Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> తా త గారి పెట్టె

tatagaripette

భార్య పిల్లలతో .. పండగకు ఊరు వెళ్లడానికి రైల్వే స్టేషన్ లో ఉన్ననాకు , ఆ స్టేషన్ రణ గొణ ధ్వనులలో .. నన్ను ఎవరో పిలుస్తున్నట్టు వినిపించింది . ఆ పిలుపు  వచ్చినవైపు  చూస్తే   .. చేతులు ఊపుతూ నా వైపు వస్తూ ఒక వ్యక్తి కనబడ్డాడు. తనని పోల్చుకోడానికి ప్రయత్నిస్తున్ననాకు " ఒరే !.. నేను శేఖర్ ని. " అంటూ పరిచయం చేసుకొన్నాడు. శేఖర్, నేను డిగ్రీ చదివే రోజుల్లో ,రాజేష్ అనే ఇంకో మిత్రుడితో పాటూ ఒకే గది లో ఉండి చదువుకొనేవాళ్ళం.  డిగ్రీ అయినతరువాత కొంత కాలం వరకు ఉత్తరప్రత్యుత్తరాలు నడిచినా , ఆ తరువాత పూర్తిగా మా మధ్య కమ్యూనికేషన్ లేదనే చెప్పాలి. మళ్ళీ ఇన్ని సంవత్సారాల తరువాత శేఖర్ ని చూడడం. తనని గుర్తుపట్టలేకపోయినందుకు సిగ్గుపడుతూ

" సారీ రా !.. గుర్తుపట్టలేకపోయా. నువ్వు ..ఇక్కడ .. ఇలా " అంటూ ఆశ్చర్యం తో అడిగా . " నేను చాలా సేపటినుండి  నిన్నే  చూస్తున్నాను.    పో ల్చుకోవడానికి కొంత సమయంపట్టిందనుకో. " అంటూ ..తాను చెన్నై లో ఉంటున్నట్టు , ఆఫీస్ పనిమీద ఇక్కడకు వఛ్చినట్టు, తిరిగి వెళిపోతున్నట్టు చెప్పాడు. తనని నా భార్య పిల్లల కి పరిచయం చేసాను. ఉభయకుశ లోపరి అయినతరువాత , ఇంకా మా రైలు రావడానికి సమయం ఉండడం తో .. ముచ్చట్లలో పడ్డాం . మాటల్లో"ఒరే ! నీకు ఆ తాత గుర్తున్నాడురా ? " అంటూ అడిగాడు. " ఎలా మర్చిపోతాం రా  తనని? ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినా  ...

ఆ వయసు పెద్దవాళ్ళని ఎవ రిని చూసినా .. తానే నాకు గుర్తుకొస్తాడు " అన్నాను నేను. తనుకూడా " అవునురా !.. నాకు కూడా" అన్నాడు. . ఇంతలో మేము వెళ్ళవలసిన రైలు వస్తున్నట్టు ప్రకటన వినిపించింది . ఒకరికొకరం వీడ్కోలు చెప్పుకొంటూ .. మా రైలు ఎక్కేసేము. రైలు ఎక్కి అంతా సర్దుకున్నాకా .. నా భార్య  " ఏమండీ !..మీరిద్దరూ ఎవరో తాత గారి గురించి మాట్లాడుకుంటున్నారు . ఎవరతను? " అంటూ అడిగింది . పిల్లలు కూడా "ఏంటి? తాత  గారా ?  ఏంటో చెప్పు నాన్నా " అంటూ ఉత్సాహంగా అడిగారు. నేను.. చెప్తానంటూ .. ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రిందటి జ్ఞాపకాలను ఏరుకొంటూ చెప్పడం ప్రారంభించాను.

*****

అవి నేను డిగ్రీ  ఆఖరి సంవత్సరం చదివే రోజులు . మా ఊ రికి చాలా దూరంగా ఉన్న ఒక ఊరి కాలేజీ లో చదివే వాడిని .ఆ ఊరు  పల్లెటూరుకు ఎక్కువ ,పట్నం కు తక్కువ గా ఉండేది. అక్కడే నేను మరో ఇద్దరు మిత్రులు  రాజేష్  , శేఖర్ ల తో కలిసి ఒక గది లో అద్దెకు వుండే వాడిని.

మా గది కి ఎదురుగా ఒక ఎత్తు గడపల పెంకుటిల్లు ఒకటి ఉండేది. ఆ ఇంటి ప్రక్క ఖాళీ జాగాలో బంతి పువ్వుల మొక్కలు ,ఒక గేదె ల కొట్టాం , ఎండు గడ్డి కుప్పలు  ఉండే వి . మా గది కిటికీ నుండి వారి ఇల్లు కనిపిస్తూవుండేది.  ఆ ఎత్తు గడపల ఇంటిలో భార్య భర్తల తో పాటు పెళ్ళీడుకొచ్చిన ఒక అమ్మాయి, అంతకన్నా చిన్నవాడైన అబ్బాయి ,వారి తో పాటు సుమారుగా ఒక ఎనభై సంవత్సరాల వయసు కలిగిన  వృద్ధుడైన తాత ఉండేవారు.

ఆ తాత ఎప్పుడుచూసినా ఆ  ఎత్తు గడపల అరుగు మీదే కూర్చొని వుండే వారు.భారీ కాయం తో .. తెల్లగా విశాలమైన నుదుటి మీద అడ్డంగా నామాలు , మధ్యలో సింధూరం బొట్టు పెట్టుకొని , ఎర్ర శాలువా కప్పుకొని కూర్చునేవారు. చాలా ఆకర్షమైన రూపం. ఆయన ముఖం లో ఒక విధమైన వర్ఛస్సు ఉండేది. దాని వల్ల చూసేవారికి ఒక విధమైన గౌరవ భావం కలుగుతుంది. ఆ అరుగు మీద ఒక ఊత కర్ర , ఒక గుడ్డ చుట్టిన పెట్టె  లాంటింది పెట్టుకొని కూర్చొనే వారు. మేము మా గది కిటికీ నుండి  ఎప్పుడు ఆ ఇంటి వైపు  చూసినా అలాగ కూర్చొనే కనిపించే వారు. మరి భోజనానికి ఎప్పుడు వెళ్లి వచ్చే వారో తెలిసేదికాదు.

మా దృష్టి ముఖ్యంగా ఆ తా త గారి మనుమరాలు పైనే ఉండేది. రోజూ ఉదయాన్నే వాకిలి ముందు 'ముద్ద బంతి పువ్వులా ' కూర్చొని ముగ్గు పెడుతూవుండేది. ఖాళీ  జాగాలో లేచిన  బంతి పువ్వులను తెంపుతూ కనబడుతూ ఉండేది. చదవడానికైతే వేకువ జామున లేవని మేము , ఆ అమ్మాయిని చూడ డా నికి ఒకరికి ఒకరం పోటీ పడి లేచే వాళ్ళం. ఆమెను చూస్తూ శేఖర్ "పువ్వులేరి తేవే చెలి, పోవలె కోవలెకు '' అన్న దేవులపల్లె పాట గుర్తుకు వస్తున్నద ని అంటూ వుండే వాడు. ఆ అమ్మాయిని మా గది కిటికీ లోనుండి చూడడానికి ఒకరికొకరం పోటీ పడుతుండే వాళ్ళం.

మా గది ముందు పళ్ళు తోముకొనే నెపం తో అటూ ఇటూ తిరుగుతూ, ఆ అమ్మాయి వైపు దొంగ చూపులు చూస్తుంటే,  ఆ తాత ఉరుముతున్నట్లు చూసే వాడు. ఆ  చూపులు భరించలేక  కిటికీ లోనుండి చూసేవాళ్ళం. రోజూ కాలేజికి , మెస్ కి వాళ్ళ ఇంటి ముందునుండే  వెళుతూవుండేవాళ్ళం. అలా వెళుతున్నప్పుడు , రాజేష్ ఎదో ఒకటి కామెంట్ చేస్తూవుండేవాడు. అది విన్నా ఏమి పట్టనట్టు , ‘కుర్ర కుంకలు అంతే ‘ అన్నట్టు అలా ఒక మౌని లా కూర్చొనే వుండే వారు. ఆయన మౌనాన్ని ఆసరాగా తీసుకొని మేము ,ఆయన మనుమరాలు వీధి లోకి వచ్చ్చినప్పుడల్లా , మా గది ముందర పుస్తకాలు పట్టుకొని చదువుతున్నట్టు నటిస్తూ, ఆ అమ్మాయిని చూస్తూ ఎదో ఒకటి కామెంట్స్ చేస్తూవుండే వాళ్ళం . ఆ వయసు లో ఉండే అల్లరి తనం తో  అవన్నీ చేస్తూ వుండే వారం . అవన్నీ ఆ తాత  గమనిస్తూ వుండే వారు. కానీ ఏమి అనేవారు కాదు. ఆ అమ్మయిని చూస్తున్నప్పుడే , నేను ఆ తాత గారి ని కూడా గమనిస్తూ వుండే వాడిని.  ఎప్పుడూ ఊత కర్ర , గుడ్డ చుట్టిన  పెట్టె పెట్టుకొనే కూర్చొనే వారు.

ఒకరోజు శేఖర్ " ఒరే చూసారా !.. ఆ తాత ఎప్పుడూ ప్రక్కన ఆ చిన్న పెట్టె పెట్టుకొనే కూర్చుంటాడు. ఆ చిన్న పెట్టె లేకుండా ఆ తాతని ఎప్పుడూ చూడలేదు. ఇంతకీ ఏముంటుందంటావురా అందులో ? " అని ఒక సందేహాన్ని లేవనెత్తాడు. ‘నిజమే ' అని అనిపించింది మా ఇద్దరికీ . ఆ పెట్టె లేకుండా ఆ తాత ని ఎప్పుడూ చూడలేదు.

రాజేష్ “తాత చుట్టలు  కాలుస్తాడేమో రా . అందులో చుట్టలు కానీ ఉన్నాయేమో ?” అన్నాడు . "ఛా..  ఛా  ... చుట్టలుండవురా!.. ఆ తాత  చుట్టలు కాల్చగా ఎప్పుడూ చూడలేదు. అయినా ఆ పెట్టె ని చూస్తే పవిత్రం గా కనిపిస్తుంది ." అన్నాను  నేను.   “అందులో ఆయన ఆస్ధి తాలూకా తాళాలు, వీలునామా కానీ పెట్టుకొంటారేమో " అన్నాడు శేఖర్. “కాదేమోరా !.. అవి భద్రంగా పెట్టినా .. రోజూ ఇలా ప్రక్కన పెట్టుకొని కూర్చోరుకదా !. పోనీ ఎవరైనా తీసేస్తారేమోనని భయం తో పెట్టుకొని కూర్చున్నా .. ఆయన పడుకున్నప్పుడు తీసేయచ్చుకదా!” అన్నాను నేను.  శేఖర్ ‘ పోనీ ఆ అమ్మాయిని అడిగితే?..’ అన్నాడు . "పళ్ళు రాలగొడుతుంది !" ఠపీ మని అన్నాడు రాజేష్.  ‘పోనీ ఆ తాత నే అడిగితే?..’ మళ్ళీ అన్నాడు శేఖర్. ‘ఊత కర్రతో ఒక్కటి ఇస్తాడు' అన్నాను నేను.

మా ముగ్గురికి  ఆ పెట్టె లో ఏముందో తెలుసు కోవాలన్న ఉత్సుకత  బాగా పెరిగిపోయింది. దాంతో ఎలాగైనా తెలుసుకోవాలని , ఒక సెలవురోజు  మా గది ముందు అరుగుమీద కూర్చొని పుస్తకాలు ముందేసుకుని చదువుతున్నట్టు నటిస్తూ ..ఆ తాత ఆ పెట్టె తో ఏమి చేస్తారోనని గమనించసాగాము. మధ్యాహ్నం భోజన సమయమైంది కానీ ఆ తాత ఆ పెట్టె ముట్టుకోలేదు. అలా ప్రక్కన పెట్టుకొని కూర్చున్నాడంతే.  ఇంతలో తనని తాత గారి కోడలు భోజనానికి రమ్మని పిలిచింది. ఆ తాత ఆ పెట్టె ను పట్టుకొని లోపలి కి వెళ్ళిపోయాడు. మేము కూడా వెంటనే భోజనానికి మెస్ కి వెళ్ళి తిరిగొచ్చేసరికి  ఆ తాత,  పెట్టె తో మళ్ళీ ఆ అరుగు మీద తయారు. మళ్ళీ మేము చూడడం మొదలుపెట్టాము . మధ్య మధ్య లో ఆ పెట్టె తో .. ఇంటి లోపలి కి వెళ్ళి వస్తూవుండేవాడే కానీ ఆ పెట్టెని మాత్రం  తెరవలేదు. రాత్రి అయిపొయింది కానీ మేము ఏమి కనిపెట్టలేకపోయాము. మా ముగ్గురికీ ఓపిక కూడా నశించిపోయింది. శేఖర్ ' ఒరే! అమ్మాయినైతే ఎంతసేపైనా చూడచ్చు,ఆ ముసలాయన్ని ఎంతసేపుచూస్తాం . వయసు మీద పడింది కదా ... చాదస్తం తో అలా పెట్టుకొని వుంటారు.  ఊసుపోక, ఎవరు మాట్లాడేవారు లేక తోడు కోసం ఆ పెట్టెని పెట్టుకొని వుంటారు. నేనిక చూడలేను .. నా వల్ల కాదు , నేను మెస్ కి పోతున్నాను .. మీరు వస్తే రండని ' అంటూ బయలుదేరడానికి సిధ్ద మైపోయాడు. మాకు కూడా విసుగనిపించింది. అక్కడి తో మా ప్రయత్నాలు ఆపేసేము.

ఉదయం నుండి మేము ముగ్గురం , గది ముందు పుస్తకాలు పట్టుకొని  అటువైపే చూస్తుండడం ఆ తాత గమనిస్తూనే ఉన్నారు .  తన మనమరాలు కోసమే  మేము అలా కూర్చున్నామని అనుకొంటారని నాకుమనసు లో  చిన్న భాధ వేసింది.  అక్కడి తో మేము ఆ తాత పెట్టె గురించి ఆలోచించడం మానివేసేము.

మాకు కూడా  ఆఖరి సంవత్సరం పరీక్షలు రావడం తో .. పరీక్షల హడావిడి లో ములిగిపోయాము. మధ్య మధ్య లో తాత ని గమనిస్తూ ఉండే వాళ్ళము, కానీ ఎప్పుడూ తాత ఆ పెట్టెని తెరవడం మాత్రం చూడలేదు.

మా పరీక్ష లూ  అయిపోయాయి . ఎవరి ఊళ్లకు వాళ్ళం వెళిపోయాము. పరీక్షల ఫలితాలు వచ్చిన కొన్ని నెలల తరువాత , మేము మళ్ళీ ఆ ఊరు వెళ్ళాము. అలవాటు ప్రకారం ఆ ఇంటి గడప వైపు చూస్తే ఖాళీ గా కనిపించింది. తాత కనిపించలేదు. ఎక్కడికైనా వెళ్లారేమో అనుకొన్నాము . మా సర్టిఫికెట్స్ తీసుకొందుకు , తక్కిన లాంఛనాలు పూర్తి చేయడానికి రెండు మూడు రోజులు అక్కడే వుండవలసి వచ్చింది.  తాత మాత్రం కనిపించలేదు. మేము మా గది ఖాళీ చేసి మా ఊళ్లకు వెళ్ళడానికి తయారయ్యము. వెళ్లే ముందు ఆ తాత గురించి తెలుసుకోవాలన్పించి మా ఇంటి యజమాని ని అడిగాము.

"వారం రోజుల క్రితమే చనిపోయాడు బాబూ !.." అని చెప్పారు.

మేము ఒక్కసారి నిస్చేష్టులమైయ్యాము . తాత లేని ఆ అరుగుని అస్సలు ఊహించలేకపోయాము. చాలా సేపటివరకు తేరుకోలేకపోయాము.    " ఒకసారి మనం ఆ తాత గారి అబ్బాయిని పరామర్శించి వద్దామా ?" అని అన్నాను . రాజేష్ "ఏమైనా అనుకుంటారేమోరా !ఇన్నాళ్లుగా ఎప్పడూ మనం  ఆయనతో మాట్లాడలేదు ,పరిచయం కూడా లేదు. అలాంటిది ఇప్పుడు వెళ్లి మాట్లాడితే బాగోదేమోరా" అన్నాడు.

" పరవాలేదులేరా ! మనం పరామర్శించడానికేగా వెళ్ళేది. ఒకవేళ ఆయన ఏమని అన్నా ,పరుషంగా మాట్లాడినా , మనం ఇక్కడ ఎలాగో ఉండం కదా !. ఒకసారిపరామర్శించి వస్తే ఆ  తాత గారి ని కూడా గౌరవించినట్టవుతుంది. " అన్నాడు శేఖర్.  ఎప్పుడూ హుషారుగా ఉంటూ,  తాత ని కామెంట్ చేస్తూ మాట్లేడే  శేఖర్ ని తాత  గారి మరణం  కదిలించేసిందనిపించింది. ముగ్గురం వెళ్లి కలవాలనుకొన్నాము.

మరునాడు ఆ తాత గారింటికి వెళ్ళాము. కొంచెం బెరుకుతో వాళ్లింటి గుమ్మం దాటి లోపలి ప్రవేశించాము. గుమ్మానికి ఎదురుగా .. ముందుగదిలో ఆ తాత గారి ఫోటో కి దండ వేసిఉంది . ఆ గదిలో కుర్చీలో ఆ తాత గారి అబ్బాయి కూర్చొని ఉన్నారు . మమ్మల్ని చూసి 'ఎందుకువచ్చారో ' అన్నట్లుగా చూసి 'రండి బాబూ.. ఇలా కూర్చోండి . '.. అంటూ కుర్చీలు చూపించారు. కూర్చున్నమాకు కొంతసేపటివరకు ఏమి మాట్లాడాలో తెలీలేదు. ఇంతలో వారి అబ్బాయి  గ్లాసు లతో మంచినీరు తెచ్చాడు. తాగిన తరువాత మెల్లగా నేను "మా ముగ్గురికి పరీక్షలు అయిపోయాయండీ. రిజల్ట్స్ కూడా వచ్చ్చేసాయి. ఇక్కడ గది ఖాళీ చేసి మా ఊళ్ళకి వెళ్ళి పోతున్నాము. ఈరోజే తెలిసింది ..తాత గారు లేరని. ..." అని అన్నాను. వారి నాన్నగారి ప్రసక్తి వచ్చేసరికి బాధ తో కొంతసేపు కళ్ళు మూ సు కొన్నారు.

" అవును బాబూ !.. ఆరోజు బాగానే ఉన్నారు . అర్థరాత్రి  గుండెల్లో నొప్పి అన్నారు. మేము హాస్పిటల్ కి తీసుకెళ్లే లోపలే ప్రాణాలు విడిచారు' అని భాద తో చెప్పారు. తరువాత మా గురించి , ఎక్కడనించి వచ్చామో , ఏమి చదువుదామనుకొంటున్నామో అడిగి తెలుసుకొన్నారు. కొంత సేపు పోయినతరువాత .. రాజేష్ " వెళ్లేముందు  మిమ్మల్ని ఒక సారి కలిసి వెళదామని వచ్చామండి " .. అంటూ వెళ్ళడానికి నిలబడ్డాడు. మేము కూడా సిద్దమయ్యాము. 'మంచిది బాబూ !.. ఎప్పుడైనా ఇక్కడకి వస్తే తప్పకుండా కలవండి ' అంటూ ఆయన కూడా లేచి నిలబడ్డారు. ఇంతలో శేఖర్ 'ఒరే ఒకసారి ఆ పెట్టె గురించి అడగరా !.. ' అంటూ మెల్లిగా నా చెవిలో గొణిగాడు. నాకు కూడా మనసు లో అదే తొలుస్తున్నాది . ఎవరేమనుకున్నా ..ఇంకా మేము ఇక్కడ ఎలాగో ఉండం కాబట్టి ఆ పెట్టె లో ఏముందో అడగాలనిపించింది. ఆయన భాధ పడినాసరే... ఇంక ఆగలేకపోయాను.

"మీరు ఏమీ అనుకోనంటే ఒకటి అడగాలనుకొంటున్నాను. " అన్నాను.

'పరవాలేదు బాబూ !.. అడుగు ' అన్నారు.

"ఏమిలేదండి. తాత గారు ఎప్పుడూ ఒక పెట్టె ప్రక్కన పెట్టుకుని వీధి అరుగు మీద కూర్చొనే వారు. ఆ పెట్టె ప్రక్కన లేకుండా తాత గారి ని ఎప్పుడూ చూడలేదు. అందులో ఏముందో తెలుసుకోవాలని ఉంది ..మీరు ఏమీ అనుకోనంటే చెప్పండి " అన్నాను.

ఆయన కొంతసేపు ఆగి అన్నారు .

" మా అమ్మగారి చితాభస్మం."

ఆయన సమాధానం విని మా ముగ్గురికి నోట మాట రాలేదు. నిస్చేష్టులమయ్యాము . దాని వెనుక ఏదో కధ ఉందనిపించింది. "మాకు ఆశ్చర్యంగావుంది. కొంత వివరంగా చెబుతారా? "అంటూ అడిగాను. "కూర్చోండి బాబూ !.. ' అంటూ తానూ కూర్చొని , తన తండ్రి గారి సంగతులు గుర్తుతెర్చుకుంటూ చెప్పడం మొదలుపెట్టారు. 

“మా నాన్నగారు .. స్వాతంత్య్రం  రాకముందు బ్రిటీష్ సంస్థానం లో పనిచేస్తూవుండేవారు. అప్పుడు స్వాతంత్రోద్యమం  ఉధృతంగా సాగుతున్నది. ఒకసారి గాంధీ గారి సభ మా ఊరి దగ్గర లో ఉన్న పట్టణం లో జరిగింది . దానికి మా నాన్నగారు వెళ్లడం జరిగింది .అక్కడ గాంధీ గారి మాటలకు  ప్రభావితులై ఉద్యోగాన్నివదలి  అప్పటినుండి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. చాలాసార్లు జైలు కి కూడా వెళ్లారు. అలా ఆ కాలం లోనే కందుకూరి వారి 'విధవా వివాహా ల 'కు ప్రేరితులై .. ఇంటిలో ,ఊరిలో పెద్ద వాళ్ళ మాటలను పట్టించుకోకుండా .. బాల్యవివాహము వలన విధవరాలైన మా అమ్మగారిని వివాహము చేసుకొన్నారు. దానివలన ఊరి లో ప్రజలు , బంధు వర్గం వీరిని వెలివేసినా .. మొక్కవోని ధైర్యం తో వీరిద్దరే అందరినీ వదులుకొని కలిసి జీవించారు.

స్వాతంత్య్రం వచ్చిన తరువాత బంధువులంతా తిరిగి రమ్మన్నా 'నేనే మిమ్మల్ని వెలివేసానని ' ఎవ్వరి సహాయం లేకుండా స్వతంత్రం  గా , ఆధునిక భావాలతో జీవించారు. అలా అందరినీ వదులుకోవడం  వలన ఆర్థికంగా చితికి , మాకు ఆస్థులేవి ఇవ్వకపోయినా , మంచి చదువులు చెప్పించి ,తాను  నమ్మినసిధ్ధాంతాలను మాకూ నేర్పారు.

తను మళ్ళీ 'విధవ ' రాలి గా మారకూడదని ,సుమంగళిగానే పోవాలనే మా అమ్మగారి కోరిక కూడా ఐదు సంవత్సరాల  క్రితమే తీరిపోయింది. అప్పటి నుండి మా అమ్మగారి 'చితాభస్మాన్ని ' మా నాన్నగారు తనతో పాటే ఈ పెట్టెలో పెట్టి ఉంచుకో సాగారు . మా అమ్మగారిని మా నాన్న గారు ఎంతో ప్రేమగా చూసుకునేవారు.  'నా గౌరి నన్ను వీడి పోలేదు. నాతోనే ఉంది . నాతోనే పోతుంది. ' అంటూ ఉండేవారు. చితాభస్మం ఇంటిలో ఉండకూడదని ఎందరు చెప్పినా  వినకుండా తన దగ్గరే ఉంచుకొన్నారు. ఆయన పట్టుదలని, ఏమి అనుకొంటే అదే చేసే అయన ధోరణిని మేము ఏమీ మార్చలేక పోయాము. ఆయనకి అడ్డు చెప్పలేకపోయాము. తన ఆఖరికోరికగా మా అమ్మగారి 'చితాభస్మం'తో పంచభూతాలలో  కలిసిపోవాలనుకొన్నారు. ఆయన కోరుకున్నవిధంగానే ఆయన ఆఖరి కోరికను తీర్చాము.'' అంటూ ముగించారు.

ఆ పెట్టె వెనుక ఇంత కధ ఉందని ఊహించని మేము  విని నిస్చేష్టులమయ్యాము. ఇంతటి గొప్పవాడిని , ఆదర్శభావాలున్న వ్యక్తిగురించి, ఆ పెట్టె గురించి ఏవేవో విమర్శలు చేసిన  మాకు నోట మాట రాలేదు. తన భార్య 'చితాభస్మం ' తనతో పాటే ఉంచుకొని , తనతో పాటే పంచభూతాలలో   కలిసిపోవాలన్న ఆయన కోరిక కొంత భిన్నం గా , విచిత్రం గా అనిపించినా .. ఆయనకు తన  భార్య మీద ఉన్న ఆకాశమంత ప్రేమకు , అభిమానానికి మాకు కళ్ళల్లో గిర్రున నీరు తిరిగింది. ఆయనకు మనసులోనే నివాళులర్పిస్తూ ముగ్గురము భారమైన గుండెలతో వెనుదిరిగాము.

*****                      *****                        ***** 

ఎప్పటికీ మర్చిపోలేని ఆ తాత జ్ఞాపకాలలోంచి… వర్తమానం లోకి వచ్చాను .

ఆ తాత కథవిన్న నా భార్య పిల్లల కళ్ళల్లో ఆశ్చర్యం తో కూడిన గౌరవభావం కనిపించింది. నా భార్య మృదువుగా నా చేతిని తన చేతిలోకి తీసుకుంది. ఆ స్పర్శలో ఆ తాత గారి కి తన భార్యమీద ఉన్న ప్రేమ ని తను అర్ధం చేసుకున్నానన్నట్టు అనిపించింది.

మరిన్ని కథలు
memoo manusulame