Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nadiche nakshatram telugu serial thirteenth part

ఈ సంచికలో >> సీరియల్స్

జాతర - శ్రీ కంఠమూర్తి

jaatara telugu story by shreekanta murthy

జాతర ఇంకా నాలుగు రోజులే వుంది.

అయినా ఆ ఊళ్ళో జాతర హడావిడి అప్పుడే మొదలైంది. అమ్మవారి గుడి బాగుచేసి సున్నం వేయడం, రంగులు పూయడం, గుడిచుట్టూ రంగు కాగితాలతో తోరణాలు కట్టడం - ఇవన్నీ రెండు మూడు రోజులు పడతాయి. జాతర రోజు ఆ ఊరంతా మనుషులతో నిండిపోతుంది. అక్కడివారు మాత్రమే కాక చుట్టుపక్కల నాలుగైదు గ్రామాలవాళ్ళు కూడా ఆ జాతరలో పాల్గొని అమ్మవారికి మొక్కుబడులు చెల్లించి,  ఆ రోజంతా ఆనందంగా గడుపుతారు.

ఆ రోజు కోసం ఊళ్ళో అందరూ ఆత్రంగా ఎదురుచూస్తుంటారు.

అందరిమాటెలా వున్నా ఈ ఏడు లక్ష్మీ మాత్రం జాతరకోసం చాలా ఆత్రంగానూ, ఆశగానూ ఎదురుచూస్తోంది. పది పదిహేను రోజులనుంచీ ఆమె మనసు నిండా జాతర గురించిన ఆలోచనలే నిండిపోయాయి.

ఆ రోజు కూడా అలాగే అయింది. లక్ష్మి వంటపని పూర్తిచేసి, పెరట్లో బాదం చెట్టుకింద కూర్చుని జాతర రోజు గురించే ఆలోచిస్తోంది.

"లచ్చీ... ఎక్కడున్నావే, సెట్టుకింద కూసుని ఏంటా ఆలోసన్లు...? లెగు... లేసి బువ్వెట్టు... దా!"

తండ్రి కేకకి లక్ష్మి పరధ్యానం ఎగిరిపోయింది.

"ఆ... వస్తున్నా...!" అంటూ లేచి ఇంట్లోకి నడిచింది.

కూతరు వడ్డిస్తూంటే ఆమె వేపే చూడసాగాడు రామయ్య.

"పాపం మొగుడికి వండిపెట్టాల్సిన వయసులో తనకి వండిపెడుతూ తనింట్లోనే ఉండిపోవలసి వచ్చింది. పిచ్చిపిల్ల!" అనుకున్నాడు.

లక్ష్మి కూడా అన్నం తిని కుండలూ, ముంతలూ సర్ది మళ్లీ ఆలోచనల్లో పడింది.

తండ్రిని చూసినప్పుడల్లా  జాలేస్తుంది తనకు. పాపం ఎప్పుడూ తన గురించే ఆలోచిస్తూ బెంగెట్టుకుంటాడు. తనకు పెళ్లి చేయలేకపోవడమే అతని బెంగకు కారణం. ఆ విషయం తనకూ తెలుసు. కాని తను మాత్రం ఏం చేయగలదు?

"లచ్చీ... నీళ్ళకు రావా ఏంటి ఇయ్యాల" అంటూ వచ్చింది నాగులు.

లక్ష్మి ఉలిక్కిపడింది. "చః పాడు ఆలోచనలు" అని తిట్టుకుంటూ లేచి నాగులుతో పాటు నీళ్ళకు బయలుదేరింది.

మంచి నీళ్ళ బావికి ఫర్లాంగు దూరం పోవాలి. దారిపొడుగునా జాతర గురించే మాట్లాడింది నాగులు. పరధ్యానంగా వింటూ అన్నిటికీ "ఊ" కొట్టింది లక్ష్మి.

తను జాతర గురించి ఆలోచిస్తున్నా తన ఆలోచనలకూ, నాగులు ఆలోచనలకూ ఎంతో భేదం ఉంది.

ఆ ఒక్కరోజు ఆనందంగా గడపొచ్చని జాతర కోసం ఎదురు చూస్తోంది నాగులు. కాని తన సంగతలా కాదు. జీవితాంతం ఆనందంగా గడిపే అవకాశం కల్సిందని జాతర కోసం ఎదురుచూస్తుంది తను.

"ఏంటే లచ్చీ... మాట్టాడవేంటీ? కొత్తసీర కొనుక్కున్నావా ? నేనైతే మానాన్నను బతిమాలి నిన్ననే సీర కొనేసుకున్నా, సుక్కల సీర ఎంతందంగుందో తెల్సా? నువ్వూ అట్టాంటిదే కొనుక్కో..."

ఇలాగే ఏమిటేమిటో ఉత్సాహంగా చెప్పుకుపోతుంది నాగులు. కాని లక్ష్మికివేవీ తలకెక్కడం లేదు.

నాగులుకి ఏం తెలీదు పాపం! అమాయకురాలు. తను విన్నా, వినకపోయినా ఎంతో ఉత్సాహంగా చెప్పుకుపోతుంది. తను కట్టుకోబోయే కొత్తచీర గురించీ, తినబోయే తినుబండారాలగురించీ.

తన కోరికలు అంత చిన్నవీ, అల్పమయినవీ కావు. ఎవరితోనూ అంత సులభంగా చెప్పుకునేవీ కావు. తనది వికసించిన మనసు, వయసు. కన్నె మనసులోని తీయని కోరికలను తెలుసుకునేంత ఈడు రాలేదు నాగులుకి - అనుకుంది లక్ష్మి.

ఆమె మౌనం చూసి విసుగెత్తి నాగులు కూడా నోరు మూసుకుంది. ఇద్దరూ నీళ్ళు తీసుకునిఇళ్ళకు వెళ్ళిపోయారు.

మూడురోజులు గడిచిపోయాయి. రేపే జాతర. ఈ మూడు రోజుల్లోనూ లక్ష్మి మనస్సు మరింత విచిత్రంగా తయారైంది. కాసేపు ఉత్సాహం, కాసేపు ఆందోళన, తన మనస్థితి తనకే కొత్తగా తోచింది.

ఎవరికోసమో నిరీక్షణ, దేనికోసమో తపన, పొద్దుటినుంచి పాతిక ముఫ్ఫయిసారైనా గుమ్మం లోకి వచ్చి తొంగి చూసి వుంటుంది. లక్ష్మి. అతనొస్తాడన్న ఆశ ఆమెను పనిచెయ్యనియ్యటం లేదు. అతను! అతనంటే ఎవరు? ఎలా వుంటాడు? ఏమో! తనకే తెలీదు అతను ఆ ఊరివాడు కాడని, పొరుగూరివాడని మాత్రం తెలుసు. అతని మొహమైనా చూడని తను, అతని కోసం ఆరాటపడుతుందని తల్చుకుంటే తనకే ఆశ్చర్యంగా వుంది.

'లచ్చీ... అన్నం మాడువాసనేస్తంటే అట్టా బయటకి చూస్తానిల్చున్నావేంటే...?' అప్పుడే బయటి నుంచి వచ్చిన తండ్రిని అయోమయంగా చూసింది లక్ష్మి. ఒకటి రెండు క్షణాల దాకా అతని మాట అర్ధమే కాలేదామెకు.

రామయ్యకు కూతురి వాలకం అంతుపట్టడం లేదు. నాలుగైదు రోజులనుంచీ ఎందుకింత పరధ్యాన్నంగా వుంటోంది. ఏదో పోగొట్టుకున్నట్టు, దేనికోసమో ఎదురుచూస్తున్నట్టు అలా దిగులుగా చూస్తూ నిలబడిపోతుంది. అడిగితే చెప్పదు. పాపం! ఏమని చెప్పుకుంటుంది. తల్లి అయినా వుంటే తన మనసులోని బాధ చెప్పేదేమో కాని చిన్నప్పుడే తల్లిని పోగుట్టుకున్న నిర్భాగ్యురాలు లక్ష్మి. అసలది చెప్పకపోయినా తను అర్ధం చేసుకోగలడు. వయసొచ్చిన ఆడపిల్ల మనసులో ఎలాంటి ఆలోచనలు రేగుతాయో తనకూ తెలుసు. కాని తను ఏమీ చెయ్యలేని నిస్సహాయుడు. నా అన్న వాళ్ళెవరూ తనకు లేరు. లక్ష్మికి తను, తనకు లక్ష్మి... అంతే అసలే తను బీదవాడు. ఉన్న కొద్దిపొలం రాబడితోనే తమిద్దరి పొట్టలు గడవడం కష్టంగా ఉంది. ఇహ కూతరు పెళ్లి చెయ్యాలంటే మాటలా? తన దగ్గర చిల్లిగవ్వ కూడా నిలవలేదు. అయినా చెయ్యగలిగిన ప్రయత్నాలు చేస్తూనే వున్నాడు.

లక్ష్మి లోపలికి వెళ్లి అన్నందించేసి పొయ్యి ఆర్పేసింది. ఆమె ఎంత ప్రయత్నం చేసినా తనకాళ్ళు ఒక్క నిముషం కూడా స్థిమితంగా ఇంట్లో నిలవటం లేదు. కాలుగాలిన పిల్లిలా ఇంట్లోకీ, వాకిట్లోకీ తిరుగుతూనే ఉంది.

పొద్దు వాటారింది. రామయ్య ఏదో పనిమీద ఊళ్లోకి వెళ్ళాడు, లక్ష్మి మళ్లీ గుమ్మంలో నిలబడి వీధి వైపు చూడసాగింది. పొరుగూళ్ళ నుంచి అప్పుడే జనం రావడం ప్రారంభించారు. జాతరకు. ఆ ఊళ్ళో చుట్టాలో లేక తెలిసినవాళ్ళో వున్న వాళ్ళందరూ ఒకరోజు ముందుగానే వచ్చి, జాతర రోజుకూడా వుండి వెళుతూ ఉంటారు. సామాన్యంగా, కొందరు మాత్రం జాతరనాడే వచ్చి, ఉత్సవంలో పాల్గొని ఆ రోజంతా హాయిగా సరదాగా గడిపి రాత్రి ఎక్కడో ఒక చోట పడుకుని వెళుతుంటారు.

లక్ష్మి అలా వస్తున్న వాళ్ళల్లోంచి తనకు కావలసిన మనిషిని వెతుక్కోసాగింది. కాని ఎవరూ తనవంక చూడనైనా చూడటం లేదు. తిన్నగా వెళ్ళిపోతున్నారు.

ఒక వేల అతనొస్తే ఆగకుండా, పలకరించకుండా వెళ్తాడా తనకు తానే ధైర్యం చెప్పుకుంది.

చీకటి పడింది. అయినా తానెదురు చూసిన మనిషి రాలేదు.

లక్ష్మి అన్యమనస్కంగా తండ్రికి వడ్డించి తనూ కాస్త తిన్నది.

మర్నాడు జరగబోయే సంబరం గురించి తండ్రి ఏమిటేమిటో చెబుతున్నా వినిపించుకోకుండా గబగబా అన్నీ సర్ది పక్కమీద వాలింది.

రామయ్య ఇక మాట్లాడి లాభంలేదనుకుని ఊరుకున్నాడు. గొంగలి పరుచుకుని ముసుగెట్టి పడుకున్నాడు.

బయట వర్షం మొదలైంది. చినుకులు రేకులపై కప్పుమీద పడి టపటపమని చప్పుడవుతూంటే చికాకనిపించింది, లక్ష్మికి.

"పాడు వాన" అని తిట్టుకుంది, మనసులో. రోజూ పరచుకునే బొంతే అయినా ఈ రోజెందుకో ముళ్ళ కంపమీద పడుకున్నట్లు ఒళ్లంతా బాధగా వున్నట్టనిపించింది. కళ్ళు
మూసినా తెరిచినా ఏదో అస్పష్టమైన ఆకారం తన కళ్ళెదుట కదులుతూన్నట్లు అనుభూతి కలిగసాగింది. వద్దువద్దనుకున్నా ఆమె మనసు క్రిందటేడాది జాతరలోకి వెళ్ళిపోయింది.

సరిగ్గా ఆ రోజు ఇదే వేళకు వర్షం మొదలైంది. రోజంతా ముసురుగానే వున్నా తనూ, తన స్నేహితురాళ్ళూ ఆ విషయాన్ని పట్టించుకోనేలేదు. ఆ రోజు ఉదయాన్నే లేచి తలంటుకుని, కొత్త బట్టలు కట్టుకుని పండుగ వంట చేసింది తను. తండ్రితో బాటు గుడికివెళ్ళి అమ్మవారికి మొక్కుబడి చెల్లించి వచ్చింది. భోజనం పూర్తి చేసేటప్పటికి బిలబిలమంటూ వచ్చారు. తన స్నేహితురాళ్ళు. రంగి, రత్తి, సీతాలు. వీళ్ళు ముగ్గురూ తనకు చిన్నప్పటి నుంచీ నేస్తాలు. అందరికీ పెళ్ళిళ్ళయిపోయాయి. తనకితప్ప పండుగకు పుట్టిళ్ళకొచ్చిన వాళ్ళు తనను కూడా తమతో వుండాలని పట్టుబట్టారు. తన కోసం ముగ్గురూ తన ఇంటికే వచ్చారు. వాళ్ళతో కలసి సరదాగా ఊరంతా తిరిగింది. హుషారుగా కబుర్లు చెప్పింది. అయినా లోలోపల మాత్రం తనకూ పెళ్ళయి వుంటే ఎంత బాగుండేది అనిపించకపోలేదు. మొగుళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటుంటే నోరెళ్ళబెట్టుకుని వినే పరిస్థితి తనకుండేది కాదుగదా! తనూ ఎంతో గొప్పగా తన మొగుడి గురించి చెప్పుకునేది. తన ఆలోచనలకు తనకే నవ్వొచ్చిందప్పుడు. పెళ్ళి కావాలని అనుకుంటే మాత్రం అయిపోతుందా? దానికి ఎన్ని వుండాలి? ముఖ్యంగా పెళ్ళికొడుకు కుదరొద్దూ? పోనీ కుదిరినా డబ్బు కావద్దూ? తన తండ్రిదగ్గరా చిల్లి గవ్వ నిలవలేదు. అసలువున్న ఆ కొద్ది పొలం మీద ఇద్దరి పొట్ట గడవడమే కష్టమయిపోతుంటే ఇహ పెల్లెక్కడ చేస్తాడు తండ్రి?

ఒక్కోసారి తనమీద తనకే కోపం, జాలీ రెండూ కలిగేవి. అందరిలా తను వుండలేదని జాలి, ఏమీ చేయలేని నిస్సహాయతకు కోపం రెండూ ఏక కాలంలో కలిగేవి. "అసలు ఈ జన్మలో తనకు పెళ్ళయ్యే యోగం వుందో లేదో" అని కూడా అనుకునేది.

"లచ్చీ... ఎంతసేపూ మేం ముగ్గురమే మాట్లాడాలా? ఇందాకా అంత ఉషారుగా వున్నావు. ఇప్పుడేటయింది నీకు", లక్ష్మి భుజం మీద చెయ్యేసి అంది రత్తి.

"అబ్బే ఏం లేదే... ఏదో ఆలోచనొస్తే..."

"ఇంకేం ఆలోచన? మొగుడి ఆలోచనే. అమ్మాయిగారి మనసంతా పెళ్ళిమీదే వున్నాది కదూ?" అంటూ వుడికించింది రంగి.

"ఏయ్ పొండే... అదేం కాదు నా ఆలోచన..."

అప్పటికి ఎట్లాగో తప్పించుకోగలిగింది కాని, అంతా అయిపోయి రాత్రి పక్కమీద పడుకున్నప్పుడు మాత్రం తీయని తలపులు వచ్చి మనసును ఉక్కిరిబిక్కిరి చేసేయి.

అదే వేళకు బయట వర్షం మొదలైంది. కాని ఊహాలోకంలో విహరిస్తున్న తనకు మాత్రం ఇప్పటిలా రేకుల మీదపడ్డ చినుకులు చికాకు కలిగించలేదు.

అంతలో ఎవరో తలుపు తట్టిన చప్పుడైంది. తండ్రి లేచి తలుపు తీశాడు. ఇంత రాత్రప్పుడు వచ్చినవాళ్ళెవ్వరా అనుకుంటూ తను కూడా లేచి వచ్చింది.

ఇంటిముందు ఎవరో ముగ్గురు నిలబడి వున్నారు. వాళ్ళు ఆ ఊరి వాళ్ళల్లా కనబడలేదు. ఎవరో జాతరకొచ్చిన పొరుగూరి వాళ్ళయి వుండాలనుకుంది తను.

"మాదీవూరు కాదయ్యా. జాతర సూద్దామని వచ్చినాము తిరిగెల్లిపోదామని కూసింత దూరం ఎల్లేటప్పటికి పాడువాన పట్టుకుంది. ఈ వానలో ఎల్లడం కష్టం. ఈ రాతిరి పండుకోటానికి సోటిస్తే పండుకుని, తెల్లారి లేసెల్లిపోతాం...' బతిమాలుతున్నట్లు అన్నాడు ఒకతను.

మిగిలిన ఇద్దరూ "అవునయ్యా... నీకు పుణ్యముంటుంది" అంటూ శ్రుతికలిపారు.

రామయ్య కాసేపాలోచించాడు. తరువాత "మా ఇల్లు శానాసిన్నది బాబూ, మరెక్కడన్నా సూసుకోండి..." అన్నాడు.

"అట్టా అనకయ్యా... ఈ వర్షంలో ఇప్పుడు ఎక్కడికెల్తాం సెప్పు? వున్న సోట్లోనే ఎట్టాగో సర్దుకు పడుకుంటాం, కాదనకు..." బ్రతిమాలాడారు వాళ్ళు.

వర్షంలో తడిసోచ్చి వణుకుతున్న వాళ్ళను చూస్తుంటే తనకు జాలేసింది.

"పోనీ వుండమను నాన్నా. నేను లోపల పడుకుంటాలే" అంది. ఆ ముగ్గురూ తన వంక కృతజ్ఞతగా చూశారు.

తన పక్కతీసి లోపల వంటగదిలో వేసుకుంది. వంట గదంటే రెండుబారలచోటు కలిగిన చిన్న వసారాలాంటిదన్నమాట. అక్కడ పడుకున్నా తనకు వాళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ స్పష్టంగానే వినిపిస్తున్నాయి.

ఆ రోజు చూసిన వింతలూ విశేషాలూ గురించి చెప్పుకుంటున్నారు వాళ్ళు. రామయ్య కూడా అప్పుడప్పుడు వాళ్ళ మాటల్లో మాట కలుపుతున్నాడు.

దీపం వెలుగులో చూసిన ఆ ముగ్గురి మొహాలు గుర్తుచేసుకుని అందరిలోకి ఎవరూ బాగున్నారని ఆలోచించసాగింది లక్ష్మి. ఇలాంటి వాళ్ళెవరన్నా తనని పెళ్లాడితే ఎంత బాగుంటుంది. వీళ్ళల్లో ఎవరో ఒకరు తనతో బతుకు పంచుకోకూడదూ! వచ్చిన ముగ్గురూ కాస్తో కూస్తో అందంగానే వున్నారు. అసలు మగాడికి అందం వుండి తీరాలనేమీ లేదు. కాస్త ఒడ్డూ పొడుగుండి మంచి బట్టలు కట్టుకుంటే ప్రతి మగాడూ బాగానే వుంటాడు చూట్టానికి, అసలు తనిప్పుడు అందగాళ్ళను కోరుకునే స్థితిలో లేదు. ఎవరో ఒకరు పెళ్ళి చేసుకుంటానంటే చాలనే స్థితిలో వుంది. వాళ్లకి తను నచ్చాలిగాని, తనకు వాళ్ళు నచ్చలేదన్న ప్రశ్నలేదు. ఎవరినైనా భర్తగా స్వీకరించటానికి తను సిద్ధంగా వుందిప్పుడు. తండ్రి తాహత్తుకు తగినవాణ్ణి తను ఒప్పుకోవాలి.

అ రాత్రి ఇలాంటి ఆలోచనలతోనే చాలా సేపు నిద్రపట్టలేదు. తనకి. ఆ తరువాత నిద్ర పట్టినా చిత్రవిచిత్రమైన కలలు... ఆ కలలో తనకు పెళ్లయింది. కాని భర్త మొహం తనకు స్పష్టంగా కనపడటం లేదు. తనను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. అత్తవారింటికి వెళ్ళిన తను జాతరకు భర్తతో సహా పుట్టింటికి వచ్చింది. తండ్రి అవతల పడుకోగా తనూ భర్తా, ఇక్కడే ఈ గదిలోనే పడుకున్నారు. మాట్లాడితే తండ్రికి వినిపిస్తుందని సిగ్గుపడి తామిద్దరూ మౌనంగా ఒకరినొకరు గట్టిగా కావలించుకుని వెచ్చగా పడుకున్నారు. అతని చేతులు తన శరీరాన్నంతా తడుముతున్నాయి. అంతలో తన ఒంటి మీద ఏదో వెచ్చగా బరువుగా పడ్డట్టయి కొద్దిగా మెలకువ వచ్చింది తనకు. మత్తుగా కళ్ళు మూసుకునే ఆ చీకట్లో తడిమిచూసింది. అదొక చెయ్యి ఒళ్ళు ఝల్లుమంది తనకు. అంతలో ఎవరో తన మీదికి వంగి రెండు చేతుల్తో తనను చుట్టేశారు. ఆ స్పర్శ తను ఇదివరకెన్నడూ అనుభవించి ఎరగని కొత్త అనుభూతిని కలిగించడంతో కళ్ళు మూసుకుని అలాగే వుండిపోయింది. ఆ చేతులు నెమ్మదిగా తన ఒళ్లంతా నిమురుతూంటే మైమరచిపోయి కలో నిజమో తెలీని అయోమయ స్థితిలో అతనికి వశమయి పోయింది.....

ఆ తరువాత మళ్ళీ ఎప్పుడు నిద్రపట్టిందో తనకు తెలీదు. మళ్ళీ మెలకువచ్చి చూస్తే తనొక్కతే పడుకుని ఉంది. " అతను ఏమీ ఎరగనట్టు వెళ్ళి పడుకున్నాడన్న మాట" అనుకుంది. ఆ తరువాత తనకు నిద్రపట్టలేదు.

తూర్పు తెల్లారకముందే వాళ్ళు ముగ్గురూలేచారు. నూతి దగ్గరకు వెళ్ళి మొహాలు కడుక్కుని వచ్చారు. తమ తమ సామాను సర్దుకుని తన తండ్రిని లేపారు. రాత్రి పడుకునేందుకు చోటిచ్చినందుకు కృతజ్ఞత చెప్పి బయలుదేరారు.

తనకు చాలా ఆశ్చర్యం కలిగింది. అసలు తన ఉనికినే మరచిపోయినట్లున్నారు వాళ్ళు. అందరి మాటెలా వున్నా రాత్రి తన దగ్గరికి వచ్చినతనైనా తనను పిలుస్తాడనీ, వెళ్తానని చెప్పి, రహస్యంగా మళ్ళీ వస్తానని సైగైనా చేసి వెళ్తాడనీ ఎంతో ఆశతో ఎదురుచూసింది తను. అతనెవరైనదీ అప్పుడైనా చూడవచ్చని తన అంచనా. కాని అంతా తారుమారైంది. ఆ ముగ్గురూ వెళ్ళిపోయారు.

ఉండబట్టలేక దిగ్గున లేచింది తను. గబగబా చీర కుచ్చెళ్ళూ, జాకెట్టూ సర్దుకుని గుమ్మంలోకి వచ్చి తొంగిచూసింది.

ఆ ముగ్గురూ దూరంగా వెళ్తూ కనిపించారు. వాళ్ళల్లో రాత్రి తన దగ్గరికి వచ్చింది ఎవరో? కనీసం ఒక్కసారి వెనక్కి తిరిగి తనకోసం చూసేంత మంచి మనసుకూడా లేదా అతనికి? తనకళ్ళలోంచి నీళ్ళు జలజలరాలాయి.

అసలు తనే పొరపాటు చేసిందేమో! ఎవరో ఏమిటో కనుక్కోకుండా, తనను పెళ్ళిచేసుకుంటాడో, లేదో అడక్కుండా తెలివితక్కువగా తన శరీరాన్నతనికర్పించింది.

తనను తనే నిందించుకుంటూ గుమ్మంలో నిలబడి వాళ్ళు వెళ్ళిన వేపే చూస్తుండిపోయిన తను, తండ్రి ఒక్క కేక పెట్టేటప్పటికి తెలివి తెచ్చుకుని లోపలి కొచ్చేసింది.

"సలిలో అక్కడేం చేస్తున్నావే? తలుపేసేయి. సల్లగాలి కొడ్తన్నాది..." అంటూ మళ్లీ ముసుగుతన్ని పడుకున్నాడు తండ్రి.

"తన బాధ తండ్రికేం తెలుసు" అనుకుని మళ్ళీ వెళ్ళి ముడుచుకుపడుకుంది తను. పడుకుందన్న మాటేగాని మనసు నిండా రాత్రి జరిగిన సంఘటన గురించిన ఆలోచనలే...

అతనెందుకలా చేశాడు? ఏమో? ఒక వేళ తనకూడా మరిద్దరు ఉండడంతో అలా గుట్టుచప్పుడు కాకుండా వెళ్ళిపోయాడేమో! తరువాత వీలు చూసుకుని ఒంటరిగా వచ్చి తనను కలుసుకుంటాడేమో!

ఇలాంటి ఆలోచనలతో సతమతమయి పోయిందారోజు.

అప్పటినుంచీ అతని తలపులు తనను వెంటాడుతూనే వున్నాయి. సంవత్సరం గడిచి పోయినా అతని జాడే లేదు.

మళ్ళీ జాతర వచ్చేసింది. తెల్లారితే జాతర. రేపు తప్పకుండా వస్తాడేమో. ఈ సారి మాత్రం అంత తేలిగ్గా వదిలిపెట్టకూడదు. సంవత్సరం నుంచీ తను అనుభవించిన ఆవేదన, ఆరాటం, అంతా అతనితో చెప్పుకోవాలి. అతని చేతుల్లో వాలిపోయి తన జీవితానికి వెలుగు చూపమని వేడుకోవాలి ...

ఆ రాత్రంతా ఒక్క నిముషం కూడా నిద్రపోలేదు. లక్ష్మి. తెల్లారేటప్పటికీ ఆమె కళ్ళు ఎరుపెక్కాయి ఒళ్లంతా బరువుగా వుండి లేవడానికి బద్ధకంగా వుంది.

చివరికెలాగో లేచింది. తల్లి వుంటే విసుక్కుంటూనో, కసురుకుంటూనో లేచి పనులు చేసుకొనేది. ఇప్పుడు తనే అన్నీ చేసుకోవాలి. ఈ రోజే జాతర. తనీవాళ ఇలా వుండకూడదు. ఎప్పట్లా హుషారుగా వున్నట్లు నటించాలి. లేకపోతే అందరూ తనను ఆటపట్టించి తన రహస్యం బయటపడిపోయేటట్టు చేస్తారు.

లక్ష్మి ఇంటిపనుల్లో పడింది. ముందు వాకిలి ఊడ్చి, కళ్ళాపి జల్లి, ముగ్గులు పెట్టింది. తరువాత ఇల్లంతా అలికి ఇంట్లో కూడా ముగ్గులు వేసింది. అంట్లు తోమింది. తలారా స్నానం చేసి వంట మొదలెట్టింది. వంట చేస్తూన్నప్పుడు ఆమె మనసంతా వీధి వాకిలివైపే ఉందిగాని వంటమీద లేదు.

వంట అయిపోయిన కూతరు గుడికి వెళ్ళే ప్రయత్నాలేవీ చేయకపోవడం రామయ్య కాశ్చర్యం కలిగింది.

"లచ్చీ... తొందరగా తెములు మరి. గుడి కెల్లొద్దూ?" అన్నాడు.

"నేను రాను, నువ్వెల్లి రా! అంటూ కొబ్బరి కాయ, పళ్ళూ, పూలూ వున్న బుట్టను అతని చేతి కందించింది లక్ష్మి.

రామయ్యకీసారి నిజంగానే కోపం వచ్చింది.

"ఏంటే అంత ఇసిత్రంగా సేత్తున్నావ్? నేను నాలుగైదు దినాల్నుంచి సూత్తున్నా నీ వాలకం. ఎప్పుడూ ఏంటో ఆలోసన్లు పరధ్యానం. ఇప్పుడు నీకేం తక్కువైందనీ..." ఇహ ఇంకేమనాలో తెలీక గబగబా బయటికెళ్ళిపోయాడు రామయ్య.

లక్ష్మి ఒక్క నిట్టూర్పు విడిచింది. పిచ్చినాన్న... తనకు కూడూ, గుడ్డా అమర్చిపెట్టేస్తే చాలనుకుంటున్నాడు పాపం. అంతకుమించి ఇంకేమి అక్కర్లేదనుకున్నాడేమో! ఇంకే ఆలోచన్లూ వుండవనుకున్నాడేమో!

ఇవాళ తనెక్కడికీ వెళ్ళకూడదు. ఒకవేళ అతనొచ్చినప్పుడు తను లేకపోతే ఎట్లా మరి? అతను ఏ వేళప్పుడు వస్తాడో ఏమో! ఇన్నాళ్ళూ అతని కోసం ఎదురుచూసి తీరా వచ్చేసరికి తను ఇంట్లో లేకపోతే తన నిరీక్షణా, ఆశ అంతా వృధాఅయిపోదూ?

"అతనొస్తాడు. తప్పకుండా వస్తాడు" అని ఆమె మనసు గట్టిగా చెబుతుంది. అందుకనే త్వరగా పనులన్నీ చేసుకుని తల దువ్వుకుని కొత్తచీరలేకపోవడంతో వున్నవాటిల్లో మంచి చీర కట్టుకుంది. చక్కగా ముస్తాబై గుమ్మం దగ్గర నిలబడింది. ఆ రోజంతా.

రాత్రిపూట చీకట్లో అతను మొహం చూడలేదు కాబట్టి సరిపోయింది. కాని ఈరోజు పగలే గనక వస్తే అతనికి తను నచ్చొద్దూ? అసలే ముదురు మొహం తనది. కొంత మందికి వయసు ముదిరినా మొహం లేతగా వుంటుంది. మరికొందరికి వయసెక్కువ లేకపోయినా ఒళ్ళు లావెక్కి మొహం ముదురుగా కనిపిస్తుంది. అందుకనే అందరూ తన వయస్సును ఎక్కువగానే అంచనా వేస్తారు.

సూర్యుడు మెల్లిమెల్లిగా నడినెత్తిమీదికొచ్చాడు. రామయ్య గుళ్ళో కొబ్బరికాయ కొట్టి ఇంటికి తిరిగి వచ్చాడు.

భోజనానికి కూర్చుని కూతురితో జాతర కబుర్లు చెప్పసాగాడు.

"అబ్బ. ఏం జనం... ఏం జనం! ఇసకేస్తే రాలనంత జనం ఈసారి. గుళ్ళోకెళ్ళి అమ్మోర్ని సూడాలంటే ఎంత కష్టమైందనుకున్నావ్? అబ్బ! తోసుకుని తోసుకుని సచ్చిపోతున్నారు జనం. అన్నట్టీసారి నీ నేస్తాలెవరూ రాలేదేంటీ! నిరుడు అందరూ వచ్చి ఎంతో సంబరంగా పండుగ చేసుకున్నారే!" అన్నాడు.

"రత్తి పురుడు పోసుకుందట, రంగికిప్పుడు నిండు నెలలంట, నాగులుకు పెండ్లి కుదిరిందంట. ఇంకెవరొస్తారు నాకోసం?" లక్ష్మి మాటల్లో తనకు మాత్రం ఏమీ లేదు." అన్న అర్ధం స్ఫురించింది. రామయ్య, మారుమాటాడకుండా లేచి బయటికి వెళ్ళిపోయాడు.

లక్ష్మి కంచం ముందు పెట్టుకుని కూర్చుందన్నమాటేగానీ, ముద్ద మింగుడుపడలేదు. తన కసలు పెళ్ళయే రాత లేదేమో? అనిపించింది.

మధ్యాహ్నమయింది. సాయంకాలమూ అయింది. చీకటి కూడా పడింది. ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతున్న లక్ష్మి మనసు ఆశవేపు ఎక్కువ మొగ్గుచూపింది.

"ఆ రోజు రాత్రే కదా వాల్లొచ్చింది. ఈ వేళ కూడా అదే వేళకు రావచ్చేమో?" అనుకుంది.

గంటలు గడుస్తున్నాయి. రాత్రి కరిగిపోతూంది. అయినా అతని జాడలేదు. గుమ్మలో కూర్చుని ఎదురు చూసి చూసి నిద్రముంచుకు రాగా, అలాగే వెనక్కి వాలిపోయింది లక్ష్మి.
 


(...వచ్చే వారం వంశీ కి నచ్చిన ఇంకో కథ)

మరిన్ని సీరియల్స్