Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమిస్తే ఏమవుతుంది?

premiste emavutundi?

గత సంచికలోని ప్రేమిస్తే ఏమవుతుంది సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి....http://www.gotelugu.com/issue245/668/telugu-serials/premiste-emavutundi/premiste-emavutundi/

(గత సంచిక తరువాయి)...  శ్రీనివాసులు కి కాని, నర్సిమ్మకి కాని రమేష్ మాటలు విని ఇప్పుడు వాళ్ళకి పెళ్లి చేయడం ఇష్టం లేదు.. వాళ్ళకి గాయత్రిని చూస్తుంటే జాలి, కోపం కూడా కలుగుతున్నాయి, చక్కటి పిల్ల, మంచి కుటుంబానికి చెందిన పిల్ల వీడిలో ఏం చూసి పారి పోయి వచ్చింది అని ఆలోచిస్తున్నారు..

రమేష్ ని చూస్తుంటే వాడిలో ఏ కోశానా చదువు, సభ్యత, సంస్కారం ఉన్న లక్షణాలు కనిపించడం లేదు.. పోనీ తెలివి తేటలూ, చొరవ, దూసుకు పోయే మనస్తత్వం లాంటివి ఉన్నాయా ... అవి కూడా శూన్యమే అనిపిస్తున్నది. అట్లాంటి ఒక ఆవారా గాడితో ఈ పిల్లకి పెళ్లి చేయడం అంటే చూస్తూ, చూస్తూ బంగారం లాంటి పిల్ల జీవితం నాశనం చేయడంతప్ప ఇంకోటి కాదు.

అమాయకంగా వచ్చింది.. చిన్న పిల్ల..తెలివి తక్కువ తనం, సినిమాల, ఆధునిక ప్రపంచపు పోకడల ప్రభావంతో ఆకర్షణ ని ప్రేమ అనుకుని వచ్చింది.. పెద్ద వాళ్ళు గా ఆ పిల్లకి నచ్చ చెప్పి వెనక్కి పంపాలి అనిపిస్తోంది.. కాని రమేష్ మొండిగా ఉన్నాడు.. ఇప్పుడు వెంటనే ఆ పిల్లని గుడిలో పెళ్లి చేసుకుని, కాపురం పెట్టేసేయాలి అని అత్రపడుతున్నాడు. వాళ్లకి ఏం చేయాలో పాలు పోకుండా ఉంది... అట్లా అని వీళ్ళ గోల మాకెందుకు ఏటన్నా పోనీ వదిలించుకుందాం అనుకోడానికి మనసోప్పడం లేదు. ముఖ్యంగా నర్సిమ్మకి ... నర్సిమ్మకి పిల్లలు లేరు.. అతని భార్య కూడా చని పోయింది.. అందుకే ఆడపిల్లలంటే అతనికి అభిమానం,

సత్యవతి బుజాల మీద తల వాల్చుకుని కన్నీళ్ళతో వచ్చిన గాయత్రి వైపు, ఆమెని తీసుకుని వచ్చిన సత్యవతి వైపు చూస్తూ ఏమైంది అని అడిగాడు నర్సిమ్మ ..

“ఏడుస్తుంది ఒక్కతే  కూసుని  సమాధానం చెప్పి  గాయత్రిని ఒక స్టూల్ మీద కోర్చో బెట్టి చాయ్ తెస్త” అంటూ మళ్ళి వంట గది లోకి వెళ్ళింది సత్యవతి ..

“ఎందుకేడుస్తున్నావ్...” విసురుగా అడిగాడు రమేష్ గాయత్రిని ..

గాయత్రి మాట్లాడ లేదు ... తల వంచుకుని కూర్చుంది కాని నిశ్సబ్దంగా వెక్కిళ్ళు పెడుతున్నట్టు భుజాలు ఎగిరి పడుతున్నాయి.

“నువ్వు గమ్మునుండు నేను మాట్లాడతా” రమేష్ ని కసిరి నర్సిమ్మ గాయత్రి వైపు చూసి అడిగాడు “మంచిగ ఆలోచన చేసినవ ... మీ ఇంటికి పోతావా ... పంపాల్నా”

“వెళ్తాను ” వెక్కుతూ  అంది ..

“నిజంగా పోతావా .. మల్ల పోయినంక రమేష్ కావాలె అంటే దొరకడు...”

“నాకొద్దు...”

“ఏయ్ ఏం మాట్లాడుతున్నావ్ ....” గయ్ మని అరిచాడు రమేష్ ..

ఆ అరుపుకి ఉలిక్కి పడి బెదురుగా చూసింది గాయత్రి.

“అరె నువ్వెందుకు తమ్మి ఆమెనట్ల బెదిరించ బడితివి ... చెప్పని ఆమెని” అని రమేష్ ని మందలించి తిరిగి గాయత్రి వైపు చూస్తూ “నువ్వు చెప్పు బిడ్డా... నీ ఇష్టం తోని వీనితో వచ్చినవు కదా మరెందుకు పోతనంటున్నావు” అడిగాడు నర్సిమ్మ . గాయత్రి మాట్లాడలేదు ...

“చెప్పు బిడ్డా ... బుగులు పడకు ...”

“ఏం దీ చెప్పేది ... ఆమెనే పోదామన్నది... పెండ్లి చేసుకుందామన్న ... మంచిది అన్నది గిప్పుడు ఉల్టా జెప్తున్నది..”

“నేను తప్పు చేసాను .... ఇప్పుడు నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు.. నిన్ను పెళ్లి చేసుకోడం అసలు ఇష్టం లేదు.. నన్ను మా ఇంటికి పంపించేయ్” ఏడుస్తూ, బతిమాలుతూ అంది గాయత్రి .

“మల్ల ఆ మాట అన్నవంటే సంపుత” అన్నాడు రమేష్ కూర్చున్న దగ్గర నుంచి పొగరుగా లేస్తూ.  గాయత్రి కెవ్వుమంది.
నర్సిమ్మ, శ్రీనివాసులు ఇద్దరూ రమేష్ ని ఒక్క లాగు లాగి గట్టిగా కసిరారు.. “ఎందట్ల బెదిరిస్తున్నవ్ ... పోలీస్ రిపోర్ట్ ఇయాలా గీ పిల్లని కిడ్నాప్ చేసి తెచ్చినావ్”  అని అంటూ అరిచాడు నరిసిమ్మ .

రమేష్ కొంచెం బెదురుతూ అన్నాడు.. “ నేను ఆమెని లవ్ చేస్తున్నవేరేటోల్లని ఆమె మారేజ్ చేసుకుంటే ఆడ్ని, ఈమేని కూడా సంపెస్తా..”
“లవ్ అంటే బెదిరించుడు గాదు.. ఆమెకి ఇష్టం లేదంట ... మారేజ్ ఎట్ల చెసుకుంటవ్?”

“ఎట్ల ఇష్టం లేదు.. మల్ల నాతోని ఎందుకొచ్చింది.. గప్పుడిష్టం, ఇప్పుడు లేదా వారేవా నకరాలు చేస్తుందా” అన్నాడు..

“నకరాలు, గికరలు మాకు తెల్వదు. మేము ఆమెని హైదరాబాద్ బస్సు ఎక్కిస్తం.” నర్సిమ్మ మాటలకి గాయత్రి ఆశగా చూసింది.రమేష్ మొబైల్ మోగింది.. జేబులోంచి మొబైల్ తీసి చాటంత మొహంతో “మా మమ్మీ ఫోన్” అని అందరికి చెప్పి ఆన్సర్ బటన్ నొక్కి "మమ్మీ" అన్నాడు గట్టిగ ..

అవతలి నుంచి దుర్గమ్మ శోకాలు, మాటలు గట్టిగా వినిపించ సాగాయి. “నా కొడకా ఏడికి పోయినవ్ బిడ్డా..నన్నింత ఆగమాగం జేసి పోయినవెందుకు .. నీకు నచ్చిన పిల్లతోని నేను చేస్తుంటి కదా కొడకా లగ్గం ...చెప్పకుండ ఎందుకు పోయినవ్..ఎడున్నవ్? అమ్మతానకోచ్చేయ్ కొడకా!”

“అరె ఊకో మమ్మీ ... వస్త... నేను గాయత్రిని లగ్గం చేసుకుంట ... “

“గా బాపనోల్ల పిల్ల ఎందుకు కొడకా ... గ పిల్ల నాయన నా బిడ్డ సచ్చి పోయిందని ఆగం చేసిండు.. ఆల్లు లేరిక్కడ ... ఇయాల పొద్దున్న లేచేసరికి తాలమున్నదని ఏడికో పోయిన్రని ఇంక రారని చెప్తున్రు ఈడ...”

గాయత్రి ఆ మాటలు వినిపించి చేష్టలుడిగి చూడసాగింది..

“ఏడికి పోయిన్రే ...” రమేష్ ఆత్రంగా అడిగాడు..

“తెల్వదు...బిడ్డ లేచిపోతే ఇజ్జత్ పోదా ... ఇజ్జత్ పోయినంక ఈడ ఉంటారు పెద్దోల్లు..ఆల్లకి ఇజ్జత్ ముక్యం ...”

“గాయత్రి ఆడికి వస్తనని ఏడుస్తుంది మమ్మీ ...”

“ఏడవని.... ముందు ఎరుక లేదా ... ఒక్క సారి బైటకు పోయినంక ఆడపిల్లలు అమ్మ, నాన్నని మర్చి పోవాల్సిందే.. ఆమె ఏడికన్న పోనీ ... నువ్వు నా దగ్గరకు వచ్చెయ్ బిడ్డా..”

రమేష్ సమాధానం చెప్పకుండా ఫోన్ డిస్కనెక్ట్ చేసి ఆందోళనగా అందరి వైపు చూస్తూ అన్నాడు “గాయత్రి మమ్మీ, డాడి లేరంట ..”
గాయత్రి గొల్లుమంది .

అప్పుడే టి తీసుకుని వచ్చిన సత్యవతి చేతిలో టి కప్పులు అందరికి ఇచ్చి ఆ పిల్ల దగ్గరకు వెళ్లి దగ్గరకు తీసుకుని ఓదార్చ సాగింది.

“నాకు అమ్మ కావాలి, నాన్న కావాలి, అన్నయ్య కావాలి ....” గాయత్రి ఉధృతంగా ఏడవ సాగింది..

అక్కడున్న అందరికి జాలితో హృదయం ద్రవించింది.. పాపం.. పిచ్చి పిల్ల ఆవేశం లోనో, అనాలోచితం గానో ఒక్క తప్పటడుగు వేసింది.. ఇప్పుడు ఆ అడుగు వెనక్కి తీసుకోడానికి అవకాశం లేకుండా దారి మూసుకుంది.. ఇప్పుడు ఈమెకి ఏం దారి? ఎక్కడికి వెళ్తుంది? ఏం చేస్తుంది? చచ్చినట్టుఈ వెధవని పెళ్లి చేసుకోవాలి ... వీడితోటే బతకాలి..

అందరూ మౌనంగా కూర్చున్నారు.

రమేష్ ఒక్క ఉదుటున బయటకి వెళ్తూ  ఇప్పుడే వస్తా అందరు ఈడనే ఉండురి అన్నాడు.

ఎక్కడికి వెళ్తున్నాడో అడిగే లోపలే గేటు దాటాడు ..

సత్యవతి బలవంతంగా గాయత్రిని లోపలికి తీసుకెళ్ళి “పో బిడ్డా మొకం కడుక్కో ... ఏడవకు... దేవుడున్డు... అన్ని ఆయననే చూసుకుంటడు ... పో” అంటూ బలవంతంగా బాత్రూం దాక తీసికెళ్ళి లోపలికి తోసి ఆమె బయటికి వచ్చిం దాకా అక్కడే ఎదురు చూసింది. గాయత్రి చన్నీళ్ళు మొహం మీద చల్లుకుని మొహం కడుక్కుని వచ్చింది .

సత్యవతి వేడి టి ఇచ్చి తాగమని బలవంతం చేసింది.

“నీకు ఎప్పటి వరకు కావాలంటే అప్పటి వరకు మా ఇంట్లనే ఉండు.. భయం లేదు..కొన్ని రోజులు అయినంక  మీ పెద్దోల్ల కోపం తగ్గుతుంది అప్పుడు నేను, మా ఆయన వచ్చి మీ ఇంట్లో నిన్ను దిమ్పెస్తాము .. అందాకా దిగులు పడకు” అని చెప్పింది.

గాయత్రికి గుండె నిండా ఆందోళన, అమ్మ, నాన్నలని చూడాలన్న ఆరాటం క్షణం, క్షణం ఎక్కు అవుతోంటే దుఃఖం ఆపుకోడం కష్టం  కాసాగింది.

సరిగ్గా అప్పుడు వచ్చాడు రమేష్ ... అతని చేతిలో రెండు పూల దండలు .

గాయత్రితో సహా అందరూ దిగ్భ్రాంతిగా చూసారు .

అన్నా.. ఇగోగార్లాండ్... ఇప్పుడే ఇక్కడే మీరందరి ఎదురుంగ మేమిద్దరం ఈ దండలేసుకుంటం...అంటూ గాయత్రి దగ్గరకు వెళ్లి ఆమెని చేయి పట్టుకుని  లాక్కుని వచ్చాడు.

అసలు ఏం జరుగుతోందో అందరికి తెలిసే లోపలె  గభాల్న ఒక దండ చేతిలోకి తీసుకుని ఆమె మెడలో వేసాడు.. ఇంకో దండ ఆమె చేతి కిచ్చి వేయి అంటూ తల వంచి ఆమె ముందు నిలబడ్డాడు.

గాయత్రి నిష్చేష్టురాలై మెడలో దండనీ, చేతిలో దండనీ మార్చి, మార్చి చూస్తూ చలన రహితంగా నిలబడి పోయింది.

(సశేషం)

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nadaina prapancham