Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమిస్తే ఏమవుతుంది?

premiste emavtundi

గతసంచికలోని ప్రేమిస్తే ఏమవుతుంది సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి...http://www.gotelugu.com/issue232/642/telugu-serials/premiste-emavutundi/premiste-emavutundi/ 

 

(గత సంచిక తరువాయి)... గోల్కొండ వెళ్లి వచ్చాక మరో వారం రోజులు గడిచాయి. ఈ మధ్యలో గాయత్రి, రమేష్ లు ఒక్కసారి కూడా కలుసుకోలేదు. రమేష్ ప్రతి రోజూ ఆమె కాలేజ్ కి వెళ్ళే సమయంలో వేప చెట్టు దగ్గర ఎప్పుడూ నిలబడే భంగిమ లోనే నిలబడుతున్నాడు కాకపోతే బండి లేదు. 


గాయత్రి మాత్రం  అతడిని తప్పించుకుని వెళ్ళిపోతోంది. ఆమె వెళ్ళిందాకా చెట్టు దగ్గర నిలబడడం, ఆమె తల వంచుకుని సందు మలుపు తిరగగానే ఆమెని కలుసుకోడానికి ఎంత వేగంగా నడిచి వెళ్ళినా ఆమె చిటికెలో మాయం అయిపోతోంది. 

రమేష్ షోగ్గా తిరిగిన బండి రెండో కొడుకు సురేష్ కి ఇచ్చేశాడు గంగరాజు . బస్సు లో వెళ్లి రావడం కష్టంగా ఉందని,  పైగా ఇప్పుడు సురేష్ కి బిజినెస్స్ ప్రమోషన్ లో భాగంగా సైట్ మీద తిరిగే పని ఇచ్చాడు వాళ్ళ బాస్. ఉద్యోగం చేస్తున్న వాడు బస్సులో అవస్థలు పడుతూ తిరగడం బలాదూర్ తిరిగే రమేష్ బండి మీద తిరగడం గంగరాజుకి నచ్చలేదు.  అందుకే దుర్గమ్మ, రమేష్ ఇద్దరూ గొడవ చేసినా పట్టించుకోకుండా బండి రెండో కొడుక్కి ఇచ్చాడు.  బండి లేకపోవడం చాలా అవమానంగా ఉంది రమేష్ కి.  అతని స్టేటస్ కి భంగకరంలా బాధపడుతున్నాడు. పైగా దుర్గమ్మ మొబైల్ కొనిచ్చాక పాకెట్ మనీ ఇవ్వడం లేదు. ఆ రోజు గోల్కొండ వెళ్ళే రోజు గొడవ చేసి, కాలేజ్ లో కట్టాలని అబద్ధం చెప్పి వేయి రూపాయలు తీసుకుని దర్జాగా ఖర్చు పెట్టేసాడు.  ్ఇప్పుడు జేబులో తిప్పి, తిప్పి కొడితే వందో, నూట యాభై ఉంటున్నాయి. అవి కూడా మధ్య, మధ్య అన్నగారి జేబులోంచి, తండ్రి జేబులోంచి కొట్టేస్తుంటే. 

చదువు మూట కట్టి వేప చెట్టు మీద పెట్టేసాడు. అది బైటకి తీయాలంటే పాండవులు తమ ఆయుధాలు తీసినట్టు ఏదన్నా ఒక అకేషన్ రావాలి ... అది ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో, రాదో కూడా అతనికి తెలియదు.. పెద్దగా ఆ విషయంలో అతను బాధ పడడం లేదు. అతని బాధంతా గాయత్రి ... ఆమెని కలుసుకోవాలి.. ఆమెతో షికార్లు తిరగాలి.. ప్రేమాయణం నడపాలి. తన చుట్టు పక్కలే ఉన్న అందమైన అమ్మాయి గాయత్రిని తను ప్రేమించడం చాలా ఆలస్యం చేసానని అతనికి చాలా అసహనంగా అనిపిస్తుంది.  అతి కష్టం మీద ఆమెని కలుసుకుని తను ప్రేమిస్తున్న విషయం చెప్పేసాడు... చెప్పిన దగ్గరి నుంచి ఆమె కూడా తనని గాఢంగా ప్రేమిస్తోందని గట్టిగా విశ్వసిస్తున్నాడు 

ఆమె కూడా తన లాగే కాలేజ్ ఎగ్గొట్టి తనతో షికార్లకు వస్తుందని, ఇద్దరూ కలిసి ఒక రోజు, గోల్కొండ, ఒక రోజు గండిపేట, మరో రోజు జూ పార్క్ ఇలా చెట్టపట్టాలేసుకుని తిరిగేద్దాం అని ఆశించాడు.. సినిమాల్లో లాగా ఇద్దరు కింద, మీదా పడుతూ డాన్స్ లు కూడా చేసేస్తారని కూడా ఆశ పడ్డాడు. కానీ గాయత్రి  వాలకం అతనికి నిరాశ కలగ చేస్తోంది.  ఆమె తనని ఖచ్చితంగా ప్రేమిస్తోంది కానీ చెప్పడం లేదు.. చెబితే వాళ్ళ నాన్న చంపేస్తాడు అని భయం కాబోలు అనుకుంటాడు. ప్రతి దానికి నాన్న , నాన్న అంటూ భయపడే గాయత్రికి బ్రెయిన్ వాష్ చేయాలని , ఆమెలో వాళ్ళ నాన్న అంటే ఉన్న భయం పోగొట్టాలని గోల్కొండ వెళ్ళిన రోజే నిర్ణయించుకున్నాడు. ఆ రోజు కొంచెం సేపే కౌన్సిలింగ్ చేయగలిగాడు... ఇంతలోకి మనసులో ఆమె పట్ల మోహం కలిగింది.. కొంచెం చనువు చూపించేసరికి ఆమె బెదిరిపోయి వెళ్ళిపోతాను అని గొడవ చేయడంతో సాయంకాలం దాకా ఆమెతో గడపాలన్న కోరిక తీరలేదు.  అప్పటి నుంచి మళ్ళీ అలాంటి అవకాశం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు.. 

గాయత్రిని ప్రేమించకుండా ఉంటే  చాలా ప్రమాదం అనిపిస్తోంది. తను ప్రేమించక పోతే వేరే ఎవరైనా ఖచ్చితంగా ప్రేమిస్తారు.  కాలేజ్ మేట్ కావచ్చు, లేక రోడ్డు మీద వెంటపడే వాడు కావచ్చు, లేక లెక్చరర్ కావచ్చు... ఎవరైనా సరే గాయత్రిని ప్రేమిస్తే తనేం కావాలి?  తనకి బాగా తెలిసిన గాయత్రీ, తన ఇంటి పక్క ఉండే గాయత్రి, తెల్లవారి లేస్తే కళ్ళ ముందు కన్పిస్తుండే  గాయత్రి  అమ్మో! ఇంకా ఎవరన్నా ప్రేమించడమా.. ఎంత మాత్రం జరక్కూడదు అనేది రమేష్ ఆలోచన... అందుకే తను గాయత్రిని గాఢంగా ప్రేమించేసి, ఆమెని తనతో పాటు తోటలు, కోటలు తిప్పేస్తే ఆమె కూడా తనని ప్రేమించేస్తుంది.. ఇంక తను సేఫ్, ఆమె కూడా సేఫ్... వీలైతే పెళ్లి కూడా చేసేసుకుంటే ఇంక గాయత్రి తనదే అనే ఒక ఊహ రమేష్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 

అందుకే ఆమెని ప్రేమించడానికి, ఆమె తనని ప్రేమించేలా చేయడానికి నానా తిప్పలు పడుతున్నాడు.. కాలేజ్ పూర్తిగా మానేసాడు.  ఆమె ఇంట్లో నుంచి బైటికి వచ్చిందాకా ఆ చెట్టు దగ్గర నిలబడడం, ఆమె రాగానే రోడ్డు మీదకి వెళ్ళడం , ఎలాగోలా ఆమెని పలకరించడానికి, తనతో తిప్పుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఈ మధ్య అసలు అవకాశమే దొరకడం లేదు.. కారణం గోల్కొండలో రమేష్ కొంచెం చనువు తీసుకుని ఆమె నడుం మీద చేయి వేయడం అన్న సంగతి గాయత్రికి తెలుసు. ఏదో చేయి పట్టుకున్న దాకా బాగానే ఉంది ఆ స్పర్శ లో మాధుర్యం అనుభవించడం కొత్తగా ఉంది.. తీయగా ఉంది. గొల్కొండకి వెళ్ళడం కూడా బాగుంది కానీ అలా చనువు తీసుకుని నడుం మీద చేయి వేయడం, చెంప మీద ముద్దు పెట్టుకోడం ఆమెకి నచ్చలేదు సరికదా తను చాలా తప్పుచేసినట్టు, పాపం చేసినట్టు బాధ పడిపోతోంది..  ఈ విషయం ఇంట్లో తెలిసిందంటే తనకి కూడా  సీతా దేవిలాగా అగ్ని పరీక్ష పెడతాడు నాన్న లేదంటే గరిట కాల్చి వాత పెడతారు ... అయినా అతనికి ఎంత ధైర్యం! అలా చేయొచ్చా.. తప్పు కదా అనుకుంటూ మనసులో అతన్ని కలుసుకోవాలని సరదాగా పార్క్ కి వెళ్లి కాసేపు కబుర్లు చెప్పుకోవాలని ఉన్నా కలిస్తే ఏం చనువు చూపిస్తాడో అని భయంతో అతన్ని తప్పించుకుని తిరుగుతోంది. ఒకవేళ అతను తనని ఎలాగోలా పట్టుకుని ఎందుకు కలవడం లేదు అని అడిగితే అతి చనువు తీసుకోనని మాట తీసుకుని అప్పుడు వెళ్ళచ్చు లెమ్మని కూడా ఆలోచించింది. 

కొడుకు కాలేజ్ కి వెళ్ళడం మానేశాడన్న  విషయం గంగరాజు దృష్టికి వచ్చింది. ఇంట్లో నుంచి ఎనిమిదింటికల్లా ముస్తాబు అయి, నాస్తా చేసి కాలేజ్ కి వెళ్తున్నా అని చెప్పి వెళ్లి,  ఆయనకీ కనిపించకుండా వీధి చివర  కిళ్ళి కొట్టు దగ్గర ఉన్న  వేపచెట్టు కింద ఎనిమిదిన్నర దాకా నిలబడి ఎటో వెళ్ళిపోయి బలాదూర్ తిరిగి పొద్దుపోయాక ఇంటికి వస్తున్నాడని ఆయన  నోటిస్ కి వచ్చిన వెంటనే ఆయన కొడుకు ఇంట్లో నుంచి బయటకి వెళ్ళడం దగ్గరి నుంచి గమనించడం ప్రారంభించాడు. . కాకపోతే వేప చెట్టు దగ్గర ఎందుకు నిలబడుతున్నాడు, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు అన్న విషయం తెలుసుకోవాలంటే ఆయన షాపు కట్టేసి కొడుకు వెనకాల తిరగాలి... అలా చేసే అవకాశం లేదు.

అందుకే ఆ రోజు ఇంట్లో నుంచి ట్రిమ్ గా తయారై నాస్తా చేస్తున్న రమేష్ ని ఏమి ఎరగనట్టు  పలకరించాడు గంగరాజు. 

“నీ పరిక్షలెప్పుడురా ... మంచిగ సదువుతున్నావా ? “

 రమేష్ తడబడకుండా చెప్పాడు...” పరీక్షలు ఇప్పుడేడుంటయ్ మార్చ్ ఏప్రిల్ ల ఉంటయి ...”

“కాలేజ్ కి సక్కంగ పోతున్నవా ... నీ అటెండేన్స్  ఇర్రేగ్యులర్ ఉందంట నీ దోస్తు చెప్పిండు ... ఏందీ సంగతి...” అన్నాడు గంగరాజు కొడుకు మొహం లోకి చూస్తూ. 

రమేష్ కొంచెం బెదిరాడు కానీ కనిపించకుండా అన్నాడు. “ఎవడాడు ... వానికేం ఎరుక ... నేను దినాం పోతనే ఉన్న... నువ్వు చుస్తాలేవా.. “

“నేను అన్ని చూస్తున్న అందుకే అడుగుతున్న .... నీకు నకరాలు మస్తు అయితున్నై... గీ కోర్సు పూర్తీ గాకుంటే బిడ్డా నిన్ను కార్ఖనకు పంపుత ... మంచిగా సదువుకుని అన్నలెక్క మంచి జాబు చేసుకో లేకుంటే” అన్నట్టు ఆపేసాడు. 

ఆ మాటతో నాస్తా తినడం గబా గబా ముగించి కోపంగా వెళ్ళిపోయాడు.

కొడుకు సరిగా తినకుండా వెళ్ళాడన్న బాధతో దుర్గమ్మ కొంచం కోపంగా అంది..’. ఏందయ్యా నువ్వు అడేనక తగిలినవ్ .... ఊకే ఏందీ... బండి తిస్కపోతివి ... మల్లెంది నీ గోస... ‘

‘నౌకరి చేసేతోనికి కావాల్న బండి బేకార్ తిరిగేటనోకి కావాల్న .... నీ కొడుకు ఏడికి పోతున్నాడో నికేరేకేనా ..’ “.భార్య వైపు చూసి సీరియస్ గా అడిగాడు గంగరాజు ..

“ఏడికి పోతాడు... కాలేజ్ కి పోతాడు.. ఆడికి మాత్రం సడుకోవాలని ఉండదా ఏందీ..”

“ ఆ, ఆ ఉంది... రెండు దినాలు ఆగు... నేను చేప్త ఆడు ఏడికి పోతుండో ఎం చేస్తుండో చేప్త ....”

“ ఎం చెప్తావో...”  సణుగుతూ లోపలికి వెళ్ళిపోయింది.

భార్య వెళ్ళిన వైపు చూసి నుదుటి మిద చిన్నగా కొట్టుకుని పంచ సరి చేసుకుని లాల్చీ వేసుకున్నాడు గంగరాజు. 

చెప్పులేసుకుంటూ దుర్గమ్మకి వినిపించేలా చెప్పాడు “ నేను దుక్నం బోతున్న.”

“ మంచిది పోయిరా ...” లోపల్నుంచే సమాధానం చెప్పింది దుర్గమ్మ. 

గంగరాజు  షాప్ వైపు కాకుండా  తన షాప్ కి కొంచెం దూరం లో ఉన్న వేప చెట్టు దగ్గరకి నడిచాడు.

అయితే ఇవాళ రమేష్ తన స్థలం రోడ్డు మీద ఉన్న స్టేషనరీ షాప్ దగ్గరికి మార్చాడు. కారణం గాయత్రి వెళ్ళేది అటే కాబట్టి ఎలాగైనా ఇవాళ ఆమెని ఆపాలి ... అది అతని లక్ష్యం ...

సందు తిరిగి రోడ్డు మీదకి రాబోయే గాయత్రి కోసం రెప్ప వేయకుండా, చూపు తిప్పకుండా ఎదురు చూడసాగాడు..  సరిగ్గా పావు గంటకి నీలం రంగు  పరికిణి నల్ల జార్జేట్ వోణి వేసుకున్న గాయత్రి తల వంచుకుని భుజానికి ఉన్న హ్యాండ్ బాగ్ జారిపోతోంటే పైకి జరుపుకుంటూ వస్తోంది.

 

(సశేషం)  

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nadaina prapancham