Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nadiche nakshatram telugu serial fourteenth part

ఈ సంచికలో >> సీరియల్స్

కుమారధార తీర్థంలో సాధువు! - గోపిని కరుణాకర్

kumaratheertham lo sadhuvu

మా తిరుమల కొండమీద తీర్థాలు ఉన్నాయి. కొన్ని తీర్థాలకు వెళ్లాలంటే దారి కూడా ఉండదు. తంబుర తీర్థం, కుమారధార తీర్థాలకైతే ముందుగా టీటీడీ ఉద్యోగులు వెళ్ళి చెట్టూ చేమా, కంపా కట్టే కొట్టి జనం వెళ్లడానికి అనువుగా దారి ఏర్పాటు చేస్తారు.

రాత్రిపూట దారిలో అక్కడక్కడ చెట్లకు దీపం వెలిగిస్తారు. అప్పుడు ఆ తీర్తాలకి వెళ్లడానికి వీలవుతుంది. కుమారధార తీర్థమైతే ఇంకా ఇష్టం. కొండలమధ్య లోయల్లో ఉంటుంది. లోయలోకి దిగటానికి ముందుగా వెళ్లి టీటీడీ ఉద్యోగస్తులు నిచ్చెనలు కడతారు. ఆ నిచ్చెనల ఆధారంగా చాలా జాగ్రత్తగా లోయలోకి దిగాలి. కాలు జారిందా అంతే! అందుకని చిన్నపిల్లల్ని తీసుకెళ్లరు.

మా బాలాజీ టీస్టాల్లో 'టీ' మాష్టారుగా పనిచేసిన మునిరెడ్డి టీటీడీలో ఉద్యోగంలో చేరాక, అతను ఒకసారి కుమారధార తీర్థంలో నిచ్చెనలు కట్టడానికి వెళ్ళాడు. అప్పుడు జరిగింది. ఈ కథ...

వీళ్లు నిచ్చెనలు కట్టుకుంటూ లోయలోకి దిగేసరికి, అక్కడ కుమారధార తీర్థంలో వీళ్లకి ఓ సాధువు కనిపించాడు. అతన్ని చూసి వీళ్లు ఆశ్చర్యపోయారు.

నిండు యవ్వనంతో మిసమిసలాడుతున్నాడు. ఒంటిమీద నూలు పోగులేదు. నగ్నంగా పున్నమినాటి చందమామలా కాంతివంతగా ఉన్నాడు. ఆ రాత్రి నెగడు వేసుకున్నారు. రాళ్ళు తెచ్చి పొయ్యిలు పెట్టి అన్నం, పప్పులుసు వండుకున్నాడు. నారవాకులు కోసుకొచ్చి విస్తరాకులు కట్టుకున్నాడు. సాదువుని కూడా భోజనానికి పిలిచారు. అతను చెయ్యనని సైగ చేశాడు.

"ఇంగ ఏం తింటారు స్వామి?" అని మునిరెడ్డి అడిగితే, బలవంతంగా మాటల్ని కూడబలుక్కుని హిందీలో చెప్పాడు.

"నేను అన్నం తినను. ఆకులూ అలములు తింటాను. అడవిలో కాసే పండ్లు ఏవైనా దొరికితే ఇష్టంగా తింటాను. ఇవేవీ దొరకలేదనుకో... గాలిని భోంచేసి, నీళ్ళు తాగి పడుకుంటాను" అని చెప్పాడు.

వీళ్లు రావటం అతనికి ఇష్టం ఉన్నట్టు లేదు. అంటీ ముట్టనట్టు ఉన్నాడు. మునిరెడ్డి వాళ్లకేమో అతని గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది.

ఆ సాధువు మనిషిలా లేడు. కనీసం అడవి మనిషిలా కూడా లేడు. ఒక్క మాటలో చెప్పాలంటే కోతి నుంచి వచ్చిన మనిషి మళ్లీ కోతైతే ఎలా ఉంటాడు? అలా ఉన్నాడు. ఆఖరిరోజు ఉండబట్టలేక వచ్చీరాని హిందీలో అడిగాడు మునిరెడ్డి. "ఏం స్వామీ! ఇంత చిన్నవయసులో ఇట్లా అడవులు పట్టుకుని ఎందుకొచ్చినావు? ఈ అడవిలో ఒంటరిగా ఉండేదానికి భయం లేదు?" అని అడిగాడు.

దీనికి ఆ సాధువు ఏం తిక్క సమాధానం చెప్పాడో తెలుసా? "ఎందుకు భయ్యా భయం? నాకు క్రూరమృగాలంటే భయం లేదు. మనుషులంటేనే భయం. అందుకే ఉత్తరాది నుంచి పారిపొయ్యి ఈ అడవిలోకి వచ్చాను" అని చెప్పాడు.

అతను చెప్పింది మునిరెడ్డి వాళ్లకు అర్ధం కాలేదు. అది గమనించిన సాధువు ఒక్కొక్క హిందీ మాటని వెతుక్కుంటూ, అప్పుడప్పుడే భాష నేర్చుకుంటున్న చిన్నపిల్లాడిలా తన గురించి చెప్పడం మొదలుపెట్టాడు.

"నా పేరు ఆనంద సావర్కార్! మాది భోపాల్... మా నాన్న ఇండస్ట్రియలిస్ట్ భోపాల్ లో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీస్, హోటల్స్, కమర్షియల్ కాంప్లెక్సులు అన్నీ మావే! మా నాన్న రెండు హిందీ సినిమాలు, అయిదు మరాఠీ సినిమాలు ప్రొడ్యూస్ చేశాడు. ఆ సినిమాలన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి. కాదు కాదు కావాలనే అట్టర్ ప్లాప్ సినిమాలు తీశాడు. ఎందుకో తెలుసా? లాస్ చూపించి బ్లాక్ మనీని వైట్ చేసుకోడానికి. నాన్న డబ్బు సంపాయించే ఓ యంత్రం! అంటే డబ్బు ఫ్రింట్ చేస్తారు చూడు, అలాంటి యంత్రమన్నమాట! అమ్మేమో ఆ డబ్బుని విలాసాలకు ఖర్చుపెడుతూ ఫ్రెండ్స్, పార్టీలంటూ విచ్చలవిడిగా తిరుగుతుండేది.

అక్కా, అన్నయ్యా, నేనూ ముచ్చటగా ముగ్గురు పిల్లలం. మాకంటే కూడా మా అమ్మకి డైమండ్స్ అంటే చాలా ఇష్టం. ఏ దేశంలో ఉన్నా, ఎంత ఖరీదైనా సరే! ఆ డైమండ్ మా అమ్మ మెడని అలంకరించాల్సిందే! అమ్మ అంటే డైమండ్, నాన్న అంటే డబ్బుని అచ్చువేసే యంత్రం!

ఈ డైమండ్ కి, యంత్రానికి పుట్టిన నేనెంత విచ్చలవిడిగా ఉంటానో మీరే ఊహించుకోండి. అక్కా, అన్నా చాలా డిసిప్లేన్ తో పెరిగారు నాన్న కోరుకున్నట్టు అతని అడుగులో అడుగు వేస్తూ, నాన్న చేసే బిజినెస్ లో పాలు పంచుకున్నారు. నాన్న కంటే వెయ్యి రెట్లు ఆస్తులు, ఐశ్వర్యం కూడబెట్టే పనిలో బిజీగా ఉన్నారు. నేనేమో అమ్మలాగా డబ్బు ఖర్చుపెడుతూ పార్టీలు, ఫ్రెండ్స్ అంటూ విచ్చలవిడిగా తిరిగేవాడ్ని. అమెరికాలో చదువుకుంటున్నప్పుడు రకరకాల గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్లు. వాళ్లతో డిస్కోధెక్కుల్లో మైఖేల్ జాక్సన్ పాప్ సాంగ్స్ కి డ్యాన్స్ చేస్తూ, ఒకసారి ఖరీదైన మద్యాన్ని సిప్ చేసి, ఇంకోసారి అమ్మాయిల లేత పెదవుల్ని సిప్ చేసి అమృతాన్ని గ్రోలేవాడ్ని.

"నేను మడొన్నాతో డేటింగ్ చేశాను. మీరు నమ్ముతారా?" అడిగాడు సాధువు.

"మడొన్నా అంటే ఎవరు స్వామి?" అని అడిగాడు మునిరెడ్డి.

ఆ మాటకి ఆశ్చర్యపోయి "మడొన్నా అంటే ఎవరో తెలీదా? పాప్ సింగర్... రంభ, ఊర్వశి, మేనకని తలదన్నే అందగత్తె" అని చెప్పాడు సాధువు.

"ఏమో స్వామీ! మాకు ఏం తెలుస్తుంది? మాకు సినిమా పాటలు పాడే సుశీల, జానకి తెలుసు. మా కొండకొచ్చి సదస్సులో కచ్చేరి చేస్తుందే ఎమ్మెస్ సుబ్బలక్ష్మి. ఆమంటే తెలుసు. ఆ మడున్నా మన్నూ మశానం ఆంటే ఎవరో తెలీదు" అన్నాడు మునిరెడ్డి.

ఆ మాటకి నవ్వి, "ఓ! సారీ సారీ... తెలియకపోతే ఫరవాలేదులే! కోరిన అమ్మాయితో ప్రపంచంలో ఏమూలకైనా సరే వెళ్లి ఏకాంతంగా ఎంజాయ్ చేసేవాడ్ని. కాని ఒక అడవి ఉంటుందని, ఆ అడవిలో జంతువులుంటాయని అప్పుడు నాకు తెలీదు" అని ఒక్క నిమిషం సైలెంట్ అయ్యాడు.

మళ్ళీ తనే ఆ సైలెన్స్ ని బ్రేక్ చేస్తూ, "ఆ... ఆరు నెలల క్రితం కెమికల్ ఫ్యాక్టరీస్ నుంచి విషవాయువులు రిలీజై, భోపాల్ అంతటా వ్యాపించి కొన్ని వేలమంది చనిపోయారు. గుర్తుందా?" అని అడిగాడు.

"తెలుసు..! పేపర్లో చదివాను. అయినా ఊరి మద్దెన అట్లాంటి ఫ్యాక్టరీలు ఎందుకు కడతారు స్వామీ! ఆ ఫ్యాక్టరీ  కట్టినోడ్ని ఉరి వెయ్యాలి" అన్నాడు మునిరెడ్డి.

"కదా..! అంతమందిని పొట్టన పెట్టుకున్న ఆ ఫ్యాక్టరీ మాదే!" అన్నాడు సాధువు.

ఆ మాటకి మునిరెడ్డి వాళ్లు పెద్దపులి ఎదురుపడ్డట్టు బిగుసుకుపోయారు.

"చూశారా! నేను మీకు పెద్దపులిలా కనిపిస్తున్నాను కదూ! నేను పులిని కాదు మనిషిని. పులి సాధుజంతువు. నేను క్రూర జంతువుని. ఆ దుర్ఘటన జరిగినప్పుడు డిస్కోధెక్ లో జర్మన్ అమ్మాయితో డ్యాన్స్ చేస్తూ, వెచ్చగా చలి కాచుకుంటున్నాను" అని చెప్పాడు.

మునిరెడ్డి వాళ్లనుంచి రెస్పాన్స్ లేదు. మౌనంగా అతడ్నే చూస్తున్నారు.

"ఆ సంఘటన తర్వాత నాన్నని అరెస్ట్ చేశారు. నేను ఇండియాకి రావాల్సి వచ్చింది. భోపాల్ వచ్చాక మా కార్ డ్రైవర్ ని వెంట పెట్టుకుని దుర్ఘటన జరిగిన ప్రాంతాల్లో తిరిగాను.
"బస్టాపులో నించున్నవాళ్ళు బస్టాపులోనే చనిపోయారు. బిడ్డకు పాలిస్తున్న తల్లి పాలిస్తూనే చనిపోయింది.

బిడ్డ రొమ్ము కుడుస్తూనే చనిపోయాడు. పెళ్ళి మండపంలో పెళ్లికొడుకు. పెళ్లికూతురు మెడలో తాళి కడుతూ నేలకొరిగాడు. మూడుముళ్ళూ వేయించుకోకుండానే పెళ్లికూతురు కూడా నేలకొరిగింది. పెళ్ళికొచ్చిన జనం పెళ్లిపందిరిలోనే ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై ప్రాణాలు వదిలారు. ఇలాంటి సంఘటనలు ఎన్నని చెప్పను? భోపాల్ అంతా శ్మశానంగా మారింది. మొట్టమొదటిసారిగా అప్పుడే, నాగరికత వాతలు వేసుకున్న మనిషిని మా నాన్నలో చూశాను. ఆ వాతలు నా శరీరంపై కూడా ఉన్నాయి" అని భోరున విలపించాడు. ఏడుస్తూనే చెబుతున్నాడు. కోపంగా అరుస్తున్నాడు, ఉన్మాదిలా బిహేవ్ చేస్తున్నాడు.

"చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కోర్టులు మా నాన్నలాంటి వాళ్లకు శిక్ష వేస్తాయి. ప్రాణాలు కోల్పోయినవారి బంధువులకు కోట్ల రూపాయలు నష్టపరిహారం అందుతుంది. ప్రతిపక్ష పార్టీలు దీన్ని ఆసరాగా తీసుకుని ఎలక్షన్స్ లో గెలిచి పార్టీని ఏర్పాటు చేస్తాయి.

స్త్రీలు, పురుషులు, వృద్ధులు, చిన్న పిల్లలు... చనిపోయినవారి ఆత్మకు శాంతి కలగాలని ప్రతి సంవత్సరం ఆ సంఘటనని గుర్తు చేసుకుని బరువెక్కిన హృదయాలతో కొవ్వొత్తులను వెలిగిస్తారు. కవులు, రచయితలు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చి కవితాగానం చేస్తారు. కళాకారుల రంగస్థలమీద ఆ సంఘటల్ని అద్భుతంగా ప్రదర్శించి రక్తికట్టిస్తారు. దర్శకులు ఊపిరి తీసుకోనివ్వని స్క్రీన్ ప్లేతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తారు. చిత్రకారులు ఆ సంఘటనల్ని రంగుల్లో ముంచి, పికాసో గెర్నికా కంటే మించిన చిత్రాలను గీస్తారు.

జనం మెల్లమెల్లగా ఆ సంఘటన తాలూకు జ్ఞాపకాలను ఎరేజ్ చేసుకుంటారు. అయినా నా శరీరంపై ఉన్న వాతల్ని ఎవరూ ఎరేజ్ చెయ్యలేరు. సత్యాన్వేషణలో రాజ్యాన్ని, తల్లిదండ్రులను, భార్యాబిడ్డల్ని వదిలివచ్చిన సిద్ధార్ధుడిలా నాలోని జంతువుని అన్వేషిస్తూ ఈ అడవికి వచ్చాను.

కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు కాళ్ళు అరిగేలా తిరిగాను. యోగులు, సాధువులు, సన్యాసులతో సావాసం చేశాను. యోగవిద్యల్ని అభ్యాసం చేశాను. కఠోర నియమాలతో ఆచరించాను. అయినా నేను జంతువుని కాలేకపోయాను. నా శరీరంపై ఉన్న వాతలు చెరిగిపోలేదు. అప్పుడు జ్ఞానోదయమైంది నాకు. మనిషితో జీవిస్తున్నంత కాలం నేను జంతువుని కాలేనని. అందుకే ఈ అడవిలోకి వచ్చాను.

ఈ జంతువుల మధ్య జీవించడం మొదలుపెట్టాను. కాషాయవస్త్రాలు చిరిగిపోయాయి. నా శరీరంమీద వాతలు చెరిగిపోయి, నేను జంతువుగా రూపాంతరం చెందడం మొదలుపెట్టాను. ఆకులు, అలములు తినటం అలవాటు చేసుకున్నాను. గడ్డీ గాదం నెమరువేయటం నేర్చుకున్నాను. భాషని కూడా మరిచిపోతున్నాను. జంతువుగా మారుతున్న దశలో మీరు వచ్చి నన్ను మళ్లీ మనిషిని చేశారు. అయ్యా! నా శ్రమంతా వృధా అయ్యిందే!" అని భోరున విలపించాడు. అతను అలా విలపిస్తుంటే మునిరెడ్డి వాళ్ళు నిలువు గుడ్లేసుకుని చూస్తూ ఉండిపోయారు. అతను చెప్పింది అతని కథేనా? లేదా కట్టు కథా? ఏమో ఎవరికీ తెలుసు. అతనైతే మంచి కథ చెప్పాడు. ఆ రాత్రి గడిచింది.

తెల్లవారి లేచి చూస్తే సాధువు కనిపించలేదు. ప్రతి సంవత్సరం నిచ్చెనలు కట్టేదానికి మునిరెడ్డివాళ్లు వెళుతున్నారు. తర్వాత ఎప్పుడూ వాళ్లకు ఆ సాధువు కనిపించలేదు.

కోతి నుంచి మనిషి వచ్చినట్టు, అతను మనిషి నుంచి పరిపూర్ణమైన కోతిగా రూపాంతరం చెంది, ఈ అడవిలోనే ఎక్కడో స్వేచ్చగా తిరుగుతుంటాడు.


(...వచ్చే వారం వంశీ కి నచ్చిన ఇంకో కథ)

మరిన్ని సీరియల్స్