Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nadaina prapancham

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమిస్తే ఏమవుతుంది..?

premiste emavutundi?

గత సంచికలోని ప్రేమిస్తే ఏమవుతుంది సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి... http://www.gotelugu.com/issue251/680/telugu-serials/premiste-emavutundi/premiste-emavutundi/

 

(గత సంచిక తరువాయి).. రమేష్ కి ఊహించని విధంగా హటాత్తుగా అందమైన గాయత్రి భార్య అవడంతో మేఘాల మీద తేలిపోతున్నంత ఆనందంగా ఉన్నాడు. ఆమెతో పొందిన  శారీరక అనుభూతి మైకంలో నుంచి బయటికి రాలేదు.

ఆ మైకం లోనే తెల్లవారుతున్నా ఇంకా అదే మత్తులో గాయత్రి స్పర్శ కోసం అతని చేయి తడుముకుంది. కాని గాయత్రి లేలేత అందాల బదులు పాత రగ్గు గరుకుగా తగలడంతో కళ్ళు తెరవకుండానే విసుగ్గా అరిచాడు..

“ఏయ్ ఏడున్నవు ...”

సమాధానం రాలేదు.. కాసేపు అలాగే చేతులతో పరుపు తడుముతుంటే రగ్గు తప్ప ఏమి తగల్లేదు. ఇంతలో గాయత్రి ఏడుపు, ఆమె మాటలు వినిపించాయి.

“అతనెవరండి నన్ను వెళ్ళనివ్వకపోడానికి.  నాకతనంటే అసలు ఇష్టం లేదు.. రాత్రంతా నరకం అనుభవించాను.. ప్లీజ్ నన్ను మా ఊరు పంపించేయమని మీ వారికి చెప్పండి.  నేనేం పెళ్లి చేసుకోమని అడిగానా అతన్ని.. నేను వెళ్ళిపోతా దయచేసి పంపించండి. “
రమేష్ నిద్రమత్తు ఎగిరి పోయింది.

కాళ్ళ మీద ఉన్న దుప్పటి కాళ్ళ తోటే విసిరి విసురుగా లేచి ఒంటి మీద పైజమా జారిపోతున్నా పట్టించుకోకుండా గాయత్రి, సత్యవతి ఉన్న దగ్గరకు వచ్చి గాయత్రిని భుజాలు పట్టుకుని గట్టిగా తన వైపు తిప్పుకుని బెదిరిస్తున్నట్టుగా అడిగాడు..

“ఏందీ ... ఏమంటున్నవు  నకరాలా... ఇగో చూడు మల్ల మల్ల చెప్తున్న నువ్వు నన్ను వదలి పోవు... పోవద్దు.. ఏడికి పోయినా గుంజుకొస్త...”

గాయత్రి అతనితో పెనుగులాడుతూ “వదులు... వదులు నన్ను... నేను వెళ్ళిపోతా ... వదులు” అని అరవసాగింది. ఆ గొడవకి శ్రీనివాసులు, సూర్యకళ, చంద్రకళ లేచి వచ్చారు..

సూర్యకళ గబ గబా గాయత్రి దగ్గరకు వెళ్లి మండిపడుతూ అరిచింది.. “వానితోని లేచిపోయి వస్తున్నప్పుడు తెల్వలేదా... ఆడి మొకం చూసి ఎట్ల ప్రేమించినవ్ ... నేనే ఈ బేకార్ గాడిని ప్రేమించ ... నీకు బ్రెయిన్ పని చేయలేదేమో... వచ్చినవ్... పెండ్లి చేసుకున్నావ్.. ఇప్పుడెందుకు లొల్లి పెడుతున్నవ్ ... పొండ్రి ... ఏడికెల్లి వచ్చిన్రో ఆడికే పొండ్రి ... అని గట్టిగా అరిచి తండ్రితో అంది... నువ్వెందుకు నెత్తిమీద పెట్టుకున్నావు డాడి .... తోలిచ్చేయ్ .. మనకెందుకు నెత్తినొప్పి ... వాళ్ళ అమ్మ, నాయన పోలిస్ రిపోర్ట్ ఇస్తే మనం లోపటకి అయితము ... ఈ లొల్లి మనకొద్దు.. తోలిచ్చేయ్ ...”

శ్రీనివాసులకి కూడా కూతురు చెప్పింది సబబుగా అనిపించింది.. నిజమే వీళ్ళిద్దరిలో ఎవరి తల్లి, తండ్రి పోలీస్ రిపోర్ట్ ఇచ్చినా తను, నర్సిమ్మ లోపటకి పోయేది నిజం ...

అవన్నీ ఏమి ఆలోచించకుండా ఈ పిల్లడు దండలు తేగానే వాళ్ళిద్దరికీ దండలు మార్పించారు.. అదిగాక ఒక్క రాత్రి తల దాచుకోడానికి సరే అంటే అంతకంతకు వీళ్ళు తనకే పెద్ద సమస్య అవుతున్నారు.. వీళ్ళని పంపేయాలి అనుకుని రమేష్ తో అన్నాడు..

“రమేష్ నువ్వు నీ పెండ్లాన్ని తీస్కొని పో బిడ్డా.. ఏడకన్నా పోయి ఏదన్న నౌకరి చేసుకో .. నీ పెండ్లాన్ని సాకు... నువ్వు బతుకు.. ఈ లొల్లి మా ఇంటికాడ చేయద్దు.. మాకు ప్రొబ్లెమ్స్ తేవద్దు .. సమజ్ అయిందా...మీరు స్నానం చేసి, చాయ్ తాగి పొండ్రి.. నేను నర్సిమ్మకు చెప్త .. ఈడకి దగ్గరలో ఒక ఊరుంది.. ఆడ మిమ్ములను ఎవరు గుర్తు పట్టరు.. ఏదన్న పని చేసుకొండ్రి ... బతుకుండ్రి ...”

రమేష్ గాయత్రిని కోపంగా చూస్తూ ..”సూసినవా ... లొల్లి చేసినవు,.. అందుకే అన్న పోమ్మంటున్నడు. ఏడికి పోదం ఇప్పుడు చెప్పు” అన్నాడు.

గాయత్రి మాట్లాడకుండా వెక్కి, వెక్కి ఏడవసాగింది..

ఆమె ఏడుపు చూస్తుంటే సత్యవతికి హృదయం ద్రవించి పోసాగింది.. పాపం పిచ్చి పిల్ల అనుకుంది.

కాని తను మాత్రం ఏం చేయగలదు.. తన కూతురు అన్నట్టు వాళ్ళ వాళ్ళు ఎవరన్నా పోలీస్ లకి చెప్తే,  వీళ్ళకి ఒక్కరాత్రి ఆశ్రయం ఇచ్చినందుకు తన కుటుంబానికే  ఏదన్నా అపకారం జరగచ్చు.. ఆడపిల్లలున్న ఇల్లు.. పరువు బజారు కెక్కుతుంది.

అమ్మో వీళ్ళని పంపించేయడం మంచిది.. ఆమె అదృష్టం ఎట్ల ఉంటె అట్ల జరుగుతది అని ఆలోచిస్తూ సానుభూతిగా అంది. “పో చెల్లె ... కష్టమైనా, ఇష్టం లేకున్నా ఒక్కసారి పెండ్లి అయినంక వాని పెండ్లానివే ... ఆడు చెప్పినట్టు ఇను..”

గాయత్రి విలవిలలాడుతూ భయంగా అంది “నా వల్ల  కాదు.. ఇతను మొరటు మనిషి ... సంస్కారం లేదు.. మర్యాద లేదు.. ఉద్యోగం లేదు.. చదువు లేదు.. నన్ను ఎట్లా పోషిస్తాడు.. నన్ను పంపించండి.. నాకు బస్సులు ఎక్కడం, రైళ్ళు ఎక్కడం తెలియదు.. నేనెప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు.. దయచేసి నాకీ సాయం చేయండి .” సత్యవతి నిస్సహాయంగా భర్త వైపు చూసింది.

అతను విసుగ్గా మొహం పెట్టి.. “ఏందే మనకి పొద్దుగాల, పొద్దుగాల ఈ లొల్లి.. అని భార్యతో అని రమేష్ తో అన్నాడు ఏయ్ గా పిల్లను తోలిచ్చేయ్ ...లేకుంటే లోపటికైతవు ... ఆమెకి ఇష్టం లేదంట తోలిచ్చేయ్” అన్నాడు.

“లేదన్న ... ఆమెకి నేనంటే ఇష్టమే ... లేకుండానే నాతొ వచ్చిందా.. నేను ఆమెని తోల్కొని ఎల్లిపోతా నువ్వు పరేషాన్ గాకు ...” అని శ్రీనివాసులు కి సమాధానం చెప్పి గాయత్రి వైపు కోపంగా చూస్తూ ఆమె చేయి పట్టుకుని లాగుతూ  అన్నాడు. “ఈడ ఉంటె నకరాలు చానా చేస్తున్నవు ..నడు పోదం ...”

“నేను నీతో రాను ...” గట్టిగా అరిచింది గాయత్రి.

“ఎట్ల రావో చూస్త ...” అంటూ విసురుగా బయటికి వెళ్ళిపోయాడు..

అతను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియని అక్కడున్న వాళ్ళు అందరూ మ్రాన్పడి చూస్తుంటే గాయత్రి గబ, గబా లోపలికి వెళ్లి తన బాగు తీసుకుని వచ్చి “ప్లీజ్ వాడు వచ్చేలోగా నన్ను పంపించండి .. మీ కాళ్ళు పట్టుకుంటాను..బస్ స్టాప్ లో దింపెయండి చాలు.. నేను వెళ్ళిపోతా” అంది శ్రీనివాసులుని ప్రాధేయపడుతూ .

అతను అయోమయంగా భార్య వైపు చూసాడు.

సూర్యకళ, చంద్రకళ తండ్రితో అన్నారు “పంపెయ్ డాడి.. నరిసిమ్మకి ఫోన్ చేసి ఆటో తెమ్మను .” శ్రీనివాసులు గాయత్రి వాలకం చూసి జాలిగా అన్నాడు “మంచిదమ్మా జర మొకం కడుక్కుని చాయ్ తాగి పోదం” అన్నాడు.

గాయత్రి బాగు గుండెలకి హత్తుకుని సత్యవతితో పాటు వంట గదిలో నక్కి నిలబడి శ్రీనివాసులు కోసం ఎదురు చూడసాగింది.
సత్యవతి టీ చేసి కప్పులో పోసి గాయత్రికి ఇచ్చింది.

గాయత్రికి అప్పటికే కళ్ళు తిరుగుతున్నట్టు అయి మౌనంగా టీ కప్పు అందుకుని తాగసాగింది. సత్యవతి మొహం కడుక్కుని వచ్చిన భర్తకు కూడా టీ ఇచ్చింది.

ఇంతలో బయట ఆటో ఆగిన శబ్దం అవడం రమేష్ వేగంగా లోపలికి రావడం జరిగింది. గాయత్రి భయంతో బిగుసుకుపోయింది. రమేష్ తన బాగు తీసుకుని “ఏయ్” అని పిలుస్తూ వంటగది తలుపు వెనక నక్కిన గాయత్రి చేయి పట్టుకుని శ్రీనివాసులు, సత్యవతి వారిస్తున్నా, గాయత్రి ఆక్రోశిస్తున్నా బలవంతంగా లాక్కెళ్ళి ఆటోలో కూర్చో బెట్టాడు.

శ్రీనివాసులు నోట్లో నుంచి రమేష్ ఏడకి అని మాట వచ్చేలోగా ఆటో కదిలింది. 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్