Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

చమత్కారం - భమిడిపటి ఫణిబాబు

chamatkaaram

.మా నాన్నగారు ఎప్పుడూ ఖద్దరు లాల్చీ, పంచె, కండువా తోనే ఉండేవారు. అంతకుముందు తరం వారు తలకి ఒక పాగా కూడా పెట్టుకొనే వారు.

వేసుకున్న వస్త్రాలని బట్టి అవతలి వారిమీద గౌరవం చూపించేవారు. మేము కాలేజీ లో చేరేవరకూ నిక్కరే గతి. అదేదో యూనిఫారం అనుకోకండి. ఇంట్లో ఎక్కువ మంది ఉంటే ఆ ఇంటిపెద్ద ఓ తాను బట్ట తీసి అందరికీ దానితోనే బట్టలు కుట్టించేవారు.

ఆడవారైతే పరికిణీ, ఓణీ లతో కలకలలాడుతూ ఉండేవారు. పంజాబీ డ్రెస్స్ అయితే స్కూల్లో ఏ.సి.సి కో, ఎన్.సి.సి కో వెసికొనేవారు.కొంచెం పెద్దవారు నిండుగా 6 గజాల చీరలో నుదుట పెద్ద కుంకుం బొట్టు పెట్టుకొని లక్ష్మీదేవిలాగ ఉండేవారు. మన గ్రామాల్లో ఎక్కడ చూసినా ఇటువంటి దృశ్యాలే కనిపించేవి.

నగరాలలో కొంచెం సల్వార్ కుర్తా వేసికొనేవారు. సినిమాలలో కూడా మన హీరోయిన్లు చూడడానికి చక్కగా ఉండేవారు. ఒక్క వాంప్ పాత్రధారిణి కి కొంచెం వేషధారణ ఇంకోలా ఉండేది. షర్మిలా టాగోర్ అదేదో హిందీ సినిమాలో బికినీ లో కనిపించేసరికి పత్రికలవాళ్ళు గోల పెట్టేశారు. అలా ఉండేది మనవాళ్ళ వేషధారణ.

ఆడవారి వస్త్రాలు క్రమక్రమంగా చిన్నవి అయిపోయి సినిమాలలో ప్రస్తుతం ఉన్నా లేనట్లే కనిపిస్తున్నాయి! కాల మహిమ! ఏ హీరోయిన్ అయినా సరే అడిగితే, ప్రేక్షకులకి ఎలా కావాలంటే మేము అలాగే వేస్తున్నామని ఓ స్టేట్మెంటూ !! వీళ్ళని ఇలా చాలా రోజులు చూస్తే ఒకరోజుకి వెగటు పుట్టుకొస్తుంది. వీళ్ళ మొహాలె ఎవడూ చూడడు.

ఇప్పుడు ఆఫీసులకెళ్ళేవారు జీన్స్ వాటిమీద ఓ టాప్పో ఏదో వేసికున్నప్పుడు చాలా డీసెంట్ గా కనిపిస్తారు.అదొక డిగ్నిటీ కూడా వస్తుంది.ఇక్కడ మహరాష్ట్రలో పాత తరం ఆడవారు 9 గజాల చీర కట్టేవారు.

ఇక్కడ పూణే లో చాలా మంది అమ్మాయిలు స్కూటర్లమీదే ప్రయాణం చేస్తారు. కళ్ళు తప్పించి మిగిలిన మొహం అంతా కప్పేటట్లుగా ఓ స్కార్ఫ్ కట్టేస్తారు. ఓ టెర్రరిస్ట్ లా కనిపిస్తారు!!నాగపూర్ లో అనుకుంటా పోలీస్ కమిషనర్ గారు ఓ ఆర్డర్ పాస్ చేశారు. ఇలా రోడ్డు మీద మొహం పూర్తిగా కప్పేసుకుంటే వారిని అరెస్ట్ చేస్తామని, దానివలన ఏమీ ప్రయోజనం లేకపోయింది, ఆ ఆర్డర్ విత్ డ్రా చేసేశారు.మొహానికి గుడ్డ , వాతావరణ కాలుష్యం నుండి కాపాడుకోవడానికి కట్టుకుంటారు

మామూలుగా ఆఫీసులకెళ్ళేవాళ్ళు, ఏవో ఫార్మల్స్ లోనో వెళ్తూంటారు. వారంలో ఒకరోజు కాజుఅల్స్ లో వెళ్తారు.అదీబాగానే ఉంటుంది. మా ఫ్రెండ్స్ కొంతమందిని చూస్తూంటాను. అవేవో కాప్రీలూ, పువ్వుల టీ షర్టులూ వేసికొని దసరా బుల్లోడిలా తయారై వచ్చేస్తూంటారు. అంటే దానర్ధం, ఈమధ్యనే ఆయన విదేశాలకి వెళ్ళైనా ఉండాలి, లేకపోతే వాళ్ళ కొడుకో, కూతురో బయటనుంచి వచ్చైనా ఉండాలి ! నేను చెప్పేదేమిటంటే అలా డ్రెస్ వేసికోవద్దని కాదు-- మార్నింగ్ వాక్ కి వెళ్ళేటప్పుడో లేక ఈవెనింగ్ వాక్ కి వెళ్ళేటప్పుడో అలాంటివి వేసికుంటే బాగుంటుంది.

ఇప్పుడు ఎక్కడ చూసినా హాఫ్ చెడ్డిలే. ఒకానొకప్పుడు మన ఎన్.టి.రామారావు గారు గుండమ్మ కథలో వేసికున్నారు అది ఇప్పుడు ఫాషన్ అయిపోయింది.ఇదివరకటి రోజుల్లో మన పోలీసులు, శానిటరీ ఇనస్పెక్టర్లూ, రెవెన్యూ ఇనస్పెక్టర్లూ వేసికొనే వారు.ఇప్పుడు వాళ్ళుకూడా పాంట్లలోకి మారిపోయారు.

ఇన్నీ రాశాను నేను వేసికొనే బట్టల గురించి కూడా వ్రాయాలిగా.రిటైర్ అయ్యేదాకా నేను టైలర్ చేత కుట్టించిన బట్టలే వేసుకొనేవాడిని. ఆ తరువాత పిల్లల ధర్మమా అని బ్రాండెడ్ బట్టలలోకి మారాను.    నాకు మా ఫ్రెండ్స్ లాగ పువ్వుల షర్టులూ అవీ వేసికొనే ప్రాప్తం లేదు.ఎందుకంటే మావాళ్ళు నలుగురూ సాఫ్ట్ వేర్ లో పనిచేస్తున్నా సరే, బయటకు వెళ్ళరు. పోనీ వాళ్ళెవరైనా బయట ఉంటే మేము కూడా ఎవరిదో పురిటికో దేనికో బయటకు వెళ్ళొచ్చుకదా అని పాస్ పోర్ట్ లు కూడా తీసికొని ఉంచుకున్నాము.అబ్బే అలాంటి ఆలోచన మా వాళ్ళకి లేదు.  చేసికున్నవాడికి చేసికొన్నంత !! .

ఫలానా బట్టలు ధరించొద్దని అనడం లేదు..వయసుకి తగ్గ వేషధారణ, సందర్భానుసారం చేస్తే బావుంటుందేమో అని నా అభిప్రాయం. .. విదేశాలలో అదేదో టానింగ్ కోసం , కురచ బట్టలూ అవీ వేసికుంటారు.. కానీ మనదేశాల్లో , అలాటి అవసరం అంతగా లేదు… అయినా ఎవరిష్టం వారిదీ..

సర్వే జనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
bhetaala prasna