Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kona venkat with sridevi

ఈ సంచికలో >> సినిమా >>

అలా సినిమా పేర్లు నటులకు ఇంటిపేర్లు అయ్యాయి!

Movie names are Actor's Surnames

కొన్ని సినిమాలు విజయం సాధించినా సాధించకపోయినా మనకు అలా గుర్తుండిపోతాయి. కారణం ఆ సినిమాల్లోని పాటలు, మాటలు, సన్నివేశాలు, నటీనటుల అసాధారణ నటన, మొదలగునవి. నటుల నటన కొన్నిసార్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. దాంతో వారి పేరుకి ముందు ఆ సినిమాల పేర్లు గుర్తుకు వస్తుంది. ఆ సినిమానే ఇంటి పేరవుతుంది. అలా సినిమా పేర్లు నటులకు ఇంటి పేర్లుగా పెట్టేస్తారు. అలాంటి నటుల గురించి కొన్ని సంగతులు...

విజయా ప్రొడక్షన్ అంటే 'మాయాబజార్, గుండమ్మకథ, పాతాళభైరవి, జగదేకవీరుని కథ, మిస్సమ్మ' లాంటి ప్రేక్షాకాదరణ పొందిన చిత్రాలను నిర్మించిన నిర్మాణ సంస్థగా గుర్తింపు పొందిన సంస్థ. ఆ సంస్థ నిర్మించిన తొలిచిత్రం ' షావకారు'. ఆ సినిమాలో పదహారణాల తెలుగింటి ఆడపడచుగా చక్కటి నటనను ప్రదర్శించిన జానకి 'షావకారు' జానకిగా మారింది.

అంతవరకూ 'విజయ, వాహిని, సారధి' మొదలైన సినిమా స్టూడియోలలో సినిమాలను చిత్రీకరించేవారు. ఆ స్టూడియోలను దాటి అవుట్ డోర్ లో షూటింగ్ జరుపుకున్న తొలిచిత్రం 'సాక్షి'. బాపు దర్శకత్వం వహించిన తొలిచిత్రం కూడా 'సాక్షి'నే. ఈ చిత్రంలో ప్రతినాయకునికి సహాయకులలో ఒకరిగా నటించిన ఆర్. రంగారావు స్వతహాగా మంచి నాటకానుభవం ఉండడంతో ఆ చిత్రంలో చక్కటి నటనను ప్రదర్శించారు. అలా 'సాక్షి' రంగారావుగా స్థిరపడ్డారు.

హిందీలో షారుఖ్ ఖాన్ 'డర్', తెలుగులో 'ఆర్య', అల్లరి నరేష్ 'నేను' సినిమాలకు స్ఫూర్తి సీనియర్ దర్శకుడు వంశీ తీసిన 'మహర్షి'. ఈ చిత్రంలో యాంటీ హీరోగా చేసిన రాఘవ భగ్న ప్రేమికుడిగా ఆకట్టుకున్నాడు. అలా 'మహర్షి' రాఘవగా ఎన్నో సినిమాలు చేసాడు.

కళాతపస్వి కె. విశ్వనాథ్ వరకట్న సమస్యపై తీసిన 'శుభలేఖ'లో సత్యనారాయణ రెండో కొడుకుగా నటించిన సుధాకర్ హాస్యపు నటనకు ప్రేక్షకులు ఓకే అనడంతో 'శుభలేఖ' సుధాకర్ గా మారి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి, ఇప్పుడు టీవీ సీరియల్స్ తో బిజీగా ఉన్నాడు.

సినిమాటోగ్రాఫర్ గా ఉన్న ఎం.వి. రఘు మెగాఫోన్ పట్టి తీసిన 'కళ్ళు' చిత్రంలో చిదంబరం నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత 'కళ్ళు' చిదంబరంగా ఎన్నో హాస్యపు పాత్రలు చేశాడు. దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ అనగానే మనకు ఎన్నో సూపర్ హిట్లు అందించిన దర్శకుడిగా గుర్తుకువస్తుంది. ఆయన రెండోకొడుకు ఈదర నరేష్ రవిబాబు దర్శకత్వం చేసిన 'అల్లరి'తో తెరంగ్రేటం చేశాడు. ఆ సినిమా విజయవంతం కావడంతో 'అల్లరి'నరేష్ గా పిలువబడ్డాడు. ఇదే 'అల్లరి'లో నటించిన సుభాషిణి 'అల్లరి' సుభాషిణిగా పిలువబడుతుంది.

కోడి రామకృష్ణ దర్శకత్వం చేసిన సినిమాల్లో 'అంకుశం, ఆహుతి' నంది అవార్డులు సాధించడమే కాక విజయం కూడా సాధించాయి. 'అంకుశం'లో 'స్పాట్ పెడ్తా' అంటూ తెగభయపెట్టిన రామిరెడ్డి 'అంకుశం' రామిరెడ్డి గాను, 'ఆహుతి'లో విలన్ గా నటించిన ఎ. జనార్ధన ప్రసాద్ చక్కటి నటనను ప్రదర్శించడంతో 'ఆహుతి ప్రసాద్'గా పిలువబడ్డారు. తేజ తీసిన తొలి చిత్రం 'చిత్రం' విచిత్రంగా హిట్ కావడంతో ఆ సినిమాలో నటించిన శ్రీను 'చిత్రం' శ్రీనుగా, 'జై' సినిమాలో నటించిన వేణు 'జై' వేణుగా స్థిరపడ్డారు.

మొదట్లో డిస్ట్రిబ్యూటర్ గా, ఆ తర్వాత నిర్మాతగా స్థిరపడ్డవారిలో 'రాజు' ఒకరు. ఆయన నిర్మించిన 'దిల్' సినిమా హిట్ కావడంతో 'దిల్'రాజుగా మారి ఎన్నో సినిమాలు నిర్మించారు. ఇంకా ఊర్ల పేరుతో పిలిచేవారిలో 'డిల్లీ' రాజేశ్వరి, 'వైజాగ్' ప్రసాద్, 'డిల్లీ' గణేష్, 'కాకినాడ' శ్యామల, 'బెంగుళూరు' పద్మ లాంటి నటులు ఉంటే, 'టెలిఫోన్' సత్యనారాయణ, 'వంకాయల' సత్యనారాయణ, 'పావలా' శ్యామల, 'తెలంగాణా' శకుంతల లాంటి నటులు కూడా ఉన్నారు మన చిత్రసీమలో. సిరివెన్నెల సీతా రామ శాస్త్రి గారి గురించి ప్రత్యేకం గా చెప్పనవసరం లేదు!

- కె. సతీష్ బాబు

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam