Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

జయజయదేవం - - డా. ఎస్. జయదేవ్ బాబు

కవి కన్నయ్య: ఇదుగో నిన్నే... ఓ చెంబుడు తేనె పట్రా! తాగి రాజ సభకి వెళతాను!
కవి భార్య: ఏమిటీ విశేషం?
కవి కన్నయ్య: ధూర్జటి వారికి సమం గా, నేనూ పద్యాలు చదివి, రాయల వారి ప్రశంసలందుకోవాలని నిశ్చయించుకున్నాను!!
కవి భార్య: ఎలా?
కవి కన్నయ్య: చూస్తూ వుండు..." కవి కన్నయ్య పల్కులకేల కల్గెనో అతులిత మాధురీ మహిమ" అని నన్నూ, రాయల వారు పొగడక పోతే ఒట్టు!! ముందు తేనె పట్రా!!

*****************
మంత్రి: మహారాజా, యువరాణి గారి పొడవైన జడ పట్టీ మాయమైందట!
రాజు: వెంటనే, యువరాణి పరిచారకలను తనిఖీ చేయండి... ముఖ్యం గా పొడుగు జడ వాళ్ళని!
మంత్రి: పరిచారకలందరు తమ జడలని పొట్టిగా కత్తిరించుకున్నారండీ! ఎవర్నని తనిఖీ చేసి పట్టుకోమూ?




*****************



ఎల్లా నాయుడు:
శెట్టీ... నీకూ, మీ ఆవిడకి మధ్య మాటల్లేవటగా?
పుల్లాశెట్టి: నెలకి పదిహేన్రోజులు మావిడ మౌనవ్రతం లో వుంటుంది! ఆ తర్వాతి పదిహేన్రోజులు నేను మౌనవ్రతం లో వుంటాను!!



*****************

మహామంత్రి:
మహారాజా, మీ పరిపాలనకు నిరసనగా ప్రజలు రహదారుల్లో వంటా వార్పూ నిర్వహిస్తున్నారు ప్రభూ!
మహారాజు: ఔనా... ఏం వండుతున్నారు? ఒక కంచం నిండా పట్రండి! రాణి గారి వంట తినలేక చస్తున్నాను!!



*****************

ఈగ పెళ్ళాం: పన్నీరు జిలేబీ తినొచ్చాను! నా మేని సువాసనలు వెదజల్లుతున్నాయి గమనించారా?
ఈగ మొగుడు: నన్ను నీతో రానివ్వవు కదా... వేరే చోటికి వెళ్ళొచ్చాను!
ఈగ పెళ్ళాం: ఎక్కడ్నుంచొస్తున్నారు? దుర్గంధం భరించలేకపోతున్నాను!!
ఈగ మొగుడు: మురుగు కాలువ నుంచి!!   


*****************

ఒక పౌరుడు:
క్రితం రాత్రి అంత:పురం లో ఎవడో ఆగంతకుడు ప్రవేశించి, పరిచారిక కన్యలను బలాత్కరించాడట గదా! అతడ్ని పట్టుకున్నారా??
రెండో పౌరుడు: (చెవి వైపుకి వంగి) పట్టుకున్నారు! అతడు మన రాజు గారేనట!! రాజుగారికి నిద్రలో నడిచే అలవాటుందిలే!! ఈ మాట రహస్యంగా వుంచు!!



*****************
గుడిమెట్ల బిచ్చగాడు:
మెట్లెక్కే భక్తులు, తిరిగొచ్చేప్పుడు చిల్లర వేస్తామని చేతులు విదిలిస్తున్నారు!
ప్రాకారం బిచ్చగాడు: దేవుడ్ని మొక్కి తిరిగొచ్చే భక్తులు కూడా చేతులు విదిలిస్తున్నారు!
 
గుడిమెట్ల బిచ్చగాడు: మరి భక్తులు, ఉత్త చేతుల్తో గుడికొస్తున్నారా?
ప్రాకారం బిచ్చగాడు: అదేం కాదు! మొత్తం చిల్లరని హారతి పళ్ళెం లో వేసేస్తున్నారు!!




*****************


కొండముచ్చు: 
ఆ పిల్లాడు నిన్ను పెళ్ళి చేసుకోనన్నాడా? ఇంత అందగత్తెవి... చదువుకున్న దానివి... ఎందుకు నిన్ను కాదన్నాడు?
కోతి: పెళ్ళిచూపులప్పుడు, "నీకు తల్లో పేలు ఏరడం వొచ్చా?" అనడిగాడు!"రాదు" అన్నాను!!



*****************

బ్రహ్మ:
భక్తా... ఒంటి కాలు మీద నిలబడి ఖఠోర తపస్సు చేశావ్! మెచ్చాను... వరం కోరుకో!!
ఒంటికాలు తపస్వి: స్వామీ... నేను, నా రెండు కాళ్ళ మీద నిలబడి, నన్ను నేను పోషించుకునే శక్తిని ప్రసాదించు!!
బ్రహ్మ: ఇచ్చాము! (స్వగతం లో... ఇతడు మొండి ఘటంలా వున్నాడు... ఒక మామూలు కోరికైనా ఒంటి కాలుమీద  నిలబడి సాధించుకుంటాడనుకుంటాను ).



*****************

మంత్రి శిఖామణి: మహా రాజా...  దాయాది రాజ్యం మన మీద విమర్శ బాణాలు ప్రయోగిస్తున్నది! చాలూ!
రాజశేఖరుడు: "విమర్శిస్తున్నారు" అని చెప్పవయ్యా... నీ బాణాలూ, కత్తులూ నా మీద ప్రయోగించకయ్యా!  అవి నాకు నచ్చవని తెలియదా??  

 

 

మరిన్ని శీర్షికలు
bhetaala prasna