Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

C/o సూర్య చిత్ర సమీక్ష

movie review

చిత్రం: కేరాఫ్‌ సూర్య 
తారాగణం: సందీప్‌ కిషన్‌, మెహరీన్‌, సత్య, హరీష్‌ ఉత్తమన్‌, ప్రవీణ్‌, అప్పుకుట్టి తదితరులు 
సంగీతం: డి. ఇమ్మాన్‌ 
సినిమాటోగ్రఫీ: జె.లక్ష్మణ్‌కుమార్‌ 
దర్శకత్వం: సుసీంద్రన్‌ 
నిర్మాత: చక్రి చిగురుపాటి 
నిర్మాణం: లక్ష్మీ నరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ 
విడుదల తేదీ: 10 నవంబర్‌ 2017 
క్లుప్తంగా చెప్పాలంటే 
సూర్య (సందీప్‌ కిషన్‌) ఓ మంచి స్నేహితుడు. ఎంత మంచి స్నేహితుడంటే, స్నేహం కోసం ప్రాణమైనా ఇచ్చేస్తాడు. అతనికో ప్రాణమిత్రుడు మహేష్‌ (విక్రాంత్‌) ఉంటాడు. సాంబశివుడు అనే ఓ రౌడీ కారణంగా సూర్య సమస్యలనెదుర్కొంటాడు. మహేష్‌ ప్రాణాలకు ముప్పుగా మారతాడు సాంబశివుడు. సాంబశివుడు ఎవరు? అతను సూర్యపైనా, అతని స్నేహితుడిపైనా ఎందుకు పగబట్టాడు? సూర్య, సాంబశివుడి నుంచి మహేష్‌ని ఎలా కాపాడుకున్నాడు? అన్న ప్రశ్నలకు సమాధానం తెరపైనే దొరుకుతుంది. 

మొత్తంగా చెప్పాలంటే 
స్నేహం కోసం ప్రాణాలకు సైతం తెగించే ఓ మంచి స్నేహితుడిగా సూర్య పాత్రలో ఒదిగిపోయాడు సందీప్‌ కిషన్‌. అతని పాత్రలో చాలా యాంగిల్స్‌, ఎమోషన్స్‌ కన్పిస్తాయి. అన్నిటినీ పెర్‌ఫెక్ట్‌గా డీల్‌ చేశాడు. నటుడిగా సందీప్‌ కిషన్‌కి ఈ సినిమా పెద్ద ప్లస్‌ పాయింట్‌ అవుతుందనడం నిస్సందేహం. మంచి అవకాశాన్ని నటుడిగా సందీప్‌ కిషన్‌ సద్వినియోగం చేసుకున్నాడు. 

హీరోయిన్‌ మెహరీన్‌కి కథలో పెద్దగా ప్రాధాన్యత లేదు. క్యూట్‌గా, అందంగా తన పాత్రకి కొంత గ్లామర్‌ అద్దింది. నటన పరంగా ఫర్వాలేదంతే. మహేష్‌ పాత్రలో విక్రాంత్‌ బాగా చేశాడు. హరీష్‌ ఉత్తమన్‌ చాలా బాగా చేశాడు. మిగతా పాత్రధారులంతా సినిమాకి అవసరమైనంత మేర ఓకే అనిపించేలా నటించి మెప్పించారు. 

మామూలు కథే అయినా, దాన్ని దర్శకుడు చెప్పిన విధానం థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. స్క్రీన్‌ప్లే ఆకట్టుకుంటుంది. డైలాగ్స్‌ బాగున్నాయి. సంగీతం బాగుంది, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఇలాంటి సినిమాలకి సినిమాటోగ్రఫీనే పెద్ద ప్లస్‌ పాయింట్‌ అవ్వాలి. ఆ విషయంలో సినిమాటోగ్రాఫర్‌ మంచి ఔట్‌పుట్‌ ఇచ్చాడు. నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ సినిమాకి హెల్పయ్యాయి. 

స్క్రీన్‌ప్లే పరంగా ఇంట్రెస్టింగ్‌ అనిపించినా, కథలో వేగం అక్కడక్కడా తగ్గిపోయింది. పరిమితమైన కథతోనే సినిమా ఆసాంతం నెట్టుకురావాల్సి రావడం మైనస్‌ పాయింట్‌. దానికి తోడు ఎంటర్‌టైన్‌మెంట్‌ లేకపోవడంతో, సాగతీత అనిపిస్తుంది. థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌కి కొదవేమీ లేదు. సాంకేతిక వర్గం బాగా సహకరించడంతో ఓ మంచి ఔట్‌పుట్‌ అయితే తీసుకురాగలిగాడు దర్శకుడు. ఈ తరహా సినిమాల్ని ఇష్టపడేవారికి బాగానే అనిపిస్తుందిగానీ, అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ అలరించడమంటే దానికి అవసరమైన ఎంటర్‌టైన్‌మెంట్‌ లేకపోవడం కొరత. హీరో - హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఇంకాస్త బెటర్‌గా ఉంటే బాగుండేది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సినిమా ఇంకా బెటర్‌ రిజల్ట్‌ రాబట్టుకునేది. 

ఒక్క మాటలో చెప్పాలంటే 
కేరాఫ్‌ సూర్య - బాగానే ఉన్నాడు 
అంకెల్లో చెప్పాలంటే: 2.75/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka