Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Movie Review - Attarintiki Daaredi

ఈ సంచికలో >> సినిమా >>

సింగీతం - ఓ నిత్య ప్రయోగ శాల

Interview with Singeetam Srinivasa Rao

 ’సంగీతానికి గుడి కడితే అది సింగీతం అవుతుంది’ అనే వారు స్వర్గీయ పీబీ శ్రీనివాస్ నర్మగర్భంగా... ఆయన ప్రస్థావన వచ్చినప్పుడల్లా. అది అక్షరాలా నిజం. ఇప్పుడంటే ఇటీవల రిలీజైన వెల్ కమ్ ఒబామా సినిమా టైటిల్స్ లో సంగీత దర్శకుడిగా ఆయన పేరు చూసి ’ఏంటి ...  సింగీతం శ్రీనివాసరావు గారు మ్యూజిక్ కూడా ఇస్తారన్నమాట అని’ మన తెలుగు వారు అనుకుంటున్నారు గానీ నిజానికి సంగీత దర్శకుడిగా ఆయన ప్రస్థానం కన్నడ చిత్రం ’భాగ్యద లక్ష్మి బారమ్మా’ (1985) తో  మొదలైంది .

ఆ సినిమాకి దర్శకత్వంతో పాటు సంగీతాన్ని కూడా అందించారాయన. సంగీత దర్శకుడిగా అదే ఆయన మొదటి చిత్రం. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్, మాధవి హీరో హీరోయిన్లు. అందులో పి. సుశీల, రాజ్ కుమార్ పాడిన ’ఇన్ను హత్తిరా’ పాట ఇవాళ విన్నా ఎంతో మెలోడియస్ గా, మోడర్న్ గా వుంటుంది  ఆ తర్వాత రాజ్ కుమార్ గారబ్బాయి  శివరాజ్ కుమార్  హీరోగా ’సంయుక్త ’ సంగీత దర్శకుడిగా రెండవ చిత్రం. ఈ చిత్రానికి సింగీతం కేవలం సంగీతాన్ని  మాత్రమే అందించారు.   దర్శకత్వం ఆర్. చంద్రశేఖర్.

ఇక తెలుగులోకొచ్చేసరికి ’పెళ్ళి పందిరి’ టీవీ సీరియల్ కి సంగీతాన్నిచ్చారు. ఆ తర్వాత ఎస్. రాజేశ్వర రావు గారిపై ఓ ప్రైవేట్ ఆల్బమ్.  ఇదొక విశిష్ట ప్రయోగం. ఎస్. రాజేశ్వరరావు గారి పాత ప్రైవేట్ సాంగ్స్ ని తీసుకుని వాటి పల్లవులు ఏ శ్రుతిలో,  ఏ లయలో వున్నాయో వాటితో సమానంగా  రాజేశ్వరరావు గారి సంగీత సామర్ధ్యాన్ని, కృషిని పొగుడుతూ ప్రత్యేకంగా రాసిన పాటలను కలుపుకుంటూ కొత్త పాటలను స్వరపరచడం. ఈ పాటలను కూడా లబ్ధ ప్రతిష్టులైన  వేటూరి, సిరివెన్నెల, భువనచంద్ర వంటి వారు రాయగా సుశీల, బాలు, జానకి, వాణీ జయరాం వంటి వారు పాడడం. అటువంటి ప్రయోగం న భూతో అనే చెప్పాలి.

వీటన్నిటికీ సజీవ సాక్ష్యంగా మిగిలే అదృష్టం జర్నలిస్ట్ లలో నాకు మాత్రమే దక్కింది.  ఇక రచయితగా ’భైరవ ద్వీపం లో విరిసినదీ వసంత గానం పాట. ఆ తర్వాత మధ్యలో ’ఘటోత్కచుడు’ యానిమేషన్ ఫిల్మ్ కి. మళ్ళీ ఇన్నాళ్ళకి, ఇన్నేళ్ళకి దర్శకుడిగా మాత్రమే కాకుండా సంగీత దర్శకుడిగా, సినిమాలో అన్ని పాటలనూ  రాసిన రచయితగా ఆయన చూపించిన కొత్త కోణం - వెల్ కమ్ ఒబామా .  ఈ సందర్భంగా ఆయన్ని ఇంటర్వ్యూ చెయ్యాలని అడగ్గానే మా ఇద్దరికీ ఎన్నో ఏళ్ళుగా వున్న పరిచయాన్ని కూడా పురస్కరించుకుని వెంటనే ఓకే అనేశారు. చెన్నై నుంచి సుమారు అరగంట పాటు సాగిన ఆ ఇంటర్వ్యూకి అక్షర రూపం ఇదీ :

"ఈ సినిమాకి మ్యూజిక్ ఇవ్వాలని, అన్ని పాటలూ మీరే రాయాలని ఎందుకనిపించింది?"
"ఇది వరకు పల్లవి చూడగానే ఏదో ట్యూన్ స్ఫురించేది. అలాగే సిట్యుయేషన్ అనుకోగానే ఏదో పల్లవి తట్టేది. ఉదాహరణకి పంతులమ్మ సినిమాలో పండగంటి ఎన్నెలంతా సెందరయ్యా ... దండగై పోతోంది సెందరయ్యా’ పాట పల్లవి నాదే. విని వేటూరి గారు ఎంత సంతోషించారో... టైటిల్స్ లో నా పేరు కూడా వుండాలని పట్టుబట్టారు కూడా. "

(ఇక్కడ మరో సరదా బిట్ ఏమిటంటే ఎప్పుడైనా ఆదివారం నాడు వేటూరి సుందర్రామ్మూర్తి గారు, బాలు గారు కలవాలని అనుకుంటే , వేటూరి గారు ఎంతకీ రాకపోతే బాలు గారు ఫోన్ చేసి ’ ‘అందమైన ఆదివారం సుందరయ్యా ... దండగైపోతోంది సుందరయ్యా ’ అని పాడేవారు. ఈ పాట పల్లవి అంతగా నోటికి పట్టు బడింది అనడానికిదో ఉదాహరణ)

"అలా ఈ సినిమా స్క్రిప్ట్ రాసుకుంటూ వుంటే కొన్ని పల్లవులు, కొన్ని ట్యూన్ లు స్పాంటేనియస్ గా తట్టేవి. వాటిని దాచుకుని తద్వారా డెవలప్ చేస్తే  మొత్తం పాటగా తయారయ్యేది."

"అంతేనా ... అన్నీ మీరే చేసేసి కొత్త నిర్మాతలకి బడ్జెట్ తగ్గిద్దామనా?"
"బడ్జెట్ దేముంది ... అవకాశం వస్తే చాలనుకుని టాలెంట్ నిరూపించుకోవడానికి సిద్ధంగా - సింగర్స్ లోనూ, మ్యుజీషియన్స్ లోనూ, రైటర్స్ లోనూ   చాలా మంది వున్నారు. అలా చూస్తే నేనే ఎక్స్ పెన్సివ్.. ఒక్కో పాటకి మూడు నాలుగు రకాల ట్యూన్లు, స్క్రిప్ట్ లు తట్టేవి. అలా నాకు స్పాంటేనియస్ గా తట్టినవి బాగోలేవనిపిస్తే రకరకాల అల్టర్నేటివ్స్ రైటర్స్ లోను, మ్యూజిక్ డైరెక్టర్స్ లోనూ ఎప్పుడూ వున్నారు. అంచేత అది నిజం కాదు.  అసలా థాటే రాలేదు. విన్నవారందరూ బావుందన్నారు. అందులో నిర్మాతలతో  పాటు నాకు అసిస్ట్ చేసే పూర్ణ ప్రజ్ఞ కొడుకు అనంత్, మా ఆవిడ కళ్యాణి వున్నారు. వాళ్ళు పాటల రికార్డింగ్ లో కూడా నాతో పాటే వున్నారు."

"సో , ఇదో ఫ్యామిలీ ప్రాజెక్ట్ లా అయిందనా మీ మనవరాలితో కూడా పాడించారు?"
"(నవ్వుతూ) నో నో నో ... ఇది కూడా నిజం కాదు. ’పుట్టింది పాల కడలి లో’ పాటని పాడిన ఆ అమ్మాయి నేను పాడించక ముందే తనేమిటో ప్రూవ్ చేసుకుంది. ఆ అమ్మాయి అంజనీ నిఖిల - బాలూ గారి ’పాడుతా తీయగా’ లో ’నీ లీల పాడెద దేవా’ పాటని పాడేసరికి జడ్జ్ గా వచ్చిన వాణీ జయరాం లేచి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చింది. అదీ ఆ అమ్మాయి టాలెంట్. ఆ అమ్మాయి నాకు డైరెక్ట్ మనవరాలు కాదు. మా నాన్నగారి తమ్ముడికి ముని మనవరాలు. అలా నాకు మనవరాలు. ఎలాగూ సింగీతం ఫ్యామిలీయే కనుక నిఖిల సింగీతం అని టైటిల్స్ లో వేశాం."

" ఈ పాటను పాడిన వారిలో రేచెల్ పేరు కూడా వుంది. హీరోయిన్ కి ఆపోజిట్ గానే కాకుండా సింగర్ గా కూడా మరో పాత్ర పోషించింది. ఆవిడ చేతే ఎందుకు పాడించాలనుకున్నారు?"
"మొదట ప్లేబ్యాక్ చేద్దాం అనుకున్నాం. కానీ ఆవిడ ఒరిజినల్ గా మంచి సింగర్. వెస్ట్రన్ మ్యూజిక్ లో ట్రైనింగ్ అయింది. అవిడ కి ఎలా పాడలో రోజూ ముంబై కి ఫోన్ చేసి ఫోన్ లోనే ట్రైనింగ్ ఇచ్చాం "

"ఆవిడ ముంభై లో వుంటారా ? "
"ఒరిజినల్ గా యూకే లో వుంటుంది. మంచి సోషల్ యాక్టివిస్ట్. ముంబై స్లమ్ ఏరియాస్ లో వుండే పిల్లలకి చదువు చెప్పించడం లాంటి సోషల్ సర్వీస్ చేస్తుంది. దానికి కావల్సిన ఫండ్స్ కోసం మోడలింగ్ చేస్తుంది. యాడ్ ఫిల్మ్స్ లో నటిస్తుంది. ఆ మధ్య రణబీర్ కపూర్ తీసిన ఓ యాడ్ ఫిల్మ్ లో యాక్ట్ చేసింది. షారుఖ్ సినిమాలో కూడా ఓ చిన్న పాత్ర పోహించింది. ఇవన్నీ ఫండ్స్ కోసమే చేస్తుంది. అంత గొప్ప వ్యక్తిత్వం ఆమెది. మేం చెప్పింది చక్కగా అర్ధం చేసుకుని యాక్ట్ చేసింది. సైకిల్ బ్యాక్ క్యారియర్ మీద కూచోమంటే కూచుంది. పల్లెటూరి పొలాల మధ్య తిరిగింది. ఏది పెడితే అదే తిన్నది. ఏదిస్తే అదే తాగింది.  హైజీనిక్ అంటూ ఎక్కడా ఏ ఇబ్బందీ పెట్టలేదు. అలాగే పాట విషయంలో కూడా నాకే ఎక్స్ ప్రెషన్ ఎలా కావాలో ఆలా ఇచ్చింది ."

"అలాగే మరొక చిన్న అమ్మాయి ప్రవస్థి చేత కూడా ’ఐ ఐ ఐ ఐయామె హీరో ’ పాటని పాడించారు ... అదెలా జరిగిందో కూడా చెప్పండి"
"ఈ చిత్ర నిర్మాతలు భారతీ కృష్ణ లు టివీల్లో రియాల్టీ షో ప్రొగ్రామ్ లు చేస్తూ వుంటారు. జీ టీవీ సరిగమ లో ఈ ప్రవస్థి అందులో పార్టిసిపేట్ చేసి అందర్నీ ఆకర్షించిందిట. అలా నిర్మాత భారతి గారి సజెషన్ తో ఆ అమ్మాయి చేత పాడించడం జరిగింది. ’ఘటోత్కచుడు యానిమేటెడ్ ఫిల్మ్ లో మై హూ ఘటోత్కచ్ ఓ పాట మీకు గుర్తుందా ... ఆలాగే వుంటుందీ పాట. ఆ అమ్మాయి కూడా అద్భుతంగానే కాదు అనర్గళం కూడా పాడింది. ఆ పాటని  కాగితం చూడకుండా పాడడం ఎవరికైనా కష్టం. అలాంటిది ఆ అమ్మాయి అసలు పేపర్ చూడకుండానే టకటకా పాడేసింది."

"పాటలే కాకుండా రీరికార్డింగ్ కూడా అల్ట్రా మోడర్న్ గా వుంది ... కారణం ఏమిటంటారు ?
"రొటీన్ గా వినిపించే పాత ఇన్ స్ట్రుమెంట్స్  పద్ధతి  ఎక్కడా ఫాలో అవలేదు. ఈ మ్యూజిక్ ప్రోగ్రామింగ్ విషయంలో జైపాల్ రాజ్ నాకు హెల్ప్ చేశాడు. ‘నాయకన్ ‘ సినిమాలో నటించిన శరణ్య తండ్రి  ఏ బీ రాజ్ అని మలయాళంలో మంచి డైరెక్టర్. ఆయన కొడుకు ఈ జైపాల్ రాజ్. అంటే శరణ్య కి బ్రదర్ అన్నమాట. సీడీ కవర్ మీద కూడా ఆయన పేరు వుంటుంది చూడండి "

"ఈ సినిమాలోని ఐదు పాటల్లో మీ దృష్టిలో దేనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ? "
"ఆకాశాన్నంటే పాటకే"

"మరి పుట్టింది పాల కడలిలో చాలా క్యాచీ గా వుంది కదా?"
"కావొచ్చు ... అందులో హీరోయిన్ ఊర్మిళ తనకు తట్టే ఉదాహరణలతో ఒక వెర్షన్ లో పాడితే , రేచెల్ తనకు తట్టే ఉదాహరణలతో తన వెర్షన్ లో పాడుతుంది. ఇలాంటివి ప్రింట్  మీడియాలో బావుంటాయి. అనుభూతి చెందడానికి వెనక్కి వచ్చి చదువుకునే సౌలభ్యం వుంటుంది. కానీ సినిమా అనేది రన్నింగ్ మీడియా. వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం వుండదు. అప్పుడు పింగళి గారిలాగ, ఆత్రేయ గారిలాగ సులువుగా వుండే మాటలతో జనాల్ని ఆకర్షించాల్సిందే. ఆకాశాన్నంటే పాటలో ఆ లక్షణాలున్నాయి."

"మీ పాటలు విన్న తర్వాత ఇండస్ట్రీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది?"
"పరుచూరి గోపాల కృష్ణ, ఆర్పీ పట్నాయిక్, కౌసల్య లాంటి వారు ఫోన్ చేసి అభినందించారు. దాసరి నారాయణ రావు గారు ఈ సినిమాలో నాకు ఫస్ట్ నచ్చింది మ్యూజిక్ అని స్టేజ్ మీదే ప్రకటించారు. బాలూ గారు కూడా మొన్న వందేళ్ళ భారతీయ సినీ వేడుకల్లో కలిసి పాటలు భలే స్వీట్ గా వున్నాయండీ ... సినిమా ఎప్పుడు చూస్తానా అని వుంది అని అన్నారు. ఇలా ఇంకా ఇప్పటికీ అభినందనలు వస్తున్నాయి "

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, విషయాలతో, విశేషాలతో నిత్య నూతనంగా వుండే వాసి గల వారికి వార్ధక్యం ఓ అడ్డు కాదని మరో సారి నిరూపించిన  సింగీతం శ్రీనివాస రావు గారిని అభినందిస్తూ ....






రాజా (మ్యూజికాలజిస్ట్)

మరిన్ని సినిమా కబుర్లు
Cine Churaka by Cartoonist Bannu