Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nadaina prapancham

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమిస్తే ఏమవుతుంది?

premiste emavutundi?

గత సంచికలోని ప్రేమిస్తే ఏమవుతుంది సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.....http://www.gotelugu.com/issue252/682/telugu-serials/premiste-emavutundi/premiste-emavutundi/

 

(గత సంచిక తరువాయి)... గాయత్రికి భయం, ఏడుపు ముప్పిరిగా ముంచు కొచ్చాయి. గట్టిగా అరిచింది “ఆటో ఆపు ... ఆపుతావా లేదా..”

“సప్పుడు జేయకు గమ్మునుండు ...” గాయత్రి కుడిచేయి గట్టిగా మెలి తిప్పాడు రమేష్.  గాయత్రి కెవ్వుమంది.

ఆటో డ్రైవర్ వెనక్కి తల తిప్పి చూసాడు.

“ఏమైంది నడు ... ఏం  జూస్తున్నవ్”  కసిరాడు రమేష్.

అయితే అప్పుడే నర్సిమ్మ ఆటో సందు మలుపు తిరిగి ఎదురు రావడం, గాయత్రి కేక వినడం ఒకేసారి జరగడం తో సడన్ బ్రేక్ తో రెండు ఆటోలు ఆగాయి.

నర్సిమ్మ ఆటో లోపలికి తొంగి చూసాడు.

రమేష్ గాయత్రి చేతులు పట్టుకుని , పళ్ళు బిగించి కూర్చున్నాడు.

గాయత్రి చెక్కిళ్ళ మీద జారిపోతున్న కన్నీళ్ళతో, వెక్కుతూ కూర్చుంది.

నర్సిమ్మ ఆటో దిగి గాయత్రి వైపు వచ్చి “ఏమైంది” అని అడిగాడు.

గాయత్రి విసురుగా రమేష్ చేయి విడిపించుకుని ఆటోలో నుంచి ఒక్క దూకు దూకింది.

నర్సిమ్మ చేతులు పట్టుకుని “ప్లీజ్ నన్ను కాపాడండి... వీడు నన్ను ఎక్కడికో తీస్కెళ్తున్నాడు” అంది.

నర్సిమ్మ రమేష్ వైపు చూసి “దిగు” అన్నాడు.

అన్నా ... అంటూ రమేష్ ఏదో చెప్పబోతుంటే జేబులోనుంచి పది రూపాయలు తీసి ఆటో డ్రైవర్ కి ఇచ్చి “నువ్వు పో”  అన్నాడు.
రమేష్ దిగాడు ... ఆటో డ్రైవర్ వాళ్ళ ముగ్గురిని వింతగా చూసి భుజాలెగరేసి వెళ్ళిపోయాడు.

కూసో అన్నాడు నరిసిమ్మ రమేష్ తో ..

గాయత్రిని కూడా కూసో చెల్లె అన్నాడు.

గాయత్రి ఆటో ఎక్కింది. రమేష్ ఆమె పక్కన కూర్చున్నాడు.

నర్సిమ్మ ఆటో స్టార్ట్ చేసాడు.

పావుగంటలో ఆటో నర్సిమ్మ ఇల్లు చేరింది.

ఏమైంది ఇద్దరి వైపు చూస్తూ అడిగాడు నర్సిమ్మ.

“నాకు పెళ్లి ఇష్టం లేదు. బలవంతంగా పెళ్లి చేసుకుని నా జీవితం నాశనం చేస్తున్నాడు.. నేను ఇతనితో ఉండలేను ... తప్పు చేసాను... మా ఇంటికి పంపించేయండి” అంది గాయత్రి.

నర్సిమ్మ రమేష్ వైపు చూసాడు.. ఏ క్షణం  అయినా ఆమె మీద పడి గొంతు కొరికి రక్తం తాగేందుకు ఎదురు చూస్తున్న పులిలా చూస్తున్నాడు గాయత్రిని.నర్సిమ్మ రమేష్ “జరసేపు బయటకు పో” అన్నాడు.

“అదికాదన్నా” ఏదో చెప్పబోతున్న నర్సిమ్మని చేత్తో వారిస్తూ పో అన్నాడు.

రమేష్ కోపంగా గాయత్రిని చూసి బయటకి వెళ్ళాడు.

నర్సిమ్మ గాయత్రిని నెమ్మదిగా వివరాలు అడిగాడు.

జరిగింది అంతా చెప్పి అంది గాయత్రి “మా అమ్మా, నాన్న నాకు అన్నీ రిశ్ట్రిక్షన్స్ పెట్టేసరికి కోపం వచ్చి ఇతనితో పారిపోయి వచ్చానండి.. ఇట్లా బలవంతంగా పెళ్లి చేసుకుంటాడు అనుకోలేదు” అంది.

“మల్ల అంత అయేవరకు ఎందుకూకున్నవమ్మ .... ఇప్పుడు ఎట్ల ... రాత్రి వాడి తోని పండుకున్నవు... ఇప్పుడు ఏడికి పోతవు... నిన్ను మల్ల ఎవరు పెండ్లి చేసుకుంటరు. మరి మీ వొల్లు బాపనోల్లు ...నిన్ను ఇప్పుడు రానిస్తరని నమ్మకం ఉందా ..” కన్నీళ్ళతో నిస్సహాయంగా చూసింది.

సానుభూతిగా అన్నాడు నర్సిమ్మ.. “అయిందేమో అయిపొయింది. నేను వాడికి ఏదన్న పని ఇప్పిస్త ... ఈడనే ఉండిపో.. వాడు నిన్ను మంచిగనే చూసుకుంటాడు.. నా మాట ఇను ... ఇప్పుడు నీకు ఇంతకన్నా వేరే దారి లేదు చెల్లెమ్మా ..”

“అట్లా అనకండి అట్లా అనకండి” రెండు చెవులూ మూసుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది . నర్సిమ్మకి నిజంగానే ఆమె మీద పుట్టెడు జాలి వేసింది.

ఈమెకి ఏమి అర్ధం కావడం లేదు.. తల్లి, తండ్రి రానివ్వరు ... ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వరు.. ఇంటికి వెళ్ళినా గోడకి కొట్టిన బంతి లాగా వెనక్కి రావాలి.. అంతకన్నా ఇదంతా దేవుడి రాత అనుకుని సరిపెట్టుకుని బతకడం మంచిది ... అదే విషయం ఆమెకి నచ్చచేప్పసాగాడు.
గాయత్రి ఏడుస్తూనే ఉండిపోయింది.

రెండు నెలలు గడిచాయి.

నర్సిమ్మ రమేష్ కి ఆటో నడపడం నేర్పించాడు. ఒక ఆటో బాడుగకి ఇప్పించాడు.

నర్సిమ్మ ఉంటున్న లొకాలిటిలో ఒక గది అద్దెకి తీసుకుని వాళ్ళు కాపురం పెట్టారు. గాయత్రి దిగులుతో చిక్కి సగమైంది.

ఎంత ప్రయత్నించినా అక్కడి నుంచి అంగుళం కదలలేక పోయింది. రమేష్ కి కోపం ఎక్కువే ... అయినా గాయత్రి అంటే ప్రాణం ... కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు.  ఉదయం ఏడున్నర కల్లా ఆటో తీసుకుని వెళ్లి సాయంకాలం ఏడు అవుతుండగా ఇంటికి వస్తాడు.. వస్తూ, వస్తూ  రోజూ ఏదో ఒకటి తినటానికి తెస్తాడు. వారానికి ఒక సినిమా తీసుకుని వెళ్తున్నాడు. గాయత్రికి అతనితో జీవితం నరకం లానే ఉంది.. తనలాంటి అమ్మాయికి రమేష్ భర్తా... అనుకుంటోంది... దేవుడా ఇలా ఎందుకు రాసావు అని వాపోతూ ఉంటుంది. అయినా ఆమెకి ఆ జీవితం కొనసాగించక తప్పలేదు.

శరణ్య సర్విస్ కమిషన్ నుంచి వచ్చిన ఆర్డర్స్ తీసుకుని కృష్ణా జిల్లా,   విజయవాడ రెవెన్యూశాఖ లో జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చింది. ఆమెకి  డిప్యుటి తహసిల్దార్ గా పోస్టింగ్ ఇచ్చారు.  నందిగామ మండలాఫీసులో విలేజ్ రెవెన్యు ఆఫీసర్ గా ట్రైనింగ్ మొదలు అయింది. ఎం ఆర్ వో నలభై ఏళ్ల బంగారయ్య ... చాలా మంచివాడు ఆమెని ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నాడు. ఆఫీస్ గురించి, పని విధానం, కలెక్టర్ గారితో ఎలా ప్రవర్తించాలి.. ఎక్కడెక్కడ ఇన్స్ పెక్షన్స్ కి వెళ్ళాలి.. స్ట్రిక్ట్ గా ఉండే ఆఫీసర్స్ కి ప్రారంభంలో ఎదురయే సమస్యలు అన్నీ ఎంతో వివరంగా, ఓపిగ్గా చెప్పాడు. ప్రొబేషన్ పీరియడ్ లో లీవులు పెట్టద్దు అని చెప్పాడు. అన్నీ చిరునవ్వుతో విని ఆయనకీ కృతఙ్ఞతలు తెలియచేసింది శరణ్య.
ఉద్యోగం లో చేరే ముందు విశాఖపట్నం వెళ్లి తల్లి, తండ్రులను చూసి, రెండు రోజులు ఉంది. అప్పుడే తేజతో తన ప్రేమ గురించి చెప్పి అతని వివరాలు ఇచ్చింది. కూతురు తెలివితేటల మీదా, ఆమె నిర్ణయం మీదా నమ్మకం కలిగిన వాళ్ళు ఇద్దరూ కూడా అభ్యంతరం చెప్పలేదు. “నువ్వు ఎప్పుడు అంటే అప్పుడు పెళ్లి చేస్తాం” అని మాట ఇచ్చారు.

ప్రొబేషన్ పీరియడ్ పూర్తీ అయి పోస్టింగ్ ఇచ్చాక పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. అందుకు అంగీకరించారు వాళ్ళు.

ట్రైనింగ్ లో జాయిన్ అవగానే తేజకి వివరంగా మెయిల్ చేసింది.

అమ్మా, నాన్న ఒప్పేసుకున్నారు.. నా వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.. ఇంక నీ సంగతే తేలాలి అంది.
వెంటనే ఫోన్ చేసి అడిగాడు తేజ ...

నీ  వైపు నుంచి లైట్ గ్రీనా .. డార్క్ గ్రీనా అడిగాడు తేజ ..

సీ గ్రీన్ అంది ...

అయితే అన్ని షేడ్స్ తో నా వైపు నుంచి మన పెళ్ళికి సిగ్నల్స్ వచ్చాయి అన్నాడు. నవ్వింది .

ఎలా ఉంది నీ ఆఫీస్ అడిగాడు.

బ్రహ్మాండంగా ఉంది ... ఇదో కొత్త లోకం ... మన కార్పోరేట్ ఆఫీస్ లలాగా ఉండదుగా ..ఎవరికీ ఎవరన్నా భయం ఉండదు.. అందరూ కింగ్స్ ..

నీతో అందరూ బాగా మాట్లాడారా ... చక్కగా రిసీవ్ చేసుకున్నారు ...చాయ్ తెప్పించి ఇచ్చారు. ఇక్కడ ఎవరు కొత్తవాళ్ళు వచ్చినా టి, బిస్కట్స్ తో వెల్ కం చెప్తారు. ఇప్పటి నుంచి మొదలు పెట్టి ఒక ముప్ఫై ఏళ్ళు నేను ఈ శాఖలో పని చేయాలి.. కాకపొతే పొజిషన్ మారుతూ ఉంటుంది...అంది నవ్వుతూ.

ఐ మిస్ యూ శరణ్యా అన్నాడు చెవిలో గుసగుసగా.

ఐ టూ మిస్ యూ తేజా అంది అదోరకమైన హస్కి వాయిస్ తో ..

దిసీజ్ టూ మచ్ ... ఇక్కడున్నన్ని రోజులూ ముట్టుకోకు అంటూ బెత్తం పట్టుకుని దూరంగా నిలబెట్టి ఇప్పుడిలా మత్తుగా మాట్లాడడంలో నీ ఉద్దేశం ఏంటి..

కిల,కిల నవ్వింది..

ఏమి లేదు.. రాత్రంతా తీయటి కలలు కంటూ పడుకుంటావని...

ఇంతకీ ఎక్కడున్నావు..

మా గెస్ట్ హౌస్ లో ... రెండు, మూడు రోజుల్లో ఇల్లు తీసుకుంటాను. అప్పుడు వద్దువుగాని అంది ...

గుడ్ , గుడ్ త్వరగా తీసుకో అన్నాడు తేజ ...

గుడ్ నైట్ నవ్వుతూ గుడ్ నైట్ చెప్పి ఫోన్ డిసకనెక్ట్ చేసింది. 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్