Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

జై సింహ చిత్రసమీక్ష

jai simha movie review

చిత్రం: జై సింహా 
తారాగణం: బాలకృష్ణ, నయనతార, నటాషా దోషి, హరిప్రియ, ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, మురళీమోహన్‌, జయప్రకాష్‌రెడ్డి తదితరులు. 
సంగీతం: చిరంతన్‌ భట్‌ 
సినిమాటోగ్రఫీ: సి.రామ్‌ప్రసాద్‌ 
దర్శకత్వం: కె.ఎస్‌.రవికుమార్‌ 
నిర్మాత: సి.కళ్యాణ్‌ 
నిర్మాణం: సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ 
విడుదల తేదీ: 12 జనవరి 2018 

క్లుప్తంగా చెప్పాలంటే 
గౌరి (నయనతార)కి తెలియకుండా ఆమె కుమారుడ్ని తీసుకుని విశాఖపట్నం నుంచి కుంభకోణం వెళ్ళిపోతాడు నరసింహ (బాలకృష్ణ). అక్కడ ఓ ఆలయ ధర్మకర్త (మురళీమోహన్‌) ఇంట్లో డ్రైవర్‌గా చేరతాడు. అక్కడే అతనికి ధాన్య (నటాషా) ఎదురవుతుంది. ఆమె ఓ యాక్సిడెంట్‌ చేయగా, ఆ నేరాన్ని తన మీద వేసుకుంటాడు నరసింహ. అక్కడి నుంచి అతనికి సమస్యలు పెరుగుతాయి. శతృవుల దాడి ఎక్కువవుతుంది. ఈ క్రమంలోనే అక్కడి ఏసీపీ నుంచి నరసింహకు వార్నింగ్‌లూ వస్తాయి. చేసేదిలేక, చిన్నారిని తీసుకుని అక్కడినుంచి వెళ్ళిపోవాలనుకునేంతలో గౌరి ఎదురవుతుంది. ఇంతకీ గౌరి ఎవరు? ఆమె బిడ్డని నరసింహ ఎందుకు ఎత్తుకొచ్చేశాడు? వంటి ప్రశ్నలకు సమాధానం తెరపైనే దొరుకుతుంది. 

మొత్తంగా చెప్పాలంటే 
బాలయ్య అంటే మాస్‌. ఆయన అభిమానులు ఆయన్ని మాస్‌ యాంగిల్‌లో చూడటానికే ఇష్టపడతారు. అలా మాస్‌ ఎంటర్‌టైనర్‌ని బాలయ్య ఎంచుకోవడానికి కారణం కూడా అదే. ఈ సినిమాలో పక్కా మాస్‌ రోల్‌లో బాలయ్యని చూస్తాం. డైలాగ్‌ డెలివరీలో ఆయన గురించి కొత్తగా చెప్పేదేముంది? యాక్షన్‌ సీక్వెన్సెస్‌లో అదరగొట్టేశాడు. డాన్సులో అయితే చాలా చాలా కొత్తదనం చూపించాడు. సెంటిమెంట్‌ సీన్స్‌లోనూ సత్తా చాటాడు.

హీరోయిన్లలో నయనతార సహజంగా కన్పించింది. నటాషా దోషి గ్లామరస్‌గా రెచ్చిపోయింది. హరిప్రియ అల్లరి అమ్మాయి పాత్రలో నటించి మెప్పించింది. బ్రహ్మానందం కాఃస్త ఎక్కువ నిడివి ఉన్న పాత్రలో కనిపించి నవ్వులు పూయించే ప్రయత్నం చశారు. కానీ ఆయన్నుంచి ఇంకా చాలా హాస్యం రాబట్టే అవకాశాన్ని దర్శకుడు చేజార్చుకున్నాడు. మిగతా పాత్రలంతా తమ పాత్ర పరిధి మేర ఫర్వాలేదన్పిస్తాయి. 
కథ కొత్తదేమీ కాదు. బాలకృష్ణ గతంలో చాలా సినిమాలు ఇలాంటివి చేసేశారు. కథనంలోనూ కొత్తదనం చూపించలేకపోయాడు దర్శకుడు. బాలయ్య ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని రాసిన మాస్‌ డైలాగులు మెప్పిస్తాయి. సెంటిమెంట్‌ డైలాగ్స్‌ కూడా ఆకట్టుకుంటాయి. పాటలు ఓకే, తెరపై చూడ్డానికీ బాగున్నాయి. నిర్మాణపు విలువలు బాగున్నాయి. సెకెండాఫ్‌లో ఎడిటింగ్‌ ఇంకాస్త అవసరం అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఫర్వాలేదన్పిస్తాయి.

బాలకృష్ణ సంక్రాంతికి వస్తున్నాడంటే అభిమానులకు మాంఛి కిక్‌ దొరుకుతుంది. ఫ్లాష్‌ బ్యాక్‌ స్ట్రాంగ్‌గా ఉంటే బాలయ్య సినిమా హిట్టేనన్న సెంటిమెంటూ ఉంది. పైగా చిన్న పిల్లాడి సెంటిమెంట్‌ అనేసరికి సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయ్యింది. కానీ పాత చింతకాయ లాంటి కథ, కథనాలతోనే దర్శకుడు నెట్టుకొచ్చేశాడు. ఏమాత్రం కొత్తగా ఆలోచించకపోవడం మైనస్‌ పాయింట్‌. మంచి ఛాన్స్‌ని దర్శకుడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఫస్టాఫ్‌ ఫర్వాలేదన్పించినా, సెకెండాఫ్‌లో సెంటిమెంట్‌ ఎక్కువైపోయింది. అది కొంత ఇబ్బందికరంగా అన్పిస్తుంది. ఓవరాల్‌గా బాలయ్య తన అభిమానుల్ని మెప్పించేందుకోసం డాన్సుల్లో, ఫైట్స్‌లో చేసిన రిస్క్‌ అభినందించదగ్గదే. పండగ సీజన్‌, బాలయ్య అభిమానులపైనే ఈ సినిమా గట్టెక్కే బాధ్యత ఉంది.

ఒక్క మాటలో చెప్పాలంటే
జై సింహా మరీ 'జై' కొట్టేలా లేదుగానీ...

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
anjatavasi movie review