Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nadaina prapancham

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమిస్తే ఏమవుతుంది?

premiste emavtundi

గత సంచికలోని ప్రేమిస్తే ఏమవుతుంది సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి...http://www.gotelugu.com/issue235/647/telugu-serials/premiste-emavutundi/premiste-emavtundi/

(గత సంచిక తరువాయి)...

“ అమ్మాయ్  మీ ఆయన్ని లోపలికి తీసికెళ్ళు గాయత్రి వస్తోంది .  ఇప్పుడు ఆవేశపడితే సీను రివర్సు అవుతుంది”   అన్నపూర్ణ తో అన్నాడు శేషు.

గాయత్రి అప్పటికే లోపలికి వచ్చింది.  శేషుని చూసి వెంటనే గుర్తుపట్టింది. “నమస్తే పెదనాన్నా” అంది.

“ఏమ్మా కాలేజి నుంచేనా” అడిగాడు శేషు .

“అ అవును “  అంది తడబడుతూ...

కోటేశ్వరరావు కళ్ళు గడియారం మీదకి మళ్ళాయి.. నాలుగు ఐదు... రోజూ ఎన్ని గంటలకి వస్తుంది కాలేజి నుంచి భార్య వైపు చూస్తూ అడిగాడు.

ఆవిడ తత్తరపడింది .,.. ఎన్నడూ లేనిది తండ్రి ఆ సమయంలో ఇంట్లో ఉండడం, తల్లి ఏదో భయపడుతూ ఉండడం ఆ వాతావరణం రొటీన్ గా తను చూసేదానికి భిన్నంగా ఉండడం గాయత్రికి ఏదో శంక గా అనిపించింది. ఏదో జరిగింది ఇంట్లో అనుకుంది. కొంప తీసి తను రమేష్ తో ఆటో ఎక్కడం ఎవరన్నా చూశారా... అన్నయ్య చూసినట్టు లేదు.. మరి ఎవరు చూసి ఉంటారు?

“ మాట్లాడవేం ..”. కొంచెం గట్టిగా రెట్టిస్తూ అడిగే సరికి అన్నపూర్ణ బెదిరిపోతూ అంది “ ఇదే టైం కి వస్తుంది ..”

కోటేశ్వరరావు గాయత్రి వైపు చూసి సూటిగా అడిగాడు “ నిజం చెప్పు కాలేజికి వెళ్ళావా ?”

ఒక్కసారిగా గాయత్రికి ఒళ్ళంతా చెమట పట్టినట్టు అయింది.. భయం జర, జరా పాకింది.” వె .. ళ్ళాను నాన్నా” అంది వణికిపోతూ.

“అబద్ధం చెప్పకు చంపేస్తాను...” గర్జించాడు.

గాయత్రి ఆ గర్జింపుకి అదిరిపడి రెండు అడుగులు వెనక్కి వేసింది.

శేషు కూర్చున్న దగ్గర నుంచి లేచి కోటేశ్వరరావు దగ్గరికి వచ్చి మందలిస్తూ అన్నాడు “ ఏంటిరా ఆ ప్రశ్నలు? కాలేజికి వెళ్ళానని చెప్తోంది కదా ....”  అని కోటేశ్వరరావు భుజం మీద చేయేసి తొందరపడకు అన్నట్టు భుజం మీద నొక్కాడు.

నివ్వెరపోయి నిలబడ్డ గాయత్రిని చూసి”  వెళ్ళమ్మా నువ్వు కాళ్ళు, చేతులు కడుక్కుని కాఫీయో, టీయో తాగు.. అన్నపూర్ణా దానికి ఏం  కావాలో చూడు “ అంటూ వాతావరణం లోని గాంభీర్యాన్ని తేలిక చేయడానికి ప్రయత్నించాడు. కోటేశ్వరరావు గర్జిస్తున్న పులిలా  కూర్చున్నాడు. అన్నపూర్ణ వంట గది లోకి వెళ్ళిపోయింది.. గాయత్రి తన గది లోకి వెళ్ళిపోయింది.

వాళ్ళు వెళ్ళాక కోటేశ్వరరావుకి మాత్రమే  వినిపించేలా అన్నాడు శేషు ..” ఇది కాదు పధ్ధతి. నేను చెప్తాను అలా టాకిల్ చేయి... నువ్వు ఆవేశపడి అడగడం, తను అబద్ధం చెప్పడం, ఇదంతా తెగేది కాదు..”

అంటే ఏంటి ఒళ్లో  కూర్చోబెట్టుకుని బుజ్జగిస్తూ అడగమంటావా... అదేం చిన్నపిల్లా... “

“ కాదు అందుకే చెప్తున్నా.  అది అలా ఒకబ్బాయితో ధైర్యంగా కాలేజ్ ఎగ్గొట్టి వెళ్లిందంటేనే అబద్ధాలు చెప్పడానికి మానసికంగా ప్రిపేర్ అయి ఉంటుంది కదా.. ఏ ధైర్యం లేకపోతే ఎలా వెళ్తుంది? అందుకే నిజం రాబట్టే ప్రయత్నం చేయాలి.. నేను చెప్తాను ఏం చేయాలో చొక్కా వేసుకుని  అలా రోడ్డు మీదకి రా” అన్నాడు.

కోటేశ్వరరావు కొన్నిక్షణాలు నిశ్సబ్దంగా కూర్చుని లేచి వెళ్లి లాల్చి తొడుక్కుని వచ్చాడు.

శేషు అన్నపూర్ణకి వినిపించేలా “ అమ్మాయ్ నేను బయలుదేరుతున్నాను” అన్నాడు.

అన్నపూర్ణ బయటికి వచ్చి “ భోజనం చేసి వెళ్ళచ్చు కదా” అంది.

“ లేదులేమ్మా  వాళ్ళు షాపింగ్ నుంచి వచ్చి ఉంటారు... నాకోసం చూస్తుంటారు. ఈ సారి మీ అక్కయ్యని తీసుకుని వస్తాలే ... మళ్ళీ  వచ్చే నెలలో వస్తాం” అన్నాడు.

“ నేను కూడా అలా  వెళ్లి వస్తా “ అన్నాడు కోటేశ్వరరావు .

“సరే  అందరిని అడిగానని చెప్పండి “ అంది అన్నపూర్ణ .

“ అలాగే “ అంటూ బయలుదేరాడు. కోటేశ్వరరావు కూడా అనుసరించాడు.

గదిలో ఉన్న గాయత్రికి అందరి మాటలూ వినిపిస్తున్నాయి.  తండ్రి, పెదనాన్నా వెళ్లిపోయారని అర్ధమైంది. అయినా గది లోంచి బయటకి రావడానికి గుండె దడ దడలాడుతోంది. ఏదో జరిగింది.. ఏం జరిగింది? తను, రమేష్ జూ పార్క్ కి వెళ్లినట్టు ఇంట్లో తెలిసిందనమాట... ఇప్పుడెలా? నాన్న పెదనాన్నని  పంపించి వచ్చాక తప్పకుండా గొడవ చేస్తాడు.. ఎలా? నిలదీస్తే ఏం  చెప్పాలి?

గాయత్రికి భయంతో పాటు ఒక రకమైన చిరాకు కూడా కలిగింది. నేనేక్కడికి వెళ్ళ కూడదా ... ఏనాడన్నా నాన్న అసలు ఎక్కడికన్నా  తీసికెళ్ళడా ... తను ఫ్రెండ్స్ తో వెళ్లకూడదా ... అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తిన్నియదు అన్నట్టు ఈ  నిర్బంధం ఏంటి?  ఎంత హాయిగా ఉంది రమేష్ తో అలా జూ పార్క్ లో తిరుగుతోంటే... అయినా తను ఒక్కతేనా ఏంటి ఇలా తిరిగింది... ఎంతమంది అబ్బాయిలు, అమ్మాయిలు వచ్చారో.. వాళ్ళయితే అసలు ఎంత ఫ్రీగా తిరిగారు.. ఇంకా తనే ఎవరన్నా చూస్తారేమో అనుకుంటూ భయం, భయం గా తిరిగింది. చేయి, చేయి పట్టుకుని తిరిగారు.. చెట్ల కింద ఒకళ్ళని ఒకళ్ళు ఆనుకుని ఎంత కులాసాగా కూర్చున్నారు. తను మాత్రం రమేష్ తన చేయి పట్టుకున్నా ఊరుకోలేదు విడిపించుకుని కొంచెం దూరంగా నడిచింది. ఈ మాత్రానికే కొంపలు అంటుకున్నట్టు ఇంట్లో ఈ సీన్ ఏంటి?

అలా అనుకున్నాక ధైర్యం వచ్చింది.. పుస్తకాలూ, బాగు ఎక్కడివక్కడ పెట్టేసి, కాళ్ళు, చేతులు కడుక్కుని బయటికి వచ్చింది. వంట గదిలో అన్నపూర్ణ మిగిలిన పిండి గారెలు వేస్తోంది.

గాయత్రి కొంచెం సందేహిస్తూనే తల్లి పక్కకి వచ్చి “ అమ్మా ఆకలేస్తోంది” అంది.

“ ప్లేటు తీసుకుని గారెలు వేసుకో... ఆ పక్క అల్లం పచ్చడి ఉంది వేసుకో”  అంది అన్నపూర్ణ ముక్తసరిగా.

గాయత్రి స్టాండ్ లోంచి ప్లేట్ తీసుకుని నాలుగు గారెలు పెట్టుకుని అడిగింది “ పెదనాన్న వెళ్ళిపోయారా ..”

“అవును “ అంది అన్నపూర్ణ .

“అదేంటి అప్పుడే వెళ్ళారే  పెద్దమ్మ రాలేదా “

“ఊళ్లోకి వచ్చారుట ఇక్కడికి రాలేదు... వాళ్ళు షాపింగ్ కి వెళ్ళారుట .. ఈయన నాన్నగారిని కలిసి వెళ్దామని వచ్చాడు”

వో...  అని అక్కడి నుంచి వెళ్ళబోతున్న గాయత్రి ఆవిడ చివరి మాటకి కాళ్ళకు షాక్ తగిలినట్టు గభాల్న ఆగిపోయింది.

“ వాళ్ళ కొత్త కోడలికి హైదరాబాద్ చూపించడానికి తీసుకొచ్చారుట వారం క్రితం గోల్కొండ వెళ్లారుట..”

ఆమె చేతిలో ప్లేట్ కిందపడి గారెలు చెల్లాచెదురుగా పడిపోయాయి..

ఆవిడ స్టవ్ ఆఫ్ చేసి వెనక్కి తిరిగి చూస్తూ “ ఏమైంది? చేతులు చచ్చు పడ్డాయా”  అంది విసుగ్గా.

గాయత్రి వంగి గారెలు తీసి పళ్ళెంలో వేసి లేచి నిలబడి నెమ్మదిగా అంది” చేయి జారింది. “

“ చేయి, కాళ్ళు, ఒళ్ళు  కూడా దగ్గర పెట్టుకుని మసలుకుంటే జారవు” అంది అన్నపూర్ణ కొంచెం కోపంగా.

గాయత్రికి అనుమానం ధృడపడింది. అయితే పెదనాన్న తనని చూసారు.. పనిగట్టుకుని ఇంటికి వచ్చి  వీళ్ళిద్దరికి చెప్పారు.. తను జాగ్రత్తగా ఉండాలి.. ఎక్కువ గట్టిగా అడిగితే దబాయించాలి.. ఆయన ఎవరిని చూసి ఎవరనుకున్నాడో నేను కాలేజ్ కే వెళ్ళాను అనాలి... మనసులో గట్టిగా నిశ్చయించుకుంది.    “నేనేం చేశాను ప్లేట్ పడితే నా తప్పా “ అంది ..

“జాగ్రత్తగా పట్టుకుంటే ఎందుకు పడుతుంది..”

“ జాగ్రత్తగానే పట్టుకున్నా ... అయినా జారింది స్టీల్ ప్లేట్ కదా ఏం  విరగ లేదులే ...”

“ విరగ్గోట్టేయ్  నీదేం పోతుంది.. సంపాదించేవాడు ఆయన ... కోనేదాన్ని నేను.. “

“ అబ్బ ఏంటమ్మా చిన్న విషయానికి రాద్ధాంతం చేస్తావు...”

“ ఇవాళ చిన్న విషయమే రేపు పెద్దది అవుతుంది... నిజం చెప్పు నువ్వు సవ్యంగా కాలేజికి వెళ్తున్నావా. “ అన్నపూర్ణ ముసుగులో గుద్దులాట ఆపి కూతురు ఎదురుగా వచ్చి నిలబడి అడిగింది.     ఊహించని ఆ పరిణామానికి మ్రాన్పడిపోయింది గాయత్రి .

నాన్న వచ్చి గొడవ చేస్తాడు అనుకుంది... కానీ  ఈవిడ ఇంత సూటిగా అడుగుతుందని ఏ మాత్రం ఊహించినా అలర్ట్ గా ఉండేది. ఇప్పుడు గాయత్రికి తన గుండెల్లో భయం కళ్ళల్లో కనిపిస్తోందని.. ఆ భయం తల్లి దృష్టిలో పడుతుందని తెలిసిపోయింది. అయినా మేకపోతు గాంభీర్యం నటిస్తూ బింకంగా  అంది ..    “ఇందాక నాన్న అలాగే అడిగారు.. నువ్వు అదేనా... నేను కాలేజి కి వెళ్ళడం లేదన్న అనుమానం మీకెందుకు వచ్చిందసలు ... వెళ్ళకపోతే నష్టం నాకా? మీకా ?” .

“నష్టం ఉందో, లేదో తెలిస్తే కాలేజ్ ఎగ్గొట్టి గోల్కొండ వెళ్తావా... ఎవరు వాడు నీతో వచ్చిన వాడు..”

అయిపొయింది... ఎదురుచూస్తున్న ఉరుము ఉరిమింది... పిడుగు పడకుండా జాగ్రత్త పడాలి. తనని తాను   సంబాలించుకుంది... సరిగ్గా ఇప్పుడే నేను జాగ్రత్తగా ఉండాలి  అనుకుంటూ  “ నేను గోల్కొండ వెళ్ళానా ... ఎప్పుడు? ఎవరితో వెళ్తాను? “ ఆశ్చర్యం నటిస్తూ  అడిగింది.

కూతురి మొహంలో నదురు బెదురు లేకపోగా ఎంతో ఆశ్చర్యంగా అడగడంతో అన్నపూర్ణ కొంచెం స్వరం తగ్గించి అంది “ నువ్వు అక్కడ కనిపించావని, నీ పక్కన ఎవరో కుర్రాడు కూడా ఉన్నాడని చెప్పారు. నిజం చెప్పు నువ్వు వెళ్ళలేదూ ..”

“అమ్మా లోకంలో మనిషిని పోలిన మనుషులు బోలెడు మంది ఉంటారు.. ఎవర్నో చూసి ఆయన నేను అనుకోడం బాగుంది.. అది మీకు పనిమాలా వచ్చి చెప్పడం ఇంకా బాగుంది.  నాకు అసలు అది ఎక్కడ ఉందో కూడా తెలియదు.. అయినా నాకు ఏ అబ్బాయి తెలుసు.. ఇల్లు, కాలేజ్ తప్ప నాకేదన్నా తెలుసా... ఆయన చెప్పడం, మీరు నన్ను క్రిమినల్ ని చూసినట్టు చూడడం...”  అంటూనే కంఠం రుద్ధమైంది... రాని కన్నీళ్ళు తుడుచుకుంటూ  “నాకేం వద్దు “ అంటూ చేతిలో ప్లేట్ పక్కన గట్టు మీద పెట్టి వేగంగా తన గది లోకి వెళ్ళిపోయింది.;

అన్నపూర్ణ కి బాధగా  అనిపించింది... నిజమే ఆయన ఎవరిని చూసి ఇదనుకున్నాడో అనవసరంగా ఆయన చెప్పింది నమ్మి  పిల్లని బాధపెట్టాను. అయినా ఉత్తప్పుడు వచ్చి కష్టం, సుఖం విచారించని వాడు పనిమాలా ఎందుకొచ్చినట్టు!  కన్నకూతుర్ని నమ్మకుండా ఆయన మాటలు నమ్మడం కూడా ఎంత వరకు సమంజసం!  నిజమే దీనికి ఎవరు తెలుసు? కాలేజ్ , ఇల్లు తప్ప ఎక్కడికి వెళ్ళదు .. అలాంటిది ఆయన చెప్పగానే నమ్మడం ... అన్నపూర్ణకే కూతురి మాటల మీద గురి కుదిరినా అప్పుడే తగ్గిపోడం ఇష్టం లేక అంది పెద్దవాళ్ళకి అనుమానాలు రావడం సహజం అంత మాత్రాన ఈ అలకలేంటి... తప్పు చేయనప్పుడు బాదెందుకు..

అప్పుడే కోటేశ్వరరావు గేటు తోసుకుని లోపలికి వచ్చాడు.. ఆ శబ్దం విన్న గాయత్రి గుండెలు జారిపోయాయి.. అమ్మకి ఎలాగో అబద్ధం చెప్పి తప్పించుకుంది... నాన్న అడిగితే ఏం చెప్పాలి... ఎట్టి  పరిస్థితుల్లో ఆయన నమ్మడు అనుకుంటూ బిక్కు, బిక్కుమంటూ కూర్చుంది ఆయన పిలుపు కోసం ఎదురు చూస్తూ.

“ఏంటి ఏమైంది “భార్యని అడిగాడు కోటేశ్వరరావు ..

“ఏం లేదు..శేషు చెప్పిన విషయం అడిగాను  తను వెళ్ళలేదుట ... ఎవరిని చూసి ఎవరు అనుకున్నాడో” అంది అన్నపూర్ణ ..

“ ఆ, వాడి సంగతి నాకు తెలుసుగా ... చూపు కూడా సరిగా ఆనదు .... నిజంగానే ఎవరినో చూసి మన పిల్ల అనుకుని ఉంటాడు..” అని భార్యతో అని “గాయత్రి “ అని పిలిచాడు.

తండ్రి మాటలకి  ఒక పక్క, అనుమానం, మరో పక్క ఆశ్చర్యం పెనవేసుకుని  నిశ్చేష్టురాలిలా ఉండిపోయిన గాయత్రి ఆయన పిలుపుకి గభాల్న కదిలి పడబోయి తమాయించుకుని హాల్లోకి నడిచింది.

ఇంతలోకే భర్త ఇలా మాట్లాడుతున్నదేంటి అని అర్ధం కాని దానిలా అన్నపూర్ణ బిత్తరపోయి నిలబడిపోయింది.

 

(సశేషం)

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్