Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
maleshiya

ఈ సంచికలో >> శీర్షికలు >>

సురభి నాటక కుటుంబం - -ప్రతాప వెంకట సుబ్బారాయుడు

surabhi nataka kutumbam

ఇప్పటి తరానికి సురభి నాటకాలు పెద్దగా తెలియక పోవచ్చుగానీ, ఒకప్పుడు వినోదానికి చిరునామా సురభి. మనదేశంలో 1913లో వచ్చిన మూకీ సినిమా రాజా హరిశ్చంద్ర కన్నా, 1932లో వచ్చిన మొట్టమొదటి పూర్తి నిడివి తెలుగు చిత్రం భక్త ప్రహ్లాద కన్నా చాలా ముందు నుంచే అంటే 1885లో ప్రపంచ ప్రఖ్యాత సురభి నాటక సమాజం,  వైఎస్ఆర్ (అప్పటి కడప) జిల్లా సురభి గ్రామంలో 'కీచక వధ'నాటక ప్రదర్శనతో సురభి ప్రస్థానం మొదలయ్యింది. ఈ సమాజ వ్యవస్థాపకుడు శ్రీ వనారస గోవిందరావు.

1885లో వనారస సోదరులు వనారస గోవిందరావు మరియు వనారస చిన్నరామయ్య కలిసి వైఎస్ఆర్ జిల్లా చక్రాయపేట మండలంలోని సురభి రెడ్డివారిపల్లెలో శ్రీ శారదా వినోదిని నాటక సభను ప్రారంభించారు. సురభిలో ప్రారంభమైన ఈ నాటక సభ కాలక్రమేణ ‘సురభి నాటక సంఘం’గా పేరు పొందింది. రంగస్థలంపై స్త్రీ పాత్రలను స్త్రీలచే ధరింపచేసిన తొలి నాటక బృందం సురభినే. నాటకంలోని పాత్రధారులందరూ ఒకే కుటుంబంలోని సభ్యులవడం చేత స్త్రీలకు చెడ్డపేరు వస్తుందనే భయం ఉండేది కాదు. బృందంలోని సభ్యులకు రంగస్థలమే జీవనం. స్థాపించిన కొద్దిరోజులలోనే ఈ సమాజం త్వరితగతిన విస్తరించి 50 వేర్వేరు బృందాలుగా వృద్ధి చెందింది. ప్రతి బృందం దాదాపు 30 మందికి పైగా సభ్యులతో స్వయం సమృద్ధితో నడుస్తూ ఉండేది. వనారస గోవింద రావుకు ముగ్గురు కుమారులు పదిమంది కుమార్తెలు. వీరి కుటుంబం విస్తరిస్తున్నకొద్దీ నాటక బృందాలు కూడా విస్తరించాయి. 1974లో సినిమా మరియు టీవీల ప్రవేశంతో, సురభి బృందాల సంఖ్య 16కు క్షీణించింది. 1982 నాటికి కేవలం నాలుగు సురభి నాటక బృందాలు మాత్రమే మనుగడలో ఉన్నాయి. ప్రస్తుతం సురభి నాటక కళాసంఘం ఆధ్వర్యంలో అతి తక్కువ నాటక బృందాలు మాత్రమే పనిచేస్తున్నాయి.

వీరి నాటకాలలో అత్యంత ప్రజాదరణ పొందిన నాటకం మాయాబజార్. ఘటోత్కచుడు అనే రాక్షసుడు (భీమ, హిడింబల కుమారుడు) తన మాయాజాలంతో ఆభిమన్యుడు, శశిరేఖల వివాహం చేయడం, ప్రేక్షకులని కడుపుబ్బ నవ్విస్తుంది. కళాకారులు పెద్దగా చదువుకోకపోయిన, సినిమాలో లాగా, సెట్టింగులతో యుధ్ధం జరిగినపుడు, మంటలు సృష్టించటం ఆ తరువాత వాన కురిపించడం, అలాగే ఒకే సమయంలో రంగస్థలంపై, అభిమన్యుడు, శశిరేఖ వేరు వేరు సెట్టింగులలో విరహ గీతం పాడటం చాలా ఆకర్షణగా వుంటుంది.

ఇలాంటి నాటక సమాజం ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. తొలి తెలుగు సినీనటీమణి సురభి కమలాబాయి సురభి కళాకారుల కుటుంబంలో పుట్టి పెరిగిందే.

మన ప్రపంచంలో ఎంత ఉన్నా, ఎన్ని ఉన్నా పెద్ద కుటుంబాలు సెల్యూలార్ కుటుంబాలుగా విచ్ఛిన్నమవుతున్నాయి. సురభిలో నాటకాలు వేసేవాళ్లు ఒకే ఉమ్మడి కుటుంబానికి చెందినవాళ్లయినా, వాళ్ల మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు పొడసూపక కళకు అంకితమై, నటీ నటులుగా నాటకాలకు జీవం పోస్తున్నారు. ఏ వృత్తి అయినా సరైన, సౌకర్యవంతమైన జీవితాన్నియ్యకపోతే మరో పనిలోకి వలస వెళ్లే వాళ్లని మనం చూస్తాం. ఆదరణ లేక ఎన్నో వృత్తి కళలు అస్తిత్వాన్ని కోల్పోయి మూలన పడ్డాయి. గతకాలపు ప్రాభవాన్ని కోల్పోయాయి. కాని సురభి కుటుంబం మాత్రం తరతరాలుగా నాటక కళకు అంకితమైపోయి ప్రేక్షకులు కొట్టే చప్పట్లతో కడుపు నింపుకుంటోంది. ‘వన్స్ మోర్’ అంటూ ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ అంటే, తమను అభిమానించి, సన్మానించినంత సంబరపడిపోతున్నారు.

తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పబ్లిక్ గార్డెన్స్ లో శ్రీ వేంకటేశ్వర నాట్య మండలి (సురభి) వారి నాటక ప్రదర్శనలు శని, ఆదివారాల్లో సాయంత్రాలు జరుగుతున్నాయి. టికెట్ ఎంతో తెలుసా? కేవలం రూ.౩౦/- లు. మాత్రమే. నాటకం చూడడానికి ఆయా రోజుల్లో సుమారుగా ముప్పై మంది ప్రేక్షకులు వస్తారట. రూ. 30 x 30 = రూ. 900 లు. అసలు తొమ్మిదొందల రూపాయలకు ఏమొస్తుంది చెప్పండి. ఈ కరువుకాలంలో దాంతో బతగ్గలమా? కేవలం కళను (సురభి) బతికించుకోవాలన్న తపన వాళ్లను బతికిస్తోంది. దేవునికి దణ్నం పెట్టుకుని నాటకం ప్రారంభించి, పూర్తయ్యాక నటీనటులందరూ వేదిక మీద కొలువుదీరి, మనతో జనగన మన..పాడడం ఓ అద్భుత దృశ్యం. చూడ రెండు కళ్లు చాలవు.  మూడు గంటల పాటూ సాగే నాటకం మనను కుర్చీలకు కట్టిపడేస్తుందనడం అతిశయోక్తి కాదు. నాటకంలోని ఒక్కో అంకం సాంకేతిక సహాయం లేకపోయినా వింతలూ, విడ్డూరాలతో మనని ఆశ్చర్యచకితులను చేస్తుంది. నాటకం పూర్తయ్యాక ’అప్పుడే అయిపోయిందా?’ అనిపిస్తుంది. వందలు కర్చు పెట్టి మల్టీ ప్లెక్స్ ల్లో మసాల సినిమాలు చూసి, ఫేస్ బుక్ లో ‘చెత్త’ అని కామెంట్లు పెట్టే బదులు, మన సంసృతికి ఆలవాలంగా నిలిచే సురభి నాటక కళను ప్రోత్సహించండి. నాటకం చూడడానికి ప్యారీస్ నుంచి ఒక విదేశీయుడు వచ్చి నాటకం మొత్తం కళ్లార్పకుండా చూడ్డం నేను చూశాను. అలాగే ఒక కుటుంబంతో వచ్చిన చిన్న పాప నాటకం మొత్తం ఆసక్తిగా చూసింది. అయితే హిడీంబ, ఘటోత్కచుడు వచ్చే సీన్లలో భయంతో కళ్లు మూసేసుకుందనుకోండి.

నారద పాత్రదారి శ్రీ దాలిరాజు మాట్లాడుతూ ‘తనకు అరవై ఏళ్ల వయసని నారదుడిగానే కాకుండా అనేక పాత్రలు ధరించానని. నాటకం చూసిన ప్రేక్షకులు చప్పట్లు కొట్టి మెచ్చుకుంటే కడుపు నిండిపోతుందని’ తన్మయత్వంతో చెప్పాడు.

స్త్రీ అయినా శ్రీకృష్ణుడి పాత్ర వేసి మెప్పించిన శ్రీమతి పద్మజ, అలాంటి పాత్ర వేయడం తన పూర్వజన్మ సుకృతమని మురిసిపోయింది. ఘటోత్కచుడి పాత్రధారి తన ఆహార్యంతో అచ్చం రాక్షసుడిలా అందర్నీ బెంబేలెత్తించాడు. అంతకు ముందు తాను హిడింబ పాత్ర వేసేవాణ్నని ఇప్పుడు ఘటోత్కచుడి పాత్ర తనకు చక్కటి గుర్తింపు నిచ్చిందని అన్నాడు.

సురభి కుటుంబాన్ని దగ్గరనుంచి చూసేలా కార్యాదర్శి పద్మశ్రీ నాగేశ్వర రావు (సురభి బాబ్జి) గారు నాకు సహకరించారు. సురభి గురించిన ముచ్చట్లూ చెప్పారు. వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. తమ హృద్యమైన నటనతో ఆకట్టుకోవడమే కాక నాతో ఆత్మీయంగా సంభాషించిన కళాకారులకు శతకోటి నమస్సులు!

మన సంస్కృతీ సంప్రదాయంలో భాగమైన సురభి నాటక కళను మనం బతికించుకోవాలి!.
సురభి కళాకారులను ఆదరించి, ప్రోత్సహించాలి!!

మరిన్ని శీర్షికలు
sarasadarahasam