Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> రాయల్ డీసీజ్

royal disease

అమ్మమ్మ సీతామహాలక్ష్మి, తాతయ్య రఘురామయ్య.  అమ్మమ్మ పుట్టినప్పుడే తాతయ్యకిచ్చి పెళ్లిచేయాలని సీతామహాలక్ష్మి అని పేరుపెట్టరాట. తాతయ్య అమ్మమ్మని ఎత్తుకొని పెంచాడట. పెంచాడు కదా పెంచినవాడి కంటే ప్రేమగా ఎవరు చూసుకుంటారు! అలా అనుకొని అమ్మమ్మ సీతామహాలక్ష్మిని  మేనమామ అయిన తాతయ్య రఘు రామయ్యకిచ్చి పెళ్లి చేశారట. చక్కని జంట. చిలకపచ్చ కాపురంలా సాగిపోయిందట వారి జీవితం.

అమ్మ జానకీదేవి. నాన్న రామచంద్రం. అమ్మ పుట్టినప్పుడే నాన్నకిచ్చి పెళ్లిచేయాలని అమ్మకు జానకీదేవి అని పేరుపెట్టరాట. నాన్న, అమ్మని ఎత్తుకొని పెంచాడట. పెంచాడు కదా పెంచినవాడి కంటే ప్రేమగా ఎవరు చూసుకుం టారు! అలా అనుకొని అమ్మ జానకీదేవిని  మేనమామ అయిన నాన్న రామచంద్రంకిచ్చి పెళ్లి చేశారట. చక్కని జంట. చిలకపచ్చ కాపురంలా సాగిపోయిందట వారి జీవితం.

నా పేరు మైథిలి. మామయ్య పేరు రామ్. నేను పుట్టగానే మామయ్యకిచ్చి పెళ్లిచేయాలని మైథిలి అనే పేరు పెట్టారట. చిన్నప్పుడు నేను ఎప్పుడూ మామయ్యతోనే ఉండేదానిని. స్కూల్ కి, కాలేజ్ కి, సినిమాలకి, ఫంక్షన్లకి ఎక్కడికి వెళ్ళినా నేను, మామయ్య పక్కనే. మామయ్య నా పక్కనే. అందరూ అంటున్నారని కాదు మామయ్యని చేసుకోవాలని నాకు మనసులో ఉంది. కానీ మామయ్యకు మాత్రం నన్ను చేసుకోవాలనే ఆలోచన లేదు. “మైథిలి నాకు మంచి ఫ్రెండ్.” ఇంట్లో పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు మామయ్య చెప్పిన మాట ఇది. నేను జీర్ణించుకోలేకపోయాను. మనసు తట్టుకోలేకపోయింది. అందుకే మామయ్యతో ఒంటరిగా మాట్లాడాలని అనుకున్నా. మామయ్యని కలిశాను. నా భావాలు, తనమీద నాకున్న ఆలోచనలు, చిన్నప్పటి నుంచి పెంచుకున్న ప్రేమ మామయ్యకి చెప్పేశాను. తను సర్ధి చెప్పాలని చాలా ప్రయత్నం చేశాడు. నేను వినలేదు. చివరిగా ఒకే మాట చెప్పాను ‘సీత రాముడి కోసం, నేను నీకోసం’ నేను బతికితే నీ భార్యగానే బ్రతుకుతాను, లేదంటే బతికినంత కాలం కుమారి మైథిలిగానే ఉండిపోతాను అని. మామయ్య ఒప్పుకోక తప్పలేదు. 

*****

“కిరీటి... కిరీటి.... ఒరేయ్ రాజూ లేవరా... ఎంతసేపు పడుకుంటావు. స్కూల్ బస్ వచ్చే టైమ్ అయ్యింది త్వరగా లేచి స్నానం చెయరా. టిఫిన్ రెడీ అయ్యింది.” ఇంట్లో చేసే చాకిరీ అంతా ఒక ఎత్తు. మీ అయ్యా కొడుకుల్ని లేపడం ఒక ఎత్తు. అనుకుంటూ మామయ్యని కిరీటిని నిద్రలేపే సరికి నా తల ప్రాణం తోకకొచ్చింది. నాకిది అలవాటే. రోజూ ఉదయం నాతలప్రాణం తోకలోకి వచ్చి పోతుంది. ఇంతకీ చెప్పలేదు కదా! కిరీటి మా అబ్బాయి. ఇప్పుడు వాడి వయసు ఆరేళ్లు.  వాడి ముద్దు పేరు రాజు.

కిరీటి చాలా హుషారైన పిల్లాడు. ఆటల్లో పాటల్లో చాలా చలాకీగా ఉంటాడు. నాకు డాన్స్ ఇష్టం కానీ నేను నేర్చుకోలేకపోయాను. అందుకే నా కొడుకు డాన్స్ చేస్తుంటే చూడాలని నాకోరిక. అందుకే వాడికి డాన్స్ నేర్పిస్తున్నాను. ప్రతిరోజూ స్కూల్ నుంచి వచ్చాక ఒక గంట డాన్స్ ప్రాక్టీస్ కోసం మా వీధిలోనే ఏర్పాటు చేసిన డాన్స్ స్కూల్ కి నేనే స్వయంగా తీసుకెళ్తాను. నేను యం.యస్.సి. చేశాను. “అంత చదువుకున్నావు కదా నువ్వు కూడా ఏదైనా ఉద్యోగం చేస్తే బావుంటుంది. ఎందుకు చదువుకున్న చదువుని వృధా చేస్తావు.” అని మామయ్య చాలా సార్లు నన్ను ఉద్యోగం చేయమని అడిగాడు. “బయటకి వెళితే ప్రపంచం అంటే ఏమిటో తెలుస్తుంది. నాలుగు గోడల మధ్య బావిలో కప్పలా ఎన్నాళ్లు ఉంటావు మైథిలి”  అని ఎన్ని సార్లు చెప్పినా నేను వినలేదు. కారణం లేకపోలేదు. నాకూ ఉద్యోగం చేయాలని ఉండేది. పాపో, బాబో పుట్టాక చేద్దామనే అనుకున్నాను. పెళ్ళైన రెండునెలలకే నేను తల్లిని కాబోతున్నాను అన్న శుభవార్త డాక్టర్ కన్ఫార్మ్ చేశారు. అమ్మవాళ్లు, అమ్మమ్మ వాళ్ళు, మామయ్య నన్ను ఏ పనీ చేయకుండా కంటికి రెప్పలా చూసుకున్నారు. ప్రగ్నెంట్ గా ఉన్న  సమయంలో కాలక్షేపం కోసం నేను ఎంచుకున్న మార్గం, సాహిత్యం చదవడం. చాలా కథలు, నవలలు చదివాను. నాలుగు గోడల మధ్య ఉంటే తెలియని ఎన్నో విషయాలని నాలుగు పుస్తకాలు చదివి తెలుసుకున్నాను. నేను ఎక్కువగా చదివింది కథలే. “కొన్ని కథలు నన్ను చైతన్య పరచాయి. కొన్ని కథలు నాకు కన్నీటిని మిగిల్చాయి. కొన్ని కథలు నాలో ఆనందాన్నిపెంచాయి. కొన్ని కథలు నాకు ఎంతో అనుభవాన్నిచ్చాయి.... ఎన్నో కథలు నా హృదయ ఫలకంపై చెరగని ముద్రని వేశాయి.” 

“అలా నాలో మిగిలిపోయిన కథ. ఉద్యోగం చేయకుండా నన్ను ఇలా మిగిల్చిన కథ  చిల్లర భవానిదేవి గారి ‘తప్తశిల’.  ఈ కథలో కథానాయిక ‘శిశిర’ ఉద్యోగిని. ఇంట్లో, ఆఫీసులో బండెడు చాకిరీ చేయాలి. లేవలేకుండా ఉంది అని సహాయపడేవాళ్ళు కూడా ఎవరూ ఉండరు. ఇద్దరు ఆడపిల్లల తరువాత మగపిల్లాడి కోసమని భర్త, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించడు. పిల్లలని ఇంట్లోనే వదిలి  శిశిర ఆఫీసుకి వెళ్తుంది. ఒకరోజు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఒక పాపని హాస్పిటల్ జాయిన్ చేస్తారు. ఒళ్ళంతా కాలిపోయి బర్నింగ్ వార్డులో ఉన్న పాప తల్లిని చూసి “చెల్లి బర్తడే ఆట ఆడిందమ్మ ... క్యాండిల్స్ జాగ్రత్తగానే వెలిగించాను ఎలా పడిందో నా నైలాన్ గౌన్ అంటుకుంది. గడియ తీయలేక అలానే గోడకి నిలబడ్డాను. చెల్లిని మాత్రం దగ్గరకు రానియలేదు” అంటూ కాలిన శరీరంతో రొప్పుతూ పాప మాట్లాడిన మాటలు పాఠకులను ఏడిపిస్తూ... ఆలోచింపచేస్తాయి. తల్లిగా ఓడిపోయానని శిశిర ఉద్యోగానికి రాజీనామా చేస్తుంది. పిచ్చిదై పోతుంది.”  అందుకే ఉద్యోగం చేయాలనే ఆలోచనని విరమించుకొని నా బిడ్డకు మంచి తల్లిగా ఉండాలనుకొన్నాను. ఈ విషయం మామయ్యకి చెప్పలేదు. ఎందుకంటే ఉద్యోగం చేస్తే బావుంటుంది అనేవాడే కానీ ఉద్యోగం చెయ్యి అని నన్ను ఏనాడూ బలవంత పెట్టలేదు.

*****

ఆరోజు కాస్త నీరసంగా ఉండి పడుకున్నాను. ఎందుకో ఉదయం నుంచి కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. ఆయన ఆఫీస్ కి వెళ్లారు. నావాలకం చూసి ఉదయమే సెలవు పెట్టుకొని ఇంట్లో ఉంటానన్నారు. నేనే వినలేదు. ఇప్పుడనిపిస్తుంది మామయ్య ఇంట్లో ఉంటే నాకు కాస్త ధైర్యంగా ఉండేదని. ఫోన్ రింగవుతూ ఉంది. నేను బెడ్ రూంలో ఉన్నాను. ఫోన్ హాల్ లో ఉంది. వెళ్ళే ఓపిక లేదు. ఫోన్ కి ఏం తెలుసు, ఫోన్ చేసే వాళ్ళకి ఏం తెలుసు నాకు ఓపిక లేదని. ఒకసారి, రెండు సార్లు... అయినా ఆగలేదు. ఎవరో చేస్తూనే ఉన్నారు. అతి కష్టం మీద నిదానంగాలేచి గోడ పట్టుకొని అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి ఫోన్ తీసుకున్నాను. రింగింగ్ ఆగిపోయింది. కాలింగ్ బెల్ మ్రోగింది. వెళ్ళి డోర్ తీశాను. అమ్మ, నాన్న. లోపలికి వస్తూనే ఏంటిరా... మైథిలి అలా ఉన్నావు. అని నాన్న అడుగుతూనే ఉన్నారు... మళ్ళీ ఫోన్ మ్రోగింది. లిఫ్ట్ చేశాను...
“హాలో...మేడమ్ కిరీటి వాళ్ళ మదరేనా మాట్లాడేది?”

“అవునండి... మీరు...”

“మేము దీప్తి విద్యాలయం నుంచి మాట్లాడుతున్నాం మేడమ్...”

“ఆ... చెప్పండి ...”

“మేడమ్ ... కిరీటి ఆడుకుంటూ ఆడుకుంటూ స్కూల్ గ్రౌండ్ లో పడిపోయాడు...”

“అవునా ... ఇప్పుడెలా ఉంది? దెబ్బలేమైన తగిలాయా?”

“కంగారు పడాల్సింది ఏమీ లేదు మేడమ్ ... పెద్దగా దెబ్బలు ఏమీ తగలలేదు. చిన్న దెబ్బే.... కానీ”

“కానీ... చెప్పండి మేడమ్ ఏమయ్యింది?”

“దెబ్బ చిన్నదే కానీ రక్తం ఆగడం లేదు. పక్కనే ఉన్న హాస్పిటల్ కి పంపించాము. బాబుతో టీచర్స్ ఉన్నారు. మీరు వీలైనంత త్వరగా హాస్పిటల్ కి వస్తే బాబుకి ధైర్యంగా ఉంటుంది”

“సరే...మేడమ్. వెంటనే బయలుదేరతాను” అని ఫోన్ పెట్టేసి ఆయనకి ఫోన్ చేసి అమ్మ,నాన్న లను తీసుకొని హాస్పిటల్ కి బయలుదేరాను”

*****

“ఆటోలో ఉన్నాననే కానీ మనసంతా పరిపరివిధాల ఆలోచిస్తుంది. మనిషంటే అనుకున్న చోటుకల్లా వెళ్లలేడు కానీ, మనసు మాత్రం చాలా సునాయాసంగా వెళ్లిపోతుంది. వర్తమానం నుంచి కోల్పోయిన గతంలోకైనా? కావాలను కునే భవిష్యత్ లోకైనా? అలానే నా మనసు,  మనసు అంగీకరించని భవిష్యత్ లోకి వెళుతున్నా, వెంటనే గతంలోకి తీసుకెళ్లాను...”

మామయ్య నన్ను పెళ్లిచేసుకోనని, మైథిలిని  చేసుకునే ఉద్దేశ్యం నాకు ఎప్పుడూ లేదని చెప్పినప్పుడు, నేను మామయ్యని కలిసి తనమీద నాకున్న ప్రేమను వ్యక్తం చేసినప్పుడు నన్ను చేసుకోనని చెప్పడానికి ప్రధాన కారణాన్ని మామయ్య నాతో మాత్రమే చెప్పాడు. ఇంట్లో అందరితోనూ చెప్పకుండా నాకు మాత్రమే చెప్పడానికి కారణం నేను బాగా చదువుకున్నదానిని అర్ధం చేసుకుంటానని. ఇంట్లో వాళ్ళకి తను చెప్పబోయే విషయం మీద సరైన అవగాహన లేకపోవడం కూడా ఒక కారణం. కానీ నేనే మామయ్య ఎంత చెప్పినా అర్ధం చేసుకోలేదు. నేను ఏమైపోతానో అన్న భయంతో నన్ను పెళ్లిచేసుకున్నాడు. ఇప్పుడు మామయ్య చెప్పిందే జరుగుతుందా? నాకు పిల్లలు అవసరం లేదు నువ్వే కావాలి, నువ్వు పక్కన ఉంటే చాలు అన్నదే నిజమవుతుందా? దేవుడా!? నీవే కాపాడాలి నాయనా. మేము చేసిన తప్పుకి మా బిడ్డను బలిచేయకు భగవంతుడా!. అని ఎన్ని దేవుళ్ళకు మొక్కుకున్నానో.

“మేనరికాల వల్ల పిల్లలు అవలక్షణాలతో పుడతార”ని మామయ్య చెప్తే నేను వినలేదు. సరికదా మా వంశవృక్షాన్ని ఉదాహరణగా చూపించాను. “తరాలు మారుతున్నాయి కనుక ప్రమాదం సంభవించదు అని మూర్ఖంగా చదువుకున్న మనం ఇలాంటి అడుగులు వేయకూడదు” అని చెప్పినా వినలేదు. ఇప్పుడు భయంతో ఒళ్ళు వణికి పోతుంది. ఏం జరుగుతుందో... ఏమో...?!

*****

“గాయమైనప్పుడు రక్తం ఆగకుండా స్రవించే ఈ హీమోఫిలియా వ్యాధిని రాజుల రుగ్మత అంటారు. బ్రిటీష్‌ రాజవంశీయులు తమ రక్తం చాలా విలువైనదని, అదెప్పుడూ కలుషితం కాకూడదని తమ దగ్గరి బంధువులనే వివాహం చేసుకునేవారు. ఇలా కొన్ని తరాలు గడిచాక దగ్గరి సంబంధాలతో జన్యువులు బలహీనమయ్యాయి. దాంతో రక్తం గడ్డకట్టించే జన్యువుల్లో లోపం వల్ల రాజవంశీయుల్లో మగపిల్లలకు ఒక జబ్బు వచ్చింది. అదేమిటంటే... సన్నగా తేలికపాటి గాయమైనా దాని నుంచి ఆగకుండా రక్తం ప్రవహించేది. దీనివల్ల గడ్డం చేసుకునే సమయంలో బ్లేడ్‌ తగిలినా సరే యువరాజులకూ, రాజులకూ ప్రాణాపాయం సంభవించే పరిస్థితి వచ్చింది. అందుకే బ్రిటిష్‌ రాజులు, యువరాజుల్లో చాలా మంది నీట్‌గా షేవ్‌ చేసుకోకుండా గడ్డాలు పెంచుతూ ఉండేవారు. బ్రిటిష్‌ రాజవంశీయుల్లో కనిపించే జబ్బు అయినందున దీనికి ‘రాజుల రుగ్మత’ (రాయల్‌ డిసీజ్‌) అనే పేరు వచ్చింది. పేరుకు రాజుల వ్యాధి అయినప్పటికీ ఎక్కువగా మేనరిక వివాహాలు చేసుకునే కుటుంబాల్లో కూడా ఈ వ్యాధి కన్పిస్తోంది. శరీరంలో రక్తం నిరంతరం ప్రవహిస్తుడడం జీవ లక్షణం. అదే రక్తం నిరాటంకంగా శరీరం నుంచి బయటకు వెళ్లిపోతే ఏ జీవికైనా మరణం తప్పదు. కొంతమందికి చిన్న దెబ్బ తగిలి గాయమైనా అది నిరంతర రక్తస్రావానికి కారణమై ప్రాణాపాయానికి కూడా దారితీయవచ్చు. ఇలా రక్తం సహజంగా గడ్డకట్టడంలో విఫలమయ్యే పరిస్థితిని ‘హీమోఫీలియా’ అంటారు.”

“శరీరంలో ఎల్లప్పుడూ జరిగే రక్త ప్రవాహానికి ఏవైనా ఆటంకాలు ఏర్పడితే సహజంగా రక్తస్రావం అవుతుంది. ఐతే, దానిని నిలువరించడానికి ఒక వ్యవస్థకూడా రక్తంలో ఉంటుంది. తన చుట్టూ వలలాంటిదాన్ని నిర్మించుకుని, ఆ వల పోగులు క్రమంగా మందమైపోతూ రక్తస్రావాన్ని ఆపుకునే ఆ వ్యవస్థను ‘రక్తం గడ్డకట్టడం’ (క్లాటింగ్‌) అంటారు. అయితే కొంతమందిలో ఇలా రక్తం గడ్డకట్టే వ్యవస్థ సరిగా పనిచేయదు. అదే ‘హీమోఫీలియా’. ఏదైనా చిన్న దెబ్బ తగలగానే రక్తస్రావం జరగడం అందరికీ అనుభవమే. కొందరిలో ఎలాంటి దెబ్బా తగలకపోయినా అంతర్గతంగా రక్తస్రావం అవుతుంది. ఈ రక్తస్రావం ఒక్కోసారి ప్రాణాంతకమూ కావచ్చు. ఈ రక్తస్రావ రుగ్మతలనే ‘బ్లీడింగ్‌ డిజార్డర్స్‌’ అంటారు. ఇందులో హీమోఫీలియా అనేదే అత్యంత తీవ్రమైన పరిస్థితి.”

కిరీటి కడుపులో ఉన్నపుడు పుస్తకాలు ఎక్కువగా చదివేదానిని.  అప్పుడు ‘హిమోఫిలియా’ గురించి నేను చదివిన ఒక వ్యాసం ఇప్పుడు గుర్తొస్తుంది. “భగవంతుడా?ఎందుకు నాయనా ఇలాంటి ఆలోచనలని నాలో కలిగిస్తున్నావు. నేనా? లేక నామనసా? కీడు శంఖించేది. ఏమీ అర్ధం కావడం లేదు.  బాబుకి తగిలింది చిన్న దెబ్బే అన్నారు. కానీ రక్తం ఆగడం లేదు అన్నారు. అది హీమోఫిలియా కాదు కదా!

ఆ రోజు మామయ్య చెప్పినట్టు విని మేము పెళ్లి చేసుకోకుండా ఉంటే ఈరోజు కిరీటికి ఈ పరిస్తితి దాపురించేది కాదు కదా! అయ్యో మేము చేసిన తప్పుకు అభంశుభం తెలియని పసివాడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో! మా సుఖాల కోసం సంతోషాల కోసం ముందు వెనుక ఆలోచించకుండా అడుగులు వేసి  పసిప్రాణాలను ఈ లోకోలోకి తీసుకొచ్చి నరకం చూపించాలా? చదువుకొని వాళ్ళకు చెప్పాల్సింది పోయి, చదువుకున్న నేనే ఇలా...!!!

*****

నేను ఆలోచనల్లోనే ఉన్నాను. ఇంకా ఆ సుదీర్ఘ ప్రయాణం నుంచి బయటకి రాలేదు. ఆటో హాస్పిటల్ ముందు ఆగింది. నాన్న  మైథిలి... మైథిలి... అని పిలిచే వరకు  నేను ఈ లోకంలోకి రాలేదు. నేను ఆటో దిగి నీరసంగా రెండు అడుగులు వేశాను. ఎదురుగా మామయ్య. ముఖంలో కాంతి లేదు. పెదాలపై నవ్వు లేదు. కిరీటికి ఏమీ కాలేదు బాగానే ఉన్నాడు భయపడాల్సినది ఏమీ లేదు, చిన్న దెబ్బే అనే మాటలు లేవు. స్కూల్ స్టాఫ్ అంతా అక్కడే ఉన్నారు. అందరూ గుంపులు గుంపులుగా మాట్లాడుకుంటున్నారు. చాలామంది నన్నే చూస్తున్నారు. కొందరు నేరుగా, కొందరు చూడలా, వద్దా అన్నట్టుగా చూస్తున్నారు. అందరూ చూస్తున్నారు. ఎవరూ మాట్లాడటం లేదు. దగ్గరగా వస్తున్నారు.

కానీ దూరంగానే ఉంటున్నారు. ఒక్కరు కూడా కిరీటి గురించి గురించి మాట్లాడడం లేదు. లోపల భయం, అంతులేని దుఖం... అర్ధమవుతున్నట్టుంది, కానీ ఏమీ అర్ధంకావడంలేదు. నా చిట్టి తండ్రిని చూపించేవారే లేరా? ఇక్కడ. నా బంగారు కొండ దగ్గరికి తీసుకువెళ్లే వారే లేరా? ఇక్కడ. అని మనసులో  అనుకుంటూ ముందుకు అడుగులు వేశాను. మామయ్య గట్టిగా పట్టుకుని నన్ను ఆపేశాడు.  నన్ను పట్టుకున్న విధానంలోనే నాకు పూర్తిగా అర్ధమయ్యింది. మామయ్య కళ్లలోకి చూశాను. తీరాన్ని దాటిన తుఫానులా కళ్ళు వర్షించడం మొదలుపెట్టాయి...

నా వైపు చూసిన మామయ్య కళ్ళు అక్కడే దగ్గరగా ఉన్న అంబులెన్స్  వైపు చూశాయి. అవే కళ్ళు మళ్ళీ నావైపు చూశాయి... మళ్ళీ అంబులెన్స్ వైపు,   నాలో నీరసం అంతా పోయింది. ఎక్కడినుంచి వచ్చిందో ఉత్సాహం... నా కిరీటిని వెదుక్కుంటూ వ్యాన్ వైపు అ...డు...గు...లు... వెనక నుంచి ఎవరో భుజం పైన ...  బాబు ఐడి కార్డు... చేతిలోకి తీసుకున్నాను... రక్తంతో తడిచిపోయిన స్కూల్ ఐడి కార్డు ... కాదు కాదు రక్తపు ముద్దగా మారిన .... కి...రీ...టి.... ఐడి కార్డు.

ఎక్కడినుంచో మాటలు వినిపిస్తున్నాయి...

‘ఆ అబ్బాయికి రాయల్ డీసీజ్’ అట...అని

అవును నాకొడుకు ‘రాజు’ అందుకే ......

*****

నా నీరసానికి కారణం నేను మళ్ళీ తల్లిని కాబోతున్నాను.

నాలో భయం పుట్టేవాడు మరో రాజు అవుతాడేమోనని.....

మరిన్ని కథలు
penkutillu