితే అని.....

ఆ ఆలోచన వచ్చినందుకే ఉలిక్కి పడ్డారు. కీర్తన కెప్టెన్. ఆమె ప్లేస్ లో ఇంకొకరినా....?

స్కోర్ 0`7కి వెళ్లింది. డైరెక్ట్ ఎయిట్ పాయింట్స్ అయితే గెలిచినట్లే. అది మ్యాచ్ పాయింట్. ప్రత్యర్ధి జట్టు చాలా హుషారుగా వుంది.
హైదరా బాద్ టీమ్ వాళ్ళు తేరుకో లేనంత బాధలో వున్నారు. ఇన్నాళ్ళ గేమ్ లైఫ్ లో ఎన్నడూ 0`8తో ఓడింది లేదు. అదీ మొదటి సారిగా....కెప్టెన్ మూలంగా ఓడి పోతున్నాం. అనుకుంటే బాధగా వుంది.

టైమ్ అవుట్ తీసుకుని బైటకి వచ్చారు. కీర్తన ఏదో ఆలోచిస్తూ న్చిుంది. స్కోర్ సరిగా చూడ లేదు. ఓడి పోతున్నామని తెలుసు. అదీ బాధే, ఆకాష్ కూడా బాధే!

ఏది ఎక్కువ బాధ...? ఒక దగ్గర మొదలైన ఆలోచనలు అలా అల్లి బిల్లిగా అల్లుకు పోతూనే వున్నాయి.

వైస్ కెప్టెన్ మెల్లగా చెప్ప బోతూ కీర్తన దగ్గరకి వచ్చింది. ఆ అమ్మాయి ఏవో చెప్ప బోతూ సందేహిస్తోంది.

‘‘కీర్తనా!....’’ పిలిచింది.

‘‘ఏంటీ....?’’ ఆమె వంక చూస్తూ అంది.

‘‘నీకు హెల్త్ బాగోనట్లుంది. నువ్వు రెస్ట్ తీసుకో!’’

ఇన్ డైరెక్ట్ గా తన అభిప్రాయం చెప్పింది.

మొదట ఆ అమ్మాయి ఏమందో అర్ధం కాలేదు. అర్ధం కాగానే మొహం వివర్ణమై పోయింది.

అప నమ్మకంగా చూస్తూ వెనక్కి వచ్చేసింది. మ్యాచ్ బిగినయింది. కొత్తగా ప్రవేశించిన అమ్మాయి బాగానే ఆడుతుంది. వాళ్ళు సర్వ శక్తులూ ఒడ్డి కృష్ణా జట్టు సర్వీస్ బ్రేక్ చేశారు. హైదరా బాద్ టీమ్ వైస్ కెప్టెన్ మనసు లోని కసినంతా బాల్ పై చూపిస్తూ సర్వీస్ చేయడంతో వరుసగా రెండు పాయింట్లు వచ్చాయి.

తర్వాత మ్యాచ్ ఫిఫ్టీస్ వరకూ వెళ్ళింది. 3`15తో ఆ సెట్ కృష్ణా జట్టు గెల్చుకోవడంద్వారా స్టేట్ ఛాంపియన్ షిప్ ని కృష్ణా జట్టు గెలుచుకుంది.
దూరంగా కుర్చీలో విభ్రాంతిగా కూర్చున్న కీర్తన వంక సానుభూతిగా చూసింది కృష్ణా కెప్టెన్.

ఆమె ఈ రోజు ఎంత ఆత్మ హత్యా సదృశ్యమైన ఆట ఆడిందో చూసిన వాళ్ళందరికీ తెలుసు.

ప్రెజంటేషన్ సెర్మనీలో రన్నర్స్ కప్ తీసుకోవడానికి కూడా వెళ్ళ లేదు. వైస్ కెప్టెనే కప్ తీసుకుంది.

టీమ్ మేట్స్ వచ్చి భుజం తట్టి వెళ్ళారే తప్ప పకరించే సాహసం చేయ లేక పోయారందరూ.

వాళ్ళందరికీ తెలుసు. కీర్తన ఎలాంటి ప్లేయరో. ఆమెను తప్పించి సబ్సిస్టిట్యూట్ ని పెట్టడం ఎంత గాయ పరుస్తుందో తెలుసు. అదీ కాక అవమానం కూడా.....

కానీ 0`8తో ఓడి పోవడం అన్నది టీమ్ అంతటికీ అవమానం. తప్పని సరి పరిస్థితుల్లో ఆ పని చేయాల్సి వచ్చింది. కీర్తన అర్ధం చేసు కోగలదు అనుకుంటూనే వాళ్ళు వెళ్ళి పోయారు.

ఎవరు రమ్మన్నా రాలేదు. అక్కడే కూర్చుండి పోయింది. జనం పలుచ బడుతున్నారు. గెలిచిన జట్టు ఉత్సాహం గానూ, ఓడిన జట్టు నిరుత్సాహం తోనూ స్టేడియం ని వదిలి వెళ్ళారు. గెలిచినపుడు అందరూ నీ చుట్టూ వుంటారు.

కానీ ఓడినపుడు...నీకు నువ్వు తప్ప ఎవరూ ఉండరు. నువ్వు చాలా ఒంటరి అయి పోతావు.

ఆ వంటరి తనాన్ని అనుభవిస్తూ అక్కడే కూర్చుంది.

ఆమె చేతిలో తనని ఓడించిన బాల్ వుంది. కృష్ణా కెప్టెన్ ని రిక్వెస్ట్ చేసి ఆ బంతి తీసుకుంది ఆమె. జనరల్ గా విన్నింగ్ టీమ్ కే అది చెందుతుంది.

కను చీకట్లు ముసురు తున్నాయి. స్టేడియంలో నార్మల్ లైట్ ఇంకా వెలగ లేదు.

నిర్వాహకులు అన్నీ సర్దుకుంటున్నారు. కీర్తన ఇంకా అన్య మనస్కంగా ఆ కోర్టు వంకే చూస్తోంది. ఇక్కడే తను ఓడి పోయింది. జీవితంలో మర్చి పోలేని చేదు అనుభవాన్ని మిగిల్చింది.

తనలో ప్రవేశించిన బల హీనతని అందరూ పసి గట్టేశారు. అందుకే తనని ఉక్కిరి బిక్కిరి చేశారు. ఎప్పుడూ పొరపాటున కూడా తన వైపు బాల్ విసరడానికి భయ పడే వాళ్ళు ఈ రోజు పదే పదే తనని టార్గెట్ చేశారు. 

అవమానం లోంచి విపరీతమైన కసి పుట్టుకొచ్చింది. తననీ పరిస్థితిలోకి నెట్టిన మనిషి కనిపిస్తే ఆ క్షణంలో హత్య చేయడానికి కూడా వెనుకాడనంత ద్వేషం పుట్టుకొచ్చింది.

ఒక ఛీటర్ కోసం తన ప్రాణ ప్రదమైన ఆటని నిర్లక్ష్యం చేసింది అనుకోగానే తన మీదన తనకే అసహ్యం కలిగింది.

బాల్ ని తీసుకుని గ్రౌండ్ లోకి వచ్చింది. బ్యాక్ లైన్ దగ్గిర నిలబడి సర్వీస్ చేసింది. మళ్ళీ సర్వీస్ నెట్ కే కొట్టుకుంది. తన ఆట తీరుని తనే నమ్మ లేక పోతోంది. తనలో ఇంత మందకొడి తనం ఎలా ప్రవేశించింది....?

దుఃఖం, నిలువెల్లా ముంచెత్తగా మోకాళ్ళ మీద కోర్టులో కూల బడి పోయింది. ఎంత సేపు ఆ స్థితిలో వుండేదో కానీ ‘హలో!’ అన్న పిలుపు వినిపించి చివ్వున తలెత్తి చూసింది.

ఎదురుగా ఎవరో పొడవాటి యువకుడు. ఎక్కడో చూసిన జ్ఞాపకం. మనసు పొరల్లో నిక్షిప్త మయి పోయిన పేరు, పైకి రావడానికి ప్రయత్నిస్తోంది.

ఎదురుగా చిరునవ్వుతో నిల్చున్నాడతను. నెట్ కి కొట్టుకొని నిస్తేజంగా కింద పడి వున్న బంతిని చేతిలోకి తీసుకున్నాడు. తనకి దగ్గరగా వస్తున్నాడు.

అతను ఎంత మారినా తను గుర్తు పట్ట గలదు. అతనే! తను సంపూర్ణ క్రీడాకారిణిగా మారడానికి దోహదం చేసిన మనిషి అతనే. తను నెంబర్ వన్ క్రీడాకారిణిగా ఎదగడానికి కారణమైన వ్యక్తి.

కానీ....కానీ....తను ఎంతో గొప్పగా ఆడిన మ్యాచ్ కిరాని మనిషి ఇప్పుడు యిలా హీనంగా, దీనంగా యితని ముందు ఎదురు పడాల్సి వస్తుందని అనుకో లేదు.

అవమానంతో తల దించుకుంది.

‘‘రండి! ఆడదాం....’’ పిలిచాడు.

‘‘నేను ఆడ లేను. నాకు ఆట రాదు....’’ నిస్పృహగా అంది.

‘‘ఎందుకు ఆడ లేరు?’’

‘‘ఏమో! ఈ రోజు నా మూలం గానే మా టీమ్ ఓడి పోయింది. చివరికి కెప్టెన్ ని తప్పించి సబ్సిస్టిట్యూట్ ని పెట్టడం మీరు ఎక్కడైనా చూశారా?’’ ఉక్రోషంగా అంది.

‘‘అదే ఎందుకలా జరిగింది?’’

దిగులుగా తల దించుకుంది. మరింత దగ్గరగా వచ్చి చేత్తో ఆమె గడ్డాన్ని పైకెత్తాడు.

‘‘నాకు తెలుసు. నేను చెప్పనా?’’ చిరు నవ్వుతో అన్నాడు.

‘‘తెలుసా?’’ విభ్రాంతిగా చూసింది.

‘‘ఊఁ! లవ్ అటాక్, హార్ట్ మీద ఎటాక్. ఇదే మీ వీక్ పాయింట్. నాలుగేళ్ళ కిందట స్మాష్ కొట్టడంలో....వీక్ కానీ ప్రాక్టీస్ మీద దాన్ని సాధించారు. కానీ హార్ట్ వీకయితే, కోర్టులో అన్ని ప్లేసుల్లోనూ  వీకయి పోవద్దని నాలుగేళ్ళ కిందటే హెచ్చరించాను గుర్తుందా?’’ అడిగాడు ప్రణీత్.

గుర్తుకు వచ్చింది. అతనన్న మాటలు ఎన్నో సార్లు మననం చేసుకున్నా వాటికి అర్ధం తెలియ లేదు. ఇప్పుడే కదా తెలిసింది. అనుభవం మీదే కదా ఏదన్నా గ్రహించేది.

అతను ఎంత బాగా చెప్పాడు? ఆ మాటలకి అర్ధం అప్పటి మనసుకి తెలియక పోయినా, కాల క్రమేణా గ్రహించినా  బావుండేది.
‘‘అసలు ఆకాష్ ఏం చేసాడో తెలుసా?’’ ఏదో చెప్ప బోయింది కీర్తన.

చెయ్యెత్తి వారించాడు ప్రణీత్!

‘‘ఆ  విషయాలు ముందు అందరితో మాట్లాడటం మానేస్తే, తర్వాత మెల్లగా మీతో మీరు మాట్లాడు కోవటం మానేస్తారు.’’

(సశేషం)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
premiste emavutundi