Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
viluvalu

ఈ సంచికలో >> కథలు >> మాంగల్యం

mangalyam

సాయంత్రం అయిదు గంటలు.

ఊరికి చివర రామ మందిరానికి ప్రక్కనున్న  ప్రాధమిక పాఠశాల  తలుపులను మూసుకొని తాళాలను బ్యాగులో వేసుకొని బయలుదేరబోయింది ప్రధానోపాధ్యాయురాలు.

అంతలో ఓ ముఫ్ఫై ఏళ్ళ వయసున్న కుర్రాడొకడు  బైకు మీదొచ్చి దిగి "ఏక్సక్యూజ్ మీ మేడం.మీతో మాట్లాడాలి."అన్నాడు ఆమెతో. వెళ్ళ బోయిందల్లా ఆగి అతని ముఖంలోకి చూస్తూ "ఎవరు మీరు?" సందేహంతో అడిగింది .

"నా పేరు సందీప్ మేడం! టౌనులో ఓ ప్రయివేటు కంపెనీలో సేల్సరెప్పుగా పని చేస్తున్నాను..."చెప్పుకొంటూ పోతున్నాడు.

'ఆగండాగండి! వెళ్ళేదాన్నల్లా ఆపి మీ వివరాల్ను  నాకెందుకు చెపుతున్నారు?'

"ఏంలేదు మేడం,ఈ బడిలో పంతులుగా పని చేస్తున్న సుప్రియను చూసి వెళ్ళాలని సమయం కల్పించుకొని వచ్చాను"కాస్త తటపటాయిస్తూ అన్నాడు.

"ఆవిడ మీకేం కావాలి?సందీప్ ను ఆపాదమస్తకం  చూస్తూ అడిగిందామె.

"నేనూ,సుప్రియ ప్రేమికులం.వుద్యోగ రీత్యా తప్పని పరిస్థితుల్లో నేను  టౌన్లో వుండడంతో మా మధ్య ఓ తొమ్మిది నెల్లు గ్యాపొచ్చింది.ఎలాగైనా ఇవాళ సుప్రియను  చూడాలని వచ్చాను.!"

"మీరు చెపుతున్న మాటల్ను నమ్మలేక పోతున్నాను.చక్కగా సెల్ఫోనులు అందుబాటులో వున్న ఈ కాలంలో ప్రేమికులంటే రోజుకు పది సార్లైనా మాట్లాడుకుంటారు.! అయినా బడి వేళలు ముగియగానే ఆ అమ్మాయి వెళ్ళి పోయిందిగా!"

"పర్వాలేదు మేడం! వారం తరువాత మళ్ళీ వస్తాను.అప్పుడు మీరే అనుమతినిచ్చి మేమిద్దరం ప్రయివసీతో మాట్లాడుకునే ఏర్పాట్లు చెయ్యాలి.వస్తాను మేడం"అంటూ బైకు స్టార్టు చేసుకొని వెళ్ళి పోయాడు సందీప్. షాక్ తిన్నట్టు  అయోమయ పరిస్థితిలో అతను వెళుతున్న వేపే చూస్తూ అడుగు తీసి ముందుకేసింది ప్రధానోపాధ్యాయురాలు.

మరుసటి రోజు లంచ్ అవర్లో....  

"భోంచేశావా సుప్రియా!" తన గదికి పిలిపించుకొని అడిగింది ప్రధానోపాధ్యయురాలు.

"అయ్యంది మేడం"నిలబడే జవాబు చెప్పింది.

"కూర్చో... పర్వాలేదు కూర్చో!"అంటూనే కూర్చొంది సుప్రియ.

"నిన్న సాయంత్రం సందీప్  వచ్చి వెళ్ళాడు"షాక్ తిన్నట్టు మేడం ముఖంలోకి చూసింది సుప్రియ.

"అవునమ్మా!బడికి తాళాలు వేసుకొని బయలుదేరుతున్న సమయంలో అతనొచ్చాడు.మీరిద్దరూ ప్రేమించుకున్నట్టు చెప్పాడు.వుద్యోగరీత్యా ఓ తొమ్మిది నెల్లు నిన్ను కలుసుకోలేక పోయాట్ట.వచ్చే శుక్రవారం మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళాడు.తను చెప్పింది నిజమా?!"కళ్ళలోకి చూస్తూ అడిగింది ప్రధానోపాధ్యాయురాలు.

అవునన్నట్టు మౌనంగా తలూపింది సుప్రియ.అప్పుడు ఆమె కళ్ళనుంచి కన్నీటి చుక్కలు రెండు చెక్కిళ్ళపై  రాలాయి. వెంటనే కొంగుతో తుడుచుకుంది.

"ఏమిటమ్మా...ఏదో బాధ పడుతున్నట్టున్నావ్ ?"

"అదేం లేదు మేడం. అయినా గడచిన తొమ్మిది నెలల్లో మా జీవితాల్లో ఎన్నో కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి..." అని ఇంకేదో చెప్పబోతుండగా బెల్లు మోగింది.' "క్లాసుకు వెళుతున్నా మేడం. మీరు తీరిగ్గా వున్నప్పుడు వివరాలు చెపుతాను"అంటూ గదినుంచి నిష్క్రమించింది సుప్రియ.

సందీప్,సుప్రియలు టౌనులో డిగ్రీ వరకు ఒకే కాలేజీలో చదువుకున్నారు.కాలేజీ చదువుతున్నప్పుడే ప్రేమను పడ్డ వాళ్ళు వుద్యోగాలు వచ్చిన తరువాత ఉభయుల తల్లితండ్రుల అనుమతులతో పెళ్ళి చేసుకొని భార్యభర్తలుగా జీవితాలను సాగించాలని నిర్ణయం తీసుకొని ప్రేమికులుగానే కొనసాగిస్తూ వచ్చారు.అయితే వుద్యోగాల రీత్యా తప్పని పరిస్థితుల్లో దూరం కావలసి వస్తుందని, ఆ దూరమే వాళ్ళ భవిష్యత్తును  మార్చేస్తుందని వూహించ లేదు.

ఆ రోజు శుక్రవారం.

ఉదయం అయిదున్నర గంటలకు లేచిన సుప్రియకు 'శుక్రవారం సందీప్  వస్తున్నా'డని ప్రధానోపాధ్యాయురాలు చెప్పిన మాటలు గుర్తుకురాగా అన్ని పనులను వెంట వెంటనే పూర్తి చేసుకొని తలస్నానం చేసి జారు ముడి వేసుకొని తనకు నచ్చిన చీర,మ్యాట్చింగ్ బ్లోజుతో దేవుడి గదిలోకి వెళ్ళింది. అయిదు నిముషాల్లో పూజ ముగించుకొని వచ్చి టిఫన్ తిని లంచ్ బాక్సును బ్యాగులో వుంచుకొని బయటికి నడిచింది.తొమ్మిది గంటలకల్లా పాఠశాల ప్రాంగణంలో కాలు పెట్టింది.

మధ్యహ్నం  స్టాపు గదిలో లంచ్ తీసుకుంటున్న సుప్రియను చూడ్డానికి వచ్చింది ప్రధానోపాధ్యాయురాలు. ఆమెను చూస్తూనే లేచి నిలబడింది సుప్రియ.

"పర్వాలేదు భోంచేయ్ !ఇవాళ శుక్రవారం కదా! సందీప్ వస్తాడని గుర్తు చేయటానికి వచ్చాను.నువ్వు జాగ్రత్తగానే వచ్చినట్టున్నావ్!అదేమిటి ముసలి దానిలా చీరను ఒంటి నిండా అలా చుట్టేసుకున్నావ్ !

మొత్తంలో నీలో ఏదో తెలియని మార్పుందీరోజు. వస్తాను"నవ్వుకొంటూ వెళ్ళి పోయింది ప్రధానోపాధ్యాయురాలు.

సాయంత్రం లాంగ్ బెల్ మోగింది,బిలబిలమంటూ పిల్లలూ, ముగ్గురు బడి పంతులమ్మలు వెళ్ళి పోయారు. మిగిలింది ప్రధానోపాధ్యాయురాలు,సుప్రియ మాత్రమే!

అనుకొన్నట్టు అయిదు గంటల ప్రాంతంలో బైకుమీదొచ్చాడు సందీప్ .బైకును పార్కు చేసి ప్రధానోపాధ్యాయురాలి వద్దకు నడుస్తుండగా ఆమే ఎదురొచ్చి సందీప్ ను  స్టాపు రూంలో వున్న సుప్రియ వద్దకు తీసుకు వెళ్ళి ఫ్రీగా మాట్లాడుకోమని చెప్పి తన గదికి వెళ్ళిపోయింది.
సందీప్, సుప్రియ ముఖంలోకి చూస్తుంటే... ఆమె నేల చూపులకు పరిమితమైంది.వాళ్ళ మధ్య రెండు నిముషాలు మౌనం రాజ్యమేలింది.
సందీపే చొరవ తీసుకొని"క్షమించు ప్రియా! తొమ్మిది నెలల పాటు వుద్యోగరీత్యా నేను నీకు దూరంగా వుండవలసి వచ్చింది.టౌను జీవితానికి,సరికొత్త నాగరికతకు అలవాటుపడ్డ నేను కొత్త స్నేహితులతో మరో ప్రపంచంలో విహరిస్తూ  పుట్టి పెరిగి చదివి ప్రయోజకుడనైన  ఈ గ్రామాన్ని,జనాన్ని, పంట పొలాల్ని, ఆ రామ మందిరాన్ని పూర్తిగా మరచి పోయాను.వీటితో పాటు అనుకోని విధంగా నా ప్రియకు,ఆమె ప్రేమకూ దూరమైయ్యాను.అవును.ఎప్పుడు వడిదుడుకులతో కొనసాగే  ఆ నాగరిక ప్రపంచానికి అలవాటు పడ్డ నేను మనం చేసుకున్న ఎన్నో బాసల్ను సైతం మరచి పోయి నీకు దూరంగా వుండి పోయాను.ఇప్పుడు వాటిని గుర్తుకు తెచ్చుకోవడంలో అర్థం లేదు.ఇక ఆలస్యం చేయడం కూడా బాగోదని మనం పెళ్ళి చేసుకొని జీవితంలో స్థిరపడాలన్న నిర్ణయంతోనే వచ్చాను.మనం భార్యభర్తలమైనా నువ్వు వుద్యోగాన్ని, సంపాదన్ను వదులుకోవలసిన అవసరంలేదు.  ఇక్కడే వుండు.నేను ఆ సిటీలోనే వుంటూ నెలకు ఓ నాలుగు రోజులు వచ్చి వెళుతుంటాను.కొన్నాళ్ళపాటు ఇలాగే సంసారాన్ని సాగిద్దాం.అప్పుటికి నువ్వు తల్లివైతే వుద్యోగాన్ని మానుకోవడం గురించి ఆలోశిద్దాం. నా మాటను కాదనవన్న నమ్మకం నాకుంది. ఏమంటావ్ ?"అని గుక్క తిప్పుకోకుండా తన మనసులో వున్న కుచిత సంస్కారంతో కూడికొన్న తుచ్ఛమైన కోరికను వెలిబుచ్చుతూ ఒక అడుగు ముందుకేశాడు సందీప్.

సుప్రియ ఏమీ మాట్లాడలేదు. ఒక్కసారి అలా సందీప్ కళ్ళలోకి తీక్షణంగా చూసింది.మెల్లగా తన మెల్లో వున్న మాంగల్యాన్ని కుడిచేత్తో తీసి సందీప్ ముఖం మీదికి విసిరినట్టు చూపి బ్యాగు తీసుకొని ప్రధానోపాధ్యాయురాలి గదికి నడిచింది. అంతే... ఎదురు చూడని సుప్రియ ప్రవర్తనకు షాక్ తిన్న సందీప్ చెప్పుదెబ్బ తిన్నట్టు  ఫీలయి  దిగాలు పడ్డ ముఖంతో బైకును స్టార్టు చేసుకోని వెళ్ళి పోయాడు.

"ఏమైంది ప్రియా!అతన్ని ఏమన్నావ్ ?  మౌనంగా వెళ్ళిపోతున్నట్టున్నాడు ?"ప్రశ్నించింది ప్రధానోపాధ్యాయురాలు,

" నేనేమీ అనలేదు మేడం!ఇదిగో...దీన్ని  చూపానంతే!మారు మాట లేకుండా వెళ్ళి పోయాడు"చెప్పింది సుప్రియ మెళ్ళో వున్న... కాదు...తనే కట్టుకున్న మాంగల్యాన్ని చూపుతూ. షాక్కు గురైంది ప్రధానోపాధ్యాయురాలు."నీకు పెళ్ళి కాలేదు కదా?ఇదేమిటి?నీ మెళ్ళోకి ఆ తాళిబొట్టు ఎలా వచ్చింది?"అడిగింది.

"ఇవాళ తను వస్తాడని మీరే చెప్పారుగా మేడం!అందుకే అతన్నుంచి తప్పుకోవటానికి నేనే దీన్ని కట్టుకున్నాను."

"అదే...అంతగా అతన్ని  ప్రేమించిన దానవు తీరా తను వచ్చేసరికి తన్నుంచి తప్పుకోవాలనుకొంటున్నావ్! ఎందుకని?"ప్రశ్నించింది.

"చెపుతాను మేడం.ఆ విషయం మీకు తెలిస్తేనే నేను అతన్నుంచి తప్పుకొంది న్యాయమని భావిస్తారు.

మూడు నెలల క్రితం ఓ రోజు నేను టౌనుకు వెళ్ళాను.అక్కడ నాతో చదువుకున్న ఓ అమ్మాయిని చూశాను.ఆమెకు పెళ్ళయి ఆరు నెల్లైతే మూడునెల్లు గర్భవతని తెలుసు కొన్నాను.ఇద్దరం హోటల్లో కాఫీ తాగుతూ కాస్సేపు సంతోషంగా మాట్లాడుకున్నాం.తరువాత ఆమె నా పెళ్ళి ప్రస్తావన  తెచ్చింది.నేను చెప్పటానికి వుపక్రమించే లోపు తనకు ఫోనొచ్చింది.ఫోన్లో మాట్లాడి అది తన భర్త వద్ద నుంచి వచ్చిందని చెప్పింది. అతనెక్కడున్నా  రోజుకు పది సార్లైనా తనతో ప్రేమగా మాట్లాడుతాడట.ఆమెను తన ప్రాణంగా చూసు కొంటాడట.అంతటి ప్రేమానురాగాలతో కూడికొన్న అన్యోన్యమైన దాంపత్యం వాళ్ళదని తనే చెప్పింది.కాని ఆమె భర్త ఎప్పుడూ కనీసం పది రోజుల పాటు ఇంటివద్ద తనతో వున్నది లేదట.

ఆఫీసు పనులని చెప్పి నెల్లో దాదాపు ఇరవై రోజులు ఢిల్లీ,ముంబై,చెన్నై,కొల్ కత్తాలంటూ దేశం నలుమూలలకు  వెళుతుంటాడట. అంతగా ప్రేమతో చూసుకునే భర్త నిత్యం తనతో వుండక పోవడం తన దురదృష్టమని వాపోయింది పాపం.నాకక్కడే సందేహం వచ్చింది.అయినా అతనెంతోమంచి వాడని చెప్పింది కనుక నాకు ఆమె భర్తను  చూడాలనిపించి అడిగాను.వెంటనే తన సెల్ ఫోనులో వున్న తన భర్త ఫోటోను నాకు చూపింది.షాక్ తిన్నాన్నేను. ఆ ఫోటోలో వున్న వ్యక్తి ఎవరో కాదు. ఈ సందీపే! నాడు నన్ను అంతగా ప్రేమించి టౌనుకు వెళ్ళి పోయి బాగా డబ్బున్న ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకొని ఆమెకు  భార్య  అన్న అంతస్థుని  కల్పించి ఆఫీసు పనులంటూ అబధ్ధాలు చెప్పి వూర్లు పట్టుకు తిరుగుతూ రకరకాల విన్యాసాలు చేస్తూ అమ్మాయిలను వశపరచుకొని వాళ్ళతో తన కోరికలను తీర్చుకొంటున్నది ఈ సందీపేనని అప్పుడు తెలుసుకున్నాను.!అవును మేడం ఈ సందీప్ ఓ తిరుగుబోతు.నాకెలా తెలుసంటే...ఓరోజు నేను టౌనుకు వెళ్ళినప్పుడు అక్కడో లాడ్జిలో  వ్యభిచారం చేస్తున్నారని ఇద్దరమ్మాయిలనూ, ఇద్దరు విటులను పోలీసు వ్యానులోకి ఎక్కిస్తుంటే చూశాను.వాళ్ళలో ఈ సందీప్ కూడా వున్నాడు. అలాంటి నీచమైన వాడు ఇవాళ ఇక్కడికొచ్చి మంచి వాడిగా నటించి నన్నూ మభ్యపెట్టి  పెళ్ళి చేసుకొని నాకూ భార్య అంతస్థును కల్పించి అక్కడా ఇక్కడా ఇద్దరి పెళ్ళాల మొగుడిగా చలామణి కావడానికి ప్రయత్నిస్తున్నాడని తెలుసుకున్నాను. అవును మేడం! నాతో మాట్లాడిన ఆ అమ్మాయి మాటల్ని గుర్తుకు తెచ్చుకొని  ఈ నాటి అతని ప్రవర్తనతో పోల్చుకుంటే నా అంచన కరక్టేననిపిస్తుంది.అందుకే గొడవ పడకుండా ఇక తను నా జోలికి రాకుండా పోవాలంటే ఇదొక్కటే మార్గమని ఈ మాంగల్యాన్ని మెళ్ళో కట్టుకొని బడికొచ్చాను.ఇదిగో... మీముందే దీన్ని తీసి వేస్తున్నాను" అంటూ మెళ్ళో వున్న మాంగల్యాన్ని చేతికి తీసుకొంది సుప్రయ.

ప్రధానోపాధ్యాయురాలు లేచి  సుప్రియ దగ్గరకొచ్చి ఆమెను గుండెలకు హత్తుకొని "జాగ్రత్తతో మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా.నిజం! కనబడ్డ ఆడదాన్నల్లా ఏదో ఓ విధంగా వశం చేసుకోని వాడుకోవాలని చూసే ఇలాంటి వెధవలు అక్కడక్కడ వుంటూనే వున్నారు.ఆడవాళ్ళం మనమే జాగ్రత్తగా వుండాలి.ఏదేమైనా నువ్వు త్వరగా పెళ్ళి చేసుకుంటే...ఆ మాంగల్యమన్నది నీ మెడలో వుంటే...ఇలాంటి వెధవలు ఎప్పుడూ నీ దరికి రారు. రా... వెళదాం!"అంటూ సుప్రియ చేయి పట్టుకొంది ప్రధానోపాధ్యాయురాలు.

మరిన్ని కథలు