Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nadaina prapancham

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమిస్తే ఏమవుతుంది?

premiste emavutundi?

గత సంచికలోని ప్రేమిస్తే ఏమవుతుంది సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి....http://www.gotelugu.com/issue250/677/telugu-serials/premiste-emavutundi/premiste-emavutundi/

 


(గత సంచిక తరువాయి)... ఏం జరుగుతోందో తెలిసే లోగానే గాయత్రి జీవితంలో జరక్కూడనిది జరిగిపోయింది. రమేష్ అనబడే ఒక అజ్ఞాని, అక్షర గంధం లేని అనామకుడు అనాలోచితంగా, చేసిన పనికి  రెండు పూల దండల సాక్షిగా ఆమె అతనికి భార్య అయింది.
ఆ దండతో తన జీవితం అనూహ్యమైన మలుపు తిరగబోతోంది అని తెలియని గాయత్రికి కేవలం ఈ దండతో నీ భార్యని ఎలా అవుతాను అని ఆ దండ తీసి విసిరేసే తిరుగుబాటు తనం కూడా లేదు. అందుకే ఆ దండే తన మెడలో తాళి అనుకుంది.

నాకు పెళ్లి అయిందా అని వణికిపోయింది..

అయ్యో పెళ్లి అయింది అనుకుంది..

అమ్మ, నాన్నా నేనెంత పని చేసాను పాపం చేసాను.. అని వాపోయింది.. కర్తవ్యం తోచక స్తంభించి పోయింది.. మెదడు ఆలోచన కోల్పోయింది. యాంత్రికంగా అక్కడ కూర్చున్న వాళ్ళ సూచనల మేరకు ఆమె చేతులు మాత్రం కదులుతున్నాయి.
ఆమె చేతికి దండ ఇచ్చి తల వంచి వేయి అంటూ బలవంతంగా తన మెడలో ఆ దండ వేయించుకుని ఇంక నుంచి నువ్వు నా పెళ్లానివి అని అతను అంటే అలా ఎల్లా అవుతాను అని ఆలోచన కూడా లేని అమాయకురాలు గాయత్రి  పెళ్లి అయింది అనగానే అవును కాబోలు అనుకుంది.

అసంకల్పిత ప్రతీకార చర్యలా తన చేతుల్లో ఉన్న దండ వేసేసింది. వేసాక ఏం జరుగుతోందో తెలిసే సరికి ఆ రాత్రి సంపూర్ణంగా అతని భార్య అయిపొయింది...

ఉన్నతమైన కుటుంబంలో పుట్టి, చక్కటి సంప్రదాయం, మంచి సంస్కారం మధ్య పెరిగిన గాయత్రి,  తనకి ఎలాంటి సంబంధం లేని వ్యక్తుల మధ్య, ఒక అనాధలా చేష్టలుడిగి నిలబడి పోయింది.

రమేష్ తనకి, గాయత్రికి అదే రాత్రి ఒక గది ఇవ్వమని అడిగాడు నర్సిమ్మని.

“గివన్ని ఈడ ఎందుకు నీకు ఏడనాన్న రూము ఇప్పిస్త, నౌకరి ఇప్పిస్త గప్పుడు సంసారం పెట్టు” అన్నాడు నరిసిమ్మ..
కానీ రమేష్ లే అన్నా “ఆమె రాత్రిల్ల లేచి ఏడికన్న పోగల ... అందుకే నేనే ఆమె పక్కన పండుకుంట.. ఒక్కసారి గది అయినదంటే ఆమె ఏడికి పోలేదన్న జర సాయం చేయి” అని బతిమాలాడు.

నర్సిమ్మకి రమేష్ అట్లా తొందర పడడం నచ్చలేదు.. కాని గాయత్రి మీద జాలితో తను కాదంటే వీడు ఆ పిల్లని ఏదన్నా చెత్త హోటల్ కి తీసుకుని వెళ్తాడేమో అనే భయంతో శ్రీనివాసలుని బతిమాలాడు.

“దండలు మార్చుకున్నంక ఆలుమగలైనట్టే పోనీ ఒక్క దినమే గద ఇద్డంలే” అన్నాడు అతను.

చంద్రకళ, సూర్యకళ పడుకునే రూమ్ వీళ్ళిద్దరికి ఇచ్చారు ఆ పూటకి. నర్సిమ్మకి గాయత్రిని చూస్తుంటే బాధగా అనిపించినా ఆమె తనంతట తానుగా రమేష్ తో లేచి పోయి వచ్చింది కాబట్టి రమేష్ ఆమెకి నచ్చే వచ్చింది అని నిర్ణయించేసుకున్నాడు.

చంద్రకళ, సూర్యకళ చిరాకు పడ్డారు.. “ఇదేందమ్మ... ఏడికెల్లి వచ్చిన్రో మనకెందుకు హోటల్కి  పొమ్మన రాదు” అన్నారు.

సత్యవతి నచ్చ చెప్పి తన గదిలో పడుకోమంది వాళ్ళని. విసుక్కుంటూనే వెళ్ళారు వాళ్ళు. సత్యవతికి గాయత్రిని చూస్తుంటే జాలేసింది.. “ఇంత చక్కటి పిల్ల ఎట్ల గీ పిల్లగాడిని లవ్ చేసింది” అని అడిగింది భర్తని.“లవ్ కి గవన్ని ఆలోచించే టైం ఉండదు.. ఒక్కసారి దేవుడు బానమేసినంక లవ్ ఇస్తర్ట్ అయితది..” అన్నాడు శ్రీనివాసులు తన పరిజ్ఞానం చూపిస్తూ.

“ఏందో పాపం దండలు మార్చుకుంటే పెండ్లి అయినట్టా ఏందీ.. జర గా పిల్లకి సోచయించనీకి టైం ఇయ్యాలె గదా..ఇప్పుడు వాడు రూమ్ ఇస్తే గమ్మునుంటడా ... ఆమెకి ఇష్టమో, కాదో నాకేం నచ్చ లేదయ్య” అంది బాధగా.

“నీకెందుకు గమ్మునుండు ... ఆడు పెండ్లి చేసుకున్నంక ఇంకేంది” కసిరాడు శ్రీనివాసులు.

“గిదేం పెండ్లి”  అంది సత్యవతి .

ఆవిడకి గాయత్రిని ఆ రమేష్ నుంచి రక్షించాలని ఉంది. దండలు మార్చుకోవడమే పెళ్ళిగా ఆమె అంగికరించలేకపోతోంది.

లేత తమలపాకులాంటి గాయత్రిని పోరంబోకు లాంటి రమేష్ అనుభవించబోతున్నాడు అనే ఆలోచనే ఆమెని నిలవనియడం లేదు..
ఎలా ఆ అమ్మాయిని రక్షించాలో కూడా అర్ధం కావడం లేదు. అటు నర్సిమ్మ, ఇటూ తన భర్త కూడా ఇంక వాళ్ళిద్దరూ మొగుడూ పెళ్ళాలు అని నిర్ణయించేసారు.. తను కాదంటే మాత్రం వింటారా.

ఆ రాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్నా ఆమెకి మాత్రం నిద్ర పట్టలేదు. ఏ క్షణమైనా గాయత్రి గదిలోంచి భయపడుతూ పరిగెత్తుకుని వస్తుందేమో, రక్షించాలి అని ఎదురు చూడసాగింది. కానీ అల్లాంటిదేమీ జరగలేదు.

అయితే నిజామాబాదులో అడుగుపెట్టిన దగ్గర నుంచి పశ్చాత్తాపంతో, దుఖంతో ఘనీభవించి స్పందన కోల్పోయిన గాయత్రికి అంతా అయాక కానీ ఏం  జరిగిందో అర్ధం కాలేదు.  తెలిసేసరికి తనని గట్టిగా వాటేసుకుని పడుకున్న రమేష్ కనిపించాడు. పక్కన తోడేలు పడుకున్నట్టుగా గభాల్న అతన్ని విడిపించుకుని దూరం జరిగింది..

“ఏడికి పోతున్నావు” అంటూ తిరిగి తనని దగ్గరకు లాక్కున్న రమేష్ స్పర్శ జుగుప్సగా అనిపించింది. గుండె  పగిలేలా ఏడవడం మొదలు పెట్టింది.

రమేష్ భయపడ్డాడు. “ఎందుకేడుస్తున్నావు ఏమైంది” అడిగాడు.

గాయత్రి రెండు చేతుల్లో మొహం దాచుకుని “తప్పు చేసాను, తప్పు చేశాను” అని గొణుగుతూ ఏడవసాగింది. రమేష్ కి కంగారుగా అనిపించింది..

ఆమె ఏడుపు గది బయటకి వినిపిస్తుందేమో అందరూ ఏం జరిగిందో అని వచ్చేస్తారు అని భయపడుతూ ఆమెని ఓదార్చడానికి ప్రయత్నించ సాగాడు. కాని ఆమె ఆపక పోగా ఉధృతం చేయసాగింది.

రమేష్ కి ఇంక చిరాకు వచ్చింది ..

“ఊకే ఎందుకేడుస్తున్నావ్ ... నేనేమన్నా నిన్ను కిడ్నాప్ చేసి తెచ్చిన్న ... నువ్వేకదా పోదం పద అని వచ్చినవు ... ఇప్పుడు ఏడ్చి ఎం లాభం లేదు.. నర్సిమ్మన్న నాకు ఆటో ఇప్పిస్త అన్నాడు ..  ఆటో నడిపించి నిన్ను సాకుత మంచిగ చూసుకుంట ... ఊకే ఏడిస్తే మంచిగుండదు చెప్తున్నా” అని అల్టిమేటం ఇచ్చాడు.

“ఎందుకిలా చేశావు? నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పానా ...పెళ్లి ఇలా చేసుకుంటారా ఎవరన్నా ... నా జీవితం నాశనం అయిపొయింది” అంటూ భోరుమంది.

“అరె చెప్పిన కదా మంచిగ చూసుకుంట అని ... ఊకో ఏడ్వకు” అని దగ్గరకు తీసుకున్నాడు. అతని చేయి తన వొంటి మీద పడగానే పాము మీద పడినట్టుగా విదిలించింది.

దూరం జరుగుతూ “నన్ను ముట్టుకోకు” అంది.

రమేష్ ఆమె మాటలు పట్టించుకోలేదు.. నిర్లక్షంగా నవ్వి అన్నాడు.. “ఒకసారి అయినంక ముట్టుకోవద్దు అంటే ఊకుంటనా ...నువ్వు అవునన్న కాదన్న నా పెండ్లానివే... నకరాలు చేయకు” అంటూ మరింతగా దగ్గరకు జరిగి ఆమెని బలవంతంగా దగ్గరకు లాక్కున్నాడు.
“వదులు రమేష్ ... మర్యాదగా వదులు” అంటూ గాయత్రి పెనుగులాడినా ఆమె ప్రయత్నం వృధా అయింది. మరోసారి అతని వాంఛకి లొంగిపోయింది.

ఎర్రబడిన కళ్ళు, వాచిపోయిన మొహంతో గదిలోంచి బయటకి వచ్చిన గాయత్రిని చూడగానే సత్యవతి గుండె ద్రవించి పోయింది. అప్పటికి ఇంకా ఎవరూ లేవలేదు. వంట గదిలోకి తీసికెళ్ళి అడిగింది. “ఏడ్చినవా.”

గాయత్రి మళ్ళి వెక్కి, వెక్కి ఏడుస్తూ అంది. “నేను తప్పు చేసాను.. నాకు అమ్మ, నాన్నా కావాలి... ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు.. అతను ఇట్లా చేస్తాడు అనుకోలేదండి.. నన్ను మా ఇంటికి పంపేయండి ప్లీజ్ మీకు దణ్ణం పెడతా.”

సత్యవతికి కూడా ఏడుపొచ్చింది. గాయత్రిని దగ్గరకు తీసుకుని అంది. “నిన్ననే నువ్వు ఇట్ల చెప్పి ఉంటె ఎట్లనన్న పంపేటోల్లం చెల్లె .. ఇప్పుడు అంతా అయినంక ఏడికి పోతవు ... పోయినా మీ వొల్లు రానిస్తారా ... ఏడవకు. దేవుడు ఇట్లనే రాసిండు అనుకో ...ఆడు మంచోడే ... నిన్ను మోసమైతే చేయడు.. పికరు చేయకు...”

గాయత్రి తల అడ్డంగా ఆడిస్తూ “నా వాల్ల కాదండీ... నేను ఇతన్ని భరించలేను. ఇలా బతక లేను” అని  గొణుగుతూ, ఏడుస్తూ ఉండిపోయింది.

నిస్సహాయంగా చూడడం తప్ప సత్యవతి కూడా ఏమి చేయలేక పోయింది. కొంతసేపటి తరవాత కన్నీళ్ళు తుడుచుకుని నిశ్చయించుకున్న దానిలా అంది నాకు ఒక సాయం చేస్తారా .. చెప్పు అంది సత్యవతి .

నేను మా ఊరు వెళ్ళిపోతాను.. అమ్మా, నాన్నల కాళ్ళ మీద పడి క్షమార్పణ వేడుకుంటా... నేను వాళ్ళ కన్నకూతురుని కాదనరు.. తప్పకుండా క్షమిస్తారు.. మీ వారికి చెప్పి నన్ను హైదరాబాద్ బస్సు ఎక్కించమని చెప్పండి ప్లీజ్ ...

సత్యవతి కళ్ళల్లో భయం .... అమ్మో గా పిల్లగాడు చూసినండంటే ఊకుంటడా అంది.

అతనేవరండి ఊరుకోకపోడానికి.. నేను పెళ్లి చేసుకోమని అడిగానా అతన్ని.. నేను వెళ్ళిపోతా దయచేసి పంపించండి.

సరే, సరే మా ఆయనతోని చేప్త... ఊకో పోయి మొకం కడుక్కుని రా చాయ్ తాగుదువు అంది సత్యవతి ఓదార్పుగా.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్