Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాదైన ప్రపంచం

nadaina prapancham

గత సంచిక లోని  నాదైన ప్రపంచం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి....http://www.gotelugu.com/issue235/648/telugu-serials/naadaina-prapancham/nadaina-prapancham/

 

(గత సంచిక తరువాయి).... ‘‘అసలు ఇంట్లో గాడి పొయ్యి తవ్వక పోతే పెళ్ళయిన యిల్లులా వుంటుందా?’’ బుంగమూతి పెట్టింది.

‘‘అది నీ పెళ్ళికి తాపీగా చేయిద్దాం. ప్రస్తుతానికి యిలా సరిపెట్టేయి. అయినా మన ఫ్రెండ్స్‌ తప్ప బంధువులు ఎవరున్నారు....?’’ బాధగా అన్నాడు.

అతనలా అంటుంటే మనసు విలవిల్లాడింది.

‘‘ఎందుకూ అందరి పెట్టూ నేను లేనూ....వుండసలు చీర కట్టుకుని, తాళాల గుత్తి పెట్టుకుని, యిల్లంతా తిరిగానంటే అదే హడావుడి వచ్చేస్తుంది’’ పెద్దరికంగా అంటుంటే చెల్లెల్ని చూసి ముచ్చటపడ్డాడు.

అశోక్‌ ఫ్రెండ్స్‌కి కూడా పెళ్ళి విషయం తెలిసి వాళ్ళు కూడా వచ్చిపడ్డారు.

ఫార్మా స్యూటికల్స్‌లో ఎంప్లాయిస్‌ అందరూ ఫ్యామిలీస్‌తో సహా మేమున్నాము అండగా....అంటూ వచ్చేశారు.

చూస్తుండగా ఆ రోజు సాయంత్రానికే వంద మంది వరకూ భోజనానికి లేచారు.

ఈ మూడు రోజులూ హోటల్‌ ఆర్డర్‌ యిచ్చి వేశాడు అశోక్‌.

కీర్తన యిద్దరు ఫ్రెండ్స్‌ని తీసుకుని పెళ్ళిబట్టలు కొనుక్కురావటానికి వెళ్ళింది.

ఈ పెళ్ళి సంబరం చూస్తుంటే నానమ్మకీ హుషారు వచ్చేసింది. కాని ముందు మనవరాలి పెళ్ళి జరిగితే బావుండునని వుంది. చేసేది ఏముంది? దేవుడెలా రాసిపెడితే అలా జరగక తప్పదు అన్న వేదాంతం లోకి వచ్చేసింది.

నానమ్మ సలహా మీద అశోక్‌ ఫోన్‌ చేసి మృదులా దేవికి, వాళ్ళ పేరెంట్స్‌నీ పెళ్ళికి రమ్మని ఫోన్‌ చేశాడు.

కానీ అటువైపు సమాధానం విన్న అశోక్‌ డీలాపడిపోయాడు.

‘‘ఏమయింది?’’ ఆందోళనగా అడిగింది నానమ్మ.

‘‘ఈ పెళ్ళి జరిగితే యిక ఈ యింటి గుమ్మం తొక్కనని అంటోంది పిన్ని’’ ఆవేదనగా పలికి చేతుల్లోకి మొహం దించుకున్నాడు
హఠాత్తుగా భూపతి నోట్లోంచి వికృతంగా ఏవో శబ్దాలు మలువడేసరికి గబుక్కున తలెత్తి చూశాడు. ఆయన మొహం వంకర్లు తిరిగిపోయింది. ఎడం చెయ్యి ఊపేస్తున్నాడు.

గాభరాగా దగ్గరికి వెళ్ళాడు. ఆయన పక్కన కూర్చొని తండ్రి చేతిని తన చేతిలోకి తీసుకుని అనునయించాడు.

ఆయన ఆవేశానికి అర్ధం తెలిసింది. ఇవేమీ పట్టించుకోకుండా పెళ్ళి చేసుకోమంటున్నాడాయన. చాలా ఆవేశంలో వున్నాడు. అసలే అంతంత మాత్రం ఆరోగ్యం.

‘‘మీరు టెన్షన్‌ పడొద్దు. అంతా సవ్యంగానే జరుగుతుంది. నేను సంతోషంగానే వున్నాను’’ అంటూ ఒకటికి పదిసార్లు చెప్పేసరికి శాంతించాడు భూపతి.

అనుకున్న టైంకి శివాలయంలో పెళ్ళి నిర్విఘ్నంగా జరిగిపోయింది. భూపతి వీల్‌ఛైర్‌లో కూర్చుని పెళ్ళితంతు అంతా పరికించాడు.
రెండు రోజుల్లో అంతా కలగా జరిగిపోయి జాహ్నవి కొత్తపెళ్ళి కూతురులా ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది.

**********

కీర్తన ఇది వరకటి మీద కాస్త తేరుకుంది. జాహ్నవి రావడంతో ఆ ఇంటికి కళ వచ్చినట్లుగా భావించారందరూ. మృదులాదేవి మాత్రం పట్టుదలగా పుట్టింట్లోనే కూర్చుంది. అక్కడందరూ శతృవులే అనుకుంటే కొత్త శత్రువు కొత్తగా రావడం జీర్ణించుకోలేకపోతోంది ఆమె!
ఆ యింట్లో తన ఆధిపత్యానికి గండిపడినట్లయింది. ఇక ఇపుడు ఎలా అక్కడ గడపాలో తెలీడం లేదు.

కానీ జగన్నాధం నుంచి మాత్రం సాధింపులు ఎక్కువయ్యాయి. ఇక్కడే కూర్చుంటే అక్కడ పెత్తనం అంతా కోడలి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి, ఆమెని వెళ్ళమని గొడవ చేస్తున్నాడు. యిక మృదులా దేవికి ఇక్కడికి రావడం ఇష్టం లేదు.

రోగిష్టి భర్తా, ముసలి అత్తగారూ, పెళ్ళి చేసుకున్న సవతి కొడుకు, పెళ్ళికాని, మాట వినని సవతి కూతురు. ఇందరి మధ్యా తనకంటూ ఎవరూ లేని ఆ ఇంట్లో వుండబుద్ధి కావడం లేదు.

అందుకే రూటు మార్చి కొత్తపాట మొదలుపెట్టింది. ఫార్మాస్యూటికల్స్‌ కంపెనీలో షేర్‌, కొంత పొలం తనకి యిచ్చేస్తే వాళ్ళ జోలికి రాకుండా గడుపుతానని రాయబారాలు పంపుతోంది.

మరి పిల్లలు ఏం తిని బతుకుతారని దవడలు నొక్కుకుని ఆశ్చర్యపోయింది నానమ్మ.

అశోక్‌ మాత్రం ఏమీ పట్టించుకోవడం లేదు. తన పనేదో తను చేసుకొని పోతున్నాడు.

జాహ్నవి రావడంతో ఇంట్లోనూ, హృదయంలోనూ ఉన్న వెల్తి ఏదో పూడిపోయినట్లయింది. ఇంటి పెత్తనమంతా అందరూ మనస్ఫూర్తిగా ఆమెకే అప్పగించేశారు.

ఒకప్పుడు గంభీరంగా, బరువుగా వుండే, ఆ ఇంటి వాతావరణం ఇప్పుడు చమత్కారం తోనూ, ఛలోక్తులతోనూ సాగిపోతోంది. ముఖ్యంగా భూపతి గారికి కాలక్షేపం సమస్య లేదు.

శ్రీధరో, ప్రకాషో ఖాళీగా వున్నప్పుడు వచ్చి ఆయన పక్కన కూర్చుంటారు. శ్రీధరయితే మరీ ఓపిగ్గా వీల్‌ ఛెయిర్‌లో కూర్చోబెట్టి తోటలో తిప్పుతుంటాడు.

జాహ్నవి సరేసరి! ఎప్పుడూ పక్కనే కూర్చుని ఆయన పూర్వచరిత్లరన్నీ అడిగేది. ఆయన రాసి చూపిస్తుండేవారు. ఇప్పుడు రాయటం కూడా చాలా స్పీడ్‌గా రాస్తున్నారు. అశోక్‌ పెళ్ళవడం మూలంగా ఇంట్లో సంతోషం వెల్లి విరిసిందనడంలో అతిశయోక్తి లేదు.

కీర్తన ప్రాక్టీస్‌ బాగానే చేస్తోంది. రెండు మూడుసార్లు ప్రణీత్‌ వచ్చి గ్రౌండ్‌లో ఆమె ప్రాక్టీస్‌ గమనించాడు. ఫిజికల్‌ అంతా ఫిట్‌, మానసికంగా మాత్రం ఇంకొంచెం స్ట్రాంగవ్వాలి అని చెప్పాడు.. అతని సహాయంతో ఆ లోపాన్ని కూడా అధిగమించగలనని  ఆమెకి ఆత్మవిశ్వాసం.
ఆ రోజు కాలేజీలో ఏవో ఎకడమిక్‌గా స్టూడెంట్స్‌ స్ట్రయిక్‌ చేశారు.

క్లాసులు లేవు. గ్రౌండ్‌కి వెళ్ళినా, ఇంత తీవ్రమైన ఎండలో ప్రాక్టీస్‌ చెయ్యడం అవదు. ఇంటికి వెళ్ళి కాసేపు రెస్ట్‌ తీసుకుని సాయంత్రం గ్రౌండ్‌కి వెళ్ళొచ్చునన్న ఉద్దేశంతో యింటికి వచ్చేసింది.

వచ్చేసరికి జాహ్నవి కిచెన్‌లో వుంది. నాన్నగారు పడుకున్నారు. నానమ్మ వత్తులు చేసుకుంటోంది. అమ్మదొంగా ఆఫీసుకి వెళ్ళకుండా వుండిపోయాడా అనుకుంటూ అతని గదివైపు నడిచింది.

అశోక్‌ ఫోన్‌ మాట్లాడుతున్నాడు. కార్డ్‌లెస్‌ పట్టుకుని కిటికీ వైపు తిరిగి తోటని చూస్తూ మాట్లాడుతున్నాడు.

వచ్చేయబోయింది. కానీ తన పేరు వినపడి అప్రయత్నంగా ఆగిపోయింది.

‘‘కీర్తన గురించా? లీవిట్‌ యార్‌....’’

‘‘.........!’’

‘‘నేను చెబుతున్నాను కదా! అంతా సవ్యంగా జరుగుతుంది.’’

‘‘......................’’

‘‘ఆకాష్‌! రియల్లీ అయ్‌ ప్రామిస్‌ యూ! కీర్తన నేషనల్‌ గేమ్స్‌కి వెళ్ళదు. నా ప్రయత్నం నేను చేస్తాను కదా.

ఇప్పటికే ఇండైరెక్ట్‌గా చాలా సార్లు చెప్పాను. తను అర్ధం చేసుకోగలదు. మీ యిద్దరి పెళ్ళి జరిగితీరుతుంది. నువ్వేం వర్రీకాకు’’ అంటూ ఇటువైపు తిరిగి కీర్తనని చూసి తడబడ్డాడు.

పాలిపోయిన మొహంతో కళ్ళింతలుచేసి, వేడిసెగ మొహానికి తగులుతుంటే విలవిల్లాడుతున్నట్లు వుంది కీర్తన. విభ్రమంగా అశోక్‌ వంక చూస్తోంది.

తనేం వింది....?

తన చెవులూ, కళ్ళూ తనని మోసం చేస్తున్నాయా?

‘అదికాదు చిట్టీ!’’ ఏదో చెప్పబోయాడు.

ఒకడుగు వెనక్కి వేసింది. ‘యూ టూ....’’ యిక ఆపై గొంతు పెగలలేదు.

కానీ చిత్రంగా కంట చుక్క నీరు రాలేదు. దుఃఖం కూడా ఘనీభవించింది.

నమ్మక ద్రోహానికి నిలువెత్తు సాక్ష్యం ఆకాషే అనుకుంది. కానీ తన అన్నయ్య! తన రక్త సంబంధం!! ముందు మంచిగా వుంటూ, వెనక ఇంత ప్లాన్‌ చేస్తాడని అనుకోలేదు.

అసలు ఆకాష్‌ అన్నయ్యకి ఎలా తెలుసు? గిరుక్కున వెనక్కి తిరిగి తన గదికి వచ్చేసింది.

‘మైగాడ్‌! ఎంత పొరపాటు జరిగిపోయింది?’ తలుపన్నా వేసుకోకుండా మాట్లాడినందుకు తనని తనే నిందించుకున్నాడు అశోక్‌.
తన మాటల్ని విన్న కీర్తన ఏదన్నా అఘాయిత్యం చేస్తుందేమో!’’ అనుకుంటూ ఆందోళనగా వచ్చి కీర్తన గది తలుపు తట్టాడు. తీయలేదామె!
తండ్రికి వినిపించకుండా మెల్లని స్వరంతో బతిమలాడుకుంటున్నాడు.

ఆమెకి వినిపిస్తుందో లేదో గాని, అటునుంచి రెస్పాన్స్‌ మాత్రం లేదు. ఈ గందరగోళం అంతా చూసి జాహ్నవి పరుగెత్తుకుని వచ్చింది.
‘‘అయ్యో! కీర్తన సంగతి తెలిసి కూడా మీరు....’’ అంటూ మెల్లని స్వరంతో ‘‘కీర్తనా!’’ అంటూ పిలిచింది.

మూడోసారికి తలుపులు తెరుచుకున్నాయి.

‘‘ఏం వదినా?’’ మామూలుగా వుంది కీర్తన గొంతు. ఆమె మొహం కూడా ప్రశాంతంగానే వుంది.

‘‘ఏం లేదు. నువ్వు....’’ తడబడింది జాహ్నవి.

‘‘వూ! నేను చచ్చిపోతాననుకున్నారా?’’ అంది.

‘‘అవేం మాటలు? మనుషులన్నాక గొడలు రావా?’’ ఆమెని శాంతింపచేయాలని అంది.

అశోక్‌ అలాగే ఖిన్నుడై నిలుచున్నాడు. కీర్తన మామూలుగానే వుందని అతను సంతోషించడం లేదు. అతని మనసు కీడుని శంకిస్తోంది. అదేంటో ఆమె బయటపడాలి.

మౌనంగా వెనక్కి తిరిగి గది లోకి వెళ్ళింది. వెనకాలే అనుసరించింది జాహ్నవి. గది బయటే గుమ్మం పట్టుకుని నిల్చున్నాడు అశోక్‌.
గది లోకి వెళ్ళగానే మంచం మీద సర్దిపెట్టి వున్న సూట్‌కేస్‌ని చూసింది జాహ్నవి. తెల్లబోయింది.

‘‘ఏవన్నా టోర్నమెంట్స్‌ వున్నాయా?’’ డైరెక్ట్‌గా అడగలేక అంది.

‘‘ఊహూ!’’

‘‘మరి ఈ సూట్‌కేస్‌.....’’

ఓ క్షణం మాట్లాడలేదు కీర్తన. తర్వాత లేచి నిలబడి సూటిగా అశోక్‌ వంక చూస్తూ....

‘‘నా దృష్టిలో ఇల్లంటే ఒక నమ్మకం. హత్యలూ, దోపిడీలూ చేసే వాళ్ళు కూడా ఆ నమ్మకంతోనే చాటుగానైనా ఇంటికి వస్తారు.

‘ఆ ఇంట్లోనే నాకు వెన్నుపోటు పొడిచే ప్రయత్నాలు’ జరుగుతున్నప్పుడు ఇక నేను ఇక్కడ వుండటం అనవసరం. నేను ఈ ఇంట్లోంచి వె...ళ్ళి...పో...తు....న్నా....ను....’’ చివరి మాట విడదీసి పలికింది.

తల మీద పిడుగుపడినట్లు బెదిరిపోయి చూశాడు అశోక్‌.

‘‘వెళ్ళిపోతావా? ఎక్కడకి!’’ నమ్మలేనట్లు అడిగాడు అశోక్‌ పాలిపోయిన ముఖంతో.

‘‘బతకడానికి ఈ లోకంలో చోటే దొరకదా? మీ అంత ప్రేమలు చూపకపోయినా, మోసం చెయ్యని ఫ్రెండ్స్‌ చాలా మందే వున్నారు. ఎక్కడికో వెళతాను. పిరికి దానిలా మాత్రం చావను. అయితే ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి. నేషనల్‌ గేమ్స్‌ అన్నది నా చిన్నప్పటి లక్ష్యం. అది నెరవేరటం కోసం నా ప్రాణాలైనా అర్పిస్తాను.   

(సశేషం)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
premiste emavtundi