Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Sri Swamy Vivekananda

ఈ సంచికలో >> శీర్షికలు >>

అవధాన ​బ్రహ్మలు, జంట కవులు -- శ్రీ తిరుపతి వేంకట కవులు - టీవీయస్. శాస్త్రి

Twin poets Tirupati Venkata Kavulu

బ్రాహ్మణులలో, వైదీకి శాఖకు చెందినవారు పూర్వపు రోజుల్లో మీసాలు పెంచేవారు కాదు. దానికి విరుద్ధంగా జంటకవులైన తిరుపతి వేంకట కవులు మీసాలు పెంచారు. అదీగాక, కవులకు మీసాలెందుకని ఎవరో అధిక్షేపించినపుడు, సంస్కృతంలోనూ, తెలుగులోనూ తమను మించిన కవులు లేరని సవాలు చేస్తూ, మీసాలు ఎందుకు పెంచారో, వారి పద్యంలోనే విందాం!

దోసమటం బెరింగియు దుందుడు కొప్పగ పెంచినారమీ,
మీసము రెండు బాసలకు మేమె కవీంద్రులమంచు దెల్పగా
రోసము కల్గినన్ కవివరుల్ మము గెల్వుడు గెల్చిరేని యీ
మీసము తీసి మీ పద సమీపములం దలలుంచి మ్రొక్కమే.


అని వివిధ కవితా గోష్టులలో, అవధాన సభలలో సవాల్ విసిరిన , మేటి కవివరేణ్యులు తిరుపతి వేంకట కవులు. వారి మాటలే పద్యాలు. ఇలా పద్యాన్ని పామరుడి దగ్గరికి కూడా తీసుకువెళ్ళిన అవధాన బ్రహ్మలు అయిన తిరుపతి వేంకట కవులను గురించి తెలుసుకుందాం!

వీరిద్దరిలో మొదటివారైన శ్రీ దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు, 26-03-1872 న పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎండగండి అనే గ్రామంలో జన్మించారు. ఈ వూరు భీమవరానికి దగ్గరలో ఉంది. ఈ గ్రామాన్ని చూసే భాగ్యం నాకు కలిగింది. అక్కడ వారి వంశస్తులు ఎవ్వరూ లేరు . వారి స్మారక చిహ్నాలు కూడా లేవు. ఆయన తండ్రి వేంకటావధాని గారు కూడా గొప్ప వేదపండితుడు, సూర్యోపాసకుడు. తిరుపతిశాస్త్రి గారి విద్యాభ్యాసం అంతా బూర్ల సుబ్బారాయుడు, గరిమెళ్ళ లింగయ్య, పమ్మి పేరిశాస్త్రి, చర్ల బ్రహ్మయ్య శాస్త్రిగార్ల వద్ద జరిగింది. చర్ల బ్రహ్మయ్య శాస్త్రి గారి వద్ద చదువుకునే సమయంలో తిరుపతిశాస్త్రి గారికి చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి సహాధ్యాయి. వీరిద్దరూ, శ్రీ చర్ల బ్రహ్మయ్యశాస్త్రి గారి ప్రియ శిష్యులు. వీరిలో ప్రత్యేకత ఏమంటే, అమితమైన ధారణ శక్తి కలిగి ఉండటం. ఏకసంతాగ్రహులు. షట్ శాస్త్రాలను క్షుణ్ణంగా అభ్యసించారు. వీరు ఏకోదరులు కాకపోయినా, సొంత అన్నదమ్ములుగా ఉండేవారు. సరస్వతీదేవి కన్నబిడ్డలుగా చరిత్రలో మిగిలిపోయారు. అవధానాలతో తెలుగు దేశమంతా జైత్రయాత్ర చేసారు. అ రోజుల్లో వీరిని అవధానాలలో ఎదుర్కొన్న ప్రముఖులలో కొప్పరపు కవులు, శ్రీ వేంకట రామకృష్ణ కవులు ముఖ్యులు. అవధానాలలో వీరిని ఢీ అంటే ఢీ ఎదుర్కొన్నారు పైన చెప్పిన కవులు. ఆ అవధానాలలోని పద్యాలు, వాదోపవాదాలు సాహితీ ప్రియుల నాలుకలపై నేటికీ నాట్యమాడుతున్నాయి.

వీరిద్దరు కలసి వంద సంస్కృత మరియు తెలుగు గ్రంధాలు, నాటకాలు, అనువాద గ్రంధాలను వ్రాసారు. వీరు రచించిన 'పాండవ ఉద్యోగ విజయములు' నాటకంలోని పద్యాలు తెలుగునాట ఊరూరా పండితుల, పామరుల నోట మారుమ్రోగాయి, నేటికీ మారు మ్రోగుతున్నాయి. వీరు వ్రాసిన గ్రంధాలలో ముఖ్యమైనవి-- పాండవ ఉద్యోగ విజయములు, పాండవ జననం లాంటి నాటకాలు, శ్రవణానందం, దేవీభాగవతం, శ్రీనివాస విలాసం, బుద్ధ చరితం, ధాతు రత్నాకరం లాంటి గ్రంధాలు విశేషంగా పండిత ప్రశంసలు పొందాయి. శ్రీ చర్ల బ్రహ్మయ్యశాస్త్రి గారి వద్ద శిష్యరికాన్ని పూర్తిచేసుకొని, ఇక వీరి అవధానాల జైత్ర యాత్రను కొనసాగిస్తూ, వివిధ సంస్థానాధీసుల చేత గండపెండేరాలు మరియూ అనేక సత్కారాలు పొందారు. తిరుపతిశాస్త్రి గారికి 1898 లో వివాహం జరిగింది. అప్రతిహతంగా సాగుతున్న వీరి కవితాయాత్రలో ఒక అపశ్రుతి దొర్లింది . శ్రీ తిరుపతిశాస్త్రి గారు మధుమేహం వల్ల అతి చిన్నవయసులోనే, 1920 నవంబర్ లో మరణించారు.

ఆ మహానుభావుడు మరణించిన తరువాత కూడా శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారు, తిరుపతి వేంకటకవుల పేరుతోనే కొన్ని గ్రంధాలు వ్రాసారు, అవధానాలు నిర్వహించారు. వీరి అవధానాలలో అతి ప్రత్యేకమైన విశేషమేమంటే, పద్యంలో మొదటి రెండు పాదాలు ఒకరు చెబితే, చివరి రెండు పాదాలు మరొకరు చెప్పేవారు. భౌతికంగా వారు ఇరువురైనప్పటికీ, మానసికంగా ఒక్కరే, అని అర్ధం చేసుకోవచ్చు! అలా వారు చెప్పిన పద్యాలు, వ్యాకరణ దోషాలు లేకుండా, నాలుగు పాదాలు ఒకరు చెప్పినట్లే అతికేవి. ఒకసారి వ్రాసిన పద్యాన్ని తిరిగి చూసుకుంటే, దానిలో ఎటువంటి తప్పులుండేవి కావు. వీరిద్దరూ బందరులో నిర్వహించిన అష్టావధానాలు, శతావధానాలు తెలుగు సాహితీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. అదీ వారిద్దరి మధ్య ఉన్న అవగాహన. భార్యభర్తల మధ్య కూడా ఈ అవగాహన ఉండదేమో!

శ్రీ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి ప్రమోదూత నామ సంవత్సర శ్రావణ శుద్ధ ద్వాదశి సోమవారం అనగా 1870 ఆగస్టు 8న తూర్పు గోదావరి జిల్లా కడియం గ్రామంలో జన్మించారు. వీరిది పండిత వంశం. ఆయన ముత్తాత తమ్ముడు వేంకటేశ్వర విలాసము, యామినీ పూర్ణతిలక విలాసము అనే గొప్ప గ్రంధాలను రచించిన మహా పండితుడు. అదీకాక, ఆయన సేకరించిన అనేక తాళపత్ర గ్రంధాలు వేంకటశాస్త్రి గారి చేతికందాయి. ఇక పువ్వుకు సుగంధం అబ్బింది. కొంత కాలం గడిచిన తరువాత వీరి మకాంను యానాంకు మార్చారు. యానాంలో వేంకటశాస్త్రి గారు తెలుగు, ఆంగ్లం, సంస్కృతం భాషలు అధ్యయనం చేసారు. కానుకుర్తి భుజంగరావు, అల్లంరాజు సుబ్రహ్మణ్య కవిరాజు గార్ల వద్ద అక్కడ శిష్యరికం చేసారు. 18 ఏండ్ల వయసులో యానాం వేంకటేశ్వరస్వామి గురించి వ్రాసిన శతకంలో వ్యాకరణ దోషాల గురించి పండితులు విమర్శించారు. దీనిని వీరు సవాల్ గా స్వీకరించి, అవమానంగా భావించి సంస్కృత వ్యాకరణం నేర్చుకోవడానికి వారాణాసి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. కానీ, ఆర్ధికమైన ఇబ్బందులు వల్ల కాశీకి వెళ్ళలేక పోయారు. అదీగాక, ఆయనకు పుట్టుక నుండి ఒక కన్నుకు సంబంధించిన సమస్య కూడా ఉండేది. అయినా, ఆ తరువాతి కాలంలో పట్టువదలక తన కాశీయాత్రను విజయవంతంగా పూర్తిచేసారు.

తరువాత వేంకటశాస్త్రి గారు శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి గారి వద్ద విద్యాభ్యాసం కొనసాగించారు. ఆ తరువాత శ్రీ చర్ల బ్రహ్మయ్యశాస్త్రి గారి వద్ద శిష్యరికం చేసారు. అక్కడే, తిరుపతిశాస్త్రి గారిని, వీరిని ఒకటిగా చేసింది సరస్వతీదేవి. శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారు, 1903 నుండి 1915 వరకు బందరులోని హిందూ హై స్కూల్ లో తెలుగు పండితునిగా పనిచేసారు. అంటే 12 సంవత్సరాలు ఒకచోటనే ఉన్నారు. వేంకటశాస్త్రి గారు బందరులో పనిచేస్తున్నప్పుడు, తిరుపతిశాస్త్రి గారు పోలవరం రాజాగారి ఆస్థానంలో పండితునిగా ఉన్నారు. చెళ్ళపిళ్ళ వారు అనేక మంది శిష్య ప్రముఖులను తయారు చేసారు. వారిలో ప్రముఖులు-- కవిసమ్రాట్ శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు, పింగళి లక్ష్మీకాంతం గారు, వేటూరి ప్రభాకరశాస్త్రి గారు, వేలూరి శివరామశాస్త్రి గారు, కాటూరి వెంకటేశ్వరరావు గార్లు. వేంకటశాస్త్రి గారి ముక్కూ మొహం తెలియని అనేకమంది కూడా ఆయన శిష్యులుగా చెప్పుకునే వారు. అయితే, దానిని శ్రీ వేంకటశాస్త్రి గారు ఎప్పుడూ ఖండించలేదు. అదీ ఆయన శిష్యవాత్సల్యం!

ఈ జంట కవుల కవిత్వంలో, కవితా మాధుర్యంతో పాటు, పౌరుషం కూడా ఒకపాలు కనపడుతుండేది. దానికి ఉదాహణనే, ప్రారభంలో చెప్పిన పద్యం. 1938లో శ్రీ వేంకటశాస్త్రి గారికి ఆంద్ర విశ్వవిద్యాలయం వారు కళాప్రపూర్ణతో సత్కరించి, తమ్ముతాము గౌరవించుకున్నారు. 1949 లో నాటి మద్రాస్ ప్రభుత్వం, వీరిని ఆస్థానకవిగా నియమించింది. తిరుపతి వేంకట కవులు ప్రాచీన, నవీన కవితోద్యామానికి వారధిగా నిలిచారు. ఈ జంట కవుల స్నేహబంధం గొప్పది. వేంకటశాస్త్రి వారాణసి వెళ్ళి తిరిగివచ్చిన తరువాత మొదటి సారిగా శ్రీ తిరుపతిశాస్త్రి గారితో కలసి కాకినాడలో జంటగా శతావధానం నిర్వహించారు. ఆ తరువాత జీవితాంతం ఆ సాహితీ మూర్తులు ఒకటై జీవించారు. ఇద్దరు అసంఖ్యాకంగా అవధానాలు నిర్వహించారు. సన్మానాలు అందుకున్నారు. తిరుపతిశాస్త్రి గారు వేంకటశాస్త్రి గారిని తన గురువుగా భావించారు. అడయారు వెళ్ళినపుడు అనీబిసెంట్ ప్రశంసలు అందుకున్నారు. వెంకటగిరి, గద్వాల, ఆత్మకూరు, విజయనగరం, పిఠాపురం సంస్థానాలు సందర్శించి తమ ప్రతిభను ప్రదర్శించి సత్కారాలు , సన్మానాలు పొందారు.

పోలవరం జమీందారు గారు వారి ప్రతిభను గుర్తించి, ఎడ్విన్ ఆర్నాల్డ్ రచించిన లైట్ ఆఫ్ ఆసియా గ్రంధాన్ని తెలుగులోకి అనువదించమని కోరారు. అంతేకాక, తమ సంస్థానంలో కవులుగా చేరమని అర్ధించారు . అయితే, శ్రీ వేంకటశాస్త్రి గారు స్వేఛ్ఛాజీవి, ప్రలోభాలు చూపి ఆయనను ఎవరూ బంధించలేరు. తిరుపతిశాస్త్రి గారి కోరిక మీద, స్నేహవాత్సల్యంతో అందుకు ఆయన అంగీకరించారు. ఆ విధంగా వారు తమ మకాంని కాకినాడకు 1901లో మార్చారు. 1889లో పిఠాపురం రాజు ప్రారంభించిన 'సరస్వతి' అనే సాహితీ పత్రిక వీరి ఆధ్వర్యంలో నిర్వహించబడింది. కేవలం ఈ పత్రిక కోసం వీరు 'బాల రామాయణం', 'ముద్రారాక్షసం', 'మృచ్ఛఘటికం' గ్రంధాలను వీరు సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించారు. 1918లో పోలవరం జమీందార్ గారి మరణం వారిని కృంగతీసింది. సరైన ఆశ్రయం లభించలేదు. అయితే , సరిగ్గా ఆ సమయంలోనే వీరిని గోలంక వీరవరం జమీందార్ అయిన శ్రీ రావు రామాయమ్మ గారు ఆదరించి, భరణం ఏర్పాటు చేసి, పోషించింది. వీరు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి రచనలను, ఆంగ్లం నుండి తెలుగులోకి అనువదించారు. అమ్మా! సరస్వతీదేవీ, కేవలం నీ దయవలనే మేము ఎన్నో సన్మానాలు అందుకొన్నాము అని చెప్పిన ఈ క్రింది పద్యాన్ని తిలకించండి, వారి వినయ విధేయతలు, కూడా ద్యోతకమవుతాయి.

ఏనుగు నెక్కినాము, ధరణీంద్రులు మ్రొక్కగ నిక్కినాము, స
న్మానము లందినాము, బహుమానములన్ గ్రహియించినార, మె
వ్వానిని లెక్క పెట్టక నవారణ దిగ్విజయంబొనర్చి ప్ర
జ్ఞా నిధులంచు బేరు గొనినాము, నీ వలనన్ సరస్వతీ!


అవధానాలలో వారు చెప్పిన అనేక 'ఆశు కవిత్వపు' పద్యాలు, ఛలోక్తులు, సమయస్ఫూర్తి చాలా ప్రసిద్ధి చెందాయి . కవి సమ్రాట్ శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు, వీరిని తన గురువువులుగా ఎప్పుడూ కొనియాడేవారు. శ్రీ వేంకటశాస్త్రి గారిని గురించి వారు ఒక పద్యం అద్భుతంగా ఈ క్రింది విధముగా చెప్పి ధన్యులయ్యారు.

అలనన్నయకు లేదు తిక్కనకు లేదా భోగమస్మాదృశుం
డలఘు స్వాదు రసావతార ధిషణాహంకార సంభార దో
హల బ్రహ్మీమయమూర్తి శిష్యుడైనాడన్నట్టి దావ్యోమ పే
శల చాంద్రీ మృదుకీర్తి చెళ్ళపిళ వంశస్వామి కున్నట్లుగన్


పూర్వపు కవులైన నన్నయ్య, తిక్కనలకు దక్కని గౌరవం, మా గురువు గారైన శ్రీ వేంకటశాస్త్రి గారికి దక్కింది, ఎందువలనో తెలుసా-- నా లాంటి శిష్యుడిని కలిగినందుకు. చూడండీ! కవిసమ్రాట్ చతురత. ఒక పక్క గురువుగారి గొప్పతనం చెబుతూ, తన స్వాతిశయాన్ని అద్భుతంగా చెప్పుకున్నారు. శ్రీ చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి గారు గొప్ప మానవతావాది. వీరు కవికోకిల శ్రీ జాషువా గారి పాదాలు కడిగి, వారికి కాలికి గండపెండేరం తొడిగి, ఇలా అన్నారు--- "ఈ మహాకవి పాదాలు తాకి నా జన్మ ధన్యం చేసుకున్నాను" అని. ఇక వీరి 'పాండవోద్యోగ విజయములు' అనే నాటకాన్ని 'కురుక్షేత్రం' పేరుతో పెక్కు నాటక సంస్థలు, నటులు నాటకంగా అనేక సార్లు ప్రరదర్శించారు. ఈ మహనీయుడు, 1950లో మహాశివరాత్రి నాడు శివసాయుజ్యం చెందారు. చాలా గొప్ప విశేషం ఏమిటంటే, వీరి పాండవోద్యోగ విజయాలలోని పద్యాలను, నటులు తప్పుగా చదివితే, ప్రేక్షకులు సవరించేవారు. అంత ప్రజా బాహుళ్యం చెందిన పద్యాలు అవి. ఈ నాటికీ ఉత్సాహవంతులైన నటులు, ఆ నాటకాలు ఆడుతూ, ఆ పద్యాలు పాడుతూ, అనుదినం వారిని మనకు గుర్తు చేస్తూనే వున్నారు.

వారి నాటకాల ద్వారా అనేక మంది నటులు ప్రఖ్యాతమైన పేరు తెచ్చుకున్నారు. వారిలో ముఖ్యులు, బందా, అద్దంకి, సి.యస్.ఆర్. రఘురామయ్య, పీసపాటి, షణ్ముఖి, ఏ. వి. సుబ్బారావు, మాధవపెద్ది మున్నగు వారు. ప్రస్తుతం శ్రీ గుమ్మడి గోపాలకృష్ణగారు వీరి నాటకాన్ని తన చక్కని గాత్రంతో, హావ భావాలతో అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు. బావా ఎప్పుడు వచ్చితీవు, చెల్లియో చెల్లకో, జెండాపై కపిరాజు, అలుగుటయే యెరుంగని... లాంటి పద్యాలు నా చెవిలో ప్రతిధ్వనిస్తున్నాయి. ఈ అవధాన బ్రహ్మల చరిత్ర మరొకసారి నా కలం నుండి జాలువారటం నా అదృష్టం. ఈ సాహితీమూర్తులకు, అవధాన బ్రహ్మలకు ఘనమైన నివాళిని సమర్పించుదాం!

మరిన్ని శీర్షికలు
humorous