Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
royal disease

ఈ సంచికలో >> కథలు >> పెంకుటిల్లు

penkutillu

కొండంత మొగులయింది.

నా గుండెలో దిగులు మొదలయింది.
 
కిటికి తెరిచి చూసాను. ఇంకా ఎనభై కిలోమీటర్లు వెళ్ళాలి. గంటకి అరవై కిలోమీటర్ల వేగంతో బస్సు దూసుకెళ్తునే ఉన్నది.
 
"ఈ ఏడైనా కాలమయితే బాగుండు" నా వెనుక సీట్లో కూర్చున్న రైతు దేవున్ని వేడుకుంటున్నాడు.
 
"ముందుగా మురిపిస్తది. తర్వాత ఏడిపిస్తది" మరో రైతు తన అనుభవాన్ని చెబుతున్నాడు.
 
రోల్లు పలిగిపోయే రోహిణీ కార్తె సగం పాదమది. మండే ఎండలకు పిట్టలు రాలిపోతున్నయి. నీటి కొరతతో జనం గొంతులు ఎండుతున్నవి. అందరు వాన దేవుని కోసం పూజలు చేస్తున్న సమయం
 
సన్నగా చినుకులు పడుతున్నాయి. బస్సులో అందరి మొహాల్లో ఆనందం కనిపించింది. చినుకులు మందమయ్యాయి. అందరు కిటికీలు మూసారు. వాన జోరు పెరిగింది. బస్సు వేగం తగ్గింది నాలో అలజడి ఆరంభమయింది. వాన రావడం సంబురమనిపించినా. ఇల్లు గుర్తుకొచ్చి కంగారు మొదలయింది. వెంటనే ఇంటికి పోన్ చేసాను. రెండు, మూడు సార్లు చేసినా స్పందన లేదు. వారు ఇప్పుడేమి చేస్తున్నారో నాకర్ధమయింది. ఇది నాకు కొత్త కాదు. వానొచ్చినప్పుడల్లా ఉండే భాగోతమే!
 
ఇంటికి జల్లెడలా ఉరుపులు, వాన రాగానే పరుగు పరుగున పాత్రలు, గిలాసలు, బకెట్లు ఉరుపు కింద పెట్టడం. ఓ వైపు ధారలు ఆపుతుంటే మరోవైపు నుండి దూసుకొచ్చే వాన చినుకులతో ఇల్లంత బురదమయం. నాలుగు గదులుంటే ఆ ఇంట్లో తడవని భాగమంటు లేదు. రాత్రిల్లు వానొస్తే ఇల్లంతా పాత్రలు పరిచి జాగారం చేయడం మా వారందరికి సాధారణ విషయం. వానొచ్చె సూచనలు కనిపిస్తే చాలు సరిహద్దులోని సైనికుల వలె మేమందరం ఇంట్లో గుమిగూడి పైకప్పు పడిపోకుండా వీర జాగ్రత్తలు తీసుకుంటాము.

ఇంతటి చల్లటి వానలో కూడ నన్ను వేడెక్కించినదేమిటంటే మా తాతగారు కట్టిన పెంకుటిల్లు. బస్సు నిదానంగా ముందుకెళ్తుంటే నా ఆలోచనలు మాత్రం వేగంగా గతం వేపు పరుగులు తీసాయి.

ఉమ్మడి గ్రామీణ కుటుంబంలో పెద్ద కొడుగ్గా నా బాధలు చెప్పుకోలేనివి. తమ్ముడికి నాకు వయసులో పదేళ్ళు తేడా ఉంది. మధ్యలో ఇద్దరు చెల్లెళ్ళు. చెల్లెల్ల పెళ్ళిలు, తమ్ముడి చదువు, కుటుంబ అవసరాలకు అన్నింటా ముందు నిలిచిన నాకు అఖరుకు మొండి చేయి మిగిల్చారు.

నా పెళ్ళయిన ఇరవై ఏళ్ళకి తమ్ముడికి పెళ్ళయింది. అప్పటికే ఉన్నత ఉద్యోగం కాబట్టి ఖరీదైన సంబంధం వెతుక్కుంటూ వచ్చింది. అందరి అవసరాలు తీరాక, అమ్మా నాన్న తమ్ముడు చెల్లెల్లు ఏకమై వేర్పాటు కు నాంది పలికారు. ఎదిగినా పిల్లలున్నారని, నా ఖర్చులు వారికి భారమవుతాయని ముందే ఊహించి కుటుంబాన్ని ముక్కలుగా చేసారు.

పెద్ద మనుషుల సమక్షంలో ఆస్తుల పంపకం జరిపించారు. అమ్మానాన్నలకు మూడు లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేయడమే కాక నెలనెలా చెరో ఆరువందలు ఇచ్చేలా ఒప్పందాలు వ్రాసారు. పెళ్ళీడుకొచ్చిన నా కూతురి కోసం ఒక్క పైసా కూడ ఆలోచించలేదు. నా చిరుద్యోగం, తమ్ముడి పెద్ద ఉద్యోగం రెండింటిని ఒకే గాటన కట్టి తీర్పు చెప్పారు. పెద్ద కొడుక్కిచ్చే జ్యేష్ఠ పాలు ధర్మాన్ని మరిచారు. పొలాలు పంచాక పేచి ఇల్లు దగ్గరకొచ్చి ఆగింది.
 
ఉద్యోగరిత్యా తమ్ముడు దూరంగా ఉండవలసి రావడం. నేను ఇంట్లోనే ఉండడం సమస్యకు కారణంగా మారింది. అవసరం నాదే కాబట్టి ఇల్లుని నాకే కట్ట చెట్టాలని అధిక ధరని నిర్ణయించారు. పాత పెంకుటిల్లుని నేనొక్కడినే ఎలా భరించాలి?

తల్లిదండ్రులున్నంత వరకు ఇల్లుని విభజించకూడదని నేను వాదించాను. నా వాదనతో పెద్ద మనుషులు ఎకీభవించారు. కొత్తిల్లు కట్టే స్థోమత లేక పాతిల్లు పరమావధిగా జీవనం గడుపుతున్న సమయంలో అధిక వర్షాల కారణంగా ఇల్లు మరమ్మతు స్థాయికి చేరింది. ఇద్దరు అన్నదమ్ముల మధ్య సఖ్యత లేక ఏడాదికేడాది ఇంటి మరమ్మతు వాయిదా పడుతూనే ఉంది.

అప్పుడప్పుడు అతిథిలా వచ్చే తమ్ముడికి ఇల్లు అవసరం తక్కువ. ఇల్లు తప్పనిసరిగా మారిన నాకు మరమ్మతు ఖర్చులు ఎక్కువ. జ్యేష్ఠ పాలు కిందికైనా నాకు ఇల్లుని విడిచిపెట్టుమని కొందరు తమ్మునికి హితోపదేశం చేసారు. అతడు వినలేదు. ఒక వేళ అతడిచ్చినా తీసుకోడానికి నా ఆత్మాభిమానం అంగీకరించదని నాకు తెలుసు. ఆత్మీయత, అనుబంధాలు డబ్బుతో ముడిపడిన ఈ ఆధునిక సమాజంలో అన్న ఎవరు? తమ్ముడు ఎవరు..?
 
సెల్ పోన్ రింగ్ టోన్ శబ్ధానికి ఆలోచనల నుండి వర్తమానంలోకి వచ్చాను. వాన జోరుగా కురుస్తూనే ఉంది.

"హాలో" అన్నాను.

"ఇల్లంగా ఉరిసింది. నిలబడటానికి కూడ చోటు లేదు. ఎక్కడున్నారు.... " శ్రీమతి ఇంకా ఏదో అంటుండగానే కట్ అయింది.

నేను పోన్ చేసినా టవర్ సిగ్నల్ లేని కారణంగా చేరడం లేదు. విలువైన సమయాన్ని కుటుంబానికి కేటాయించి తప్పుచేసానా? నాలో అంతర్మథనం అంకురించింది. రెక్కలు రాగానే ఎగిరిన పక్షుల వలె కుటుంబాన్ని వదిలిపెట్టి హాయిగా ఉంటున్న పెద్దకొడుకులెందరో ఉన్నారు. వారి నిర్ణయం సరైనది కాక పోవచ్చు. కాని

పెళ్ళయి ఇరవై ఏళ్ళు, ఉద్యోగమచ్చి పదమూడేళ్ళు ఉమ్మడి కుటుంబ నియమానికి కట్టు బానిసలా నా ధర్మాన్ని నిర్వర్ద్థిస్తే నాకేమి మిగిలింది. ఎదిగిన పిల్లల చదువుల ఖర్చులు. తీరని అప్పులు. కలగా మారిన కనీస అవసరాలు.

"నేను మారాలి"

"నేను మారాలి"

ఇప్పుడు మారినంత మాత్రాన నాకొచ్చే ప్రయోజనమేమి లేదు. జరగవలసిన నష్టం ఎప్పుడో జరిగింది.కృతఙత మరచిన మనుషుల మధ్య సున్నితంగా జీవించడమే పెద్ద నేరం. వాన ఎలిసింది. బస్సు గమ్యానికి చేరువలో ఉంది. భారం దిగినట్లు బస్సు మళ్ళి వేగాన్ని పుంజుకొంది. ఈ సారి ఎలాగైనా ఇంటి మరమ్మతు చేయాలని నా మనసు ధృడంగా నిశ్చయించింది.

"అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం" ఎవరి పోన్ నుండో వచ్చిన పాటకు నా కళ్ళు చెమ్మగిల్లాయి.
 

మరిన్ని కథలు