Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
jayajayadevam

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఉత్తరాఖండ్ తీర్ధయాత్రలు - కర్రా నాగలక్ష్మి

uttarakhand

( చంపావత్ జిల్లా )

ఉత్తరాఖండ్ లో మరో ముఖ్యమైన జిల్లా చంపావత్ , యీ జిల్లా లో చాలా ప్రాంతం కొండలతో కూడుకొని వుంటుంది . సుమారు సముద్ర మట్టానికి 250 నుంచి 2000 మీటర్ల యెత్తు వరకు వుండటం మూలాన వాతావరణం చాలా చల్లగా వుండి యెంతోమంది పర్యాటకులను ఆకర్షిస్తోంది .


చంపావత్ జిల్లాలో ' తనక్ పూర్ ' ముఖ్యనగరం . ఈ ప్రాంతం వేసవివిడిదిగా రూపుదిద్దుకోవడం తో యిక్కడ వసతి సౌకర్యాలు పెరిగి పల్లెకాస్త నగరంగా రూపుదిద్దుకుంది . భారతదేశ ప్రభుత్వం నిర్వహించే కైలాస మానససరోవరం యాత్ర తనక్ పూర్ మీదుగా సాగడం వల్ల , యీ మధ్య కాలం లో యీ యాత్ర ప్రాముఖ్యతను సంపాదించడం వల్ల యీ నగరం మహానగర పోకడలన్నీ అద్దుతుంది .

దేశ రాజధాని ఢిల్లీ నుంచి తనక్ పూర్ వరకు రైలు సదుపాయం వుంది , విమానయానం ద్వారా యిక్కడకి రాదలచుకున్న వారు పంత్ నగరు వరకు వచ్చి అక్కడనుంచి రోడ్డు ద్వారా సుమారు 150 కిలో మీటర్లు ప్రయాణించి తనక్ పూర్ చేరుకోవచ్చు .

ఢిల్లీ నుంచి రోడ్డు మార్గంలో కూడా తనక్ పూర్ చేరుకోవచ్చు . రుద్రాపూర్ అంటే సుమారు 250 కిలోమీటర్ల వరకు నైనితాల్ రోడ్డు మీద ప్రయాణించేక అక్కడ తనక్ పూర్ దారి చీలుతుంది . అక్కడనుంచి సుమారు 150 కిలోమీటర్లు చాలా మటికి శారదా నదీ తీరంలోని మైదానాలలోనూ , కొంత  ఘాట్ లలోనూ సాగుతుంది మన ప్రయాణం . చంపావత్ జిల్లా యిండో నేపాలు బోర్డరు జిల్లా . శారదా నదికి అవతల వైపు నేపాలు వుండడంతో నేపాలీలు యీ దారిన మన దేశంలోకి , మనదేశం వారు అటువైపు ప్రవేశిస్తూవుంటారు . సాధారణంగా వీరు పేదవారు కావడం వల్ల కాయకష్టం చేసుకొని బతికేస్తారు . కొండలమీద నుంచి ప్రవహించే శారదా నది కూడా యెన్నో బండలను దొర్లించుకుంటూ ప్రవహించటం వల్ల ఆ బండలు నీటి ప్రవాహానికి నున్నగా గుండ్రంగా మారి సహజ శివలింగాలేమో అనిపిస్తూ వుంటాయి . ఈ బండలను వీరు యిళ్లు కట్టడానికి , రోడ్లు వెయ్యడానికి వుపయోగిస్తూ వుంటారు . తనక్ పూర్ నుంచి ఘాట్ రోడ్డు మొదలవుతుంది . కైలాస యాత్ర తనక్ పూర్ మీదుగా పిత్తోరా ఘడ్ జిల్లాలో ప్రయాణించి దర్చూలా చేరుతుంది . దర్చూలా దగ్గరనుంచి కైలాస మానస సరోవర్ కి నడకదారి మొదలవుతుంది .

ఓ పక్క శారదానది మరోపక్క హిమాలయాలు , పచ్చని ప్రకృతి మధ్యవున్న తనక్ పూర్ పర్యాటకలను యిట్టే ఆకర్షిస్తుంది .

ప్రతీ హిల్ స్టేషన్స్ లో వున్నట్లే చల్లని నీటి సరస్సులు పచ్చిక మైదానాలు జలపాతాలతో కూడుకొని వుంటుంది తనక్ పూర్ ప్రాంతం .

తనక్ పూర్ చేరడానికి నైనితాల్ , భాగేశ్వర్ మీదుగా కూడా రావొచ్చు , యీ దారి చాలా శ్రమతో కూడుకొన్న దారి యెందుకంటే చాలా దూరం కొండలలో ప్రయాణించవలసి రావడమే కారణం .

తనక్ పూరులో పర్యాటక స్థలాల గురించి తెలుసుకుందాం .

శ్యామల తాల్ ----

తనక్ పూర్ బస్టాండుకి సుమారు 56 కిలో మీటర్ల దూరంలో టేకు , దేవదారు అడవుల మధ్య సహజ సరస్సు . చుట్టారా వున్న పర్వతాల నీడలు , వృక్షాల నీడల వల్లనో యేమో యీ సరస్సు నీరు నీలం రంగులో కాక కాస్త ముదురు నీలం రంగులో వుండటం వల్ల యీ సరస్సును శ్యామల తాల్ ( తాల్ అంటే సరస్సు ) అని పిలుస్తున్నారు . సూర్యకిరణాలు చొరబడలేనంత దట్టమైన అడవుల మధ్యన వుండడం కూడా నీటి రంగు ముదురు నీలంగా వుండడానికి ఒక కారణం కావొచ్చు .

పచ్చని ప్రకృతిలో నిశ్సభ్ద ప్రకృతిలో సరస్సు ఒడ్డున గడపడం చాలా బాగుంటుంది . ఇలాంటి ప్రయాణాలు హితులుతో కలిసి చేస్తే యింకా అహ్లాదంగా వుంటుంది . శ్యామలా తాల్ వొడ్డున వున్న వివేకానంద ఆశ్రమం పర్యాటకలకు మరో ఆకర్షణ . అంతటి చక్కని ప్రకృతిలో ధ్యానం చేసుకోడం వల్ల మనలోని అన్ని  వికారాలూ నశించి మనఃశ్సాంతి నిస్తాయనడం అతిశయోక్తి కాదు . అందుకే వివేకానందులవారు యిక్కడ ధ్యానం చేసుకున్నారేమో . సంవత్సరం పొడవునా యీ ఆశ్రమానికి పర్యాటకుల వస్తూనే వుంటారు . దశరా శలవులలో పర్యాటకుల యెక్కువ సంఖ్యలో వస్తూ వుంటారు .

బేరేజ్ రోడ్డు ----

తనక్ పూరు లో వున్న నేషనల్ హైడెల్ పవర్ కార్పొరేషను స్థానికులకు , పర్యాటకులకు యిష్టమైన ప్రదేశం . ఇక్కడి  ప్రొద్దుటి సూర్యోదయం , సాయంత్రం సూర్యాస్తమయం చూడ్డానికి పర్యాటకులే కాదు స్థానికులు కూడా యెంతో వుత్సాహంగా వస్తారు .

పుణ్య గిరి ---

తనక్ పూరు నగరానికి సుమారు 20 , 21 కిలోమీటర్ల దూరంలో వున్న శక్తి పీఠం . తనక్ పూర్ నగరం నుంచి శారదా నది వొడ్డున 15 , 16 కిలో మీటర్ల ప్రయాణానంతరం లోకల్ జీపులు నిలుపు ప్రదేశం చేరుకుంటాం , అక్కడనుంచి షేర్డు టాక్సీలలో మరో మూడు నాలుగు కిలోమీటర్లు మట్టి దారిన ప్రయాణించి చిన్న పల్లె ' టున్యాస్ ' చేరుకుంటాం అక్కడనుంచి ఓ మోస్తరుగా వుండే కొండ యెక్కి అమ్మవారి మందిరం చేరుకుంటాం . దారంతా గెష్టు హౌసులు , ఆశ్రమాలు పర్యాటకులు ఒకటి రెండురోజులు వుండడానికి అనువుగా వున్నాయి . చిన్న చిన్న టీ కొట్లు , ఫలహారశాలలు దాటుకుంటూ నడస్తాం కాబట్టి నడక కాస్త సరదాగానే సాగుతుంది . ఈ దారంతా మన్ను , ధూళి యెగురుతూ వుంటుంది , వర్షం పడితే యీ ప్రాంతం బురదయిపోయి చాలా జారుడుగా వుంటుంది . కొండలపై నుంచి ప్రవహిస్తున్న కాళి నది వొడ్డునుంచి సాగుతుంది నడకదారి . కాళి నదికి  యివతలి వొడ్డున వున్న పర్వతం పుణ్యగిరి అవతల వొడ్డున వున్న పర్వతం పైన అమ్మవారి భక్తుడైన బడా సిద్దనాధ్ బాబా ఆశ్రమం వుంటుంది .

స్థానికుల నివాసాల మధ్య నుంచి నడుస్తూ మందిరం చేరుకోవాలి . కొండ యెక్కడం కాబట్టి కాస్త ఆయాసంగానే వుంటుంది , మందిరం దగ్గర మెట్లదారి వెళ్లేదారి , వచ్చేదారి గా విడిపోతుంది , పైన కుంకుమతో కప్పివున్న చిన్న అమ్మవారి విగ్రహం , పక్కనే భక్తులు కట్టిన మొక్కుల యెర్రతాళ్లు వుంటాయి . పక్కగా పూజారులు భక్తులకు రక్షతాళ్లు కడుతూ వుంటారు . ఆ చల్లని వాతావరణం లో కూడా ఆయాసం వల్ల చమటలు పడతాయి .

పుణ్యగిరి గురించి దేవి భాగవతం లో వర్ణించబడింది .

108 శక్తి పీఠాలలో ఒకపీఠంగా గుర్తించబడింది . ఇక్కడ సతీదేవి ' బొడ్డు ' పడిందట .

ఈ పుణ్యగిరిని పూర్ణగిరి అని కూడా అంటారు . అన్నపూర్ణ అమ్మవారి రెండో ముఖం యిక్కడవున్న పూర్ణగిరి అమ్మవారు అని అంటారు . అందుకే యీప్రదేశం పూర్ణగిరిగా పూర్వం పిలువబడేది . కాలక్రమేణా యిది పుణ్యగిరిగా పిలువబడసాగింది .

అమ్మవారి దర్శనం కోసం వెళ్లేవారు కాస్త బియ్యం తమతో కూడా తీసుకువెళ్లి అమ్మవారికి నివేదించి యింటికి తెచ్చుకుంటారు , అలాచేస్తే వారింట యెప్పుడూ అన్నానికి లోటుండదని భావిస్తారు . అలాగే యిక్కడి అమ్మవారు సతీదేవి నాభి కాబట్టి నాభికి సంభందించిన అన్ని శక్తులు పశుపతినాధ్ మందిరంలో ప్రకటితమౌతాయని స్థానికుల విశ్వాసం . అమ్మవారి దర్శనానంతరం నేపాలులోని బ్రహ్మదేవ్ మరియు మహేంద్రనగర్ లలోని బడా సిధ్దనాధ్ సమాధిని దర్శించుకుంటారు .

సిధ్దనాధ్ బాబా నేపాల్ ఆశ్రమంలో వున్నప్పుడు తన ముఖ్య శిష్యురాలయిన ' గురుమా ' కి చెవిలో పూర్ణగిరిమాత గురించి చెప్పి అక్కడ ఆశ్రమం నిర్మించమని కోరి సమాధి పొందేరట . గురుమా సిధ్దనాధ్ చెప్పిన ఆనవాలును వెతుకుతూ పూర్ణగిరికి వచ్చి 1998 లో ఆశ్రమం నిర్మించి ' ఆది శక్తిపీఠం ' స్థాపించేరు . శక్తిపీఠం దర్శించుకొనే భక్తులు తెల్లని యిసుక తిన్నెలు కలిగిన శారదానదిలో స్నానాలు ఆచరించి ' ఆది శక్తిపీఠాన్ని ' దర్శించుకుంటారు . ఇక్కడ శారదా నదిలో గవర్నమెంటు వారి ఆధ్వైర్యంలో రాఫ్టింగు మొదలయినవి నడపబడుతున్నాయి . నేపాలు  బోర్డరు వుండడంతో యిక్కడ భద్రతా దళాలు యెక్కువగా గస్తీ తిరుగుతూ కనిపిస్తాయి . ఇక్కడనుంచి కూడా చాలా మంది యాత్రీకులు బోర్డరు దాటి ఆవలివైపుకి వెళ్లి పశుపతి నాధుడిని దర్శించుకుంటూవుంటారు .

చైత్ర నవరాత్రులలో యిక్కడ జాతర జరుగుతుంది . ఆ రోజులలో వేలాదిభక్తులు వస్తారు . మిగతా రోజులలో పదుల సంఖ్యలో వుంటారు భక్తులు . ఏడాది పొడవునా భక్తులరాకపోకలు వుంటూనే వుంటాయి . 

' మా పూర్ణగిరి ' దర్శనానంతరం మేము ఆ కొండలలో వున్న ' మీఠా రీఠా సాహెబ్ ' కి బయలుదేరేం , ఆ విశేషాలు వచ్చే సంచికలో చదువుదాం , అంతవరకు శలవు .

మరిన్ని శీర్షికలు
prize-for-best-comment