Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> వేపచెట్టు

vepachettu

అది ప్రభాత సమయం

బాల భానుడు తూర్పు కొండల మీద నుండి ఉదయించి మెల్ల మెల్లగా పైపైకి ప్రాకుతున్నాడు పసి పాపలా. భానుడి లేత కిరణాలు మెల్ల మెల్లగా మంచు తెరల్ని కరిగించుతూ వెలుగుల్ని ప్రసరిస్తోంది. ప్రకృతి సోయగాలతో ఆ వాతావరణమంతా ఆహ్లాదంగా ఉంది .

భూషణం మంచం మీద నుండి పైకి లేచి పెరట్లోకి వచ్చాడు . వస్తూనే కళ్ళు నులుము కొంటూ పెరట్లో ఉన్న వేపచెట్టు కేసి చూస్తూ , ఆ చెట్టు లేత ఆకుల మధ్య లొంచి దూసుకు వస్తున్న లేత కిరణాలను చూస్తూ కనీ కనబడని సూర్య బింబాన్ని దర్శించుకొని సూర్య నమస్కారం చేసుకొన్నాడు .

భూషణమే గాదు , ఆ ఇంటిల్లిపాదీ తరతరాలుగా వేపచెట్టుని దర్శనం చేసుకొని అందులొంచి పారాడే బాల భానుని బింబాన్ని చూడందే తదుపరి కార్యక్రమాలకు ఉపక్రమించరు . తమ కుటుంబానికీ , వేపచెట్టుకీ ఉన్న సంబంధం మాటల్లో చెప్పడానికి వీల్లేదు . వేసవిలో వచ్చే చల్ల గాలి కోసం ఆ వేపచెట్టు క్రిందనే నులక మంచం వేసుకొని పడుకొంటాడు భూషణం . ఆ రోజుల్లో ఫ్యాన్ లాంటి ఉపకరణాలు గూడా లేవు . కేవలం వెదురు బద్దలతో చేసిన విసన కర్రలే వాడాలి .

కాలకృత్యాలు తీర్చుకోవడానికి భూషణం మైలు దూరంలో ప్రవహించే ఏటికోసం బయలు దేరాడు . వెళుతూ వేపచెట్టు కొమ్మ వంచి ఒక వేప పుల్లని త్రుంచు కొన్నాడు దంతావధానం కోసం . అక్కడక్కడా విరగ బూసిన తెల్ల ముత్యాలలాంటి వేప పూతను చూసి ఆనంద భరితుడై కొంచెం పూత తీసుకోని నోట్లో వేసుకొని నమిలి మింగాడు . వేప పూతే గాదు , వేప చెట్టే ఒక ఆయుర్వేద ధనవంతరి . ఆకులు గానీ , పూత గానీ , వేప కషాయము గానీ నమిలి మ్రింగితే సకల రోగాలు మటుమాయం అని తన నాయనమ్మ చెబుతుండేది ఎప్పుడూ . అదే అలవాటు తన ఇంటిల్ల పాదికీ వచ్చింది .

కాల కృత్యాలు తీర్చుకొని దొడ్డి దారిన ఇంటిలోకి అడుగు పెడుతూ , స్నానాల గది వైపు కెళ్ళి పొయ్యి వెలిగించాడు . శనగ పొట్టు , వరి పొట్టు , పిడకలు వేసి పొయ్యి వెలిగించాడు . ఎండిన కట్టెలు పొయ్యిలో ఎగదోస్తూ మంటల్ని రాజేసాడు. పొయ్యి మీదున్న పెద్ద గంగాళంలో నీళ్లు కాగుతున్నాయి.

సూర్యోదయం కాకముందే పూజార్చన కార్యక్రమాలు ముగించడం అలవాటు భూషణానికి . దేవతార్చన చేస్తూ గంట వాయించిన శబ్దంతో తన నాయనమ్మ అన్నపూర్ణమ్మ నిద్ర లేస్తుంది . అంతకు ముందే ఇంటి లోని వారందరు లేచి కాలకృత్యాలు తీర్చుకొని వేప పుల్లల్తో దంతావధానం చేస్తారు . తన ధర్మ పత్ని సుశీల , కూతురు , కొడుకు అందరూ హారతి వేళకు వరుసగా నిలబడి , హారతి , తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందే ! . ఇదీ వాళ్ళ దైనందిక చర్య.

భూషణం కర్పూర హారతి వాళ్ళ నాయనమ్మ దగ్గరకు వెళ్లి ఇచ్చాడు . అన్నపూర్ణమ్మ హారతి తీసు కొంటూ మనవడి ముఖంలో చూసింది నిర్లిప్తంగా .

'' నేను విన్నది నిజమా నాయనా? '' అన్నది. ఆమె గొంతు వణుకు తోంది.

'' ఏమిటది నాయనమ్మ? ''

''వేపచెట్టును అమ్మేస్తున్నావంట'' ఆమె గొంతు గాద్గదిక మయ్యింది .

''అబ్బే ..అబ్బే .. అలాంటిదేమీ లేదు నాయనమ్మా !''

''నా దగ్గర దాపరిమెందుకు నాయనా ? నా ముఖం లోకి చూసి నిజం చెప్పు ?''

''అ ... అవును నాయనమ్మ .. కడప నుండి వచ్చే సాయబులకి ఐదు వేల రూపాయలకు అమ్మేస్తున్నాను '' అన్నాడు భూషణం .నాయనమ్మ ముఖంలోకి చూడలేక తలా దించుకొన్నాడు.

కళ్ళల్లోంచి కన్నీళ్లు ధారా పాతంగా వర్షిస్తుంటే దభాల్న కుప్ప కూలి పోయింది అన్నపూర్ణమ్మ  ఆర్ధిక పరిస్థితుల వలన భూషణం వేపచేట్టుని అమ్మడానికే నిశ్చయించు కొన్నాడు . వ్యవసాయంలో వచ్చే డబ్బు ఏ మూలకు సరిపోవడం లేదు. కూతురు పుష్పవతి అయినప్పటి నుండి , ఆమె మెడలో కనీసం వెండి గొలుసు గూడా కొనివ్వ లేక పోతున్నాడు .వచ్చే ఐదు వేలకు ఏదయినా బంగారు గొలుసు కొనివ్వాలని అనుకొన్నాడు . గానీ డబ్బు కోసం బంగారం లాంటి వేప చెట్టును అమ్మడం తనకు గూడా సుతారాము నచ్చలేదు . ఊర్లోని కామందులంతా పచ్చిని చెట్లని అమ్మేసి డబ్బులు పోగు చేసుకొంటున్నారు .వేప మొద్దులకి , కలప మొద్దులకి చాలా గిరాకీ ఉందని కలప వ్యాపారం చేసే వాళ్ళు ఎగబడి చెట్లను కొంటున్నారు. పల్లె పల్లెలూ తిరిగి డబ్బు ఆశ చూపి పచ్చగా కళకళ లాడుతున్న చెట్లని నరికి పల్లెలన్నింటిని బీడు భూములుగా చేసి ఎడారి భూములుగా మారుస్తున్నారు.

'' నాయనమ్మా ... నన్ను క్షమించవా? అనునయంగా నాయనమ్మ ప్రక్కన కూర్చొని ఆమె చుబుకం పైకెత్తి అడిగాడు భూషణం.

' నిన్ను క్షమించను గాక క్షమించను. వేప చెట్టుకు , మన ఇంటికీ ఉన్న అవినాభావ సంబంధం నీకు తెలుసు గదరా? అది నాకు దైవంతో సమానం. అది మీ తాతయ్య పుట్టిన రోజు నాటినదన నీకు తెలుసు గదా? నేను ఈ ఇంటి గడప తొక్కినప్పటి నుండి దాన్ని ప్రాణ ప్రదంగా కాపాడు కొంటూ వస్తున్నాను. ఒరేయ్..భూషణం.. ఈ చేతులతో కడివెడు నీళ్లు ప్రతి రోజూ పోసి , నా బిడ్డ లాగా చూసు కొన్నాను. మరి ఈ నాడు ఈ ప్రారబ్ధం వస్తుందని నేను కలలో గూడా అనుకోలేదు. '' అంది అన్నపూర్ణమ్మ ఆయాస పడుతూ.

'' నా కన్నీ తెలుసు నాయనమ్మా... వేప చెట్టుపై నీకున్న అనుబంధం ....''

'' అంటే అన్నీ తెలిసే అమ్మాలను కొన్నావా నాయనా ? చెట్లు భగవంతుని రూపాలని మన వేదాలు ఘోషిస్తున్నాయే ! వేపచెట్టు , రావిచెట్టు శ్రీ లక్ష్మి నారాయణులని పూజిస్తామే ! మీ అమ్మా నాన్న బ్రతికే ఉంటే , నన్ను కాదని ఈ పని చేసే ఉండరు. వంద సంవత్సరాల నుండి మన ఇంట్లో కల్ప వృక్షంలా పెరిగింది .'' అంది ఆమె బొంగురు పోయిన కంఠంతో . ఉబికి వస్తున్న కన్నీటిని కొంగుతో తుడుచు కొంది .

భూషణం తల్లి తండ్రులు అనారోగ్యంతో కాలం చేసి పది సంవత్సరాలయ్యింది . అప్పటి నుండి భూషణం ఇంటి బాధ్యతలను నెత్తిపై వేసుకొన్నాడు.

'' చెట్లు దైవ స్వరూపాలు . చెట్లు మనిషికి ఆపన్న జీవులు. పరిశుద్ధమైన గాలిని చెట్లు మనకిస్తున్నాయి. వేప చెట్టు లాంటివి కల్ప వృక్షాలు. దాని పూత, ఆకులు, గింజలు, బెరడు మనిషి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగ పడుతున్నాయి. వేపాకు గూడా పొలాలకి దుక్కిగా వేస్తున్నాము. అలాంటి కల్పవృక్షాన్ని ఎలా అమ్ముతావు నాయనా? ఈ ప్రయత్నం మానుకోరా! '' అంది బుజ్జగింపుగా అన్నపూర్ణమ్మ.

'' నాయనమ్మ .. అన్నీ నాకు తెలుసు. గత్యంతరం లేక అమ్ముతున్నాను. '' అని విసురుగా లేచి బయటికి వెళ్లి పొయ్యాడు భూషణం .
అన్నపూర్ణమ్మ తన గది లోకి వెళ్లి మంచం మీద వాలిపోయింది నిస్సత్తువతో .

-----------------------------

మరుసటి రోజు , అనుకొన్న ప్రకారం కొనుగోలు దారుడు ఐదు వేల రూపాయలు భూషణం చేతిలో పెట్టి అగ్రిమెంట్ రాయించు కొన్నాడు. వాళ్ళ పెద్ద పెద్ద రంపాలు , కొడవళ్లు, గొడ్డళ్లు , పొడుగాటి త్రాళ్లు తెచ్చుకొన్నారు. పనులు పురమాయించి ఆ పెద్ద మనిషి వెళ్లి పొయ్యాడు.

భూషణం తో పాటు , ఇంటిల్ల పాది విల విల లాడి పొయ్యారు. చెట్టు కొమ్మలు నరుకుతూ ఉంటే , తమ చేతుల్ని నరుకు తున్నట్లు భాధ పడి పొయ్యారు. ఆ అపరిచిత వ్యక్తులు దాదాపు పది మంది తమ నునుపైన కొడవళ్ళతో దృఢమైన వేప చెట్టు కొమ్మల్ని తెగ నరుకుతూ ఉన్నారు.మధ్యాహ్నం అయ్యేసరికి కాళ్ళు చేతులు తెగి పోయిన మొండెంలా నిర్జీవమైన కళతో మిగిలి పోయింది వేపచెట్టు.

సాయంత్రానికల్లా వేపచెట్టు మొదలు కాండాన్ని రంపంతో కోస్తున్నారు. కీచు కీచు మని రంపం చేస్తున్న శబ్ధం అన్నపూర్ణమ్మ ప్రేగుల్ని కలచి వేసింది. ఆమె శరీరాన్ని ఎవ్వరో ముక్కలుగా ముక్కలుగా కోస్తున్నట్లు విల విల లాడి పోయింది .అంతలోనే బ్రహ్మాండ మైన శబ్దం . త్రాళ్లతో లాగుతూ అంత పెద్ద చెట్టు మొదల్ని పెళ పెళ మని నేల గూల్చారు .

ఆ వేపచెట్టుకు నోరు ఉంటే ఆర్తనాదాలు చేసేదేమో ! సాయంకాలం అయి పోయింది . రెండు లారీలు ఇంటి ముందర వచ్చి ఆగాయి. ఆ వచ్చిన పని వాళ్ళు వేప మొద్దుల్ని పేర్చి లారీల్లోకి ఎక్కిస్తున్నారు.

ఎక్కడి నుండో వచ్చిన కాకుల , పక్షుల గుంపు భయంకర మైన అరుపులు చేసుకొంటూ అక్కడక్కడే చెట్టు చుట్టూ తిరుగుతూ అరుస్తున్నాయి. బహుశా తమ తమ పిల్లలు , గూళ్లు ఏమైపోయాయనే బెంగతో అరుస్తున్నాయి. కొన్ని కాకులు వలయాలుగా తిరుగుతూ కావు కావు మని అరుస్తున్నాయి.

భూషణానికి ఆ రాత్రంతా నిద్ర పట్టడం లేదు .గుండె లయ తప్పి గట్టిగా కొట్టుకోసాగింది .గుండెను అదుముకొంటూ బలంగా శ్వాస వదుల్తూ నిద్ర రాక అటూ ఇటూ పొర్లుతున్నాడు .

తెల్ల వారింది .

పక్షుల గుంపు , కాకులు ఇంకా ఆర్తనాదాలు చేస్తూనే ఉన్నాయి. నిన్నటి వరకు తమకు ఆశ్రయ మిచ్చి , తమతో సహా వాసం చేసిన ఆ మహా వృక్షం ఒక్కసారిగా అదృశ్యమైనందుకు ఆ మూగ జీవాలకు అర్థం గావడం లేదు .పెరడంతా బోసి పోయి నట్లయింది . ప్రకృతి పాలి పోయినట్లుంది .

భూషణం స్నానానంతరం , హారతి పళ్లెంతో అన్నపూర్ణమ్మ పడుకొన్న మంచం కేసి నడిచాడు .

'' నాయనమ్మా.. ఇంద హారతి తీసుకో!'' అన్నాడు భూషణం.

రెండు మూడు సార్లు పిలిచినా , అన్నపూర్ణమ్మ లో చలనం లేదు .

'' నాయనమ్మా'' అంటూ ఆమె మీద పడి భోరున విలపించాడు.

హారతి పళ్లెంలో కర్పూర జ్యోతి ఎప్పుడో ఆరి పోయింది .

తొంభై ఏళ్లుగా ఆ ఇంటిని కని పెట్టుకొని , అందరి ఆలనా పాలనా చూసుకొన్న అన్నపూర్ణమ్మ అనంత వాయువుల్లో ఎప్పుడో కలిసి పోయింది. తాను ఎంతో ఇష్టంగా పెంచుకొన్న వేపచెట్టు లాగే నిర్జీవ మైంది .

మరిన్ని కథలు
joginatham the great