Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Cine Churaka by Cartoonist Bannu

ఈ సంచికలో >> సినిమా >>

మ్యూజిక్ ముచ్చట్లు

Raja Music Muchchatlu

వి ఎ కె చెప్పిన విశేషాలు
ప్రముఖ సంగీత విశ్లేషకుడు, పరిశోధకుడు, వివిధ భాషలకు చెందిన సుమారు అరవై  రెండు వేలకు పైగా రికార్డులను కలిగి వున్న సంగీత నిధి, నా వంటి వారెందరికో గురుతుల్యుడు అయిన శ్రీ వి.ఎ.కె. రంగారావు భారతీయ సినిమా వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ ఇరవై అయిదవ తేదీన హైదరాబాద్ వచ్చి డా.॥ గురవారెడ్డి తన సన్ షైన్ హాస్పిటల్ లో ప్రత్యేకంగాకట్టించుకున్నఆడిటోరియమ్ లో సినీ సంగీతాభిమానులకు అద్భుతమైన సమాచారాన్ని క్లిప్పింగ్స్ తో సహా చూపించి మరీ వివరించారు.  సుమారు గంటన్నర పాటు సాగిన ఆ ప్రసంగ విశ్లేషణ లో కొన్ని ఆణిముత్యాలివి :

శాంతారామ్ తీసిన ఎన్నో సంగీత భరిత చిత్రాలు తర్వాతి తరం వారికి ప్రేరణలు, మార్గ దర్శకాలు అయ్యాయి. ఆయన మరాఠీ లో తీసిన ’మత్ వాలీ శాయర్ రామ్ జోషి’ మన ’జయభేరి’ చిత్రానికి  ప్రేరణ’ ఆ సినిమాలో హీరో మన్ మోహన్ కృష్ణ డప్పు పట్టుకున్న తీరు ’సిరి సిరి మువ్వ’ లో చంద్రమోహన్ డప్పు పట్టుకున్న పద్ధతికి ప్రేరణ.



నవరంగ్’ సినిమాకి నృత్య దర్శకుడిగా శామ్ అనే పేరు వుంటుంది. శాంతారామ్ తన పేరు లోని మొదటి, ఆఖరి అక్షరాల్ని కలుపుకుని అలా వేసుకున్నాడు.అన్ని పాటలకూ తనే నృత్య దర్శకత్వం వహించాడు. అ సినిమాకి సంబంధించిన బ్రోచర్ ఒకటి రిలీజ్ అయినప్పుడు శామ్ పేరు మీద తన అల్లుడి ఫొటో వేశాడు. ఆ సినిమాలోని  నృత్యాలకు ఉత్తమ నృత్య దర్శకత్వం అవార్డు కూడా వచ్చినప్పుడు ఆ అల్లుడు వెళ్ళి అవార్డు తీసుకోవడానికి నిరాకరించాడు. "మీరు  చేసిన పనికి నేను అవార్డు తీసుకోవడం తగదు" అన్నాడు. విధి లేక శాంతారామ్ ఆ అవార్డు తీసుకుంటున్నప్పుడు నృత్య దర్శకత్వం వహించింది తనేనని ఆ వేదిక మీద ప్రకటించాడు.

హృషికేష్ ముఖర్జీ తీసిన ’అభిమాన్’ ఎంతో మంచి సినిమా. సంగితం కూడా ఎంతో బావుంది. ప్రతీ పాటా స్క్రీన్ ప్లే లో ఒక అంతర్భాగం అదే మాట నేను (వి.ఏ.కె. రంగారావు) సత్యజిత్ రే తో అంటే " సీ మిష్టర్ రావ్ ... ఇట్ మే బీ ఎ గుడ్ ఫిల్మ్ బట్ ఐ డోన్ట్ లైక్ హీరో హీరోయిన్స్ బ్రేకింగ్ ఇంటూ సాంగ్ విత్ అర్కెష్ట్రా " అన్నారు. దానికి నేను " మే ఐ ఆస్క్ యు వన్ క్వశ్చెన్ ? " అన్నాను. ఆయన యస్ అన్నారు. " మీ ఫిల్మ్స్ లో వాటర్ స్పైడర్స్ అటూ ఇటూ తిరుగుతూ వుంటాయి. అప్పుడు సరోద్, సితార్ వినిపిస్తూ వుంటాయి. అవి ఎక్కణ్ణుంచి వచ్చాయి. అక్కణ్ణించే మాకొక లతా మంగేష్కర్ వచ్చింది. అక్కణ్ణించే మాకొక మహమ్మద్ రఫీ వచ్చాడు" అని జవాబిచ్చాను.

భానుమతి బద్ధకస్తురాలు. ఆమె ఒళ్ళొంచి నాట్యం చేయలేదు. కానీ శాస్త్రం తెలుసు. అలాగే నృత్య దర్శకుడు పసుమర్తి కృష్ణమూర్తికి శాస్త్రం తెలుసు, ఆయన ఏ నృత్యం కూర్చినా అందులో చాప కింద నీరులా శాస్త్రం తొంగి చూస్తూ వుంటుంది. ఆయనకి భానుమతి సంగతీ బాగా తెలుసు. అందుకే ’మల్లీశ్వరి’ లోని ’పిలచినా బిగువటరా’ పాటలో ఆమె చేత బులబులాగ్గా చేయించాడు. నేను (వి.ఏ.కె) అడిగాను - "అదేంటండీ అలాచేయించారు ? " అని. దానికాయన అన్నాడు " మీకు భానుమతి సంగతి తెలుసు. బి.యన్. రెడ్డి చెప్పినా ఎవరు చెప్పినా ఆవిడ అనుకున్నదే చేస్తుంది. అదీకాక సినిమాలో ఆవిడ పాత్ర ఓ పద్మసాలీల పిల్ల. ఆ పద్మసాలీల పిల్లకి అంతకన్నా నాట్యం ఏమొస్తుంది ? "

అలాగే  ... చింతామణి సినిమాలో తరంగమో, అష్టపదో పెడదామనుకున్నారు. పాటల పుస్తకంలో వుంది. సినిమాలో లేదు. నేను రామకృష్ణ గారిని అడిగితే ఆవిడెక్కడ పాడుతుందండీ ... ఈ మూడు పాటలకే నా ప్రాణం తీసింది - అన్నారు.

’అన్నమయ్య సినిమాలోని  ’పొడగంటిమయ్యా నిన్ను పురుషోత్తమా’ కి వరస చేసింది డి. పశుపతి. ఆయన నేను చేసే నృత్యాలకు కూడా పాడేవారు. అన్నమయ్య లో కీరవాణి తీసుకున్నది ఆయన వరసే. ఏమీ మార్చలేదు. మరి కీరవాణి చేసిన పని ఏమిటయ్యా అంటే వాద్యగోష్టి. బాలసుబ్రహ్మణ్యంతో పాడించిన తీరు. సినిమాలోని ఆ సన్నివేశానికి పశుపతి చేసిన వరస కంటే కీరవాణి సమకూర్చిన వాద్య గోష్టి, బాలసుబ్రహ్మణ్యం తో పాడించిన తీరు బాగా అతికింది.








రాజా (మ్యూజికాలజిస్ట్)

మరిన్ని సినిమా కబుర్లు
Aditya Hrudayam