Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాదైన ప్రపంచం

nadaina prapancham

గత సంచిక లోని  నాదైన ప్రపంచం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి..... http://www.gotelugu.com/issue244/665/telugu-serials/naadaina-prapancham/nadaina-prapancham/

స్టేడియం లోకి ఇలాగ అడుగు పెట్టానో లేదో హర్షధ్వానాలు మిన్నంటాయి.

ఆతృతగా చూశాను. మా టీమ్ మేట్స్ అంతా పరాజయ భావంతో మొహాలు వాడి పోగా బైటికి వస్తున్నారు. బీహార్ జట్టు విజయ నినాదాలు చేస్తోంది. ఇది కాదు నన్ను కలవర పరిచింది.

బీహారు జట్టు కెప్టెన్ పక్కగా నిల్చుని విజయ గర్వంతో చిరునవ్వు చిందిస్తున్న నేను ప్రేమించిన అమ్మాయిని, ప్రత్యర్థి కెప్టెన్ తమ విజయానికి తురుపు ముక్కని సగర్వంగా అందరికీ పరిచయం చేస్తున్నాడు.

నా సహచరులంతా నా కేసి చూసిన చూపులని నేను జన్మలో మర్చి పోలేను. నేను మ్యాచ్ ఫిక్సింగ్ చేశానని గవర్నమెంటు నా మీద ఆరోపణలు చేసింది.

అన్నీ ఒకెత్తు...ప్రేమ నాకు చేసిన గాయం ఒకెత్తు....జీవితంలో వాలీ బాల్ జోలికి, ప్రేమ జోలికి పోకుండా బతుకుతున్నాను.

‘‘కానీ ఈ గేమ్ నా ప్రాణం. ఎంతో నిబద్దతతో ఆడే నిన్ను చూస్తుంటే ముచ్చటేసేది. నీలో నన్ను చూసుకుంటూ ఇంతకాలం గడిపాను. నేను సాధించ లేని లక్ష్యం నువ్వు సాధిస్తే చూడాలని నా కోరిక.....

జీవితంలో ఎదురయ్యే ఇలాంటి సమస్యలని జాగ్రత్తగా ఎదుర్కొని విజయం సాధించు. యిది నా ఆకాంక్ష’’ ఉద్వేగంగా అన్నాడు ప్రణీత్.
అతను చెపుతున్నంత సేపూ విభ్రమురాలై వింది కీర్తన.

అంటే! ఇప్పుడు తనని కూడా ఇలాగే, ప్రణీత్ లాగే, సైకలాజికల్ గా దెబ్బ తీయాలని ఆకాష్, మణిబిందు చూస్తున్నారా?

కఠినంగా మారి పోయింది కీర్తన మనసు. ఇక ఎవరూ తనని ఏ విషయానికీ లొంగ దీయ లేరు...నిశ్చయంగా అనుకుంది.

‘‘ఇంక బయల్దేరండి....భోజనం చెయ్యాలిగా’’ చెప్పాడు. కీర్తన వస్తుంటే చప్పున పక్కకి తొలిగింది ఓ ఆకారం. కాసేపు అక్కడే తచ్చాడి వెనక్కి వెళ్ళి పోయింది. అయితే ఆ మొహంలో విస్మయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

*********************

అప్పటికి దాదాపు రెండు గంటల నుంచీ ఆ వరండాలో కుర్చీలో కూర్చుని పడిగాపులు పడుతున్నాడు ఆకాష్.

తన పనులన్నింటినీ వాయిదా వేసుకుని కీర్తన కోసం వస్తే, ఇంత సేపయినా ఆమె ఇంటికి రాలేదు. కోపం వచ్చింది. ఎంత రాత్రయినా ఇలాగే వుండాలన్నట్లు కూర్చున్నాడు.

తొమ్మిది గంటలవుతుండగా వచ్చింది కీర్తన. ఆమె ఏదో ఆలోచనలో వుండి వరండా లోకి వచ్చే వరకూ అక్కడ ఎవరు వున్నదీ చూసుకో లేదు.

ఆమె దగ్గరకి రాగానే.....‘‘హలో....’’ అన్నాడు. ఉలిక్కి పడింది కీర్తన.

ఎదురుగా ఆకాష్! తాళం తీసి కామ్ గా లోపలికి నడిచింది.

‘‘ఒక్క దానివీ ఎక్కడికి వెళ్ళావు? ప్రణీత్ ఏడి...?’’ అడుగుతుంటే నిశితంగా చూసింది.

‘‘ఏంటా చూపు?’’ కోపాన్ని నటిస్తూ అన్నాడు. నవ్వు రాలేదు. లోపలికి వెళ్ళి స్నానం చేసి కిచెన్ లోకి వచ్చింది.

అతనూ వెనకాలే వచ్చి...‘‘భోజనం చేయ లేదా? బయటకి వెళదాం రా....’’ పిలిచాడు. మాట్లాడ లేదు కీర్తన.

‘‘నిన్ను చూడాలనిపించింది అన్ని పనులూ వదిలేసి వచ్చేశాను’’ వెనక నుంచి కౌగిలించుకుని మెడ వంపులో ముద్దాడుతూ అన్నాడు.
మృదువుగా విడిపించుకుంది. ఆశ్చర్య పోయాడు.

‘‘ఏంటి....నా మీద కోపమా?’’ అడిగాడు. మాట్లాడ లేదు....

‘‘అలిగావా...?’’

సమాధానం లేదు. రైస్ కుక్కర్ పెట్టి వచ్చి, హాల్లో సోఫాలో కూర్చుంది.

అతనూ వెనకే వచ్చి ఆమె పక్కనే కూర్చుని, ఒళ్ళో తల పెట్టుకుని పడుకున్నాడు.

తదేకంగా అతని మొహం వంకే చూస్తోంది. ఇది వరకటిలా అతని మాటలు తనని కదిలించడం లేదు. అంతగా మనసు ఘనీభవించింది.
మనుషుల్లో ఇంతగా నటన ఉంటుందా? అందులోనూ ఆకాష్ ఇలా నటించ గలడా? అన్న ఆశ్చర్యం వదలడం లేదు.

‘‘ఏంటి అలా ఉన్నావు...? ఇంత డల్ గా వుంటే ఏంటోగా వుంది బుజ్జీ!’’ ఆమె పొట్టలో మొహం దాచుకుంటూ అన్నాడు.

‘‘ఎందుకిలా చేశావు ఆకాష్....?’’ మెల్లగా అడిగింది కీర్తన. ఆమె కంఠంలో శాంతం వెనుక లీలగా తొంగి చూస్తున్న బాధ.
చప్పున తలెత్తి చూశాడు. అతని మొహంలో అయోమయం....

‘‘నేనేం చేశాను?’’ అర్ధం కానట్లు అడిగాడు.

‘‘నా చేతులు ఫ్రాక్చరయితే నేను నేషనల్ గేమ్స్ కి వెళ్ళననే కదూ ఇలా చేశావు.’’ గబుక్కున లేచి కూర్చుని ఆమె చేతులు పట్టుకుని చూస్తూ.....

‘‘ఫ్రాక్చరవడం ఏంటి? అసలేం జరిగింది?’’ కంగారుగా అడిగాడు.

అతని ఆత్రాన్ని పరిశీలనగా చూసింది. ఎంత బాగా నటిస్తున్నాడోననిపించింది.

‘‘వెళ్ళిపో ఆకాష్! ఇంకెప్పుడూ నాకు కనిపించ వద్దు.’’ గబుక్కున కీర్తనని పట్టుకుని ‘‘ఏంటి కీర్తనా? నేనేం చేశానని? నాకు అర్ధం కావడం లేదు. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలిసేలా చెప్పు?’’ ఆదుర్దాగా అడిగాడు.

ఇప్పుడిప్పుడే కీర్తన కుదుట పడి తనతో మామూలుగా వుంటుందనుకుంటుంటే, మళ్ళీ ఇంత లోనే ఏం జరిగింది? ఆందోళనకి గురయింది అతని మనసు......

‘‘నీకు నీ ఉడ్ బీ ని గెలిపించుకోవాలని వుంటే, నిజంగా ఆ అమ్మాయికి అంత ప్రతిభ వుంటే, ఫెయిర్ గేమ్ ఆడి గెలవమను. అంతే గానీ ఇలా ప్రత్యర్ధుల కాళ్ళూ చేతులూ విరగ్గొట్టి దాన్ని గెలుపు గా మలుచుకోవాలనుకోవడం మంచిది కాదు....’’ ఆవేశం రగుల్కొంటుండగా అంది.
అంతా తెల్లబోయి విని...‘‘ఎవరు నా ఉడ్ బి...? నువ్వేగా....?’’ అన్నాడు.

‘‘అని ఎవరన్నారు...?’’

‘‘ఒకళ్ళనేదేంటి? మనిద్దరం ప్రేమించుకుంటున్నాం. మధ్యలో ఏవో సమస్యలు వస్తాయి, పోతాయి. చివరికి మనిద్దరికీ పెళ్ళి జరుగుతుంది.’’ ఖచ్చితంగా అన్నాడు.

అంతా విని మొహం తిప్పుకుంది.

‘‘మరి నువ్వు కాక ఇంకెవరు నా ఉడ్ బీ?’’

‘‘ఎవరు అలా ప్రచారం చేసుకుంటున్నారో వాళ్ళని అడగండి.’’ కోపంగా అంది.

‘‘ఎవరు మణి బిందూనా?’’

‘‘ఆహా! పేరుతో సహా తెలుసుగా!’’ వ్యంగ్యంగా అంది.

‘‘అసు మా ఇద్దరి మధ్యా ఆ ప్రపోజల్స్ లేవు. అందరూ అలా వూహిస్తున్నారంతే! అదీ గాక మణిబిందు నిన్నేడిపించడానికి నా పేరు వాడుకుంటోంది అంతే! తనకి కూడా ఆ వుద్దేశం లేదు.’’ మొత్తుకుంటున్నట్లుగా అన్నాడు.

‘‘ఏ రిలేషనూ లేకపోయినా ఆవిడ గారి కోసం ఎదుటి వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారంటే నమ్మమంటారా?’’

అతనికి ఓపిక నశించింది.

‘‘ఏం జరిగిందసలు?’’ గట్టిగా అరిచాడు.

నిరసనగా చూసి తల తిప్పుకుంది.

అతను కాసేపు కోపంగా పచార్లు చేస్తూ వుండి పోయాడు. తర్వాత ఏదో గుర్తొచ్చినట్లు సెల్ ఆన్ చేసి ఫోన్ చేశాడు.

‘‘బిందూ! నేను ఆకాష్ ని....’’ అనగానే బుస్సున తల తిప్పి చూసింది కీర్తన.

(సశేషం)

 

 

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
premiste emavutundi?