Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమిస్తే ఏమవుతుంది?

premiste emavutundi

గత సంచికలోని ప్రేమిస్తే ఏమవుతుంది సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి....http://www.gotelugu.com/issue233/643/telugu-serials/premiste-emavutundi/premiste-emavtundi/

 

(గత సంచిక తరువాయి)...

ఆమెని చూడ గానే గబ గబా  నడుస్తూ ఆమెకి ఎదురు వెళ్లి “ గాయత్రి”  అని పిలిచాడు.

గాయత్రి రమేష్ అలా దారికి అడ్డు వస్తాడని ఊహించ లేదేమో అతన్ని చూడ గానే ఉలిక్కి పడింది.

“ ఏమైంది కలుస్త లేవు... నేను పరేషాన్ అయితున్న”  అన్నాడు దబాయింపుగా.

అతనలా రోడ్డు మీద నిలేసి దబాయిస్తోంటే గాయత్రి బెదురుతూ అటు, ఇటూ  చూసింది.

“ ఏయ్ ఏంది గట్ల నిలబడినవ్ నడు పబ్లిక్ గార్డెన్ పోదం”  అన్నాడు ఆటో కోసం చూస్తూ ..

“ ఇప్పుడా నేను రాను కాలేజ్ కి వెళ్ళాలి”  గబుక్కున అని ముందుకు నడవ బోతుంటే ఆమె చేయి పట్టుకుని ఆపుతూ అటుగా వచ్చిన ఖాళి ఆటో ఆపాడు. దా అంటూ ఆమెని లాగి ఆటో లోకి తోసి నంత పని చేసాడు.

“నేను రాను ప్లీజ్ దిగిపోతాను”  చేయి విడిపించుకుంటూ కుడి కాలు బయటికి పెట్టి  దిగబోయిన గాయత్రి సందు మలుపు తిరుగుతున్న కార్తికేయ కనిపించడంతో అదిరి పడి కాలు వెనక్కి తీసుకుని  రమేష్ కి సమీపంగా జరిగింది.

రమేష్  “గమ్మున కూసో”  అని గాయత్రితో అని,  ఆటో అతనికి “నాంపల్లి పోనీ” అని చెప్పాడు. ఆటో కదిలింది.

గాయత్రి వణికి పోతూ మౌనంగా ఉండి పోయింది.. చూసాడా... అన్నయ్య చూసాడా... అమ్మో చూసి ఉంటె ఇవాళ నా పని అయి పోయినట్టే... దేవుడా చూసి ఉండడు కదూ... అన్నయ్య నన్ను చూడ లేదు... అవును చూడ లేదు.. తిరిగి, తిరిగి ఆటో లోంచి తల బైటికి పెట్టి చూడ సాగింది.

“ ఏందీ గట్ల చూస్తున్నవు”. ఆమె ఎడం చేయి తన చేతులోకి తీసుకుంటూ అడిగాడు రమేష్.

విహ్వలంగా చూస్తూ అంది....” మా అన్నయ్య కనిపించాడు చూసాడేమో అని భయంగా ఉంది..”

రమేష్ ఆ మాటకి తను కూడా ఒక్క సారి వంగి ఆటో లోంచి బైటికి చూసి తిరిగి సరిగా కూర్చుని అయితే ఏమైతది అన్నాడు నిర్లక్ష్యంగా..
“చంపేస్తాడు” అంది గాయత్రి భయంగా.

“ఏం గాదు పికరు పడకు” అన్నాడు తనకు తోచిన రీతిలో ఓదారుస్తూ..

అతను అన్నట్టుగా ఆటో కదలడం ఒక్క క్షణం ఆలస్యం అయి ఉంటె కార్తికేయ దృష్టి వాళ్ళ మీద పడేది ..వాళ్ళ అదృష్టం బాగుండి కార్తికేయ వాళ్ళని చూడ లేదు. కాలేజ్ టైం అయిపోయిందని వడివడిగా ఎటూ చూడకుండా నడిచి వెళ్ళి పోయాడు.

వేప చెట్టు దగ్గరకు వచ్చిన గంగ రాజుకి అక్కడ తను విన్నట్టుగా కొడుకు కనిపించక పోవడంతో ఒక్క క్షణం అక్కడే నిలబడి ఆలోచించాడు... తరవాత అతనికి తను అనవసరంగా టైం వృధా చేస్తున్నట్టు అనిపించి  నేరుగా షాప్ కి వెళ్ళాడు.

రేపు వాడి కన్నా తనే ముందు వచ్చి వాడి వేషాలు  చూడాలి అని నిశ్చయించుకున్నాడు.

*****

ఆఫీస్ కి  రెడీ అయి భార్య ఇచ్చిన కారేజి తీసుకుని చెప్పులు వేసుకుంటున్న కోటేశ్వరరావు ఫోన్ మోగడంతో ఆగిపోయాడు.
అన్నపూర్ణ వెళ్లి స్టాండ్ మీద ఉన్న కార్డ్ లెస్ తీసుకొచ్చి భర్తకి ఇచ్చింది. ఆయన ఆన్సర్ బటన్ నొక్కి హలో అన్నాడు.|

“కోటేశ్వరరావు నేనురా శేషుని .... ఎలా ఉన్నావు?”  అడిగాడు శేషు.

“ శేషూ ఎక్కడి నుంచి?”  చాలాకాలం తరవాత శేషు గొంతు విన్న కోటేశ్వర రావు ఉత్సాహంగా అడిగాడు. 

“ హైదరాబాద్ వచ్చాను... మళ్ళి రేపు ముంబై వెళ్ళి పోతున్నాను... ఓ సారి వచ్చి చూసి వెళ్దామని.. ఆఫీసుకి బయలు దేరావా.. ఎలా ఉన్నావు?  అడిగాడు శేషు.

“ఆ, ఆ,. ఇప్పుడే బయలు దేరుతున్నాను  ఫోన్ శబ్దం విని ఆగి పోయాను... బానే ఉన్నాను... మీరంతా ఎలా ఉన్నారు? ఎప్పుడు వస్తున్నారు ఇక్కడికి?”  అడిగాడు.

“వద్దామనే ... నీ సంగతి ఏంటి? తిరిగి రాక. సాయంత్రమేనా  మధ్యాన్నం పెర్మిషన్ ఏమన్నా తీసుకో గలవా ...”

“ఎప్పుడు వస్తావు”  చేతి వాచీ చూసుకుంటూ అడిగాడు కోటేశ్వర రావు.

“ నువ్వు చెప్పరా ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా... నా కోసం ఆఫీస్ పని డిస్టర్బ్ చేసుకోకు..”

కోటేశ్వర రావు నవ్వాడు..” ఫర్వా లేదు రాక, రాక అంత దూరం నుంచి నువ్వు వస్తుంటే ఆఫీస్ లో కూర్చోడం అవసరమా ... మధ్యాహ్నం నుంచి లీవ్ పెడతా వచ్చి.. ఒక్కడి వేనా అందరూ వచ్చారా...”

“రావడం అందరం వచ్చాం.... కానీ వాళ్ళంతా ఏదో షాపింగ్ కి వెళ్తారుట నేను వస్తా... అయితే మూడింటి కల్లా వస్తాలే..”

“ అలాగే, తప్ప కుండా రా... “. శేషు ఫోన్ పెట్టేయడంతో కార్డ్ లెస్ అన్నపూర్ణ చేతికిస్తూ చెప్పాడు... “మా పెత్తండ్రి కొడుకు శేషు లేడూ ... వాడు ముంబై నుంచి వచ్చాడుట... సాయంత్రం ఇంటికి వస్తా అన్నాడు.. ఈ కారేజ్ ఉంచెయ్ మధ్యాహ్నం వచ్చేస్తా.... “ అంటూ కారేజ్ ఆవిడ చేతికిచ్చాడు.

“అందరు రావడం లేదా” అప్పటి దాకా వాళ్ళ సంభాషణ విన్న అన్నపూర్ణ అడిగింది.

“లేదు వాళ్ళ కేదో షాపింగ్ ఉందిటలే సరే నేను బయలుదేరతా ...”  అంటూ చెప్పులేసుకున్నాడు.

“అలాగే జాగ్రత్తగా వెళ్ళిరండి ....” గుమ్మం దాకా నడిచి అలవాటు గా చెప్పింది.

ఆయన సమాధానం చెప్ప కుండా బయటకు నడిచాడు. అన్న పూర్ణ కారేజ్ తీసుకుని లోపలికి వెళ్లి  మిగిలిన వంట పూర్తీ చేసి వంట గది సర్దేసింది. తరవాత గిన్నెలు కడిగేసి, మిగతా గదులు కూడా సర్దేసింది. గారెలకి మినప్పప్పు నానేసింది.

రోజూ ఆవిడ  నిద్ర లేవగానే బ్రష్ చేసుకుని స్నానం చేసి , దేవుడి దగ్గర దీపం పెట్టి వంట గదిలోకి నడుస్తుంది.. అక్కడి నుంచి కాఫీలు, టిఫిన్లు, వంట అంతా పూర్తీ చేసుకుని అందరిని పంపించాక మొహం కడుక్కుని  విశ్రాంతిగా కూర్చుని పేపర్ చదువుతుంది. ఇవాళ పేపర్ చదివే టైం లేదు అనుకుంటూ మొహం కడుక్కుని జడేసుకుంది..  మడి  చీర మార్చుకుని వాయిల్ చీర కట్టుకుంది.

ఆవిడకి శేషు, అతని భార్య ఉమా కళ్ళ ముందు కదిలారు. శేషు ఏదో వ్యాపారం  చేసే వాడు.. చాలా కాలం హైదరాబాద్ లోనే ఉన్నారు వాళ్ళు. అతనికి ఇద్దరు కొడుకులు... పెద్ద వాడు భాస్కర్ మొదటి నుంచి ముంబై లోనే ఉద్యోగం... రెండో వాడు జవహర్ ఏ జి  ఆఫీస్ లో పని చేస్తున్నాడు.. ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయాయి.. శేషు హైదరాబాద్ లో వ్యాపారం అంతగా లాభ సాటిగా లేదని పెద్ద కొడుకు దగ్గరకు వెళ్ళాడు అక్కడే ఏదో చేయాలనుకున్నాడు కానీ బెడిసి కొట్టింది.. ఇంక చేయడానికి ఏమి లేక ఇద్దరి కొడుకుల దగ్గరికి తిరుగుతూ మొగుడు, పెళ్ళాం కాలక్షేపం చేస్తున్నారు.. ఎప్పుడు హైదరాబాద్ వస్తారో.. ఎప్పుడు వెళ్తారో తెలియదు... కనీసం ఏడాదికి ఒక సారన్నా వచ్చి ఎలా ఉన్నారు ఏంటి విశేషాలు అని మంచి, చెడు మాట్లాడరు భార్యాభర్తలు.. ఇవాళ అకస్మాత్తుగా ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందో అనుకుంది.
అన్నపూర్ణ కూడా ఇడ్లి తినేసి  కాస్త రవ్వ కేసరి చేసింది.. ఆవిడ పని అయి పోగానే రెండింటి కల్లా కోటేశ్వర రావు వచ్చే సాడు.. ఇద్దరు కలిసి భోజనం చేసారు..

“కాసేపు నడుం వాల్చండి .. మళ్ళి అతను వచ్చాక ఆవలిస్తారు” అంది అన్నపూర్ణ  .

“అవును పడుకోవాల్సిందే” అన్నాడు ఆవలిస్తూ..

అన్నపూర్ణ కంచాలు తీసి శుభ్రం చేసి మినప్పప్పు నాని పోడంతో గారెలకి రుబ్బి పక్కన పెట్టింది. పచ్చి మిరప కాయలు, అల్లం విడిగా మెత్తగా గ్రైండ్ చేసి పిండిలో కలిపింది. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టింది. కాలింగ్ బెల్ మోగింది.

అన్నపూర్ణ “ వచ్చినట్టున్నాడు”  అనుకుంటూ వీధి గుమ్మం దగ్గరకు వచ్చే సరికి చెప్పులు వదిలి లోపలికి వస్తున్నాడు ..

రండి, రండి అన్నపూర్ణ మర్యాదగా ఆహ్వానించింది...

ఏమ్మా వీధి తలుపు వేయ లేదే ... కుర్చీలో కూర్చుంటూ అడిగాడు.

ఏం ఫర్వాలేదండి... ఇక్కడ భయాలేం లేవు.. కులాసానా అక్కయ్య, పిల్లలు బాగున్నారా అడిగింది.

అందరూ నిక్షేపంగా ఉన్నారు మీరెలా ఉన్నారు... వచ్చాడా కోటి అడిగాడు శేషు.

ఆ, వచ్చారు... భోజనం చేసి కాసేపు నడుం వాలుస్తా అంటూ లోపలికి వెళ్ళారు... లేపుతా అంటూ పడక గది లోకి వెళ్ళింది. భర్త  దగ్గరగా  వెళ్లి  నెమ్మదిగా పిలిచింది  ఏవండి  ఆయన వచ్చారు.. కొద్దిగా వొంగి చెవిలో చెప్పింది.  |మంఛి నిద్రలో ఉన్న కోటేశ్వరరావు ఒక్క పిలుపుకే లేచి అన్నపూర్ణని చూసే 'వచ్చాడా' అని అడుగుతూ మంచం దిగాడు. 

ఆ, ఆ వచ్చారు... మొహం కడుక్కుని రండి అంటూ వంట గది వైపు వెళ్ళింది.

బాత్రూం లోకి వెళ్లి చల్లటి నీళ్ళతో మొహం కడుక్కుని టవల్ తో తుడుచు కుంటూ హాల్లోకి వచ్చాడు.” ఏరా ... ఎలా ఉన్నావు..”. శేషు స్వరం, “ఎంత కాలమైంది మనం కలిసి” అంటూ కోటేశ్వర రావు పలకరించు కున్నారు.

హాల్లోంచి అన్నదమ్ములిద్దరూ ఒకరి నొకరు ఆప్యాయంగా పలకరించుకోవడం వింటూ చల్లటి మంచి నీళ్ళు రెండు గ్లాసుల్లో తెచ్చి భర్తకి, శేషు కి ఇచ్చింది అన్నపూర్ణ.

వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటుంటే తను తిరిగి వంట గది లోకి వెళ్లి మూకుడులో నూనె వేసింది.

శేషు స్వరం గట్టిగా వినిపిస్తోంది.. ఇతను గట్టిగా మాట్లాడడం ఇంకా మాన లేదు అనుకుంది అన్నపూర్ణ  పిండి గుండ్రంగా ప్లాస్టిక్ పేపర్ మీద తట్టి మధ్యలో రంధ్రం చేసి కాగిన నూనెలో వేస్తూ.

వాళ్ళ మాటల్లో ముంబై విశేషాలు, వాళ్ళ పిల్లల ఉద్యోగాలు, వగైరా దొర్లుతున్నాయి.

అన్నపూర్ణ రెండు ప్లేట్ లలో నాలుగేసి గారెలు, అల్లం పచ్చడి వేసి, చిన్న బౌల్స్ లో కొంచెం రవ్వ కేసరి పెట్టి తెచ్చింది.
“ఎందుకమ్మా ఇవన్నీ” అంటూనే అందుకున్నాడు శేషు.

(సశేషం)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nadaina prapancham