Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
premiste emavutundi?

ఈ సంచికలో >> సీరియల్స్

నాదైన ప్రపంచం

nadina prapancham

గత సంచిక లోని  నాదైన ప్రపంచం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి..... http://www.gotelugu.com/issue237/652/telugu-serials/naadaina-prapancham/nadaina-prapancham/ 

(గత సంచిక తరువాయి)... అలా ఎంత సేపు నిద్ర పోయిందో తెలీదు. ఎవరో తనని పిలుస్తున్నట్లు లీలగా తెలుస్తోంది.
కళ్ళు తెరిపిడి పడటం లేదు. అతి ప్రయత్నంమీద కళ్ళు తెరిచింది. ఎదురుగా కనిపించిన మనిషిని చూసి నిద్ర ఎగిరి పోయింది. గబుక్కున లేచి కూర్చుంది.

ఎదురుగా ప్రణీత్!....

ఆశ్చర్యంగా తననే చూస్తూ!...

చూడ గానే ఉయ్యాల బల్ల మీద నుండి ఒక్క దూకు దూకింది.

‘‘ఆ....నెమ్మది....’’ వారించాడతను.

ఇంకేమీ అడగలేదతను. తాళం తీసి సూట్ కేస్, బ్యాగ్ లోపల పెట్టి....

‘‘రండి!’’ పిలిచాడు.

మొహమాటంగా లోపలికి అడుగు వేసింది.

‘‘కూర్చోండి’’ చెప్పాడు.

హాల్లో ఉన్న సోఫాలో కూర్చుంది.

ఫ్రిజ్ లోంచి కూల్ డ్రిరక్ తీసి గ్లాసులో పోసి యిచ్చాడు.

అప్పటికే దాహంగా ఉండటంతో వద్దనకుండా తీసుకుంది.

ఆమె ఏదో చెప్పబోతుంటే వారించి...

‘‘స్నానం చేసి రండి, మాట్లాడుకుందాం....’’ కిచెన్ లోకి వెళుతూ అన్నాడు ప్రణీత్.

మౌనంగా అతను చూపించిన వేపు నడిచింది కీర్తన.

ఆమె స్నానం చేసి జడేసుకుని వచ్చే లోపు అతను సప్పర్ ప్రిపరేషన్స్ పూర్తి చేశాడు. బాయిల్డ్ ఎగ్స్, పుల్కాలు, అందులోకి కర్రి, ఒక పెద్ద గ్లాస్ మిల్క్... బాగా ఆకలిగా ఉండడంతో అతనితో మళ్ళీ చెప్పించుకోకుండానే డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంది.

ఒక ప్లేట్ వుండటం చూసి ‘‘మరి మీరు?’’ అడిగింది.

‘‘ఈ రోజు హోటల్లో పార్టీ వుంది. అక్కడే చేశాను. అందుకే లేటయింది’’ టైమ్ చూస్తూ అన్నాడు. తినేసి, ప్లేట్ తీసుకెళ్ళి కడిగేసి, రాక్ లోపెట్టి వచ్చింది. ప్రణీత్ పాత్రలన్నీ సర్దుతుంటే తనూ హెల్ప్ చేసింది.

ఆమెకి వేరే బెడ్ చూపిస్తూ...

‘‘అక్కడ పడుకోండి. గుడ్ నైట్....’’ చెప్పి, అతను ఇంకో బెడ్రూమ్ వైపు వెళుతుంటే...

ఆమె ‘‘నేను ఇంట్లోంచి వచ్చేశాను.....’’ మెల్లగా అంది.

ఒక్క క్షణం ఆమె వంక చూశాడు.

‘‘నిజంగా....’’ చెప్పింది.

‘‘ఇష్టం లేని చోట ఎవరూ వుండ లేరు. రెస్ట్ తీసుకోండి....’’ చెప్పి కదల బోయాడు.

‘‘ఇష్టం లేక పోవటం కాదు. అయిన వాళ్ళే నమ్మక ద్రోహం చేశారు. తట్టుకో లేక పోయాను. ఇష్టం లేక పోయినా వుండ గలను. కానీ మోసం చేసే మనుషుల మధ్య ఎలా....?’’ ఆమె గొంతు వణికింది.

అతను ఏదో ఆలోచిస్తున్నట్లు ఆగి....

‘‘ఇప్పుడు ప్రశాంతంగా నిద్ర పోగలరా లేదా?’’అడిగాడు.

‘‘ఏవో ఆలోచనలు చుట్టు ముడుతున్నాయి. బాధగా, భయంగా వుంది’’ మెల్లగా చెప్పింది.

‘‘ఇలా రండి....కాసేపు మాట్లాడుకుందాం’’ అతను సోఫా వైపు కి దారితీశాడు. కీర్తన వచ్చి ఎదురుగా వున్న కుర్చీలో కూర్చుంది.

‘‘చెప్పండి’’ వినడానికి ఉద్యుక్తుడయినట్లు కాస్తంత ముందుకు వంగి అన్నాడు.

ఇంతకాం గుండెల్లో దాచుకున్న వేదనని విప్పి చెప్పడానికి ఏం పదాలు వాడాలో ఆమెకి తెలీడం లేదు. అతి ప్రయత్నం మీద భావోద్వేగాన్ని అదుపులో పెట్టుకుని మొదటి నుండి జరిగిందంతా అతనికి చెప్పుకొచ్చింది.

మధ్యలో ఆకాష్ గురించి చెప్పేటప్పుడు అతను చిన్నగా నవ్వు కోవడం చూసి ఉక్రోషంగా అనిపించింది. చెప్పడం ఆపేస్తే....

‘‘చెప్పండి’’ ఆసక్తిగా అనేవాడు.

అంతా చెప్పడానికి గంట పట్టింది. అంతా విని.

‘‘ఈ స్టోరీ యింత వరకూ ఎంత మందికి చెప్పారు?’’ కామ్ గా అడిగాడు ప్రణీత్.

కోపం వచ్చేసింది కీర్తనకి.

‘‘అంటే నేను అందరికీ చెప్పుకుంటూ తిరుగుతున్నాననా?’’ ఆవేశంగా అంది.

ఆమె ఆవేశాన్ని అతను అలాగే చూస్తున్నాడు. చిత్రంగా సూర్య కిరణాల తాకిడికి కరిగే మంచులా ఆమె ఆవేశమంతా చల్లారి పోయింది.
అతను అలాగే చూస్తున్నాడు. నెమ్మదిగా ఆమెలో చైతన్యం ఒళ్ళు విరుచుకుంది. నెమ్మదిగా రెక్కు అల్లార్చి పైకి లేచింది. మనసులోని దిగులు మేఘంలా చెల్లా చెదురయి పోయింది.

అతని కళ్ళ లోంచి ఏదో శక్తి తరంగాలుగా తన హృదయాన్ని తాకి ఉత్తేజితం చేస్తున్నాయి.

చురుకుగా వున్న అతని కళ్ళు ఎంతో ధైర్యాన్నిస్తున్నట్లుగా వున్నాయి.

మనిషిని ఓదార్చాలీ అంటే మాటే అవసరం లేదు. కంటి చూపు చాలు. మనసంతా తేలికై పోయిన భావన. ఉల్లాసంగా వుంది. కంటి ముందు లక్ష్యం మెరుపు మెరుస్తూ ప్రత్యక్షమయింది. ఆమె పెదాల మీద మనోహరమైన చిరు నవ్వు ప్రత్యక్షమవగా అప్రయత్నంగా అతనూ నవ్వి..‘‘ఇప్పుడు మనసు తేలిక పడిందా?’’ మృదువుగా అడిగాడు.

ఉత్సాహంగా తలూపింది. అతను లేచి ‘‘ఇక పడుకోండి’’ అని చెప్పి బెడ్రూం వైపు వెళుతూ ఆగి...

‘‘క్రీడాకారుడు ఎప్పుడూ విజయాలనే పంచుకోవాలి. అపజయాల్ని కాదు. ఎందుకంటే అపజయం బలహీనతకి గుర్తు. మన అపజయాలను ప్రత్యర్ధులు తమ జయాలుగా మలచుకుంటారు కాబట్టి.’’

గంభీరంగా వున్న అతని మాటల్ని నెమరు వేసుకుంటూ నిద్ర లోకి జారుకుంది కీర్తన.

***************

తెల్ల వారు జామున నాలుగు గంటలకి తలుపు చప్పుడవుతుంటే చటుక్కున లేచింది కీర్తన.

ఒక్క క్షణం తానెక్కడుందో అర్ధం కాలేదు. బెడ్ లైట్ వెలుగు గదంతా మంద్రంగా పరచుకుంది. ఎదురుగా టేబిల్ మీదున్న షీల్డ్స్ మసక మసకగా కనిపిస్తున్నాయి.

రాత్రి తను వాటిని చూస్తూనే నిద్ర పోయింది. నిద్రలో విజయ శిఖరం చాలా చేరువలో కనిపించింది. ఆ తర్వాత ఎలాంటి కలలూ లేని గాఢ నిద్ర పట్టేసింది.

మళ్ళీ తలుపు మీద సున్నితంగా నాక్ చేశారు ఎవరో. గబ గబా లేచి డ్రస్ సరి చేసుకుంది. తలుపు తీసింది. ఎదురుగా ట్రాక్ సూట్ లో ప్రణీత్.
‘‘జాగింగ్ కి వెళదాం పదండి’’ చెప్పాడు.

‘‘అయిదు నిమిషాలు’’ అని చెప్పి బాత్రూం వైపు పరుగు తీసింది. ప్రణీత్ తలుపు తీసుకుని బయటకు వచ్చాడు.

కీర్తన బ్రష్ అయ్యి తనూ ట్రాక్ సూట్, స్పోర్ట్స్ షూ వేసుకుని బయటకు వచ్చింది.

మసక వెలుతురులో కూడా దృఢంగా, సమున్నతంగా కనిపిస్తున్న కీర్తన ఆకారం వంక ఆరాధనగా చూశాడు ప్రణీత్.

అతని ఆరాధనలో వ్యామోహం లేదు. ఒక క్రీడాకారిణి ఫిట్ నెస్ ఎలా వుండాలో అలాగే వుంది కీర్తన. మానసిక బలహీనతని కూడా జయిస్తే ఈమెకి ఎదురు లేదు.

‘‘నేను రెడీ’’ అతని పక్కకి వచ్చి అంది కీర్తన. అతను డోర్ లాక్ చేసి బయలు దేరాడు.

తెల్ల వారు జాము వెన్నెల విచిత్రంగా వుంది. అంత వరకూ చిక్కని పాల లాంటి వెన్నెలని లోకం మీదకి జల్లి, పాత్ర ఖాళీ అయి పోవడంతో బిక్క మొహం పెట్టాడు చంద్రుడు. అందుకే వెన్నెల తరిగి పోతోంది.

మౌనంగా జాగింగ్ చేస్తున్నారిద్దరూ. వారి మెత్తని షూ సవ్వడి....ఆ తారు రోడ్డు మీద లయబద్దంగా వినిపిస్తోంది.

ఇంకో గంట ఆగితేనే కాస్తంతయినా అలికిడి కాదు. కీర్తనని చూస్తుంటే ముచ్చటగా అనిపించింది ప్రణీత్ కి. జాగింగ్ చేయటం మొదలు పెట్టి అప్పటికి నలభై నిమిషాలయింది. ఆమె శరీరం నుండి చెమట బిందువులు ముత్యాల వరుసలా జారుతున్నాయి కానీ ఆమెలో అలసి పోయిన జాడే లేదు. నోటి నుంచి రొప్పుతున్న శబ్దమే లేదు.

చాలా మంది అమ్మాయిలు నాలుగు అడుగులు నడిచి ఈసురోమంటూ కూర్చుండి పోతారు.

ఒంటికి చెమట పట్టడం నామోషీగా ఫీలవుతారు.

సున్నితంగా వుండటమే స్టయిల్ అనుకుంటారు. శరీరాన్ని దృఢంగా వుంచేవి ఆటలని తెలీక బ్యూటీ పార్లర్లకి వెళ్ళి వేలకి వేలు డబ్బు తగల బోస్తుంటారు.

సిగ్గునూ, పిరికి తనాన్ని వదిలి పెట్టి జాగింగ్ చేస్తే అదెంత ఆరోగ్యమో గ్రహించరు.

మార్నింగ్ వాకింగ్ పేరిట చాలా మంది ఆడ వాళ్ళు నిదానంగా చీమల్లా నడుస్తూ, కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళడం తను చాలా సార్లు చూశాడు. సమయం వృధా అవడం తప్ప దాని మూలంగా ఏమీ ప్రయోజనం లేదు.

‘‘కాసేపు ఆగుదామా?’’ పరుగెడుతూనే అడిగాడు.

“నా టైమ్ ఎప్పుడూ వన్ అవర్!’’ వాచ్ వంక చూసుకుంటూ అంది.

‘‘ఓ.కె.’’ చెప్పాడు.

సరిగ్గా గంట అయ్యే సరికి ఇంటి పరిసరాల్లోకి వచ్చారు. కీర్తన జాగింగ్ ని ఒకే సారి ఆపేయదు. ఫినిషింగ్ స్లోగా చేస్తుంది. జాగింగ్ ని వాకింగ్ గా మార్చింది.

కొన్ని కోట్ల మంది అనే మాట ఆమె నోటి వెంటా వచ్చింది. ‘‘ప్రకృతి చాలా బావుంది’’ అంటూ పరిసరాలు చూస్తూ నడవటం ప్రారంభించింది. ఆకాశం తెల్ల బడుతోంది. నక్షత్రాలు కనుమరుగవుతున్నాయి.

ఇంటికి వచ్చాక బయట తోటలో వున్న బెంచీ మీద కూర్చున్నారు. రాత్రి చల్ల దనాన్ని తమలో యిముడ్చుకున్న చెట్లు మెల్లగా కదడం ప్రారంభించాయి.

‘‘ఇంట్లో ఎవరెవరు వుంటారు?’’ అడిగింది కీర్తన.

‘‘నేనూ, మా అమ్మ’’ చిరునవ్వుతో సమాధానమిచ్చాడు.

‘‘మరి....?’’ ప్రశ్నార్ధకంగా చూసింది.

‘‘పెళ్ళికి వెళ్ళారు. రెండు రోజుల్లో వస్తారు’’ చెప్పాడు.

‘‘ఓ! నాకు ఆవిడని చూడాని వుంది.’’

(సశేషం)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్