Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope february 16th to february 22nd

ఈ సంచికలో >> శీర్షికలు >>

మనల్ని టీ వీ లకి కట్టేస్తున్న ’పాడుతా తీయగా’! - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

padutateeyagaa

కొన్ని సంవత్సరాలుగా పాడుతా తీయగా కార్యక్రమం ప్రేక్షకులకి మొహంమొత్తకుండా ప్రసారమవుతోంది. ఆబాలగోపాలాన్ని అలరించే టీ వీ షో ఏదన్నా ఉందాంటే, అది పాడుతా తీయగా అని అందరూ ముక్తకంఠంతో చెబుతారు.

ఇంతమందిని సమ్మోహితుల్ని చేస్తున్న ఆ పాటల కార్యక్రమంలో అసలు ఏవుంది?

కచ్చితంగా గాన గంధర్వుడు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం నిర్వహణా సామర్థ్యానికి తార్కాణం అది. ఒకసారి పిల్లలతో, మరోసారి యువతతో, ఇంకోసారి పెద్దలతో..ఎవరితో పాటల కార్యక్రమం నిర్వహించినా అద్భుతమే! శంకరాభరణం వచ్చిన కొత్తల్లో అందరూ శాస్త్రీయ సంగీతానికి ఆకర్షితులై, సంగీతం నేర్చుకోవాలని మాస్టార్లని కుదుర్చుకున్నారు. శృతిలయలు, సాగరసంగమం సినిమాలు విడుదలైనప్పుడు నృత్యం మీద ఆసక్తి కలిగి చాలామంది డాన్స్ స్కూళ్లలో చేరారు. ఇప్పుడు పాడతా తీయగా వీక్షకుల్ని సంగీతమంటే చెవి కోసుకునేలా చేస్తోంది. అందరి మనసుల్నీ సంగీతం క్లాసులకి తరలి వెళ్లేలా మారుస్తోంది.

కార్యక్రమ ప్రారంభంలో ఎంపికైన వాళ్లు పాడే పాటలు వింటుంటే ‘వీళ్లను అసలు ఎలా ఎంపిక చేసుకున్నారు?’ అనిపిస్తుంది. ఒక్కో అంకంలో బాలూగారు వాళ్లని సానబడతారు. గాయనీ, గాయకులూ ఆయన చెప్పినదాన్ని శ్రద్ధ గా, పట్టు చిక్కేవరకూ అభ్యాసం చేస్తారు. చివరి అంకానికి వచ్చేసరికి వజ్రాల్లా ప్రకాశిస్తారు. ప్రేక్షకులని ‘ఔరా!’ అని విస్తుబోయేలా చేస్తారు. ఎంత డబ్బు ఫీజుగా చెల్లించినా, ప్రేక్షకుల సాక్షిగా, అలాంటి సంగీత విద్వాంసుడు, అనుభవజ్ఞుడి సాంగత్యంలో సంగీత సాధన సాధ్యమౌతుందా? సంగీత సరస్వతి, నారదుడు, తుంబురుడు ఆశీర్వాదఫలం తోటే అది సాధ్యం.

వ్యక్తి తనకిష్టమైన వృత్తిలో ఎంతగా ఇమిడిపోతాడు, తాదాత్మ్యం చెందుతాడు అన్నదానికి ఎస్పీజీ ఒక మహోన్నత శిఖర ఉదాహరణ. 1966 నుంచి ఈనాటి వరకూ దాదాపు 40,000 పాటలు పాడి, గిన్నీస్ రికార్డ్ లో పేరు నమోదు చేసుకుని, సాచ్యురేషన్ స్థాయికి చేరుకున్నా, మొదటి సినిమాకి పాడే అవకాశం వచ్చి పాట పాడుతున్న అలౌకికానుభూతిని ఆయనలో మనం చూడొచ్చు. 70+ వయసులోనూ అది ఎలా సాధ్యమో మరి. బహుశా అనుక్షణం వృత్తిలో ఆనందాన్ని వెతుక్కునేవాళ్లు మాత్రమే అలా ఉండగలరనుకుంటా!

సాధారణంగా ఏ వృత్తినైనా జీవిక కోసం చేస్తాం. కొంతమంది అభిమానంతో అయితేనేమి, పనిపట్ల ఏకాగ్రతతో అయితేనేమి పరిణతి సాధించి అనుభజ్ఞులవుతారు. తర్వాత రిటైరయి వృద్ధాప్యాన్ని చీకూ చింతా లేకుండా గడుపుతారు. దాదాపు 50 ఏళ్ల సినీ జీవితంలో పాటలు పాడడంతో పాటు సంగీత దర్శకత్వం, డబ్బింగ్, యాక్షన్ లాంటి విభిన్న ప్రక్రియల్లోనూ తనేంటో నిరూపించుకున్నారు. సినిమా అంటే ప్రాణం ఆయనకు.

పాటలు పాడుతూ సంగీత దర్శకుల హావ భావాల్ని, పనిచేసే విధానాన్ని, సంగీతం రూపొందించడంలోని మెళకువల్నీ ఆకళింపు చేసుకోవడం అంత మామూలు విషయమేం కాదు. దానికి తను చేసే పని పట్ల ఆసక్తి, అంకితభావం, అహర్నిశం అదే ధ్యాసా ఉండాలి. ముఖ్యంగా అపారమైన ప్రజ్ఞ, ధారణ శక్తి ఉండాలి. సంగీతం నేర్చుకోకపోయినా సంగీత ప్రపంచంలో మేరువులా నిలిచారు. బాలూగారిలో ఉండే మరో ప్లస్ పాయింట్ ఏమిటంటే తెలుగు భాష పట్ల ఎనలేని మక్కువ. సంగీతంలో ఎంత కృషి చేశారో, సాహిత్యంలోనూ అంతే అభినివేశం. పాటల కార్యక్రమంలో పాల్గొనే పిల్లల అక్షర, పద ఉచ్ఛారణలోని దోషాలను సరిదిద్దడంలో సాక్షాత్తు తెలుగు మాస్టరే! ‘ఆవృతం’ ‘కరతాళధ్వనులు’ లాంటి కమ్మని అడుగడుగు తెలుగు పదాల కదంబం ఈ కార్యక్రమం.

పిల్లల్లో పిల్లాడిలా, పెద్దల్లో పెద్దగా కలసిపోవడం, తమాషాలు చేస్తూ, సరదా, సరదాగా ఒకప్పటి సంగీత దర్శకుల, స్టూడియోల సంగతులు చెబుతూ మురిసిపోవడం, సందర్భానుసారం పాటకు ముఖ్యమైన సన్నివేశాలు చూపించడం, అవకాశం వచ్చినప్పుడు నాలుగు మంచి మాటలు చెప్పడం, కంటెస్టెంట్ పాట పాడడం పూర్తవగానే, అప్పట్లో తనకు ఆ పాట పాడే అవకాశం ఇచ్చిన సంగీత దర్శకులను సభా వేదిక ద్వారా స్మరించుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకోవడం, అతిథిల గురించి పరిపూర్ణంగా తెలియజేసి, ఆయా రంగాల్లో వారు చేసిన కృషిని కొనియాడడం..ఎన్నో సాధించినా వినయంగా, ఒద్దికగా వేదిక మీద కనిపించడం- ఇవి కార్యక్రమంలోని కొన్ని మెచ్చుతునకలు మాత్రమే. పాడుతా తీయగా అంటే ఓ నిష్ణాతుడు నిర్వహించే వ్యక్తిత్వ వికాసం బోధ.

ఎంత చిన్న పిల్లాడైనా, పాట చక్కగా, శృతి సుద్ధంగా, ఎంజాయ్ చేస్తూ పాడితే, మురిసిపోతూ వయసు మర్చిపోయి అభినందనల పుష్పగుచ్ఛాలందించడం ఆయనలోని నిష్కల్మష సంగీతజ్ఞుడికి ఓ ఉదాహరణ.

సినిమాల్లో అవకాశాలు మెండుగా వస్తున్నా, ఎలాంటి పాటలు పడితే అలాంటి పాటలు పాడకుండా, తనంతట తాను సున్నితంగా తిరస్కరిస్తూ, పెద్దతనాన హుందాగా సాహిత్య విలువలున్న పాటలు మాత్రమే సినిమాల్లో పాడుతూ "పాడుతా తీయగా" కార్యక్రమానికి అంకితమవడం యువ గాయనీ, గాయకులకు నిజంగా ఒక వరమే! కొత్త గొంతుకలను వెలుగులోకి తెచ్చి సినీ ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత బాలూసార్ దే. ఇవాళటి రోజున ఎన్నో గళాలు తెలుగు చలనచిత్రసీమలో వినసొంపుగా వినబడుతున్నాయంటే దాని కారకులు నిస్సందేహంగా బాలూజీనే! గాయకులకు చక్కటి రాచబాట వేశారని చెప్పొచ్చు.

కొసమెరుపు: పాడుతా తీయగా కార్యక్రమం కోసం బయటి పనులు, ఉద్యోగ బాధ్యతలు తొందరగా ముగించుకొచ్చి ‘టీ వీ సెట్ల’ ముందు కూర్చుని కార్యక్రమం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తాం. మొదలవంగానే ఇంట్లో ఇంక పిన్ డ్రాప్ సైలెన్సే. కార్యక్రమం మధ్యలో అడ్వర్టైజ్ మెంట్లు వచ్చినా పని చేసుకోవడానికి కుర్చీల్లోంచి లేవం. బాలూజీ మాటలు మిస్సయిపోతామేమోనని.

వారం మొత్తం పడిన కష్టాన్ని మనసుల్లోంచి తుడిచేసి, హాయిగా సేదదీర్చే ఈ చక్కటి సంగీత కార్యక్రమం, పదికాలాల పాటు కొనసాగాలని ప్రతి ప్రేక్షకుడూ కోరుకుంటున్నాడు.

పాడుతా తీయగా కార్యక్రమం చివర్లో బాలూగారు తనదైన శైలిలో చెప్పే శాంతి మంత్రంతోటే ఈ వ్యాసాన్ని ముగిస్తాను.

 

సర్వే జనా సుజనో భవంతు

సర్వే సుజనా సుఖినో భవంతు!

మరిన్ని శీర్షికలు
vankaaya pacchadi