Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమిస్తే ఏమవుతుంది?

premiste emavutundi?

గత సంచికలోని ప్రేమిస్తే ఏమవుతుంది సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి....http://www.gotelugu.com/issue249/675/telugu-serials/premiste-emavutundi/premiste-emavutundi/

(గత సంచిక తరువాయి)... ఆవిడ మొహం లోకి ఏదో వెతుకుతున్నట్టుగా చూసింది శరణ్య.. ఎందుకు మాట్లాడరు.. ఏంటి వీళ్ళ సమస్య.. అప్పటి దాకా లేని కుతూహలం కలిగింది. ఏదన్నా కష్టం ఉంటె తను సాయం చేయచ్చుగా ..

శరణ్య మనసులో ఆలోచన పసిగట్టినట్టు మళ్ళి అంది ఆవిడ..”మేము ఎవరితో మాట్లాడము.. మాతో ఎవరూ మాట్లాడద్దు.”

“ఎందుకని?” విస్మయంగా అడిగింది శరణ్య.

ఆవిడకి దుఃఖం ఉధృతం అయింది. “ మా దురదృష్టం” అంది ఏడుస్తూ .

శరణ్యకి బాధగా అనిపించింది.  “ఆంటటీ నేను మీ కూతురు లాంటి దాన్ని. మీకేదన్నా ప్రాబ్లం ఉంటే చెప్పండి...నా చేతనైన సాయం చేస్తాను ప్లీజ్.. ఎవరికీ చెప్పను కూడా” అంది.

ఆవిడ కొద్ది సేపు ఏమి మాట్లాడకుండా దుఃఖం అణుచుకోడానికి ప్రయత్నం చేస్తూ అలాగే కూర్చుంది. తరవాత ఏం అనుకుందో  కళ్ళు తుడుచుకుంటూ చెప్ప సాగింది అన్నపూర్ణ.

“ ఏం చెప్పమంటావమ్మా .. పరువు, మర్యాద ఉన్న కుటుంబం... మా అమ్మాయి చేసిన పరువు తక్కువ పనితో తప్పనిసరి అయి ఉన్న ఇల్లు ఖాళి చేసి ఇక్కడికి వచ్చాం .. అపార్ట్ మెంట్ అయితే ఒకరినొకరు పట్టించుకోరు కదా మా బతుకులు ఎవరికీ తెలియవులే  అని ఇక్కడ ఉంటున్నాం .. అసలు ఈ ఊరి నుంచే వెళ్లిపోవాల్సింది కాని మా వారికి ఇంకా ఎనిమిదేళ్ళ సర్వీసు ఉంది .. మా అబ్బాయి చదువుకుంటున్నాడు.. ఆ పాపిష్టిది చేసిన పనికి వాడి జీవితం నాశనం చేయలేము కదా .. అందుకే ఇక్కడికి వచ్చాం..”

జాలేసింది శరణ్యకి. పాపం పెద్దవాళ్ళకి రాకూడని కష్టమే వచ్చింది. సానుభూతిగా అంది “ ఏం జరిగింది అభ్యంతరం లేకుంటే చెప్పండి.. నా చేతనైన సాయం చేస్తాను.”

“ ఏం ఉందమ్మా తెలివి తక్కువది.. ఒక లోఫర్ తో ప్రేమలో పడి వాడితో వెళ్ళి పోయింది.. మా కులం కాదు, మా స్థాయి కాదు, చదువు లేదు, రూపం లేదు.. ఎలా నచ్చాడో, ఎందుకు నచ్చాడో ఏమి అర్ధం కాలేదు.. అసలు పెళ్లీడు కూడా రాలేదింకా దానికి పదహారు వెళ్లి పదిహేడు వచ్చింది.. అప్పుడే ప్రేమ, పెళ్లి.. లేచిపోవడం ... మా జీవితాలు చిందర, వందర చేసింది... ఆయన ఆరోగ్యం బాగా పాడైపోయింది. అందుకే రోజూ గుడికి వస్తున్నాను .. ఆ తల్లిని నా భర్త ఆరోగ్యం కాపాడమని వేడుకుంటున్నాను.”

అయ్యో .... శరణ్య మనసు బాధగా మూలిగింది.. ఈ జనరేషన్ పిల్లలు ఎలా తయారవుతున్నారో తను పార్క్ ల్లో , ట్యాంక్ బండ్ మీద నెక్లెస్ రోడ్ లో, ఇంకా అనేక చోట్ల చూస్తూనే ఉంది.

శరణ్యకి ఒక రోజు తనూ, తేజ ఈవినింగ్ వాక్ కి వెళ్ళినపుడు కనిపించిన గాయత్రి, రమేష్ గుర్తొచ్చారు.

ఆ అమ్మాయి కూడా ఎంత బాగుందో! వాడిని చూస్తే పిట్టలు పట్టుకునేవాడిలా ఉన్నాడు..

ఆ జంట ఏమయారో...

వీళ్ళ అమ్మాయిలా ఆ అమ్మాయి కూడా వాడితో లేచిపోలేదు కదా.. లేదులే ఆ అమ్మాయిని చూస్తే చాలా భయస్తురాలిలా అనిపించింది.. ఏదో వెర్రి ఆకర్షణలో ఆ రోజు అలా పార్క్ కి వచ్చిందేమో .. తరవాత తను రెండు, మూడు సార్లు వెళ్ళినా కనిపించలేదు..

“ ఏంటో ఎంత మర్చిపోదామన్నా మర్చిపోలేకపోతున్నాను.. వాడు ఎక్కడికి తీసుకు వెళ్ళాడో, ఏం చేశాడో తలచుకుంటే భయంతో వణికిపోతున్నాను. మా కుటుంబం పట్ల ఎంతో గౌరవంగా ఉండే ఆ కుర్రాడి తల్లి వాళ్ళిద్దరూ కనిపించకపోడంతో ఇంటి మీదికి వచ్చి నన్ను నానా మాటలు అంది. తన కొడుకుని నా కూతురే వల్లో వేసుకుని లేపుకు పోయిందని, బోలెడంత కట్నం నష్ట పోయానని, ఇంకా ఏవేవో.. అన్ని మాటలు పడ్డాక అక్కడ ఉండలేకపోయాము..”

పాపం ... మరోసారి అనుకుంది శరణ్య.

“అలా అని ఎక్కడికి వెళ్ళగలము! .. ఎంత దూరం పారిపోగలం! “

శరణ్య ఆవిడ చేయి అందుకుని తేలిగ్గా అంది.. “ఆంటటీ మీరు ఎక్కడికి పారిపోవాల్సిన అవసరం లేదు.. ఈ రోజుల్లో ఇలాంటివి ప్రతి ఇంట్లో కామన్ అయింది.. పిల్లలు తప్పు చేశారని మిమ్మల్ని మీరు నేరస్తులుగా భావించుకుని ఇలా ఎవరితో కలవకుండా ఉంటే బాధ ఎక్కువ అవుతుంది..

చూడండి.. ఇక నుంచి నన్ను మీ అమ్మాయి అనుకోండి. మీకే సమస్య ఉన్నా నాతో పంచుకోండి.. కనీసం మీకు మనశ్శాంతి అయినా దక్కుతుంది.. వంటరిగా మీలో మీరు కుమిలి పోతుంటే మీ ఆరోగ్యం దెబ్బ తింటుంది. మీ అమ్మాయి వెళ్ళిన వాడితో ఎంత కాలం ఉంటుంది.. తప్పకుండా తిరిగి వస్తుంది..నేను చెప్తున్నాగా..”

ఆవిడ గాభరాగా అంది..” లేదు, లేదు ... అది మా దృష్టిలో ఇంక లేనట్టే.. ఆయన రానివ్వరు.. కనీసం అతనితో అది సుఖంగా ఉంటే చాలు ..” శరణ్య జాలిగా చూసింది. తల్లి మనసు ... కూతురు మీద కోపం లేదు.. కేవలం పరువు పోయిందన్న బాధ.. వాళ్ళ మనసుని గాయం చేసిన కూతురు సుఖంగా ఉంటె చాలు అనుకుంటోంది.. నిట్టూర్చింది శరణ్య .

ఆ తరవాత ఇద్దరూ అపార్ట్ మెంట్ దాకా కలిసి వచ్చారు..  మీకేదన్నా అవసరం ఉంటె మాత్రం మొహమాటపడకండి అని మరో సారి చెప్పి తన ఫ్లాట్ కి వచ్చేసింది శరణ్య. చీర మార్చుకుని డ్రెస్ వేసుకుని కాలేజ్ కి బయలు దేరింది. ఇంటికి వెళ్ళిన అన్నపూర్ణకి చాలా రోజుల తరవాత మనసు కొంచెం తేలికగా అనిపించింది. ఆ అమ్మాయి అన్న మాట నిజం బాధ వంటరిగా మోస్తుంటే గుండె, మెదడుతో పాటు జీవితం కూడా బరువుగా అయిపోతుంది.. పంచుకుంటే తేలికవుతుంది.. ఇన్నాళ్ళకి పంచుకోడానికి మనిషి దొరికింది.. చిన్న పిల్ల అయితే ఏం ఎంత పెద్ద మనసు!

ఆయనకీ తెలియకుండా జాగ్రత్త పడితే చాలు.. తెలిసిందంటే ఇంక అంతే! “కూతురుతో పాటు నువ్వు కూడా నా పరువు తీస్తావా .. ఇరుగమ్మలు, పొరుగమ్మలతో కబుర్లు చెప్పడం మొదలు పెడితే ఎంక్వయిరీ లు మొదలు అవుతాయి.. నీకు తెలియకుండానే ఇంటి గుట్టు రచ్చకి చేరుతుంది.. పొరపాటున కూడా ఎవరితో మాట్లాడద్దు” అని ఈ ఫ్లాట్ కి వచ్చిన రోజే వార్నింగ్ ఇచ్చాడు కోటేశ్వరరావు.
అలా అని శరణ్యతో మాట్లాడకుండా ఉండలేక పోయింది అన్నపూర్ణ .. ఏ మాత్రం అవకాశం లబించినా  కోటేశ్వర రావు లేని సమయంలో శరణ్య ఇంట్లో ఉంటే మాత్రం కనీసం పది నిమిషాలైనా ఆ అమ్మాయితో తన మనసులో బాధ చెప్పుకుని ఓదార్పు పొందడం అలవాటు అయింది అన్నపూర్ణకి.

శరణ్య సంస్కారం, మంచితనం, మాటల్లో ఆత్మీయత ఆవిడని ఎంతో ఆకర్షించాయి. ఒకరోజు శరణ్య ఇంట్లో తేజ కనిపించగానే ఆవిడ భయపడి పోయింది.. అతన్ని పరిచయం చేసింది శరణ్య..

ఎంతో వినయంగా, మర్యాదగా మాట్లాడిన అతని మాట తీరు, అతని రూపం, చదువు, హోదా తెలిసాక శరణ్య నిర్ణయాన్ని అభినందించింది.
“నీలాగే నా కూతురు కూడా కాస్త చదువుకుని ప్రేమించి ఉంటే ఇలాంటి మంచి కుర్రాడిని ప్రేమించేది.. మేమూ కాదనేవాళ్ళం కాదు.. కానీ వాడు.. ఆ వెధవ ఎందుకూ పనికిరాని వాడమ్మా..” అంటూ వాపోయింది ఒకరోజు.

“బాధ పడకండి.. తను బాగానే ఉంటుంది” అంది శరణ్య. అయితే అన్నపూర్ణకి నిరాశని, బాధని శరణ్యకి ఆనందాన్ని కలిగించే సంఘటన జరిగింది. శరణ్య గ్రూప్స్ లో సెలెక్ట్ అయి విజయవాడలో రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో పోస్టింగ్ వచ్చింది.

ఆ విషయం ఎంతో ఆనందంగా అన్నపూర్ణకి చెప్పగానే అనుకోకుండా లభించిన ఒక ఆత్మీయురాలు దూరం అవుతున్న బాధ ఆవిడ కళ్ళల్లో కనిపించింది. అది చూడగానే శరణ్య మనసు చివుక్కుమంది..ఇలా పోస్టింగ్ వస్తుందని తెలిసి అనవసరంగా ఈవిడకి దగ్గర అయాను..అయ్యో అనుకుంది శరణ్య.

అన్నపూర్ణ కొద్ది నిమిషాల్లోనే సర్దుకుని “చాలా సంతోషం తల్లి ..త్వరలో పెళ్లి చేసుకుని పిల్లా, పాపలతో సుఖంగా ఉండు” అంది మనసారా దీవిస్తూ. “థాంక్స్ ఆంటీ అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాను” అంది.

“వద్దమ్మా .. వద్దు... ఆయనకీ తెలిస్తే కొంపలంటుకుంటాయి” అంది అన్నపూర్ణ కంగారుగా . బాధగా అనిపించినా చేసేది లేక ఊరుకుంది శరణ్య.

తేజ చాలా సంతోషించాడు.. “త్వరలో నువ్వు కలెక్టర్ అవాలి శరణ్యా!..”అన్నాడు అభినందిస్తూ.

“అప్పుడు నువ్వు నా దగ్గర పి ఏ గా చేస్తావా” చిలిపిగా అంది శరణ్య.

“మహా భాగ్యంలా భావిస్తాను సరేనా..” శరణ్య నవ్వింది.

“ఇప్పుడు మా నాన్నని మన పెళ్ళికి ఒప్పించడం వెరీ ఈజీ” అన్నాడు.

“ఉండు బాబూ ముందు నన్ను సెటిల్ అవనీ... ఎక్కడ పోస్టింగ్ ఇస్తారో .. ఏంటో ... వెళ్లి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చిందాకా టెన్షన్ ...”

“ఎందుకు టెన్షన్ ...మంచి పోస్ట్ ఇస్తారులే... అయినా ఏదిచ్చినా నువ్వు చేయగలవు.. నాకు తెలుసు...” అతని నమ్మకానికి ముచ్చట వేసింది శరణ్యకి..

“విజయవాడ వెళ్లే ముందు ఒకసారి వైజాగ్ వెళ్లి అమ్మా, నన్నల ఆశీర్వాదం తీసుకుని వెళ్లి జాయిన్ అవుతా” అంది.

“ఇట్ ఈజ్ మస్ట్” అన్నాడు తేజ.

ఆ రోజు నోవటేల్ లో డిన్నర్ ఇచ్చాడు తేజ.  

(సశేషం)

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nadaina prapancham