Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
jai simha movie review

ఈ సంచికలో >> సినిమా >>

అజ్ఞాతవాసి చిత్రసమీక్ష

anjatavasi movie review

చిత్రం: అజ్ఞాతవాసి 
తారాగణం: పవన్‌కళ్యాణ్‌, ఖుష్బూ, ఆది పినిశెట్టి, కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌, బోమన్‌ ఇరానీ, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, రావు రమేష్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు 
సంగీతం: అనిరుధ్‌ 
సినిమాటోగ్రఫీ: వి.మణికందన్‌ 
దర్శకత్వం: త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ 
నిర్మాత: సూర్య దేవర రాధాకృష్ణ 
నిర్మాణం: హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ 
విడుదల తేదీ: 10 జనవరి 2018 

క్లుప్తంగా చెప్పాలంటే 

ఏబీ గ్రూప్‌ అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త గోవింద భార్గవ్‌ అలియాస్‌ విందా (బోమన్‌ ఇరానీ), అతని కుమారుడ్ని కొందరు దుండగులు హతమారుస్తారు. విందా భార్య ఇంద్రాణి (ఖుష్బూ) ఏబీ గ్రూప్‌ వ్యవహారాల్ని చూసుకునేందుకు బాలసుబ్రహ్మణ్యం (పవన్‌కళ్యాణ్‌)ని అస్సాం నుంచి తీసుకొస్తుంది. ఏబీ గ్రూప్‌లో పర్సనల్‌ మేనేజర్‌గా చేరి, కంపెనీ వ్యవహారాలు చూసుఉంటూ, విందా హంతకుల కోసం అన్వేషిస్తాడు. ఇంతకీ విందా, అతని కుమారుడ్ని హత్య చేసిందెవరు? సీతారామ్‌ (ఆది పినిశెట్టి)కీ, విందాకీ సంబంధమేంటి? బాలసుబ్రహ్మణ్యం అసలు సంగతేంటి? వంటివి తెరపై చూస్తేనే బాగుంటుంది. 

మొత్తంగా చెప్పాలంటే 
నటుడిగా పవన్‌కళ్యాణ్‌ చెయ్యాల్సిందంతా చేశాడు. అన్ని ఎమోషన్స్‌ పండించాడు. తన నుంచి అభిమానులు ఏయే అంశాల్ని ఆశిస్తారో, అవన్నీ తెరపై చేసి చూపించాడు. యాక్షన్‌ సీన్స్‌లో తనదైన ప్రత్యేకతను చాటుకున్నాడు. తన మార్క్‌ డైలాగ్స్‌తో ఆకట్టుకుంటాడు. 
హీరోయిన్లలో కీర్తి సురేష్‌కిగానీ, అనూ ఇమ్మాన్యుయేల్‌కిగానీ పెద్దగా ప్రాధాన్యత ఉన్న పాత్రలు దక్కలేదు. ఇద్దరూ గ్లామరస్‌గానే కన్పించారు. సీనియర్‌ నటి ఖుష్బూకి మంచి పాత్ర దక్కింది. చాలాకాలం తర్వాత తెలుగు తెరపై ఆమె మంచి పాత్ర చేసింది. బోమన్‌ ఇరానీ తన పాత్రకు న్యాయం చేశాడు. మురళీ శర్మ, రావు రమేష్‌ హాస్యానికి పరిమితం కాగా, మిగతా పాత్రధారుల తమ పాత్ర పరిధి మేర ఫర్వాలేదన్పించారు. విలన్‌ పాత్ర ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే హీరో పాత్ర అంత స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఆది పినిశెట్టి బాగా చేసినా, ఇంకా పవర్‌ఫుల్‌గా అతని రోల్‌ తీర్చి దిద్ది ఉంటే బావుండేదనిపిస్తుంది.

నిజానికిది కొత్త కథ ఏమీ కాదు. ఓ ఫ్రెంచ్‌ మూవీ నుంచి స్ఫూర్తి పొంది ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే, ఈ సినిమాలో త్రివిక్రమ్‌ - పవన్‌ గత చిత్రం 'అత్తారింటికి దారేది' పోకడలు ఎక్కువగా కన్పించాయి. త్రివిక్రమ్‌ - పవన్‌ కాంబినేషన్‌ గురించి చాలా చాలా ఎక్స్‌పెక్ట్‌ చేసే ఆడియన్స్‌ని సినిమా పూర్తిగా డిజప్పాయింట్‌ చేస్తుంది. కథ, కథనం ఏదీ ఆకట్టుకోదు. డైలాగ్స్‌ సైతం త్రివిక్రమ్‌వేనా? అన్న అనుమానాలొచ్చేలా ఉన్నాయి. సంగీతం బాగానే ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఫర్వాలేదు. నిర్మాణపు విలువలు మాత్రం చాలా బాగున్నాయి. ఎడిటింగ్‌ చేయడానికి చాలా చాలా స్కోప్‌ మిగిలే ఉంది. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ ఓకే.

'జల్సా', 'అత్తారింటికి దారేది' తర్వాత పవన్‌ - త్రివిక్రమ్‌ నుంచి వస్తోన్న సినిమా కావడంతో భారీ అంచనాలకు కొదవేముంది? కానీ సినిమా స్టార్టింగ్‌ నుంచే నిరాశ మొదలవుతుంది చూసే ప్రేక్షకులకి. అంతే, సినిమాలో ఎక్కడా మళ్ళీ ఊపు వచ్చే సందర్భమే కన్పించదు. ఓవరాల్‌గా ఇది కంప్లీట్‌ డిజప్పాయింట్‌ మూవీ అనే అభిప్రాయం చూసిన ప్రేక్షకుడికి కలుగుతుంది. పవన్‌ ఇమేజ్‌, హీరోయిన్ల గ్లామర్‌, త్రివిక్రమ్‌ టాలెంట్‌ ఇవేవీ ఎక్కడా ఈ సినిమాని గట్టెక్కించలేకపోయాయి. పవన్‌ అభిమానులు సైతం తమ అభిమాన హీరో, తమ అభిమాన దర్శకుడి నుంచి వచ్చిన సినిమాయేనా? అని ఆశ్చర్యపోయేలా అన్పిస్తుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే
అజ్ఞాతవాసి అజ్ఞాతంలోకే

అంకెల్లో చెప్పాలంటే: 2/5

మరిన్ని సినిమా కబుర్లు
lovers day lover boy