Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
chamatkaaram

ఈ సంచికలో >> శీర్షికలు >>

విహారయాత్రలు ( మలేషియ ) - కర్రా నాగలక్ష్మి

maleshiya

( జెంటింగ్ హైలెండ్స్ )

సాధారణంగా వేసవి విడుదులు అంటే ఎత్తైన కొండలమీద వుండే వూళ్లు , మనం మనకి నచ్చిన హోటల్స్ లో దిగి చుట్టుపక్కల ప్రదేశాలు చూసుకొని విశ్రాంతి తీసుకొని వచ్చెస్తాం . ఇలాంటివే మనకి అనుభవంలో వున్నాయి , కాని మొత్తం కొన్ని వేల యెకరాల స్థలంలో వున్న రిసాట్స్ ని వేసవి విడిది అని అనొచ్చా ? అన్ని రకాల వినోదాలు , హోటల్స్ , రెస్టోరాంట్స్ , పార్కింగులతో సహా ఒక నిజ వాణిజ్య సంస్థ ఆధ్వైర్యంలో వుండడం యిదే మొదటి దేమో లేక నాకు తెలిసి యిదొక్కటేనేమో ? కాదు కాదు యిలాంటివి చాలా తక్కువగా వున్నాయి కాని అసలే లేవని కాదు . ఫ్రాన్స్ లో వున్న ‘ డిస్నీ లేండ్ ‘ అలాంటిదే కాని అందులో గదులు అద్దెకిచ్చే సదుపాయం లేదు . అమెరికా లోని లాస్ వేగాస్ అయితే ఒకే సంస్థ ద్వారా నడుప బడటం లేదు . కాని యీ జెంటింగ్ హైలెండ్స్ మొత్తం ఒకే సంస్థ ద్వారా నడుపబడుతున్నాయి .     

మలేషియా లోని ప్రముఖ వ్యాపార వేత్త ‘ తన్ లిమ్ గొహ్ టొంగ్ 1965 లో ‘ కెమరూన్ హైలేండ్స్ ‘ లో  విశ్రాంతికై వచ్చి తన హోటల్ రూము లోంచి ప్రకృతిని ఆరాధిస్తున్నప్పుడు కౌలాలంపూర్ కి ఓ గంట ప్రయాణం తో చేరుకోగలిగే చోట సర్వ సదుపాయాలతో ఓ వేసవి విడిది నిర్మిస్తే అనే ఆలోచనలకు ప్రతి రూపమే యీ ‘ జెంటింగ్ హైలెండ్స్ ‘ . కౌలాంపూర్ కి దగ్గరగా వున్న అనువయిన ప్రదేశాలను వెతికే టప్పుడు లిమ్ కి సుమారు 55 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 5,700 యెత్తున ‘ టిటివంగ్స్ ‘ ప్రవతశ్రేణులు ఆకర్షించేయి . అయితే యీ పర్వత శ్రేణులు ‘ పహాంగ్ ‘ , సెలంగోరు రాష్ట్రాలకు చెందినవి కావడంతో ఆయా రాష్ట్ర ప్రథినిధులతో సంప్రదింపుల అనంతరం పహాంగ్ రాష్ట్రం నుంచి 12వేల యెకరాల భూమిని ఫ్రీహోల్డు లోను , సెలంగోరు ప్రతినిధులు 99 సంత్సరాల లీజుకి గాను సమ్మతించి తరువాత లిమ్ కోరిక పైన ఫ్రీహోల్డ్ లో సుమారు 28 వందల యెకరాల భూమిని సంపాదించి రాకపోకలకు వీలుగా రోడ్డు నిర్మాణం కావించి ఆగష్టు 18 1965 లో అప్పటి ప్రధాన మంత్రిచే మొదటి హోటల్ ‘ హైలేండ్ హోటల్ ‘ కి శంకు స్థాపన చేయించేరు .

1971 లో హైలేండు హోటల్ పూర్తయింది . జెంటింగ్ పనులను పర్యవేక్షించిన అప్పటి  ప్రధానమంత్రి అక్కడ జరుగుతున్న అభివృధ్ది పనులుచూసి ప్రకృతికి యెటువంటి క్షతి కలుగ జేయకుండా జరుగుతున్న నిర్మాణపు పనులకు సంతోషించి అక్కడ ‘ కేసినో ‘ నడుపుకోడానికి కావలసిన లైసెన్స్ లు మంజూరు చెసేరు . మలేషియ దేశం లో జూదాలను  అనుమతించరు , అందుకే మలేషియ లో ‘ కేసినొ ‘లు లేవు . ‘ జెంటింగ్ ‘ లో మాత్రం కేసినోలను అనుమతించేరు . కొద్దికాలం తరువాత ‘ హైలేండ్ హోటలు ‘ థీమ్ పార్క్ హోటల్ ‘ గా మార్చబడింది .

మలేషియా లోని అన్ని పట్టణాలనుంచి ‘ జెంటింగ్ ‘ కి బస్సు , టాక్సీ సర్వీసులు వున్నాయి .  పినాంగ్ నుంచి సుమారు 340 కిలోమీటర్ల దూరం . మేం మా అలవాటు చొప్పున మా కారులో ప్రయాణం సాగించేం . హై వే మీద ప్రయాణం కాబట్టి చాలా అహ్లాద కరంగా సాగింది . ఐపొహ్ గుహలు , బాతు గజ దాటి కౌలాలంపూర్ కి 40 కిలోమీటర్ల దూరంలో హైవే దిగి ‘ జెంటిగ్ ‘ రోడ్డు మీదకి తిరుగేం . అక్కడ నుంచి ఒక్కమారుగా వాతావరణం మార్పు చెందుతుంది . సూర్యకిరణాలు చొరబడలేనంత దట్టమైన అడవులతో ఒక్క సారి గాలి చల్లగా మారుతుంది . మేఘాలలోంచి మా కారు వెళ్లడం సన్నగా తుప్పరగా పడుతున్న వర్షం , యింకా ముందుకి వెళుతూ వుంటే మేఘాలు దట్టంగా మారి మనని చుట్టుముట్టడం ఓహ్ అదో గొప్ప అనుభవం . జెంటింగ్ చేరిన తరువాత ఆశ్చర్యం ఆపర్వతాల పైన బహుళ అంతస్థుల హోటల్స్ , అలాగే బహుళ అంతస్థుల పార్కింగులు . సొంత కారులలో వచ్చేవారికి కష్టాలు యిక్కడనుంచి మొదలవుతాయి .

జెంటింగ్ హైలెండ్స్ లో సుమారు 6 హోటల్స్ వున్నాయి . అన్ని హోటల్స్ రిసెప్షన్స్ సొరంగ మార్గం ద్వారా కలిసి వుంటాయి . అలాగే పార్కింగ్ లోనుంచి అన్ని హోటల్స్ లాబి లకి సొరంగమార్గాలు , లిఫ్ట్ లు  వున్నాయి . మేం వెళ్లింది వీకెండు కావడం తో రూములు దొరకడం కష్టమైంది , దాని కన్నా ముందు పార్కింగు ప్రోబ్లమ్ అయింది . పార్కింగ్ లో పెట్టుకొని రూము కోసం వెతుకసాగేం , 7 నక్షత్రాలనుంచి వున్నాయి , యే నక్షత్రం లేని హోటలు అద్దె చుక్కలలో వుంది , అదీ ఖాళీ లేదు , క్యూలో నిలబడితే ఓ రూము ఖాళీ అయితే దాన్ని క్యూలో వున్న వాళ్లకి అలాట్ చేస్తున్నారు . అలా మాటర్న వచ్చేసరికి మూడు నాలుగు గంటలు పట్టింది . రూము చేరి మాతో తెచ్చుకున్న భోజనం చేసి తిరగడానికి బయలుదేరేం . మా రూము యెంత చిన్నదంటే అయిదడుగుల బెడ్ తప్ప మరేవీ లేవు రూములో , బెడ్ పక్కన ఓ అడుగు జాగా నడవడానికి మాత్రం వుంది .

బాత్ రూము మూడు చదరపు అడుగులది , అయితే చాలా నీటుగా వుంది , యెక్కడా మనం రోడ్డు పైకి రావలసిన అవుసరం లేకుండా అన్ని ప్రదేశాలకి  చేరుకోవచ్చు . మరో రకంగా చెప్పుకోవాలంటే కాళ్లు నొప్పులు పెట్టడం తధ్యం . ఆటోలలో వెళదాం అనుకుంటే పొరపాటే . ఇక్కడ అలాంటి వేమీ వుండవు . లోపల నుంచి వెళ్లేటప్పుడు నిజంవి అనిపించేటట్టుగా వుండే ప్లాస్టిక్  అడవులు  , కొండలు జలపాతాలు ఆఖరుకి షవర్స్ ద్వారా పడుతున్న వాన లోంచి వెళ్లడం , ప్లాస్టిక్ మానులను వూడలను తడిమి చూసి ఓ ప్లాస్టికి వా అనుకోడం , కొండలను కూడా తడిమి చూడడం , జలపాతాలను చూసి ఆశ్చర్య పోవడం ఓ అనుభూతి . వీటికి రూప కల్పన చేసినవాడు అపర విశ్వామితృడా ? లేక మరో మయుడా ? అనే అనుమానం కలుగమానదు .

అప్పటికే సాయంత్రం అయిపోయింది కాబట్టి మేం కెసినొ కి వెళ్లేం , జూదం యెప్పుడూ ఆడకోడదు అది సరదాకైనా అనే నియమం మా దంపతులకి వుండడం వల్ల కోయిన్ మిషన్ల దగ్గర కూడా కూర్చోలేదు . రైడ్స్ కి వెళ్లేటప్పుడు కెసినోలోంచి వెళ్లవలసి రావడంతో అక్కడి వాతా వరణాన్ని చూసేం . ఒక నిముషం కెసినొ లో గడిపినా ఒక చైన్ స్మోకర్ పది సంవత్సరాలు సిగరెట్టు కాల్చితే వూపిరి తిత్తులు పాడయినంత పాడవడం మాత్రం నిజం అనేది అర్దమైంది . మలేషియాలో జూదం త్రాగుడు , సిగరెట్టు కాల్చడం పై నిబంధనలు వుండడం వల్ల యిక్కడ అలాంటివి లేకపోడం వల్ల చాలా మంది యిక్కడకి వీటికోసమే వస్తారు .

నైట్ రైడ్స్ వున్న చోటికి వెళ్లేం , అక్కడ ప్రపంచంలోని పేరుపొందిన భవనాల నమూనాలు వున్నాయి . వాటి చుట్టూ తిరిగే రైడ్స్ వున్నాయి . రాత్రి అందరూ కెసినోలలో బిజీగా వుండడం వల్ల రైడ్స్ కి పెద్దగా రద్దీలేదు . ముందుగానే అన్ని రైడ్స్ కి టికెట్టుతీసుకోవాలి కాబట్టి టికెట్టుతీసుకొని మాకు నచ్చినవి పెద్దగా భయం లేనివి యెక్కేం . ఇండోర్ వి కావడం వల్ల పెద్దపెద్ద రైడ్స్ లేవు . మౌంటు క్లైంబింగ్ మొదలయినవి కూడా వున్నాయి .

పట్టపగలుని తలపిస్తున్న లైట్లు , యెవరికి నచ్చిన రైడ్స్ వారు యెక్కుతూ యెవరి లోకం లో వారున్నారు . వేలమంది ఒకే సారి గోల చేస్తే యెంత శబ్దం , అది చాలదన్నట్టు డిస్కో మ్యూజిక్ గోల మేం మాట్లాడు కోడానికి అరవవలసి వచ్చేది , దాంతో తెల్లవారేసరికి గొంతునొప్పి మాటలేదు . రాత్రి అక్కడున్న వాటిలో నాలుగో వంతు చూడగలిగేమేమో కాళ్లు నొప్పులు , గొంతునొప్పితో ఒంటిగంటకి వెనక్కి తిరిగేం , మా హోటల్ కి వెళ్లడానికి దారితప్పి తిరిగి తిరిగి రెండింటికి రూము చేరేం . బయట మాత్రం గోల తెల్లవార్లూ సాగుతూనే వుంది .

మేం మళ్లా ప్రొద్దుట మిగిలినవి చూద్దామని బయలుదేరేం . అవన్నీ రాత్రికేనట , పగలు ఔట్ డోర్ రైడ్స్ వుంటాయట . వాటికి వెళ్లేం . ఆ రైడ్స్ మావల్ల కావు అని వాటిని చూడగానే అర్దమయింది . మరో పక్క రైన్ ఫారెస్ట్ పైనుంచి వానలా పడుతూ వుండగా మట్టితో కట్టిన గుహలాంటి దాంట్లోకి అందరూ వెళుతున్నారు . స్విమ్ సూటు వేసుకున్నవాళ్లు మాత్రమే వెళ్లాలి అనే ఆంక్ష వుండడం వల్ల మేం వెళ్లలేదు అలాగే వాటర్ పార్క్ కూడా .

ఆ పక్కన స్నో మిషన్ పెట్టేరు అదో గాజు తలుపులతో పెద్ద గదిలా కట్టేరు ఓ పక్కగ వున్నచక్రం లాంటిది తిరుగుతూ తెల్లని మంచుని విసురుతోంది స్నోసూట్స్ వేసుకున్న పర్యాటకులు కేరింతలు కొడుతూ వారి మీద పడుతున్న మంచుతో ఆడుకుంటున్నారు . వారిని చూస్తే నచ్చింది కాని మేం వెళ్లాలంటే మాత్రం బిడియపడ్డాం .

ఔట్ డోర్ రైడ్స్ మాకోసం కాదు అనిఅనిపించగానే మేం మాకారు వెతుక్కొని సైట్ సీయింగ్కి బయలుదేరేం . ముందు కేవ్స్ టెంపుల్ కి బయలుదేరేం . దారంతా నిర్మానుష్యంగా వుంది . రాత్రంతా కెసీనొ లలో గడిపిన పర్యాటకులు పగలు నిద్రకుపక్రమించడం వల్ల రోడ్లు నిర్మానుష్యంగా వున్నాయి .  జెంటింగ్ ను నిర్మించిన సంస్థ యీ చైనీస్ మందిరానికిగాను సుమారు 28 యెకరాల జాగా సమకూర్చింది . ఇందులో చైనీస్ బౌద్దమందిరాన్ని నిర్మించేరు . మందిరం మొత్తం చైనీస్ శిల్పకళతో నిర్మింపబడింది . ఎర్రటి రంగు రాసిన పెద్ద పెద్ద డ్రాగాన్ లు స్వాగతం పలుకుతూ వుంటాయి . ప్రహారి గోడని కూడా ఎర్రటి డ్రాగాన్ లతో అలంకరించేరు . దట్టమైన అడవి మధ్య లో ప్రశాంతమైన ప్రదేశంలో వున్నమందిరం . మానవ నిర్మితమైన జలపాతాలు యీ మందిరానికి అదనపు ఆకర్షణ . మందిర ప్రాంగణంలో పద్మాసనంలో వున్న పెద్ద బౌద్ద విగ్రహం మనని అకట్టుకుంటుంది . మందిరం లోని ప్రతీ స్థంభం పైన పెనవేసుకున్న డ్రాగన్స్ చెక్కివున్నాయి .         బయట వున్న వుద్యానవనంలో నల్లమందారాలు మమ్మలని ఆశ్చర్యంలో ముంచేయి , అదీ చాలా డార్క కలర్ లో , తరవాత మరి ఆరంగు మందారాలని యెక్కడా చూడలేదు .

జెంటింగ్ హైలేండ్స్ ని నిర్మించిన లిమ్ చైనా లోని ఫుజి ప్రాంతానికి చెందిన బౌధ్ద శాఖకు చెందన వాడు కావడంతో ‘ ఛిన్ స్వీ ‘ మందిర నిర్మాణం చేపట్టేడు . ఈ మందిరం కోసం యెంచుకున్న ప్రదేశం యెగుడు దిగుడు గా వుండి పర్వతశిఖరానికి చేరడానికి నడక తప్ప మరో మార్గం లేకపోవడంతో యీ మందిర పునాదికి కావలసిన 80 అడుగుల త్రవ్వకంలో యెటువంటి యంత్రాలను వుపయోగించే వీలు లేకపోయింది . చాలా పనులు యంత్రసహాయం లేకుండా చెయ్యవలసి రావడం వల్ల యీ మందిర నిర్మాణం 18 సంత్సరాల దీర్ఘకాలం పట్టింది .
గర్భ గుడిలో ఛిన్ స్వీ యొక్క జీవిత గాధలు రాసివున్నాయి , అలాగే అతని వద్ద గల ప్రత్యేక శక్తులను గురించిన కథలు కూడా రాసేరు . ఛిన్ స్వీ అనే బౌధ్దబిక్షువును ఫుజీ ప్రాంతపు ప్రజలు సాక్షాత్తు బుధ్దుని గా కొలుస్తారు , యితని వద్ద వర్షాలను కురిపించే శక్తి , చెడుశక్తులను నిరోధించే శక్తి వున్నదని నమ్ముతారు .

మందిరం లోపల బయట అంతా చైనీస్ లేంపులతో అలంకరించి వుంటుంది . గర్భగుడిలో వున్న ‘ ఛీ స్వీ విగ్రహాన్ని ‘ ఫేంగ్ సుయి ‘ శాస్త్రాన్ని అనుసరించి నిర్మించేరు. విగ్రహాన్ని కూడా ‘ ఫేంగ్ సుయి’ ప్రకారం ఉత్తరాన వున్న గట్టు పై దక్షిణాభిముఖంగా ప్రతిష్టించేరు . ఈ మందిరానికి జెంటింగ్ హైలేండ్స్ కి వచ్చే పర్యాటకులే కాక చైనా లోని ఫుజి ప్రాంతపు ప్రజలు , హాంకాంగ్ , తైవాన్ , ఇండోనీషియ , థైలాండ్ లనుంచి ఛీ స్వీ భక్తులు వస్తూ వుంటారు .

ప్రతీ సంవత్సరం చాంద్రమాన కొత్త సంవత్సరం నుంచి పదిరోజుల పాటు యీ మందిరంలో ఉత్సవాలు జరుపుతారు . విగ్రహం కొండను ఆనుకొని వుంటుంది , కొండపక్కన మానవ నిర్మితమైన జలపాతం నుంచి మినరల్ నీరు ప్రవహింప జేస్తున్నారు . దీనిని ‘ డ్రేగాన్ వాటర్ ఫాల్స్ ‘ అని అంటారు . దీనిని చాలా పవిత్ర మైన నీరుగా భావించి చైనీయులు తమతోకూడా తీసుకు వెళతారు .

ఈ మందిర నిర్మాణం చాలా వ్యయప్రాయాసలతో కూడుకున్నదే కాక ప్రమాద భరిత మైనది కూడా . అంత ప్రమాదకరమైన కట్టడం లో చిన్నపాటి ప్రమాదం కూడా జరగలేదని , అలా జరుగకుండా ‘ ఛీ స్వీ ‘ యొక్క  శక్తే కాపాడిందని నమ్ముతారు .ఇక భోజన సదుపాయానికి వస్తే వెజిటేరియన్ వి యేవీ మాకు దొరకలేదు . వెజ్ బర్గర్ అంటే సలాడ్ ఆకులు వేసిన బర్గరు దొరికింది , అంతే మరేం వెజిటేరియన్ వి దొరకలేదు . ఇప్పడు పరిస్థితి మారి వుండవచ్చు , భారతీయ వంటలు కూడా దొరుకుతూ వుండవచ్చు . ప్లైన్ యోగర్ట్ కూడా దొరకలేదు . మేం కందిపొడి అన్నం తో రోజు గడుపుకున్నాం .

జెంటిగ్స్ హైలేండ్స్ లో ‘ ఫస్ట్ వర్ల్డ హోటల్ ‘ 7351 రూములతో ‘ గిన్నిస్ బుక్ ఆఫ్ వర్ల్డ్ రికార్డ్స్ ‘ లో 2006 నుంచి 2008 వరకు యెక్కువ గదులు గల హోటల్ గా చోటు సంపాదించుకుంది , తిరిగి 2015 లో 10,000 గదులకు పెంచడంతో తిరిగి గిన్నెస్ బుక్ లోకి చేరింది .          మిగతా 5 హోటల్స్ కూడా చిన్నవేమీ కావు , ధరలు కూడా చాలా యెక్కువగా వుంటాయి , చుట్టుపక్కల దేశాలనుంచే కాదు యురోపు దేశాలనుంచి వచ్చే పర్యాటకులు నెలల తరబడి యిక్కడ వుంటారు అంటే ఆశ్చర్యం కలిగింది . వారితో మాట్లాడిన తరువాత వారి మాటలు వింటే నిజమే అనిపించింది  . యురోపియన్ దేశాలలో సీనియర్ సిటిజన్స్ శీతాకాలంలో ఆ దేశాలలో గడపాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని , వారి దేశం లో ఒక నెలకయే ఖర్చుతో మలేషియాలో నక్షత్రాల హోటల్ లో ఆరునెలలు గడపొచ్చట , అదే సంపన్నులైతే మన ఊహకే అందదు కదా ? అందుకే యురోపియన్స్ నవ్వంబరు నుంచి ఏప్రెల్ వరకు మలేషియ , థాయ్ లాండులలో గడిపి తిరిగి వారి దేశాలకు వెళుతూ వుంటారు . మరికొందరు యేదో చుట్టం చూపుగా వారి దేశాలకు వెళ్లేవారు కూడా వున్నారు . వీరు ఆరేసినెలలకు హోటల్స్ బుక్ చేసుకోడం వల్ల హైలేండ్స్ లో యెప్పుడూ బసలకు గిరాకి యెక్కువగా వుంటుంది .

జెంటింగ్ హైలెండ్స్ కి మూడు రోజుల పేకేజీ టూరులు నిర్వహించే సంస్థలు కూడా వున్నాయి . అందులో వెళితే హోటలు రూము కూడా వారే బుక్ చేస్తారు కాబట్టి పార్కింగు , రూము ల గురించిన టెన్షను మనకి వుండదు .

2018 వరకు మరమ్మత్తు పనులు జరుగుతున్న దృష్టా ఔట్ డోర్ థీమ్ పార్కు మూసి వేసేరు . ఈ సంవత్సరం వెళ్లదలుచు కున్న వారు యీ విషయం కనుక్కొని వెళితే మంచిది . ఆ రోజు రాత్రికూడా కొన్ని రైడ్స్ తిరిగి వచ్చేం . మరునాడు 8 గంటలకు బయలుదేరిన మేం మా కారు వెతుక్కోడం లో ఓ అరగంట గడచిపోగా ఆఖరుకి మా కారులో 8-30 కి బయయలుదేరేం .

పినాంగ్ వెళ్లే దారిలో వున్న కేబుల్ కారు యెక్కాలని నిశ్చయించుకున్నాం .

ఆ వివరాలు పై వారం చదువుదాం మరి అంతవరకు శలవు .

మరిన్ని శీర్షికలు
surabhi nataka kutumbam