Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> సరైన నిర్ణయం

saraina nirnayam

రోజులాగానే అందరిళ్ళల్లో అంట్లు తోమేసి,సాయంత్రానికి తన గుడెసెకి చేరుకుంది రమణి.కాస్త అలసటగా అనిపించి మంచoపై కూర్చుంది.అమ్మా కొంచెం పాలు ఉంటే టీ చుక్క ఇవ్వు.అడిగింది. ఇస్తా గానీ ఎందుకు నీకీ పాచి పనులు.నే ఎల్తా కదా అంటే నీకు పేణo బాలేదు, వద్దూ అంటావాయే.నసిగింది చిట్టెమ్మ.

అలా అంటావేంటమ్మా.మొన్న డాక్టర్ గారు ఏం చెప్పారో మర్చిపోయావా .ఈసారి నువ్వు కష్టమైన పనులు ఏమైనా చేస్తే నీ ఛాతీ నెప్పి మరింత పెరుగుతుంది కనుక, విశ్రాంతిగా ఉండమన్నారుగా.

ఆల్లు అట్టాగే సెప్తారు.కానీ మనకి కూలి కెళ్తే కానీ కూడు దొరకదు.చెయ్యి సాగితే గాని కడుపు నిండదు.

అమ్మా.అయినా నేను పని చేస్తున్నాను కదా.అలాగే  మరో పక్క చదువుతున్నాను.అదే కరస్పోండెన్సు.ఆ దూరవిద్య నుండి ఈ డిగ్రీ అయిపోనీ.తర్వాత ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకుంటాను.అపుడు ఈ పని మానేస్తాను .ఎంచక్కా ఇల్లు కూడా మార్చేద్దామ్.చెప్పింది రమణి,అలమరలోని ముల్తాని మట్టి ముఖానికి రాసుకుంటూ.

సరేలే .ఇదిగో టీ తాగు, గ్లాసు చేతికిచ్చింది తల్లి.ఆ గ్లాసు అందుకుంటూ,ఎదురుగా ఉన్న ఈశ్వరుడి ఫోటో వంక చూస్తూ ,భగవంతుడా ఏంటి ఈ జీవితం.మాకేప్పుడు మంచి రోజులు వస్తాయి.నేను ఉదయం లేచి అపార్ట్మెంట్ మెట్లు ఎక్కడం  మొదలు , అందరూ ఛీఛీ అనే నా మొహాన తిడతారు.ఒకరు ఏంటి ఆలస్యం?పని చెయ్యడానికా లేక మాకు పని చెప్పడానికా  అంటే మరొకరు మా ఇంట్లో ఓ గిన్ని కనబడ్డం లేదు తీసావా  అనడుగుతారు.ఏమో నాకొక్క సారి అర్దం కాదు.పనికి చేరే  వాళ్ళకి  భావోద్వేగాలు ఉండవనుకుంటారో  ఏమో.పనిమనుషులయితే మాత్రం,వారికి మనసు మనిషి నుండి విడిగా మైకా కాగితంతో తయారు కాదు కదా. ఇంట్లో వదిలి రావడానికి. .అయినా ఎన్ని ఎదురైనా కానీ తప్పదు.

నా చదువు అయ్యేవరకు భరించాలి.అయినా మా నాన్నే సక్రమంగా ఉంటే మాకు ఈ దుస్తితి వచ్చేది కాదేమో.మా నాన్న ,నేను మా అమ్మ దగ్గర నేను  పాలు తాగే వయసులోనే మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయాడట.తర్వాత నాకు మళ్ళీ అయిదేళ్లు వయసున్నపుడు వచ్చాడట.మా అమ్మ మెడలో తాళి పట్టుకు పోయాడట.తరువాత మళ్ళీ నాకు పదేళ్ళ వయసున్నపుడు వచ్చాడట.కానీ బాగా తాగుడికి బానిసై అమ్మని రోజు తిట్టి కొట్టేవాడట.తాగుడికి డబ్బులివ్వడం లేదని మళ్ళీ ఇంట్లోంచి వెళ్లిపోయాడట.కానీ మరలా ఇంత వరకూ తిరిగి రాలేదు.కానీ విచిత్రం ఏమిటంటే ,అతను అంత చేసినా అమ్మ మాత్రం నాన్నని కలవరిస్తూనే ఉంటుంది.బహుశా మూడ పతి బక్తికి పరాకాస్ట అంటే ఇదేనేమో.అలాగే ఆయన వచ్చిన ప్రతి సారి,పెద్ద పులిని జింక నమ్మినట్టు అమాయకంగా ఆహ్వానిoచింది.కానీ ,ఆయన మాత్రం,వ్యసనాలకి డబ్బు లేకపోతేనో లేక పూట గడవనప్పుడో మాత్రమే వచ్చేవాడట.అవునులే బందాలనీ ,అనుభంధాలనీ కూడా అవసరానికి వాడుకునే ప్రబుద్దులకి వాటి విలువ ఏం తెలుస్తుంది.వారి అవసరాలే అన్నిటికంటే ముఖ్యం.అవి ఏవైనా,ఎలాంటివైనా వారికి అనవసరం గడవాలి అంతే.వాటి పర్యావసనాలు ఆలోచించరు.అందుకే కాబోలు నన్ను కూడా ఓ సారి అమ్మేయాలని చూశాడట.అవన్నీ విన్నాక,అసలు ఇలాంటి నాన్నలు కూడా ఉంటారా అని అనిపించింది నాకు.మేం ఎలా బ్రతుకుతామో కూడా ఆలోచించలేదు.ప్రస్తుతం తృప్తిగా తినక పోయినా మనశ్శాంతిగా బ్రతుకుతున్నాం.మoచి గుడ్డ కట్టకపోయినా ,గూటిలో పక్షుల్లా గుట్టుగా బతుకుతున్నాం అనుకుంటూనే కన్నీళ్లు తుడుచుకుంది.ఇంతలో ,గుమ్మం దగ్గర అలికిడి కావడంతో,గుమ్మం దగ్గరకెళ్లింది రమణి.

ఎవరమ్మా అడిగింది తల్లి.

ఏమోనమ్మా ఏదో అడ్రెస్ అడిగారు.తెలీదని చెప్పి పంపేసాను.

అలాగా ?మన పక్క గుడెసెలో ఉండే పుణ్యవతమ్మ తిరపతి వెళ్లిందిగా.ఆవిడ తాలూకూ సుట్టాలోత్తారంది.ఆల్లు కాదు కదా. అబ్బే కాదమ్మా.
ఎదురు పెంకుటిల్లు పార్వతమ్మ కొత్తగా వచ్చింది.ఆవిడ కోసం కాదు కదా.కాదమ్మా.నేను అన్నీ వివరాలూ అడిగి తెలుసుకునే ఇక్కడ కాదని చెప్పి పంపేశాను. అలాగా.సర్లే.తలుపేసి రా.చెప్పింది తల్లి. అలాగేనమ్మ. అని  బరువైన స్వరంతో తల్లితో అనేసి .మనసులో, భగవంతుడా, ఏంటి ఈ పరీక్ష . ఆ వచ్చింది నా తండ్రేనని నాకు తెలుసు.కానీ మళ్ళీ అతన్ని మా  జీవితాల్లోకి ఆహ్వానిస్తే ఈ సారి కోల్పోవడానికి మా దగ్గరేo లేదు.ఒక్క మనశ్శాంతి తప్ప.ప్రతిసారి అతను మారిపోయాడని అమ్మ నమ్మడం, ఆమె నమ్మకం ఒమ్ము కావడం చాలా సార్లు జరిగింది.ప్రస్తుతం కూడా అతను పూర్తిగా మారాడనే నమ్మకం నాకు లేదు.పైగా వయసులో ఉన్న నన్ను మాయచేసో మత్తు ఇచ్చో ఎవరికైనా అంగడి బొమ్మలా అమ్మేస్తే,అమ్మో నా జీవితం ఏం కావాలి.మా అమ్మని ఎవరు చూస్తారు.కనుక నా నిర్ణయమే సరైనది.మా అమ్మ కూడా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని ఉంటే ,ఇప్పుడామె జీవితం ఇలా ఉండేది కాదు.కనుక సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. కొన్ని సార్లు గుండెని బండ చేసుకుంటేనే బతుకు సుతారంగా సాగుతుంది.లేదంటే మళ్ళీ వెతలని చేజేతులా ఆహ్వానించి ,తర్వాత తలరాత అనుకుని బాధపడాలి.ఒక వేళ అతను ఈసారి నిజంగా మారిపోయే వచ్చుంటే,ఎక్కడున్నా మా శ్రేయస్సే కోరతాడు.ఎక్కడున్నా మనిషిలా బ్రతికేస్తాడు.మనిషి మనిషిలా బ్రతికితే చాలు సమాజం ఎప్పుడూ వారికి అండగా నిలుస్తుంది. అని మనసులో అనుకుని ,మరలా అతను రావచ్చనే ఉద్దేశంతో త్వరలోనే ఇల్లు కూడా మార్చేసిందామె.
                                                               

మరిన్ని కథలు
aacharanalo