Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Why do we do Kalasa Pooja?

ఈ సంచికలో >> శీర్షికలు >>

నేనూ నా జ్ఞాపకాలు: పుస్తక సమీక్ష - సిరాశ్రీ

nenu naa jnapakaalu book review

పుస్తకం: నేనూ నా జ్ఞాపకాలు
రచన: తమ్మారెడ్డి కృష్ణమూర్తి
సంకలనం: ఎస్వీ రామారావు
వెల: 75/-
ప్రతులకు: విశాలాంధ్ర పుస్తక విక్రయ కేంద్రాలు

అలనాటి చలన చిత్రాలతో పరిచయం ఉన్న వారికి తమ్మారెడ్డి కృష్ణమూర్తి పేరు తెలియకుండా ఉండదు. లక్షాధికారి, జమిందారు, బంగారు గాజులు, ధర్మ దాత, డాక్టర్ బాబు వంటి ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించిన నిర్మాత ఆయన. ఇక నేటి తరం వారికి ప్రముఖ సినీ దిగ్గజం తమ్మారెడ్డి భరద్వాజ తండ్రిగా సుపరిచితులు. ఈ మధ్యనే కృష్ణమూర్తిగారు కాలం చేసారు. తెలుగు పరిశ్రమలో ప్రస్తుత మూలవిరాట్టు అక్కినేని నాగేశ్వర రావు దగ్గర్నుంచి పరిశ్రమ యావత్తూ వారికి నివాళులు అర్పించింది. వారిని ఈ సందర్భంగా తలుచుకోవడంతో పాటు 2008 లో విడుదలయిన తమ్మారెడ్డి కృష్ణమూర్తి లఘు జీవిత చరిత్ర "నేనూ నా జ్ఞాపకాలు" గ్రంథాన్ని గురించి చెప్పుకుందాం.

జీవిత చరిత్రల లక్ష్యం జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులు, వాటిని ఎదుర్కొనే మానసిక ధైర్యం, స్ఫూర్తి భావి తరాల వారు పొందేలా చేయడం. కానీ ప్రతీ విషయాన్ని వివరంగా చెప్పాలన్న ఆలోచనతో గ్రంథ విస్తారం చేసేస్తుంటారు చాలా మంది. ఎవరి మీదైనా కాస్తంత ఇష్టంతో వారి జీవిత చరిత్ర చదువుదామంటే అదొక 500 పేజీలు ఉంటుంది... చూడగానే ఆయసం వచ్చి దాని జోలికి పోని వాళ్ళే ఎక్కువ. ఆ విషయం గ్రహించారో లేక యాధృచ్చికమో తెలీదు కాని తమ్మరెడ్డి గారు తన జీవిత చరిత్రని ఫొటోలతో కలిపి 98 పేజీల్లో ముగించేసారు. ఆపైన ఇతరుల వ్యాసాలు వగైరాలు కలిపి మొత్తం పుస్తకం 116 పేజీలు. "నేనూ నా జ్ఞాపకాలు" అనే టైటిల్ చూడగానే పుస్తకాన్ని పట్టుకోవాలనిపించడం, వెంటనే చదివే ప్రయత్నం మొదలుపెట్టడం, చెప్పదలచుకున్న విషయం సూటిగా సహజ శైలిలో చేప్పేయడం కారణంగా గంటలోపే చదవడం పూర్తి అయిపోతుంది.

సినీ ప్రియులను ఆకట్టుకునే పలు అంశాలు ఇందులో ఉన్నాయి. 1952 లో విడుదలయిన "పల్లెటూరు" చిత్ర నిర్మాణం సంగతులు చెప్తూ ఇలా రాసారు. "అప్పట్లో ఎక్స్ ట్రా నటులకు మగవారికి మూడున్నర రూపాయలు, ఆడవారికి ఐదున్నర రూపాయలు ఇచ్చేవారు. ఎక్స్ ట్రా సప్లైర్లు దాంట్లో సగం కమీషన్ గా కాజేసే వారు. వారి సమస్యలను గ్రహించి ప్రొడ్యూసరే డైరెక్టుగా ఎక్స్ ట్రా నటులకు స్పాట్ పేమెంట్ జరిగేలా ప్రయత్నించి సఫలీకృతమయ్యాను. ఎక్స్ ట్రా సప్లైర్స్ నాపై దాడి చేసినప్పటికీ మా కృషి జూనియర్ ఆర్టిస్టులకు ఎంతగానో సహాయపడింది".

ఇలాంటివి సినిమా రంగంలో వారినే కాకుండా సినిమా పరిశ్రమ చరిత్ర తెలుసుకోవాలనుకునే వారిని కూడా ఆకట్టుకుంటాయి.

అలాగే "తెలుగు చిత్రంలోని ఏరువాక సాగారో అన్న పాట ట్యూన్ ని హిందీ చిత్రం "బొంబాయి కా బాబు" లో ఉపయోగించుకున్నారు" అని ప్రస్తావించారు.

ఇటువంటి విషయాలు ఈ పుస్తకానికి సంకలనకర్తగా వ్యవహరించిన ఎస్వీ రామారావు గారికి కరతలామలకమే అయివుండొచ్చు కానీ, నేటి తరం వారికి న్యూ డిస్కవరీలే..అందుకే ఈ ముక్క చదివిన వెంటనే యూట్యూబ్ లో ఆ హిందీ పాట కొసం వెతికి విన్నాను. "దెఖ్నే మే బోలా హై..." అని ఉంది..యాసిటీజ్ గా యారువాక ట్యూనే..!

ఇంకా తన రష్యా పర్యటన గురించి చెబుతూ 1924 లో మరణించిన రష్యా విప్లవ కారుడు లెనిన్ పార్ధివ శరీరాన్ని భద్ర పరిచిన తీరు చూసి పరవశించిపోయామని రాశారు. నేనిది 2013 లో చదువుతున్నాను కనుక రష్యా వెళ్లక్కర్లేకుండానే గూగుల్ లో వెతికేసి చూడగలిగాను.

ఇలాంటి సంగతులు ఎన్నో. చరిత్రని షార్ట్ కట్ లో చదివిన అనుభూతి.

సినిమా చరిత్ర అంటే సరదా ఉన్న వారంతా చదవాల్సిన పుస్తకం ఈ "నేనూ నా జ్ఞాపకాలు". "వీల్" ఉంటే... ఐమీన్ "వీలుంటే"... మీకు అందుబాటులో టూ ‘వీల’రో, ఫోర్ ‘వీల’రో, లేక ఆటొ లాంటి త్రీ ‘వీల’రో ఉంటే విశాలాంధ్రకి వెళ్లి ఈ పుస్తకం సంపాదించండి.

మరిన్ని శీర్షికలు
Navvula Jallu by Jayadev Babu