Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమిస్తే ఏమవుతుంది?

premiste emavtundi

గత సంచికలోని ప్రేమిస్తే ఏమవుతుంది సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి..... http://www.gotelugu.com/issue236/650/telugu-serials/premiste-emavutundi/premiste-emavtundi/

 

(గత సంచిక తరువాయి)...  తేజ తీసిన షార్ట్ ఫిలిం ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించడానికి సెలక్ట్ అయింది. ఆ ఆనందం శరణ్యతో పంచుకోడానికి ఫోన్ చేసాడు.. ఫోన్ రింగ్ అయింది కాని శరణ్య తీయలేదు.. అయిదు నిముషాలు ఆగి మళ్ళి చేసాడు. అప్పడు కూడా తీయ లేదు..

ఎక్కడికి వెళ్లిందో మహాతల్లి అనుకుంటూ వాచీ చూసాడు.. టైం ఏడు అవుతోంది. తెజకి కొంచెం ఖంగారుగా అనిపించింది. ఈ పాటికి ఇంటికి వెళ్లి పోవాలి ... వెళ్ళలేదా.. లేక అప్పుడే నిద్ర పోతోందా.. ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు..

శరణ్యకి ఇంకో మొబైల్ , ఇంకో సిమ్  కార్డ్ కొనివ్వాలి పర్సనల్ కాల్స్ కోసం సపరేట్గా  పెట్టుకోమనాలి.

మళ్ళి రింగ్ చేసాడు.. స్విచ్ ఆఫ్ అని వచ్చింది. తేజకి టెన్షన్ ఎక్కువైంది..

తన షార్ట్ ఫిలిం సాధించిన విజయానికి కలిగిన ఆనందం ఆవిరై పోయి ఇప్పుడు శరణ్య ఫోన్ ఎందుకు తీయలేదు.. పైగా స్విచ్ ఎందుకు ఆఫ్ చేసింది అని మనసేదో కీడు శంకించింది.

అతను ఆ సమయంలో  బంజారా హిల్స్ లోని ఒక కాఫీ షాప్ లో ఉన్నాడు.  అతని చేతిలో కాపిచినా కాఫీ కప్పుంది.  నెమ్మదిగా సిప్ చేస్తూ శరణ్య నెంబర్ ట్రై చేస్తూనే ఉన్నాడు. స్విచ్ ఆఫ్ అయిన ఫోన్ ఎన్నిసార్లు రింగ్ చేస్తే మాత్రం కలుస్తుంది! కప్పు టేబుల్ మీద పెట్టి గబుక్కున లేచి బయటికి నడిచి  పార్కింగ్ లో ఉన్న బండి తీసాడు..  విపరీతమైన రద్దీ.. మూడు నాలుగు సిగ్నల్స్ దగ్గర చాలా సేపు ట్రాఫిక్ ఆగిపోయింది.. చాలా అసహనంగా అటు, ఇటూ చూసాడు ఎక్కడ చిన్న సందు దొరికినా దూసుకు వెళ్ళాలన్నట్టుగా... మొత్తం కార్లు, ఆటోలు, టూవీలేర్స్ తో దడి కట్టినట్టుగా ఉంది .. ఇంతమంది ఎక్కడికి వెళ్తారో ఇళ్ళల్లో కూర్చోక అనుకున్నాడు చిరాగ్గా.

అతని మనసంతా శరణ్య ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసింది అనే ప్రశ్న వేయి సార్లు ఇంపోజిషన్ రాసుకున్న పేపర్ లా ఉంది .. ఎందుకు? ఎందుకు? అనుకుంటూ ట్రాఫిక్ క్లియర్ అవడం కోసం చూడ సాగాడు.. పావు గంట తరవాత నెమ్మదిగా ఒక్కో వాహనం కదల సాగింది. బండి స్టార్ట్ చేసి వేగం పెంచాడు. అతను లిబర్టి దగ్గర శరణ్య అపార్ట్ మెంట్ దగ్గర బండి ఆపి లిఫ్ట్ కోసం కూడా ఎదురు చూడకుండా రెండేసి మెట్ల చొప్పున ఎక్కి శరణ్య ఫ్లాట్ ముందు ఆగి ఊపిరి పీల్చుకున్నాడు. ఆటోమేటిక్ గోద్రెజ్ లాక్ ... ఇంట్లో ఉందో, బయటికి వెళ్లిందో కూడా అర్ధం కాదు. కాలింగ్ బెల్ నొక్కాడు. రెండు సార్లు నొక్కాక తలుపు తెరుచుకుంది.  నైట్ డ్రెస్ లో జుట్టంతా పైకి కట్టి క్లిప్ పెట్టుకుని ఏదో నములుతూ కనిపించింది శరణ్య.

" హాయ్ వాట్ ఏ సర్ ప్రైస్ .... " మొహం నిండా వెలుగు నింపుకుని అడిగింది .. కోపం పళ్ళ బిగువున ఆపుకుని ఆమె వైపు చూడకుండా హాలు మొత్తం కలయ చూసాడు. కార్నర్ టేబుల్ మిద చార్జ్ పెట్టి ఉంది ఆమె మొబైల్ .. గబా, గబా అక్కడికి నడిచి చార్జర్ తీసి ఫోన్ విసిరేసాడు.

అతని చర్యకు ఆశ్చర్యంగా చూసి గభాల్న ఫోన్ క్యాచ్ పట్టుకుంది శరణ్య.

ఏయ్ ఏంటిది ఏమైంది అంది అతని షర్ట్ గుండెల దగ్గర పట్టుకుని.

నీకసలు బుద్ధుందా... మండి పడుతూ అరిచాడు.

"అరె బాబూ వాట్ హపెండ్.."

ఎంత సేపటి నుంచి ట్రై చేస్తున్నాను ... ఫోన్ లిఫ్ట్ చేయలేదు, పై నుంచి స్విచ్ ఆఫ్ చేస్తావా..నా గురించి ఏమనుకుంటున్నావు.. పిచ్చి వెధవ ఊరికే వెంట తిరుగుతాడు... విడినేంటి కేర్ చేసేది అనుకున్నావా... లేకపోతే నేను ఫోన్ లిఫ్ట్ చేయక పోతే వీడు ఎం చేస్తాడో చూద్దాం అనుకున్నావా..

అతని మోహంలో కనిపిస్తున్న టెన్షన్, మాటల్లో వినిపిస్తున్న వేదన చూస్తూ చిరునవ్వుతో అంది "ముందు కూల్ ఆవు కొంచెం కూల్ డ్రింక్ తాగు.. తరవాత ఒక్కో ప్రశ్నే అడుగు అన్సర్ చేస్తా " అంటూ ఫ్రిడ్జ్ వైపు  వెళ్తున్న ఆమె భుజం పట్టి లాగి తనకి అభిముఖంగా తిప్పుకుని ' ముందు ఆన్సార్ చేయి ' అన్నాడు.

తన భుజాల మీద ఉన్న అతని చేతులు, అతని మొహం మార్చి, మార్చి చూసిన ఆమె మోహంలో ముందు తెరలు, తెరలుగా ప్రారంభం అయిన నవ్వు క్షణంలో పగలబడి నవ్వ సాగింది.వొళ్ళు మండి పోయింది తేజకి... 'ఆపు' అన్నాడు గట్టిగా.

ఆ అరుపుకి నవ్వు ఆపినా పెదాల మీద , కళ్ళల్లో చిందు లేస్తూనే ఉండడంతో పెదాలు రెండూ బిగించి అతన్నే చూడసాగింది..

అసలు స్విచ్ ఆఫ్ అయిం దాకా చార్జ్ ఎందుకు పెట్ట లేదు ? అడిగాడు.

శరణ్య సమాధానం చెప్పకుండా అలాగే పెదాలు బిగించి నిలబడి పోయింది.

చెప్పు.... ఏం చేసావు ఇప్పటి దాకా ... కాలేజ్ నుంచి ఇంటికి నేరుగా రాలేదా.. ఎక్కడికి వెళ్లావు?

అతనలా తన మీద ఏదో అధికారం ఉన్నట్టు గద్దిస్తూ అడుగుతుంటే శరణ్య కి కోపం రాలేదు.. మరో సారి ఫక్కున నవ్వి, అతని చేతులు పట్టుకుని సోఫాలో కూర్చో బెట్టి అతని పక్కనే కూర్చుంది.

తేజ తన వైపే సూటిగా చూస్తున్న ఆమె చూపులు తప్పించు కుంటూ మొహం పక్కకి తిప్పుకున్నాడు.

శరణ్య మృదు మధురంగా అంది 'నువ్వలా తిడుతుంటే నాకు చాలా బాగుంది తేజా.. ఇంకా దగ్గరగా అనిపిస్తోంది.. ఇంకాస్సేపు తిట్టవా ప్లీజ్..'
సిగ్గు లేక పోతే సరి ...

ఇంకా .... కళ్ళల్లో నవ్వుతో అంది.

తేజకి ఆమెని చూడగానే తను అంత దాకా పడిన టెన్షన్ స్థానంలో పిచ్చి కోపం వచ్చింది.. తిట్టాల్సినది తిట్టక ఆమె నవ్వు చూస్తోంటే మనసు తేలికైంది... ఒక్క సారి ఆమెని దగ్గరకు తీసుకుని నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా అని సేద తీరాలని  గాఢంగా అనిపిస్తోంది.. కానీ ఏదో దూరం .... ఆ దూరం అతనికి నచ్చనిది.. ఆ దూరం శరణ్య తనంతట తానుగా  తగ్గించాలి... అందుకు ఎంత కాలమైనా ఎదురు చూడాలి అనుకున్నాడు. అందుకే మొహం తిప్పుకుని టి వి చూడ సాగాడు.. ఏదో తెలుగు సీరియల్ వస్తోంది.. ఇద్దరు ఆడ వాళ్లు ఇంకో లేడి కారక్టర్ గురించి మాట్లాడుకుంటూ ఆమె పెళ్లి ఎలా చెడగొట్టాలా అని ప్లాన్ చేస్తున్నారు.. అది చూడగానే అణ చుకున్న కోపం నషాళానికి అంటింది..
“బుద్ధి ఉందా... చదువుకున్న దానివి ఇలాంటి చెత్త ప్రోగ్రామ్స్ చూస్తావా.. పైగా ఈ దిక్కు మాలిన ప్రోగ్రాం చూస్తూ మైమరచి పోయి నా ఫోన్ కి రెస్పాండవవా.. నిన్నేం చేయాలి” అన్నాడు.

“ఏమి చేయద్దు... బుద్ధిగా కూర్చుని నేను చెప్పేది విను “ అంది ..

“ ముందా టి వి ఆఫ్ చేయి నాకు బి పి రైజ్ అవుతుంది” అన్నాడు.

శరణ్య కొంచం ఒంగి సెంటర్ టేబుల్ మీద ఉన్న రిమోట్ తీసుకుని టి వి ఆఫ్ చేసింది.

సీరియస్ గా కూర్చున్న తేజ వైపు చూసి అంది “ కొంచెం ఆ సీరియస్ నెస్ తగ్గించు బాబూ...” తేజ మాట్లాడ లేదు.. ఏటో చూస్తూ కూర్చున్నాడు.

“సరే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినందుకు ఎక్స్ ప్లనేషన్ ఇచ్చిం దాకా నవ్వ కూడదని డిసైడ్ అయావా చెప్తా విను“ అంటూ తను అప్పటి దాకా తింటున్న ఉడక బెట్టిన వేరు సెనగ పప్పులు రెండు  ప్లేట్ లో నుంచి తీసి అతని నోటికి అందించి చెప్పడం మొదలు పెట్టింది.
“ ఇవాళ మామూలుగా రోజూ లాగే కాలేజ్ కి వెళ్లాను.. నా కివాళ నా రొటీన్ రెండు క్లాస్ లతో పాటు ఇంకో లెక్చరర్ రాలేదని ఆవిడ క్లాస్ కూడా తీసుకోమన్నారు తీసుకున్నాను. అన్ని అయే సరికి లంచ్ టైం అయింది. ఇవాళ లంచ్ తీసుకుని వెళ్ళ లేదు.. నా కొలీగ్ రాఘవ కూడా తెచ్చుకోలేదు. కాలేజ్ పక్కనే ఉన్న ఒక రెస్టారెంట్ కి వెళ్ళాము ఇద్దరం కలిసి. మంచి ఇడ్లి తిన్నాము, స్ట్రాంగ్ కాఫీ తాగాము. అప్పుడు మన హిరో అదే నా కొలీగ్ రాఘవ గాడికి మూడ్ వచ్చి నా చేయి తన చేతి లోకి తీసుకుని ' ఐ లవ్ యు ' అన్నాడు. లాగి చెంప మీద కొడదాం అనుకున్నాను కానీ ప్రస్తుతం  అలా కొట్టడం అనాగరికంగా పరిగణించ బడుతోంది కాబట్టి మెత్తగా క్లాస్ పీకడం స్టార్ట్ చేసాను.. ఒరే వెధవా ఏదో నా తోటి లెక్చరర్ వి అని నీతో రెస్టారెంట్ కి వచ్చానని నువ్వు ప్రేమిస్తున్నా అనగానే నీకోసమే నే జీవించునది అని పాడేస్తానని ఎలా అనుకున్నావురా బడుద్ధాయి.. నీకంత సిన్ లేదు.. ఇంకెప్పుడూ ఇలాంటి చొల్లు వాగుడు వాగకు అని వాడు బిల్ పే చేయబోతుంటే  నేనే ఇద్దరి బిల్ పే చేసి, బిల్ కట్టాను కదా అని ని మీద నాకేదో ప్రేమ రాబోతోందని మురిసిపోకు ఈ జన్మకి రాదు అని చెప్పి నా మానాన నేను కాలేజ్ కి వెళ్లాను.

నేను ఇచ్చిన షాక్ కి గిల గిలలాడిపోయి ఇంటికి వెళ్ళిపోయి, ఫోన్ చేసాడు.. నీకు నా గురించి తెలుసా నా దగ్గర కోట్ల రూపాయలున్నాయి.. ఉద్యోగం సరదాకి చేస్తున్నా.. నా కుక్క మెయిన్ టేనేన్స్ అంత జీతం లేదు నీకు ఎందుకే అంత పొగరు... అని వాగాడు.. అయితే కుక్కనే పెళ్లి చేసుకో , కుక్కనే ప్రేమించు అని చెప్పి డిస్కనెక్ట్ చేశా. వాడికి ఆ మాటతో పౌరుషం పొడుచుకు వచ్చింది.. మళ్ళి కాల్ చేసి తిట్టడం మొదలు పెట్టాడు.. ఈ ఫార్సు ఇవాళ మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఆరున్నర దాకా సాగుతూనే ఉంది. అందుకే ఫోన్ మోగుతున్నా చూడ లేదు, లిఫ్ట్ చేయ లేదు.. అలా మోగుతూనే ఉంది .. విసుగు పుట్టి ఆఫ్ చేశాను.. ఇప్పుడు చెప్పు నాకు బుద్ధి ఉందా లేదా.“
వింటున్న తేజ మొహంలో క్షణం, క్షణం మారుతున్న రంగులు చూస్తుంటే అతనికి బాగా కోపం వచ్చిందని గ్రహించింది శరణ్య .. అతడిని అల్లా చూస్తుంటే తమాషాగా ఉంది.. తను ఫోన్ లిఫ్ట్ చేయ లేదని ఖంగారు పడి అప్పటికప్పుడు ఇంతదూ రం ఈ పీక్ టైములో , ట్రాఫ్ఫిక్ సమస్యల్లో పడి రావడం , వస్తూనే తన చెంప పగల కొట్టాలన్న ఆవేశాన్ని బలవంతంగా అణచుకుని మండి పడడం సరదాగా ఉంది.. తేజ నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడు అనుకుంది..

“ నీకు నిజంగానే బుద్ది లేదు.. చెప్పుతో కొట్టి ఉంటే మళ్ళి కాల్ చేసేవాడా.. ఎందుకు కొట్ట లేదు.”.

నవ్వింది శరణ్య.“ ఆ కాలం పోయింది తేజా.. నువ్వంటే నాకు మోజు ఒక రాత్రి నాతో స్పెండ్ చేస్తావా అని డైరెక్ట్ గా అడిగే నీచ సంస్కృతిని  నాగరికతగా భావించి ఇష్టమైతే వెళ్ళడం, లేదంటే నో సారి అని చెప్పే దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఉన్నాం .. నేనలా కొట్టలేక కాదు.. కొట్టి ఉంటె నేనొక అనాగారికురాలిగా ముద్ర పడేదాన్ని.. నన్నందరు ఐటెం లాగా చూసేవాళ్ళు. ,., ఇవాళ ఒక్క రోజు వాడిష్టం వచ్చినన్ని కాల్స్ చేస్తాడు.. రిప్లై ఇవ్వక పోతే విసిగి పోయి సైలెంట్ అయి పోతాడు.. మొరిగే కుక్కని ఎం చేస్తామో వీడి లాంటి వాళ్ళని కూడా అదే చేస్తాం. సరేలే ఇంతకీ ఎందుకు ఇంత ఎమర్జెన్సీ గా వచ్చావు.. నాకేమన్నా అయిందేమో అని టెన్షన్ పడ్డావా.” తేజ మాట్లాడ లేదు.

“చెప్పు తేజా చాల్లే కోపం ..” గోముగా అంది ..

తేజ ఆమె వైపు చూసాడు.. చిన్న చిరు నవ్వు అతని కళ్ళల్లోంచి పెదవుల మీదికి పాకింది.

“ఏంటో ఆ ముసి, ముసి నవ్వులు” అంది.

“నా షార్ట్ ఫిలిం ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రెజంట్ చేయడానికి సెలక్ట్ అయింది. ఆ న్యూస్ వినగానే ముందు నీకే చెప్పాలని ఫోన్ చేశా...”

“ ఓ మైగాడ్ .... కంగ్రాట్స్....” గబుక్కున అతని దగ్గరగా జరిగి చెంప మీద ముద్దు పెట్టుకుంది..

“ థాంక్  యు ...” ముద్దుకి, అభినందనలకి కలిపి చెప్తున్నట్టు ఆమె కళ్ళల్లోకి  మైమరచి చూస్తూ, అపురూపంగా చెప్పాడు.

“ పద, పద నీకు మంచి డిన్నర్ పెట్టిస్తా.. నేనిప్పుడే డ్రెస్ మార్చుకుని  వస్తా..” అంటూ లేచి లోపలి పరిగెత్తింది ..

ఆమె హడావుడి కి, ఆమె ఇచ్చిన ఆత్మీయతతో కూడిన చిన్న ముద్దుకి అతని టెన్షన్ మొత్తం అర చేతిలో పట్టుకున్నమంచులా జారి పోయింది.. మనసంతా ఉల్లాసంగా మారింది.. శరణ్య తో జీవిస్తే జీవితం ఓ ఫెస్టివల్  ఓ సెలబ్రేషన్ అనుకున్నాడు.

తెల్లటి లెగ్గిన్ మీద తెల్లటి లక్నో కుర్తి వేసుకుని వచ్చింది.

“చలో చట్నిస్ కి వెళ్దాం .. “

|“ముందు నీకు ఒక ఫోన్ కొనిస్తా దానికి ఒక సిం కార్డ్ కొనిస్తా నీ  ఆధార్ కార్డ్ తీసుకురా ఒక ఫోటో కూడా” అన్నాడు.

“ఎందుకు” ప్రశ్నార్ధకంగా చూసింది..

“ నాకోసం మాత్రమే నీ దగ్గర ఒక సపరేట్ ఫోన్ ఉండాల్సిన నేసెస్సిటి ఇవాళే తెలిసింది నాకు..”

“ ఓ పిచ్చి తేజా ఒక్క రోజు ఏదో ఇలా అయిందని రోజూ అవుతుందా..”

“ అదంతా కాదు వెళ్ళు పట్రా” అన్నాడు..

అతని కళ్ళల్లోకి చూసి మురిపెంగా నవ్వి లోపలికి వెళ్లి ఫోటో, అధర్ కార్డ్ జిరాక్స్ తీసుకొచ్చింది.

“గుడ్“ అంటూ లేచాడు తేజ.

(సశేషం)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nadaina prapancham