Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అన్వేషణ

anveshana

ఎత్తుగా కొండపై నుండి జల జలా ఉరక లేస్తూ జాలు వారుతోంది జలధార. పాయలు పాయలుగా కొండ చరియల నుండి క్రిందకు దూకుతున్న ఆ ఆకాశ ధారలో ఒకర్నొకరు తోసుకుంటూ భక్తి పారవశ్యంతో నిలువునా తడుస్తూ స్నానాలు చేస్తున్నారు భక్తులు.
ఆకాశ ధారకి ఎదురుగా అటు కొండలనానుకుని రెండు పెద్ద పెద్ద నల్ల బండల నడుమ రాతి పలకలతో నిర్మించిన వీరాంజనేయ స్వామి వారి గుడి ఉంది.

అటూ ఇటూ ఉన్న రెండు కొండల నడుమ విశాలంగా ఉన్న మెట్ల దారి నీళ్లతో నానుతూ నాచు పట్టి ఉంది. సింహ గిరి పై వెలసిన సింహాద్రి నాధుని దర్శించుకోడానికి వచ్చే భక్తుల కోసం నాడేనాడో పురూరవ చక్రవర్తి నిర్మించిన మెట్ల దారి అది.

ఆ రోజు `

శనివారం! సింహాద్రి అప్పన్నకు మేలిమి రోజు. ఉత్తరాంధ్ర నుండే కాక ఒరిస్సా, బెంగాల్‌ రాష్ట్రాల నుండి కూడా లెక్కకు మించిన భక్తులు ముడుపులు మొక్కుబడులతో సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకోవడానికి వస్తున్నారు.

కొండ దిగువన ఉన్న ఊర్లో బస్సులు దిగి తొలి మెట్టున్న ‘తొలి పావంచా’ దగ్గర కాల భైరవ స్వామికి మొక్కుకుని కొబ్బరి కాయలు కొట్టి మెట్ల దారిలో నడక ప్రారంభిస్తున్నారు భక్తులు.

తండోప తండాలుగా నడుచుకుంటూ భక్తులు ‘గోవింద గోవిందా’ అని గొంతెత్తి నామస్మరణ చేసుకుంటూ మెట్లు ఎక్కుతున్నారు. మెట్ల దారిలో అటూ ఇటూ దారి పొడవునా ఉన్న పుణ్య ధారల్లో మునుగుతూ ఆకాశ ధార వద్దకు చేరుకుని తలారా తడిసి ముద్దవుతూ మురిసి పోతున్నారు.

సాక్షాత్తూ శివుడి జటాఝూటం నుండి జాలు వారుతున్న పుణ్య గంగలా గోచరిస్తున్న ‘ఆకాశ ధార’లో స్నానమాచరించి ఎదురుగా ఉన్న వీరాంజనేయ స్వామిని దర్శించుకుంటూ ముందుకు సాగి పోతున్నారు భక్తులు.

తొలి పావంచా దగ్గర నుండి కొండపై నున్న చిట్ట చివరి మెట్టు వరకూ మెట్టు మెట్టు దగ్గర యాచకులు అటూ ఇటూ గోనె సంచులు పరుచుకుని వచ్చే పోయే భక్తులను అడ్డగించి మరీ బిక్షమెత్తుకుంటున్నారు.

చిన్నపిల్లలు, పెద్ద వాళ్ళు, ఆడ వాళ్ళు, ముసలి వాళ్ళు, సాధువులు ఒకరేమిటి... ఎక్కడెక్కడి నుండో వలస వచ్చిన యాచకులంతా మెట్లు దారి పొడవునా బారులు తీరి ఉన్నారు. మెట్టు మెట్టుకి వరుస కట్టి సిల్వర్ పల్లెం చేత్తో పట్టుకుని దీనంగా భిక్షం కోసం యాచిస్తూ కూర్చున్నారు ముష్టి వాళ్ళు. 

పుణ్యాత్ములైన భక్తులు చిల్లర చేత్తో పట్టుకుని అడిగినా అడగక పోయినా యాచకులందరి గోనె పట్టాల మీద చిల్లర నాణేలు పడేస్తూ పరుగు పరుగున మెట్లు ఎక్కుతున్నారు.

కొండపై నుండి క్రింద వరకూ మెట్ల దారి పొడుగునా అమర్చిన మైకుల్లో భక్తులకు జాగ్రత్తలు చెప్తూ హెచ్చరికలు వినిపిస్తున్నాయి. మధ్య మధ్యలో భక్తి గీతాలు శ్రావ్యంగా కొండ గాల్లో తేలియాడుతూ శ్రవణానంద పరుస్తున్నాయి.

ఉరుకులు పరుగులు మీద మెట్లెక్కుతున్న భక్తుల మధ్య నిదానంగా ఒక్కో మెట్టు లెక్క పెడుతున్నట్టూ ఎక్కుతోంది ఒకామె. నిర్లిప్తతకు నిదర్శనంగా...నిదానానికి నిలువుటద్దంలా గోచరిస్తోంది ఆమె.

ఆమె!

కాటన్‌ చీర కట్టుకుంది. మెళ్ళో చిన్న పాటి చైను, చెవులకి పొడుల దుద్దులు, చేతులకు సన్నగా నిగ నిగ లాడుతున్న రెండేసి గాజులు వేసుకుంది. ముక్కున ధగధగా మెరుస్తున్న ముక్కు పుడక ఆమె అందానికి వన్నె తెస్తోంది.

చీర చెంగు తల నిండుగా కప్పుకుని మెట్ల దారిలో ఉన్న యాచకులందర్నీ బంధువులా పలకరిస్తున్నట్టు వారి ముందు నిలబడి పరీక్షగా చూస్తూ ముందుకు నడుస్తోంది.

‘‘అమ్మా....తల్లీ....ధర్మం చెయ్యండమ్మా!....మీకు పుణ్యం ఉంటుంది! ఒక్క రూపాయి దానం చెయ్యండమ్మా!’’ అని ఒకో యాచకుడు అడుగుతున్నా వారి మాటలేవీ విననట్టే నిర్వికారంగా నడుచుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతోంది ఆమె.

మెళ్లో ఉన్న బ్యాగుని ఈ భుజం నుండి ఆ భుజానికి....ఆ భుజం నుండి ఈ భుజానికి మార్చుకుంటూ ముందుకు సాగుతోంది ఆమె. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆ మూల నుండి ఈ మూలకు ఈ మూల నుండి ఆ మూలకు అడ్డదిడ్డంగా మెట్లెక్కుతూ వెళ్తోంది ఆమె.

భక్తి పారవశ్యంతో ‘గోవిందా....గోవిందా’ అని గొంతెత్తి ప్రార్థనలు చేసుకుంటూ మెట్లు ఎక్కుతున్న భక్తుల కాళ్లకు అడ్డం పడుతోంది. అటూ ఇటూ నడుస్తున్న ఆమెని తప్పించుకుంటూ ముందుకు సాగి పోతున్నారు భక్తులు.

కొందరు బాల యాచకులు మెట్ల వెంబడి భక్తి పారవశ్యంతో పరుగెడుతున్న భక్తుల్ని అడ్డుకుంటూ చేతిలో ఉన్న సిల్వర్ పాత్ర అడ్డం పెడుతూ బిక్షం వెయ్యమని ప్రాధేయ పడుతున్నారు. భక్తు ఎవరి ధ్యాసలో వారు ముందుకు సాగి పోతూ లేదు లేదని మొత్తుకున్నా వినకుండా వారి కాళ్లకి అడ్డం పడుతూ అడుక్కుంటున్నారు.

బాల యాచకు మొర పట్టించుకున్నవాళ్ళు బిక్షం వేస్తున్నారు. పట్టించుకోని వాళ్ళు వాళ్లని తోసుకుంటూ ముందుకు సాగి పోతున్నారు.
పిచ్చిదాన్లా అటూ ఇటూ ఆ మూల నుండి ఈ మూలకు ఈ మూల నుండి ఆ మూలకు నడుస్తూ మెట్లు ఎక్కుతున్న ఆమెని పిల్లలైన యాచకులు ఇద్దరు గమనించారు.

ఆమె తామున్న మెట్టు దగ్గరకు రాగానే ఒక కుర్ర యాచకుడు అడ్డుగా నిలబడి ‘అమ్మా’ ధర్మం చెయ్యండమ్మా అంటూ అడ్డుకున్నాడు. హఠాత్తుగా అడ్డు పడ్డ కుర్ర బిక్షగాడ్ని చూస్తూ టక్కున ఆగింది ఆమె.

రెండో కుర్రాడికి పదేళ్ళుంటాయి. చిరిగిన చొక్కా వేసుకున్నాడు. నిక్కరో, ఫుల్‌ పేంటో తెలీని ఫేంటు వేసుకున్నాడు. అది ఒక కాలుకి పొడవుగా, మరో కాలుకి తొడ వరకే ఉందా ఫేంటు.

రెండో కుర్రాడు కూడా ఆమె ముందుకు వచ్చి దీనంగా యాచించాడు.

ఇద్దర్నీ ఎగాదిగా పరీక్షగా చూసింది ఆమె. నిర్లిప్తంగా చూస్తూ నిర్వికారంగా నిలబడిందో క్షణం.

యాచక కుర్రాళ్ళిద్దరూ ఆమెని కదలనివ్వకుండా ‘అమ్మా!’ మీకు పుణ్యం ఉంటుంది ధర్మం చెయ్యండమ్మా!...మీ బిడ్డల్లాంటి వాళ్ళం...మీకు తోచిన సహాయం చెయ్యండమ్మా!’’ అంటూ ఆమెని ఊపిరి కూడా పీల్చుకోనివ్వకుండా ఒకరి తర్వాత ఒకరు కంఠో పాఠమైన పద్యాన్ని అప్పగించినట్టు ఆమె ముందు ముష్టి మాటలు వల్లె వేస్తున్నారు.

ఆమె!

ఇద్దర్నీ నఖ శిఖ పర్యంతం పరిశీలనగా చూస్తూ ఛటుక్కున భుజానికి తగిలించుకున్న బ్యాగ్‌ ప్రక్కనే ఉన్న చిన్న జిప్‌ సర్రున లాగి అందులో నుంచి చిన్న పర్సు లాంటి బ్యాగ్‌ తీసి ఇద్దరికీ చెరో నోటు ఇచ్చేసి టక్కున పర్సు లోపల పెట్టి జిప్‌ మూస్తూనే ముందుకు నడిచింది.
ఆమె ఒక్క మాట కూడా మాట్లాడకుండా ‘దానం’ చేసే సరికి కుర్ర యాచకులిద్దరూ ఆమె కేసి ఆశ్చర్యంగా చూస్తూండి పోయారు.  తమ సిల్వర్‌ పాత్రలో ఆమె వేసిన నోటు కేసి చూసి మరింతగా ఆశ్చర్య పోతూ ఇద్దరూ తమ తమ గోనె పట్టా మీద అయోమయంగా చతికిల బడి పోయారు.

రెండు వేల రూపాయల నోటు....చెరొకటి...దానం చేసి నిదానంగా మెట్లెక్కి వెళ్లి పోతున్న ఆమె పిచ్చిదో... మంచిదో.... అర్థం గాక  ఇద్దరు కుర్రాళ్ళు నోట్లని చేత్తో పట్టుకుని అనుమానంగా అటూ ఇటూ తిప్పి చూసుకున్నారు.

‘‘ఒరేయ్‌ రామూ! ఈ రోజుకి ఇక చాల్రా! పద పోదాం’’ అన్నాడు మొదటి యాచక కుర్రాడు సోము.

‘‘సర్లేరా!...పోదాం! ఒరేయ్‌ సోమూ! ఆవిడెవర్రా!....పిచ్చిదంటావా? మంచిదంటావా?’’ రెండువేల రూపాయల నోటు అటూ ఇటూ తిప్పి చూస్తూ అన్నాడు రాము.

‘‘ఏరా అలా అన్నావు’’ అడిగాడు సోము.

‘‘కొంప దీసి ఇది దొంగ నోటంటావా?’’ అనుమానంగా అన్నాడు రాము.

‘‘ఛ! పోరా! నీకన్నీ అనుమానాలే?! పాత నోట్లు పోయి కొత్త నోటు వచ్చింది కదరా! అదే ఇది. ‘‘దేవతరా! చూసావా ఆ తల్లిని! అమ్మలా అగుపించటం లేదూ?’’ తన్మయంగా అన్నాడు సోము.‘‘నిజమేరా! మా అమ్మ ఎలాగుంటుందో నాకూ తెలీదు. మీ అమ్మ ఎవరో నీకూ తెలీదు. కానీ మనిద్దరికీ అమ్మలాగే సాయం చేసిందిరా.’’ సంతోషంగా అన్నాడు రాము.

‘‘అరేయ్‌ రామూ! వెనకాతలే వెళ్లి మళ్ళీ ‘బిచ్చం’ అడుగుదామా?’’ ఆశగా అన్నాడు సోము.

‘‘వద్దురా....ఆ అమ్మని చూసావా! అచ్చం అమ్మోరమ్మలా అగుపించ లేదా! తల మీద ముసుగేసుకుని ఎవరికీ కనపడకుండా తిరుగుతున్న లక్ష్మీదేవమ్మలా లేదూ’’ అన్నాడు రాము.

‘‘అవున్రోయ్‌! ముక్కుకి ధగ ధగా మెరుస్తున్న ముక్కు పుడక చూడు..ఎంత అందంగా ఉందో’’ ఆశ్చర్యంగా అన్నాడు సోము.

‘‘అందుకే వొద్దురా! కోపమొచ్చి మనకిచ్చిన రెండు వేల రూపాయలు తిరిగి లాగేసుకుంటుందేమో!’’ భయంగా  నోటు చిరిగిన జేబులో భద్రంగా దాచుకుంటూ అన్నాడు రాము.

‘‘అవున్రా! వారం రోజులకు సరిపడా దొరికిన ఈ ‘ముష్టి’ మనకు చాలు. అత్యాశొద్దు.’’ అన్నాడు సోము.

‘‘పద! ఈ పట్టాలు బూతు బంగ్లాలో దాచేసి వెళ్దాం.’’ అన్నాడు సోము మెట్ల మీద పరచిన గోనె పట్టా తీస్తూ.

‘‘పోరా! మళ్లీ బంగ్లా దగ్గరకెందుకు. ఈ మెట్లవతల తుప్పల్లో బండల మూల దాచేద్దాం.’’ అన్నాడు సోము.

‘‘సరే! పద!’’ అంటూ ఇద్దరూ చెట్టా పట్టాలేసుకుంటూ గోనె పట్టాలు తుప్పల్లో పడేసి తొలి పావంచా కేసి హుషారుగా పరిగెడుతూ రెండేసి మెట్లు గెంతుకుంటూ క్రిందకు దిగారు బాల యాచకులిద్దరూ.

(సశేషం)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
premiste emavutundi?