Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
jnaapakaalu

ఈ సంచికలో >> కథలు >> కొంచెం టచ్లో ఉంటే చెప్తా!!’ -హాస్యకథ

konchem touchlo vunte chepta

‘‘ ఏవండోయ్.. వియ్యంకులవారి నుంచి ఫోన్.. ‘‘ వంటింట్లోంచి గావుకేకపెట్టి మరీ భర్తను పిలిచింది గుర్నాధం భార్య కాంతం.  ‘‘ ఇదిగో.. కాంతం.. పొద్దున్నే.. ఏంటీ వేళాకోళాలు.. సమయం సందర్భలేకుండా.. ఇంకా మనమ్మాయికి పెళ్ళేకాలేదు.. ఇంతలోనే వియ్యంకులవారు.. ఎక్కడ పుట్టుకొస్తారు?’’ తీరుబడిగా పేపర్ చదువుకుంటూ.. భార్య మాటల్ని లైట్ గా తీసుకున్నాడు గుర్నాధం.

‘‘ మిమ్మల్ని నమ్ముకుంటే.. వియ్యంకులవారు కాదుకదా.. అయినవారుకూడా.. దూరంగా పారిపోవాల్సిందే ఖర్మ.. ఖర్మ..’’ అనుకుంటూ గబాగబా పరుగెత్తుకుంటూ  వచ్చి.. ఫోన్ చేతికందించింది.‘‘ హల్లో.. ఎవరూ.. హహ్హహ్హా.. బావగారూ బావున్నారా?.. ఏంటీ.. మళ్ళీ..ఈ ఆదివారం అమ్మాయిని చూడ్డానికి వస్తున్నారా?.. అదేంటి.. ’’ అని గుర్నాధం అడుగుతుంటే..

‘‘ నేనప్పుడే చెప్పానా.. ఏవండీ.. పొద్దున్నుంచీ.. ఎదురింటి గోడమీద వాలిన కాకీ ఒకటే అరుస్తుంది.. పైగా.. పిల్లికూడా ఎదురొచిచ సచ్చింది.. ఆ పెళ్ళి చూపులు వేరే రోజు పెట్టుకుందాం.. అని తెగ మొత్తుకున్నా. విన్నారా?! అయ్యయ్యో.. ఇప్పడు నేనూ నాకూతురు.. ఏ నుయ్యోగొయ్యో చూసుకుని దూకాల్సిందే..’’ హఠాత్తుగా బోరున విలపించడం ప్రారంభించింది కాంతం.

‘‘ ఇదిగో.. నీ వెదవ ఏడుపు ఆపుతావా?! ఇక్కడ ఎవరు సచ్చారనీ.. అయ్యయ్యో మిమ్మల్ని కాదండి బావగారూ.. అయినా అదేంటి బావగారు.. అమ్మాయిని మొన్న చూసివెళ్ళారుగా.. అమ్మాయి లక్షణంగా ఉంది.. అబ్బాయికి కూడా తెగ నచ్చేసిందీ.. లాంఛనాలు.. గీంచనాలు సంగతి తర్వాత చూద్దాం.. తొందరలోనే ముహూర్తాలు పెట్టుకుందాం.. అని మీరే కదా ఎంతో సంతోషంగా చెప్పింది’’ అని ఫోన్లో గుర్నాధం అడుగుతుండగానే..

‘‘ అయ్యయ్యో అంతా అయిపోయిందండీ.. ఒక్కగానొక్క కూతురు.. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురికి.. మంచి సంబంధం వచ్చిందని తెగ మురిసిపోయానే.. ఇంతలో ఎవరి కళ్ళు పడ్డాయో ఏమో.. వాళ్ళు నాశనం అయిపోను.. ఆళ్ళ కళ్ళు కాకులు గద్దలు పొడుచుకుపోనూ.. ’’ ఈసారి మరింత వాల్యూమ్ పెంచి ఆరున్నొక్కరాగంలో విలపించింది కాంతం.

‘‘ అబ్బబ్బా.. నీకసలు బుద్ధుందా ’’ అని గుర్నాధం భార్యను మందలిస్తున్నంతలోనే

‘‘ ఏంటండీ.. మంచి మర్యాదలేకుండా మాట్లాడుతున్నారు.. కాబోయే వియ్యంకుడ్ని పట్టుకుని బుద్ధందా.. సచ్చారా.. అని అడుగుతారా.. నాన్సన్స్.. ’’ అంటూ ఫోన్లోనే అవతలాయన విరుచుకుపడేసరికీ..

‘‘ అయ్యయ్యో బావగారూ.. మిమ్మల్ని కాదండీ.. ఇక్కడ పక్కనే మా పనోడుంటే.. వాడ్ని తిడుతున్నా.. అంతే అంతే.. అయ్యో మిమ్మల్ని అట్టాంటి పెద్ద మాట అనేస్తానా చెప్పండి.. హిహ్హిహ్హీ.. ’’ అని సర్ధిచెప్పబోతుండగా

‘‘ దేవుడా.. ఈ ఇంటికి ఏమైందీ.. ఒకవైపు ఎదురింట్లో కాకి అరుపులు.. పక్కింట్లో ముదనష్టపు పిల్లికూతలు.. ఫోన్లో చావుకబురు.. అయ్యో.. ఎంత చిక్కొచ్చిపడిందే.. ’’ ఈసారి వీధివీధంతా వినపడేటట్టు గగ్గొలు పెట్టింది కాంతం.

‘‘ ఛీ.. నీఁ.. నీకసలు బుద్ధందా.. అన్నం తింటన్నవా.. గడ్డితింటన్నావా.. ఒకపక్క మాట్లాడుతూ ఉంటే.. ఎవరో సచ్చినట్టు అరుస్తావెందుకు.. నోర్మోసుకో.. నాగ్గానీ తిక్కరేగిందంటేనా..’’ అంటూ కాంతంపై మరోసారి మండిపడ్డాడు గుర్నాధం.

‘‘ మిష్టర్ గుర్నాధం.. వాట్ ఆర్ యూ టాకింగ్.. వియ్యాలవారితో మాట్లాడే పద్దతేనా ఇది. ఒకే.. మీకు అంతగీర్మానంగా ఉంటే.. అలాగే కానివ్వండి.. ఎవడిక్కావాలి.. మీ బోడి సంబంధం.. నాన్సన్స్’’ అని అవతల స్వరం.. తెగతెంపులుగా మాట్లాడేసరికి.. గుర్నాధం గజగజా వణకిపోతూ..

‘‘ బావగారూ.. మీరంత మాటనకండీ.. చెప్పేగా.. పక్కనో అక్కుపక్షి.. అయినదానికి, కానిదానికి కుయ్యోమొర్రో అంటూ ఒకటే నస. దాన్ని బయటకు ఎళ్ళగొట్టాలని అలా తిట్టా.. ’’ అని గుర్నాధం వివరణ ఇవ్వబోతుండగా..

‘‘ అంటే మనిషిని తిట్టే తిట్లేవో.. కుక్కని తిట్టే తిట్టోవో తేడా తెలియదా మాకు.. అంటే మీ కంటికి మేము అంత తింగరనాయాళ్ళా కనపడతున్నామా? ఏదో.. పద్దతైన కుటుంబం.. ఒక్కగానొక్క కూతురని ముచ్చపడితే.. మమ్మల్ని కుక్కలతో పోలుస్తారా.. ఇట్స్ టూ బ్యాడ్.. ఐవిల్ సీ యువర్ ఎండ్’’ అవతల గొంతులో వీరావేశం కట్టలు తెంచుకుంది.

‘‘ అయ్యో బావగారు.. అమ్మతోడు.. నమ్మండి.. కావాలంటే.. మా ఆవిడ్నడగండీ.. ఇప్పటిదాకా.. నేను అరిచింది ఇంట్లో పెంచుకుంటున్న కుక్కపైన. కాదు కాదు.. మా ఆవిడపైన.. హిహ్హిహ్హీ.. మిమ్మల్నికాదు.. ఇదిగో మీ చెల్లాయి పక్కనే ఉంది.. అనుమానం ఉంటే అడగండి.. ’’ మాట్లాడమని కళ్ళతో సైగచేస్తూ భార్య చేతికి ఫోన్ అందించాడు గుర్నాధం

‘‘ అన్నయ్యగారూ.. మీరింత పనిచేస్తారనుకోలేదు.. తోడబుట్టిన అన్నకంటే మిన్నగా మిమ్మల్ని భావించానే.. ఒక్కగానొక్క కూతుర్ని మీ ఇంటికి కోడలిగా పంపాలనుకున్నానే.. అలాంటిది.. మాకు అన్యాయం చేస్తారా? అన్నయ్యగారూ.. ఇది మీకు ధర్మమా? న్యాయమా? వా..ఆఁ

’’ నోటికి చీరకొంగు అడ్డుపెట్టుకుని మరీ ఏడుస్తూ కన్నీరుమున్నీరై ఫోన్లో కాంతం అడుగుతుంటే.. గుర్నాధం పరిస్థితి మరింత కాలు కాలిన పిల్లిలా మారింది.

‘‘ ఏమేవ్.. నీతో పెట్టుకుంటే.. ఎట్టాంటి కాపురాలైనా ఉన్నపళంగా నిట్టనిలువునా చీలుపోవాల్సిందే.. ఆ దరిద్రపు ఏడుపు ఆపి.. ఆ ఫోన్ ఇలా తగలడు.. ’’ బలవంతంగా ఫోన్ లాక్కున్నాడు గుర్నాధం.

‘‘ బావగారూ.. మరేంలేదు.. అదీ ఏమంటే.. నేను ఇంట్లో పెంచుకుంటున్న కుక్కను తిట్టానని.. మీ చెల్లెలు కాంతం.. మరీ ఓవర్ ఎమోషన్ అవుతోంది..  అంతే.. హిహ్హీహ్హీ.. ’’

‘‘ అంటే.. ఇంట్లో పెళ్ళాల్ని.. మీ కుటుంబాల్లో ఆడాళ్ళందరినీ.. కుక్కా.. నక్కా అని తిడతారన్నమాట.. నోనోనో.. ఈ సంబంధం క్యాన్సిల్.. ’’ అనే మాటలు వినపడగానే..గుర్నాధానికి గుండెజారినంత పనైంది.

‘‘  బావగారూ  వాఁ.. మీరు మరీ అంత కఠువైన నిర్ణయాలు తీసుకోమాకండీ..  అమ్మతోడు.. మిమ్మల్ని ఇప్పటిదాకా ఈసమెత్తు మాటనలేదు.. అంతా.. ఈ ఫోన్ వల్ల ఏర్పడిన గ్రహచారం.. ఒకరి మాట ఒకరికి వినపడక ఒకటి.. పక్కనే మా అక్కుపక్షి.. అదే అదే.. మీ చెల్లాయి చేస్తున్న వోవర్ యాక్షన్ వల్ల.. అయ్యో వోవర్ యాక్షన్ కాదు.. అదీ అదీ కంగారువల్ల.. ఏదో అపార్ధాలు జరిగిపోయాయి.. అంతేగానీ, మిమ్మల్ని ఆడిపోసుకునేంత ధైర్యం మాకెక్కడదండీ.. మీరు ఎన్నిసార్లైనా రావొచ్చు.. అమ్మాయిని చూడొచ్చు.. అందులో ఇబ్బందేముంది బావగారూ.. హిహ్హిహ్హీ’’ నవ్వుతూ మాట్లాడుతూ వియ్యాలవారిని శాంతింప చేసే ప్రయత్నం చేశాడు గుర్నాధం.

‘‘ సరే.. సరే.. ఈ ఒక్కసారికి మీకో ఛాన్స్ ఇస్తున్నా.. తీరా అక్కడకొచ్చిన తర్వాత ఏదైనా తేడా జరిగిందో.. ఏం చేస్తానో నాకే తెలియదు.. వచ్చే ఆదివారం మళ్ళీ మీ అమ్మాయిని చూసుకోవడానికొస్తున్నాం.. మిగితా విషయాలు ఏమైనా ఉంటే అక్కడ మాట్లాడుకుందాం..’’ రుసరుసలాడుతూ ఫోన్ పెట్టేశాడు కాబోయే వియ్యంకుడు.

‘‘ అయ్యో.. అనుకున్నట్టే అయ్యింది.. మీ ఛాదస్తంతో.. బంగారంలాంటి సంబంధం కాస్తా పెడాకులు చేసి పాడేశారు. ఇప్పుడు నేనూ, నాకూతురు ఏం చెయ్యాల్రా దేవుడా.. నీ పెళ్ళి సంబంధాన్ని మీనాన్నే స్వయానా చెడగొట్టేశాడని.. నానోటితో నేను.. నా బిడ్డకు ఎలా చెప్పాల్రా దేవుడా.. అయ్యో.. ’’ అంటూ ఈసారి భూకంపం వచ్చినట్టుగా గుండెలు బాదుకుంటూ మరీ బాధపడిపోయింది కాంతం

‘‘ అబ్బబ్బా.. కాంతం..  ఇక ఆ ఏడుపు ఆపవే.. అవతల ఎవరైనా విన్నారంటే.. ఇంట్లో ఎవరికో ఏదో అయ్యిందని.. పరుగెత్తుకుని రాగలరు.. అసలు నీవల్లే.. వియ్యంకులవారు.. తిట్టిన తిట్టు తిట్టకుండా.. నన్ను తిట్టిపడేశారు.. నేను అవతల ఫోన్లో మాట్లాడేటప్పుడు నిన్నెవడు.. మధ్యలో మాట్లాడి చావమన్నాడు.. నీ మీద విసుక్కున్న మాటలన్నీ.. వియ్యంకులవారినే అన్నట్టుగా అపార్ధం చేసుకున్నారు. మొత్తానికి ఫోన్లోనే కాళ్ళూ వేళ్ళూ పట్టుకుని బ్రతిమాలబట్టి సరిపోయింది లేదంటే.. అనుకున్నదే అయ్యేది... ’’ అమాయకపు భార్యను ఏమీ అనలేక సుతిమెత్తగా దండించాడు గుర్నాధం

‘‘ హమ్మయ్య.. నానోములు ఫలించబట్టి.. మొత్తానికి అన్నయ్యగారి మనసు మెత్తబడిందన్నమాట.. ’’ అనుకుంటూ.. భార్య  కాంతం కళ్ళు మూసుకుని దేవుడ్ని తలచుకుంటూ ఉండగా..

‘‘ అంతేగానీ, నేను చేసినదానివల్ల మాత్రం ఫలం దక్కలేదంటావ్.. నీ వంకర బుద్ధి పోనిచ్చుకున్నావ్ కాదు.. ’’ లోపల అనాల్సిన మాటని పైకే అనేశాడు గుర్నాధం.

‘‘ ఇదిగో.. వంకర టింకర అనమాకండీ.. అయినా.. ఈ వంకర మూతినేగా.. ఎగాదిగా చూసి.. వోలమ్మో.. మీ అమ్మాయి నాకు తెగ నచ్చేసింది అని.. పెళ్ళిచూపుల్లోనే.. తెగవంకర్లు తిరిగుతూ చెప్పింది.. మర్చిపోయారా?’’ అని భార్య ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళే సరికి..

‘‘ నేను.. జీవితంలో జరిగిన విషాధకరమైన విషయాల్ని.. చేదు సంఘటనల్ని త్వరగా మర్చిపోతానన్న సంగతి నీకు తెల్సుగా కాంతం’’ అంటూ భార్యను తనదైన చమాత్కరంతో ఆటపట్టించబోతుండగా..  గేటు తీసుకుని ఎవరో లోపలికి వస్తున్న అలికిడయ్యింది.

‘‘ గుర్నాధం గారూ.. పెళ్లిచూపుల కేసెట్ రెడీ.. చూస్తారా?!’’ అంటూ చేతిలో డీవీడి పెట్టాడు ఫొటోగ్రాఫర్ ఏడుకొండలు.

‘‘ ఏవిటోయ్.. ఏడుకొండలు.. అప్పడే.. రెడీ అయిపోయిందా.. అమ్మాయి పెళ్లిచూపుల కేసెట్టు..’’ అని గుర్నాధం అడగ్గానే..  ‘‘ ఇప్పుడెక్కడ కేసెట్లు సార్.. అదంతా జమానాలో. ఇప్పుడంతా చిప్పుల్లోనే. వీడియో ఇలా తీసి.. అలా కంప్యూటర్లోకి కాపీ చేసి.. అంతే స్పీడుగా ఎడిటింగ్ చేసి.. డీవీడీల్లోకి ఎక్కించేస్తున్నాం సార్.. అంతా ఆటోమేటిక్ సిస్టమ్’’ ఫొటో, వీడియో టెక్నాలజీలో వచ్చిన మార్పుల్ని తనదైన శైలిలో హుషారుగా చెప్పుకొచ్చాడు ఏడుకొండలు

‘‘ ఓహో.. అలాగా.. సరిసరే.. మా అమ్మాయి.. పెళ్లిచూపుల వీడియో ఎలా వచ్చింది?’’ చాలా ఆత్రంగా అడిగాడు గుర్నాధం

‘‘ అక్కడ ఏదైనా విషయం ఉంటే కదండీ.. తీసిన వీడియోలో ఏదైనా బాగా రావడానికి.. ఆరోజు ఊళ్ళోలేక.. మా అసిస్టెంట్ ని.. పంపాను. తీరా.. నిన్న ఎడిటింగ్ చేసేటప్పుడు వీడియో చూస్తే.. మైండ్ బ్లాక్ అయ్యింది.. ఒక్కరైనా తలెత్తి కెమెరా వంక చూస్తేగా..  మరీ ఇంతగా అతుక్కుపోకూడదండీ.. ’’ చిరాగ్గా మొఖం పెట్టి అనేసరికి గుర్నాధం దంపతులకు ఎక్కడలేని అనుమానం వచ్చింది.

‘‘ ఏంటీ అతుక్కుపోవడమేంటీ‘‘ అని ఇద్దరూ ఒకేసారి అడగ్గానే.. ‘‘ అవునండీ.. మీరూ అట్టానే ఉన్నారు.. మీ వియ్యంకులవాళ్ళూ అట్టానే ఉన్నారు.. ఒక్కరైనా.. తలఎత్తి.. మొఖాలు చూపెడితేకదా.. వీళ్ళు ఫలానావోళ్ళు.. అని గుర్తుపట్టి తగలడ్డానికీ.. ’’ వ్యంగ్యం, చిరాకు కలగలిపిన స్వరంతో అన్నాడు ఫొటోగ్రాఫర్ ఏడుకొండలు

‘‘ ఏమైందిరా.. ఏడుకొండలూ.. ఊరికే.. తిక్కతిక్కగా మాట్లాడమాక.. అసలే ఇప్పటిదాకా.. మా వియ్యంకుడి పెట్టిన క్లాసుతో తల హీటెక్కిపోయింది. నువ్వు దానికి ఆజ్యంపోసి.. ఉన్న జుట్టుకాస్తా ఊడిపోయేలా చేయమాక..’’ చిర్రుబుర్రులాడాడు గుర్నాధం.

‘‘ ఏవండోయ్ గుర్నాధం గారు.. ఈ వీడియో చూస్తే.. కచ్ఛితంగా అదే జరుగుతుంది. చూపించమంటారా చెప్పండి?’’ ఒకింత వెటకారంగానే అడిగాడు ఏడుకొండలు.

‘‘ చూడ్డానికే కద్రా.. వీడియో తీయించింది.. మళ్ళీ నీ బెదిరింపులేంటి?.. అసలు అందులో ఏమైనా ఉందా లేదా?! ’’ మరోసారి రెట్టించి అడిగాడు గుర్నాధం

‘‘ నేనూ అదే అంటన్నా గురువుగారూ.. అందులో చూడ్డానికి ఏముంది.. ఇటు ఈ కటుంబం, అటు ఆ కుటుంబం.. అంతా.. పెళ్ళి కూతురు మాదిరిగానే తలకాయలు వంచి.. ఫోన్లలో తలపెట్టి కూచున్నారు.. పెళ్ళి కొడుకు మొఖం ఎలాగుందో.. కనపడదు, పోనీ పెళ్లికూతురు మొఖం చూద్దామా అంటే.. అదీ కనపడదు. కనీసం ఒక్కరైనా ఈలోకంలో ఉన్నారయ్యా అసలు. అందరూ చెప్పుకున్నట్టుగా.. స్మార్ట్ ఫోన్ చేతిలో పెట్టుకుని.. అందులో పీకలదాకా మునిగిపోయి.. ఫేసుబుక్కులు, వాట్సప్పులు, ఛాటింగ్ లు అని.. ఎవరు పరధ్యానంలో ఆళ్ళున్నారుగానీ.. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళైనా.. కెమెరాకేసి చూస్తేకదా.. మీ బొమ్మలు సరిగ్గా రావడానికి.. పాపం మా అసిస్టెంట్ శీనుగాడు మొహమాటపడి.. ఎట్టా ఉన్నోళ్ళని అట్టా తీశేశాడుగానీ, అసలు ఆరోజు నేనుంటేనా.. అందరి డిప్పమీద ఒకటిచ్చేవాడ్ని’’ అని వీడియోలో ఉన్న తతంగాన్ని ఏడుకొండలు కళ్లకు కట్టినట్టుగా చెప్పగానే..

‘‘ ఏంటీ ఆ వీడియోలో.. ఎవ్వరూ తలపైకెత్తే చూడలేదా?? ’’ నోరెళ్ళబట్టి మరీ అడిగారు దంపతులిద్దరూ.

‘‘ ఏవండోయ్.. మిగితావాళ్ళమాట దేవుడెరుగు.. కనీసం.. రేపు పెళ్ళి చేసుకోబోయే అమ్మాయబ్బాయైనా.. విడిగా..ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారా?!’’ డౌటొచ్చి అడిగాడు ఏడుకొండలు.

‘‘ చూసుకొని ఉంటే.. వియ్యంకులవారు.. మళ్ళీ పెళ్ళిచూపులు పెట్టమని ఎందుకు అడుగుతారు?’’ నొచ్చుకుంటూ అన్నాడు గుర్నాధం.

‘‘ఇందులో పోయిందేముందండీ.. పెళ్ళిచూపులేకదా.. అల్లుడుగారు అమ్మాయిని మరోపాలి చూడాలని.. ముచ్చటపడుతున్నాడేమో?! ’’ అమాయకంగా మొహంపెట్టి కాంతం అనగానే..

‘‘ చూడండి అమ్మగారు.. మీరు ఇలాంటి పెళ్ళి చూపులెన్ని పెట్టినా.. ఫలితం ఉండదు.. ఈ స్మార్ట్ ఫోన్ రోజుల్లో దించిన తలకాయలు ఎత్తాలంటే.. చాలా కష్టం’’ పెదవి విరస్తూ అన్నాడు ఏడుకొండలు.

‘‘ పోనీ.. ఈసారి జరిగే పెళ్ళిచూపులు సక్సస్ కావాలంటే ఏంచేయాలో.. కాస్త ఐడియా చెప్పి పుణ్యం కట్టుకోరా.. ’’ ధీనంగా మొహంపెట్టి అడిగాడు గుర్నాధం.

‘‘ ఇప్పడు మనం..దేవుడు దర్శనానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం.. మనదగ్గరున్న కెమెరాలు.. ఫోన్లు.. ఒకపక్కన అప్పజెప్పిన తర్వాతే గుళ్ళోకెళతాం కదా.. అట్టాగే, ఆరోజు కూడా.. మీ రెండు కుటుంబాలకు చెందిన ఫోన్లన్నీ.. ఓ మూటగట్టి.. కాసేపు పక్కనపడేస్తే.. ఎంచక్కా.. అన్నీ సెట్ అయిపోతాయి.. ఈ విషయం వియ్యాలవారికి కూడా చెప్పండి..’’ అని ఓ ఐడియా ఇచ్చాడు ఫోటోగ్రాఫర్ ఏడుకొండలు

‘‘ ఏంటీ.. ఈ విషయం వియ్యాలవారికి చెప్పాలా?! పద్దతిగా ఉండదేమోరా?!’’ అమాయకంగా అడిగాడు గుర్నాధం

‘‘ ఏవండోయ్.. మాష్టారు.. మీకో విషయం తెలుసా?! యిక్కడకొచ్చే ముందు.. మీ వియ్యంకులవారు పెళ్లిచూపుల వీడియో గురించి నాకు ఫోన్ చేస్తే.. ఆ వీడియోలోని గురించి.. ఫుల్ గా వివరించి.. కాస్తంత జ్ఞానబోధచేశా. ఆ తర్వాతే మీకు ఆయన ఏమీ ఎరగనట్టు ఫోన్ చేసుంటారు.. కాకపోతే.. మగపెళ్ళోళ్ళుకదా.. ఢాం..ఢూమ్ అని కాస్త బింకం ప్రదర్శించారనుకుంటా. మిగితాదంతా.. మీలాగే సేమ్ టు సేమ్. ఇందులో ఎవరూ తక్కవుకాదు. అందరూ.. స్మార్ట్ ఫోన్ బానిసలే. కనీసం ఆరోజైనా కాస్త మీరంతా టచ్ లో ఉంటే మంచిది...లేదంటే’’ అని ఏడుకొండలు అనగానే..

‘‘ మా ఫోన్లన్నీ మూటగట్టి గోదాట్లో విసిరేత్తావ్.. అంతేనా.. ఒకే డన్..’’ అంటూ గుర్నాధం అనగానే..

‘‘ ఏంటో.. మీరిద్దరూ ఇప్పటిదాకా ఏం మాట్లాడుకున్నారో.. ఒక్క ముక్క అర్ధంకాలేదు సుమీ.. ’’ అని కాంతం అనగానే..

’’ అర్ధంకాలేదా? కాంతం.. అయితే.. కొంచెం టచ్లో ఉంటే చెప్తా!!’’ పగలబడి నవ్వేశాడు గుర్నాధం.

మరిన్ని కథలు