Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

జవాన్‌ చిత్రసమీక్ష

javan movie review

చిత్రం: జవాన్‌ 
తారాగణం: సాయిధరమ్‌తేజ, మెహరీన్‌ కౌర్‌, ప్రసన్న, కోట శ్రీనివాసరావు, సత్యం రాజేష్‌, నాగబాబు తదితరులు. 
సంగీతం: తమన్‌ 
సినిమాటోగ్రఫీ: కెవి గుహన్‌ 
దర్శకత్వం: బివిఎస్‌ రవి 
నిర్మాత: కృష్ణ 
సమర్పణ: దిల్‌ రాజు 
నిర్మాణం: అరుణాచల్‌ క్రియేషన్స్‌ 
విడుదల తేదీ:
1 డిసెంబర్‌ 2017 
క్లుప్తంగా చెప్పాలంటే 
దేశభక్తి మెండుగా వున్న యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ కుర్రాడు జై (సాయిధరమ్‌ తేజ), తనకోసం దేశం ఏమైపోయినా ఫర్వాలేదనే వ్యక్తిత్వం గలవాడు కేశవ (ప్రసన్న). ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంతో దేశభక్తి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్న జై, డీఆర్‌డీఓ తయారు చేసిన కొత్త మిస్సైల్‌ సిస్టమ్‌ని కొట్టేయాలనుకునే కేశవతో తలపడ్తాడు. ఈ క్రమంలో కేశవ్‌ ఎత్తుల్ని చిత్తు చేస్తాడు జై. దాంతో జై కుటుంబం ద్వారా జైని లొంగదీసుకోవాలని కేశవ్‌ ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో కేశవ్‌, జై కుటుంబానికి దగ్గరవుతాడు. ఇంతకీ కేశవ్‌ ఎవరు? కేశవ్‌ కుట్రల నుంచి దేశాన్ని జై ఎలా కాపాడాడు? ఇంటికో జవాన్‌ ఉండాలని బలంగా నమ్మే జై, కేశవ్‌ కారణంగా తన కుటుంబానికి ముప్పు ఎదురైతే ఏం చేశాడు? అన్నవి తెరపైనే చూడాలి. 
మొత్తంగా చెప్పాలంటే 
గత చిత్రాలకు భిన్నంగా చాలా సెటిల్డ్‌ పెర్ఫామెన్స్‌ ఇచ్చేందుకు ప్రయత్నించిన సాయిధరమ్‌ తేజ, ఆ ప్రయత్నంలో సఫలమయ్యాడు. నటన, డైలాగులు, బాడీ లాంగ్వేజ్‌, డాన్సులు - ఇలా అన్నిట్లోనూ కొత్తదనం కోసం ప్రయత్నించాడు. తన వరకూ పూర్తి న్యాయం చేయడానికి సాయిధరమ్‌ పడ్డ కష్టాన్ని అభినందించాల్సిందే. మెరుపు వేగంతో డాన్సులు వేసే సత్తా ఉన్నా, ఆ డాన్సుల్లోనూ కొత్తదనం కోసం ప్రయత్నించడం అభినందనీయం. 

హీరోయిన్‌ మెహ్రీన్‌ నటన పరంగా పెద్దగా చేసిందేమీ లేదు. అసలామె పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు కూడా కథలో. సీరియస్‌గా సినిమా సాగుతున్న టైమ్‌లో ఆమె క్యారెక్టర్‌ షడెన్‌గా వచ్చిపోతుంటుందంతే. అది కూడా కొంత ఇబ్బందికరంగా అన్పిస్తుంది. ఉన్నపళంగా ఫిజిక్‌ని తగ్గించుకోకపోతే, బొద్దుతనం కాస్తా ఆమె కెరీర్‌ని స్లో చేసెయ్యొచ్చు. 

విలన్‌ పాత్రలో నటించిన ప్రసన్న తన పాత్రలో ఒదిగిపోయాడు. ఎక్కడా బౌండరీ దాటెయ్యలేదు. సరిగ్గా వాడుకుంటే తెలుగు తెరకు మరో స్టైలిష్‌ విలన్‌ ప్రసన్న రూపంలో దొరికినట్లే. మిగతా పాత్రల్లో నాగబాబు, సత్యం రాజేష్‌ బాగానే చేశారు. మిగిలిన వారికి సినిమాలో పెద్దగా స్కోప్‌ లేదు. ఉన్నతంలో బాగానే చేశారంతా. 

కాస్త ఇంట్రెస్టింగ్‌గా అన్పించే పాయింట్‌ చుట్టూనే సినిమా కథని అల్లుకున్నారు. కథనం బాగానే వుంది. డైలాగ్స్‌ బాగున్నాయి. సినిమాకి ప్రాణంగా నిలిచింది బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌. పాటలు సోసోగా వున్నా, బ్యాక్‌గ్రౌండ్‌తో సినిమాకి ప్రాణం పెట్టేశాడు తమన్‌. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణపు విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదు. ప్రతి ఫ్రేమ్‌ రిచ్‌గా, బ్రైట్‌గా కనిపించింది. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ బాగా హెల్ప్‌ అయ్యాయి సినిమాకి. ఎడిటింగ్‌ బాగానే ఉంది. 

ఈ తరహా కథల విషయానికొచ్చేసరికి, ఎంటర్‌టైన్‌మెంట్‌ అయినా మెయిన్‌ లీడ్‌ లవ్‌ ట్రాక్‌ అయినా పంటికింద రాయిలా అన్పిస్తుంటుంది. అద్భుతం అన్పించగలిగితేనే ఆ రెండిటినీ ఇలాంటి సినిమాల్లో టచ్‌ చేయాల్సి వుంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ జోలికి వెళ్ళలేదుగానీ, హీరో హీరోయిన్ల మధ్య లవ్‌ ట్రాక్‌ సినిమా వేగాన్ని కొంచెం తగ్గించినట్లనిపిస్తుంది. సెకెండాఫ్‌లో సినిమా మరింత వేగం పుంజుకోవడం ప్లస్‌ పాయింట్‌. మేజర్‌ సస్పెన్స్‌ రివీల్‌ అయ్యేటప్పుడు వుండాల్సిన టెంపో లేకుండా పోవడం, క్లయిమాక్స్‌లో భారీతనం తగ్గడం, కొన్ని సన్నివేశాలు లాజిక్‌కి దూరంగా వుండడం మైనస్‌ పాయింట్స్‌. ఓవరాల్‌గా హీరో నుంచి ఓ మంచి ప్రయత్నమైతే జరగడం అభినందించదగ్గదే. 
ఒక్క మాటలో చెప్పాలంటే 
'జవాన్‌' బాగున్నాడుగానీ 
అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka