Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
premiste emavtundi

ఈ సంచికలో >> సీరియల్స్

నాదైన ప్రపంచం

nadaina prapancham

గత సంచిక లోని  నాదైన ప్రపంచం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.....http://www.gotelugu.com/issue236/649/telugu-serials/naadaina-prapancham/nadaina-prapancham/

 

(గత సంచిక తరువాయి)... ఎవరు ఏ కారణాల చేతా దాన్నుంచి నన్ను దూరం చేయ లేరు. అలా చేయటానికి ప్రయత్నిస్తే వాళ్ళకి దూరమవుతాను నేను. అందుకిదే ఉదాహరణ’’ అని సూట్ కేస్ తీసుకుని నడవ బోయింది.

చెయ్యి పట్టుకుని ఆపాడు అశోక్. అతని మొహం కంద గడ్డలా మారి పోయింది.

‘‘నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తోందా?’’ పంటి బిగువున అన్నాడు.

సూటిగా అతని కళ్ళలోకి చూసింది కీర్తన.

‘‘ఇంకా అలా అడిగే అర్హత నీకు వుందనే భావిస్తున్నావా....?’’

ఒక్క క్షణం దీర్ఘంగా నిశ్వసించి....

‘‘ఉంది...ఆ అర్హత నాకే వుంది. మనం విన్న మాటల వెనక కూడా ఎన్నో అర్ధాలుండవచ్చు. నేషనల్ గేమ్స్ నీ లక్ష్యం కావచ్చు. దాని కోసం నువ్వు కృషి చెయ్యొచ్చు. కానీ మనం మనుషులం కదా! అందరి తోనూ నువ్వు మంచి రిలేషన్స్ కలిగి వుండాలని, సంతోషంగా జీవితం గడపాలనీ నాకు వుండదా?’’ ఆవేశంగా అన్నాడు.

‘‘ఓహో! అయితే నా సంతోషం కోసమే ఒక మోసగాడితో చేయి కలిపావన్న మాట’’ వ్యంగ్యంగా అంది.

‘‘ఇక ఆపు. మాట్లాడకు’’ గట్టిగా అరిచాడు అశోక్.

‘‘పెద్ద వాడివి కదాని ఈ అరుపు తోనే నన్ను కంట్రోల్ చేయ గలవు. అంతే! నా మనసుని మాత్రం కాదు’’ తిరస్కారంగా చూస్తూ అంది.

‘‘నీకు తెలీదు. నిజంగా ఆకాష్ గురించి నీకు తెలీదు. అందుకే ఇలా మాట్లాడుతున్నావు’’ కోపంగా అన్నాడు.

‘‘అయినా ఇప్పుడు నాకు ఎవరి గురించీ తెలుసుకోవాలన్న ఆసక్తి లేదు. నన్ను వెళ్ళనివ్వు’’ ముందుకడుగేసింది.

‘‘కనీసం నాన్న గారి గురించయినా ఆలోచించ లేవా?’’ ఆవేదనతో అన్నాడు. వెళ్ళ బోయేది ఆగింది. చిన్న నవ్వు నవ్వి....

‘‘మంచికో, చెడుకో వదిన ఈ ఇంటికి వచ్చిన రోజే నా చేతి లోని జ్యూస్ గ్లాస్ తీసుకుని ఇక నుంచీ డ్యూటీ నాది అంది. ఇక నాన్న గారికి నా అవసరం ఏముందీ?’’ విరక్తిగా అంది.

ఆ మాట వినగానే కోపం ఆపుకో లేక పోయాడు అశోక్. చెయ్యి పట్టుకుని బర బరా తండ్రి దగ్గరకి లాక్కెళ్ళి నిద్ర పోతున్న ఆయన్ని చూపిస్తూ...

‘‘ఆయన మొహం చూసి చెప్పు. తండ్రీ కూతుళ్ళ మధ్య ఉండేది అవసరార్ధమైన బంధమా? నీ ఆట ధ్యాసలో పడి నువ్వెంత మెకానికల్ గా ఆలోచిస్తున్నావో తెలుసా? ఇదే నా బాధ. ఇదే ఆకాష్ బాధ....నీకిప్పుడు ఎంత చెప్పినా అర్ధం కాదు.

జీవితంలో నువ్వనుకున్న లక్ష్యం చేరుకుని వెనక్కి తిరిగి చూసుకో. ఒక్కరు కూడా నీకు మిగలరు. ప్రతి మనిషికీ లక్ష్యం వుండటం, దాన్ని సాధించటానికి ప్రయత్నించటమూ మంచిదే! దాని కోసం జీవితం లోని ముఖ్యమైన ఘట్టాలని పోగొట్టుకో కూడదు.

నేషనల్ గేమ్స్ నీ లక్ష్యమయితే అలానే సాధించు. కానీ ఏవో ఛాలెంజ్‌లు అవీ చేసి ఆకాష్ ని దూరం చేసుకో వద్దు. మీరిద్దరూ ఏమనుకున్నారో నాకనవసరం. మీ ఇద్దరి పెళ్ళి జరిగి తీరుతుంది’’ ఖండితంగా అన్నాడు అశోక్.

‘‘నువ్వు ఆ కల్లోనే విహరించు. నా జీవితంలో పెళ్ళికి తావు లేదు’’ చెప్పి బయటకు నడిచింది.

జాహ్నవి పిలిచి ఏదో చెప్పబోతున్నా విన లేదు. రోడ్డు మీదకి వచ్చి ఆటో పిలిచి అందులో ఎక్కి కూర్చుంది. ఆటో వేగాన్ని పుంజుకుని సాగింది.

*****************************

సూట్ కేస్ తీసుకుని రైల్వే స్టేషన్ కయితే వచ్చింది కానీ ఎక్కడికి వెళ్ళాలో తోచ లేదు కీర్తనకి.

ప్లాట్ ఫాం మీద వున్న చెయిర్ లో కూర్చుని తాపీగా ఆలోచించడం ప్రారంభించింది.

అశోక్ మాటలు గుర్తుకొస్తున్నకొద్దీ గుండెలు మండి పోతున్నాయి.

ఏమన్నాడతను?

తనని ఎట్టి పరిస్థితుల్లోనూ నేషనల్ గేమ్స్ కి   వెళ్ళనివ్వడా? ఆకాష్ తోనే తన మారేజ్ జరిగేలా చూస్తాడా?

తనెంత గానో నమ్మిన తన అన్నయ్య ఈ మాటలు అన్నాడు.

ఎలా నమ్మాలి?

తన వూపిరే తనకి విష పూరితంగా మారిందన్న చేదు వాస్తవాన్ని ఎలా భరించాలి?

అసలు అశోక్ కీ, ఆకాష్ కీ ఎలా పరిచయం? ఆ పరిచయం తమిద్దరి అనుబంధాన్ని దెబ్బ తీసే స్థాయిలో వుండటమే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ఇప్పటి వరకూ తను ఎదుర్కున్న అవమానాలు వేరు.....ఇప్పుడు తగిలిన దెబ్బ వేరు.

ఆప్యాయంగా గూటికొచ్చి వాలిన గువ్వని, ఆదరించినట్లు నటించి గొంతు పిసికి చంపిన అమానుషత్వం అశోక్ లో కనిపిస్తోంది.
అసలు ఆకాష్ ఎందుకు తన మీద కక్ష కట్టాడు?

తనని నేషనల్ గేమ్స్ ఆడకుండా చెయ్యడంలో అతని ఉద్దేశం ఏంటి?

‘ఇదంతా మణి బిందు ప్లాన్ కాదు కదా?’ అనుకోగానే దుఃఖం ముంచుకొచ్చింది.

ఆ దుఃఖం నుంచే పట్టుదల తలెత్తింది.

తనని ఎవరూ అడ్డుకో లేరు. తమ టీమ్ నేషనల్ కప్ సాధించడం ఖాయం.

లోకమంతా ఒక్కటై తనని ఏకాకిని చేసినా, తన ఆత్మ విశ్వాసమే తోడుగా అనుకున్నది సాధించి తీరుతుంది తను.

ఎంత సేపు అలా ఆలోచిస్తూ కూర్చుందో తెలీదు కానీ, తను కూర్చున్నాక బెంచీ చివర ఎవరో కూర్చోవడం, గలగలా నవ్వు వినిపించే సరికి తలెత్తి చూసింది కీర్తన.

అప్పటికే చీకటి పడుతోంది.

మధ్యాహ్నం నుంచీ ఆ బెంచీ మీద దిగాలుగా కూర్చుని ఎక్కడికి వెళ్ళాలో తెలీనట్లు, ఏ ట్రైనూ ఎక్కకుండా కూర్చున్న అందమైన కీర్తనని గమనించే సరికి ఓ అల్లరి గ్యాంగ్ కి ఆసక్తి పెరిగి పోయింది.

‘‘హలో....ఎక్కడికి వెళ్ళాలి.....?’’ ఓ అబ్బాయి ఎడ్వాన్స్ అయి పోయాడు.

అయోమయంగా చూసింది.

ఆమె బిత్తర చూపు గమనించి వాళ్ళకి ధైర్యం వచ్చేసింది.

‘‘మద్రాసా?’’ రహస్యంగా అడిగాడు.

ఈ అమ్మాయి తన అందం చూసుకొని తప్పని సరిగా సినిమాల్లో జాయిన్ అవడానికే వెళుతోందన్న అభిప్రాయంతో అడిగాడు.
మాట్లాడ లేదు కీర్తన.

మరింత పక్కకి జరిగాడతను.

ముడుచుకు పోయింది కీర్తన.

ఇలాంటి అమ్మాయిల్ని హేండిల్ చేయటం చాలా సులువు అనుకున్నాడతను.

కీర్తన గురించి పూర్తిగా తెలీక!

‘‘డబ్బు, నగలు ఏవయినా తెచ్చావా?’’ ఏకంగా ఏక వచనంలోకి దిగి అడిగాడు.

అభావంగా చూసింది.

‘‘నేను తోడు వస్తాలే....’’ మరింత దగ్గరికి జరిగి ఆమె చేతి మీద చెయ్యి వేయ బోయాడు.

అంతే....!

ఏం జరిగిందో అర్ధమయ్యే లోపు కళ్ళ ముందు నక్షత్రాలు కనిపించాయి. కుడి బుగ్గ బూరెలా వాచి పోయింది. లేచి నిలబడింది కీర్తన.‘‘ఎవరి దోవన వాళ్ళని బతకనివ్వండి....’’ అంటూ విసురుగా అడుగు వేస్తూ స్టేషన్ బయటకు కదులుతుంటే, నోర్లు తెరుచుకొని చూస్తుండి పోయింది ఆ గ్యాంగ్.

బయటికి వచ్చినా ఎక్కడికి వెళ్ళాన్న ఆలోచన వదల లేదు. తన ఫ్రెండ్స్ అడ్రసులన్నీ కళ్ళ ముందు మెదిలాయి.

ఊహూ! అక్కడ ఎక్కడా తనకి ప్రశాంతత వుండదు. అందరూ తనని ప్రశ్నలతో వేధిస్తారు.

మరి ఎక్కడికి వెళ్ళాలి?

తీవ్రమైన ఆలోచనలకి నిదర్శనంగా నుదురు ముడుచుకు పోయింది.

చివరికి ఒకే ఒక్క పేరు స్మృతి పథంలో మిగిలి పోయింది. ఎస్ అక్కడయితేనే తను ప్రశాంతంగా వుండ గలదు. ఆ చోటే తనకి ధైర్యాన్ని యివ్వ గలదు. మరేమీ ఆలోచించ లేదామె. ఆటో ఎక్కి అడ్రస్ చెప్పింది.

ఆటో రివ్వున సాగిపోతుండగా తన నిర్ణయాన్ని తరచి తరచి చూసుకుంది.

ఒక్క నిమిషం బెరుకుగా అనిపించినా, ఈ పరిస్థితుల్లో అంతకన్నా మంచి చోటు తనకి దొరకటం చాలా కష్టం!

పర్సు లోంచి అడ్రస్ తీసి చూసుకుని, ఆటో అతనికి చెప్పింది. అర గంటలో ఆమె చెప్పిన ఇంటి దగ్గర దింపాడు.

బ్యాగ్ నీ, సూట్ కేస్ నీ సర్దుకుంటూ దిగింది కీర్తన.

నెమ్మదిగా అడుగు వేసుకుంటూ వెళ్ళింది. వీధిలైటు మెగులో ఇంటి ముందు ప్రాంతమంతా కనిపిస్తోంది.

రక రకాల పూల మొక్కలతో ఆ ప్రాంతమంతా శోభాయమానంగా వుంది.

చిన్న గేటుని తీసుకుని, చుట్టూ పరికిస్తూ లోనికి అడుగువేసింది. ఎదురుగా చిన్న వరండా కనిపించింది. అక్కడ నాలుగు ఛైర్లు, ఒక ఉయ్యాల బల్ల  కనిపించాయి.

కాలింగ్ బెల్ మోగింది. రెండు నిమిషాలు గడిచినా ఎవరూ తలుపు తీయ లేదు.

అప్పుడు గమనించింది....తలుపుకి వేలాడుతున్న తాళం కప్పని.

ఏం చెయ్యాలో తోచనట్లు ఓ నిమిషం నిలబడింది. బరువుగా వున్న బ్యాగ్ నీ, సూట్ కేస్ నీ పక్కన పెట్టింది.

మొక్కలకి పక్కగా వున్న నీళ్ళ పంపుని చూసి అక్కడికి వెళ్ళి మొహం, కాళ్ళూ, చేతులూ శుభ్రంగా కడుక్కుంది.

తియ్యగా వున్న ఆ నీళ్ళను కడుపారా తాగి, వచ్చి కుర్చీలో కూర్చుంది.

టైమ్ ఎనిమిది గంటలయింది.

ఇంకా రావాల్సిన వ్యక్తి రాలేదు.

అలసటతో కళ్ళు మూతలు పడుతుంటే, లేచి నిల్చుని ఆ పరిసరాలన్నీ తిరుగుతూ గమనించింది.

ఎంతో ఆహ్లాదంగా వుంది ఆ ప్రాంతమంతా. ఉయ్యాల బల్ల దగ్గరకి వచ్చి నిల్చుని, గొలుసు పట్టుకుని చూసింది.

చూడ గానే ఓసారి పడుకో బుద్దయింది. నడుం వాల్చింది. ‘లేవాలీ’ అనుకుంటూనే, మరి కొంచెం సేపు అనుకుంటూ నిద్ర లోకి జారి పోయింది.

(సశేషం)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్