Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
premiste emavutundi?

ఈ సంచికలో >> సీరియల్స్

నాదైన ప్రపంచం

nadaina prapancham

గత సంచిక లోని  నాదైన ప్రపంచం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి....http://www.gotelugu.com/issue245/667/telugu-serials/naadaina-prapancham/nadaina-prapancham/

(గత సంచిక తరువాయి)... పారిజాతాపహరణంలో పారిజాత పుష్పాన్ని శ్రీకృష్ణుడు రుక్మిణికి ఇచ్చాడని తెలియగానే సత్యభామ.... ‘‘అనవిని వేటు పడ్డ యురగాంగనయుంబలె....’’ వుందని నంది తిమ్మన వర్ణించడం గుర్తొచ్చింది ఆకాష్ కి. చప్పున తల తిప్పుకుని....

‘‘ఏంటి గొడవ?’’ డైరెక్ట్ గా విషయం లోకి వెళ్ళిపోయాడు. ‘‘............’’

‘‘అసలు నీకెన్నిసార్లు చెప్పాను? తన జోలికి వెళ్ళొద్దని....మళ్ళీ ఏం చేశావు?’’ గట్టిగా అడిగాడు.

అటు వైపు నుండి ఆమె చెప్పేది రెండు నిమిషాలు విన్నాడు. వింటుండగానే అతని మొహంలో రంగులు మారి పోయాయి.

‘‘మైగాడ్!’’ మతి పోయినట్లు అరిచాడు.

అటు నుండి సారీ చెపుతోంది మణి బిందు. అదేమీ వినిపించు కునే స్టేజిలో లేడు.

‘‘ఆ అమ్మాయి, నా ఉడ్ బి. ఈగ వాలినా సహించనని తెలుసు. నీ గేమ్ కోసం ఛ...నువ్వసలు మనిషివేనా?’’ కోపంగా అరిచేసి ఆపుకో లేక చేతిలోని సెల్ ని నేలకేసి విసిరి కొట్టాడు.

లెక్క పెట్ట లేనన్ని ముక్కలుగా మారి పోయిందది. అతని రియాక్షన్ అంతా డ్రామాలా వుంది కీర్తనకి. పెదాల మీద వ్యంగ్యపు నవ్వు చిందులేస్తుండగా వినోదంగా చూస్తోందతని వైపు.

‘‘కీర్తనా! అయాం ఎక్స్ ట్రీమ్ లీ సారీ ! అసలు నాకు ఇవేమీ తెలీవు. అయినా నా పంతం కోసం, నా పందెం కోసం నీకు హాని చెయ్యగలనని ఎలా అనుకున్నావు?’’ బాధగా అడిగాడు.

‘‘నాకు మనుషుల మీద నమ్మకం పోయింది. తాము విజయం సాధించడం కోసం ఎదుటి వారి బహీనత మీద దెబ్బ కొట్టడం అన్నది ప్రతి ఫీల్డ్ లోనూ సర్వ సాధారణమై పోయింది.’’ చెప్పి డైనింగ్ టేబిల్ దగ్గరకి వెళ్ళి ప్లేట్ లో ఐటమ్స్ వద్దించుకుని తిన సాగింది.

మాట వరుసకయినా అతన్ని భోజనం చెయ్య మన లేదు. అలాగే దిగాలుగా కూర్చున్నాడు ఆకాష్. ఈ పరిస్థితుల్లో కీర్తనని ఒంటరిగా వదిలి పెట్టి వెళ్ళడానికి అతని మనసు ఒప్ప లేదు.

ఆ రాత్రికి ఇక్కడే వుండటానికి నిశ్చయించుకున్నాడు. భోజనం చేసి టి.వి. చూస్తూ కూర్చుంది.

అతను వెళ్ళి పోతే నిద్రపోవాలనుంది. అతను ఎంతకీ కదలడు.

‘‘నాకు నిద్ర వస్తోంది’’ ఇండైరెక్ట్ గా అంది.

‘‘పడుకో!’’ చెప్పాడు.

ప్రశ్నార్ధకంగా చూసింది. ‘‘నేనిక్కడే వుంటాను. ఒక్క దాన్ని వదిలి వెళ్ళను. నువ్వు పడుకో’’ దివాన్ మీద నడుం వాలుస్తూ అన్నాడు.
విచిత్రంగా చూసి లోపలికి వెళ్ళి పోయింది.

ఆ అలవాటు లేని చోటులో అతనికి నిద్ర రావడం లేదు. ఒక పక్క ఆకలి, మరో పక్క ఆవేదన, ఇంకో పక్క కంఫర్ట్ గా లేని డ్రస్. ఎంతకీ నిద్ర రావడం లేదు.

తలుపు ఓరగా వేసి వుండటం చేత, లైటు కాంతి సరళ రేఖలా ఆమె మీద పడుతోంది.

ఆమెని చూడకుండా వుండ లేని బలీయమైన కాంక్ష ఏర్పడింది. దగ్గరగా వెళ్ళి నిల్చున్నాడు. కిటికీ నుంచి వెన్నెల ఆమె చెంపలమీదుగా జీరాడుతోంది.

ఆమె, నిద్రలో అటు ఇటు కదులుతూ చేతులు వేసి పడుకోడానికి ఎవరూ లేక దిండుని ఆలంబనగా చేసుకుంది.

‘బామ్మ పక్కన పడుకునే అవాటు కాబోలు ' నవ్వుకుంటూ అనుకున్నాడు.

మెల్లగా పక్కలో నడుం వాల్చి దిండుని ఆమె చేతుల్నుంచి తప్పించాడు. వెంటనే ఆ చేతులు ఆధారం కోసం అటూ ఇటూ కదిలి ఆకాష్ శరీరం తగలగానే చుట్టేశాయి.

ఇక విడవలేనట్లు అతని హృదయం లోకి దూరి పోయి పడుకుంది. ఇక రక్షణ ఏర్పడినట్లు గాఢ నిద్ర లోకి జారుకుంది. అతని కళ్ళు అప్రయత్నంగా తడయ్యాయి. ఈమె గొప్ప క్రీడాకారిణి కావచ్చు. మానసికంగా మాత్రం ఒంటరి. అందుకేగా ఆ ఒంటరితనాన్ని పోగొట్టి ఆమె జీవితంలో ఆనందానుభూతుల్ని నింపి తనూ ఆనందాన్ని పొందాలనుకున్నాడు. ఎప్పటికి ఆ విషయం అర్ధం చేసుకుంటుంది??
తను కదిలితే ఎక్కడ ఆమెకు మెలకువ వస్తుందోనని కదలకుండా అలాగే పడుకుని....‘‘ఇక నుంచీ ఇలాగే నిద్ర పోవడం ప్రాక్టీస్ చెయ్యాలి’’ నవ్వుకుంటూ అనుకున్నాడు.

తెల్లారి నిద్ర లేవ గానే తన వంకే చూస్తున్న ఆకాష్ కనిపించాడు. కోపంగా మొహం పెట్టి లేచింది.

‘‘మరీ అంత కోపం పనికి రాదు....రాత్రి నువ్వు అంత హాయిగా పడుకున్నావంటే, నా త్యాగమే కారణం’’ సరదాగా అన్నాడు.
విస విసా నడుచుకుంటూ ఆమె బాత్రూంకి వెళ్ళడంతో.. వెళ్ళొస్తానని చెప్పి బయటకి వచ్చాడు ఆకాష్.

***********************

ఉదయం ఏడున్నర గంటలు.....

హాస్పిటల్లో అప్పుడప్పుడే కలకలం ప్రారంభమవుతోంది.

తాపీగా నిద్ర లేచిన పేషెంట్స్ కాలకృత్యాులు తీర్చుకుంటున్నారు. వాళ్ళ హెల్త్ చెక్ చేయడానికి వస్తున్న నర్సులూ, కాంపౌండర్ల మాటలు కలగాపులగంగా వినిపిస్తున్నాయి.

ఆ సమయంలో గేటు బైట ఫ్లవర్ బొకేతో నిలబడ్డ అమ్మాయి వాచ్ మెన్ తో వాదిస్తోంది.

ఇవి విజిటింగ్ అవర్స్ కావని, ఆమెని ససేమిరా వదలనని వాచ్ మెన్ అంటున్నాడు. చివరికి ఓ నోటు ఆమె పర్సు నుండి అతని జేబుకి మారాక ఒప్పుకున్నాడు.

అతను ఎక్కడ వున్నాడో తెలుసు కాబట్టి ఆమె సరాసరి అక్కడికే నడిచింది.

ప్రణీత్ అప్పటికే మొహం కడుకున్నాడు. కాంపౌండర్ సాయంతో స్నానం కూడా చేశాడు. వాల్చిన దిళ్ళ మీద వెనక్కి ఆనుకుని కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు. అతని మొహం ప్రశాంతంగా వుంది. బెరుకుగా గుమ్మం బయటే నిల్చుందామె.

‘‘మే ఐ కమిన్’’ లో గొంతుకతో అంది.

తల తిప్పి చూశాడు ప్రణీత్.

ఎదురుగా మణిబిందు....అతని మొహంలో చిరు దరహాసం.

మెల్లగా నడుచుకుంటూ వచ్చి బొకే అతని చేతిలో పెట్టి ‘‘విష్ యూ స్పీడ్ రికవరీ’’ అంది.

‘‘థాంక్యూ!’’ చిరునవ్వుతో చెప్పి ‘‘కూర్చోండి’’ అన్నాడు.

మొహమాటంగా పక్కనే వున్న చెయిర్ లో కూర్చుంది.

నిన్నటి నుంచీ మనసు లోని సంఘర్షణని తట్టుకో లేక రావడం అయితే వచ్చింది కానీ ఏం మాట్లాడాలో తెలీడం లేదు.

‘‘బాగా ప్రాక్టీస్ చేస్తున్నారా?’’ మృదువుగా, స్నేహ పూర్వకంగా అడిగాడు.

చప్పున తలెత్తి చూసింది. అతని మొహంలో హేళన గానీ, వెటకారం గానీ లేదు...ప్రశాంతంగా వున్నాడు. తలూపింది....

‘‘జరిగిన దానికి నేను చాలా బాధ పడుతున్నాను’’ పశ్చాత్తాపంగా అంది.

‘‘నా గురించయితే మీరు బాధపడడం వృధా...కానీ మీరు గత ఆరు నెలల నుంచీ ఒక అమాయకురాలైన హృదయంతో ఆడుకున్నారు. ఆమె హృదయం లోని ప్రేమని వ్యక్తుల పట్ల నమ్మకాల్ని చెల్లాచెదురు చేశారు. దీనికి మీరు ఏం జవాబు చెబుతారు?’’ సూటిగా అడిగాడు...
తల వంచుకుంది. కంటిన్యూ చేశాడు.

‘‘విజయం కోసం....అవునా? ఇపుడామె చెయ్యి విరిగి ఆశలన్నీ వమ్మయి పోయి, చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తూ, కన్నీళ్ళతో జీవిత శిథిలాల మధ్య నిస్సహాయంగా పడుంటే, ఆ శిథిలాల మీద విజయ శిఖరాల్ని అధిరోహించాలనుకున్నారు. అది నిజంగా ఆనందాన్ని కలిగిస్తుందా? ఇదేనా క్రీడాస్ఫూర్తి? ఎవరు మీలో ఈ యాటిట్యూడ్ ని ప్రవేశ పెట్టారు?’’ ఎంత వద్దనుకున్నా అతని గొంతులో ఆవేశం తాండవించింది.

(సశేషం)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్