Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమిస్తే ఏమవుతుంది?

premiste emavutundi?

గత సంచికలోని ప్రేమిస్తే ఏమవుతుంది సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి....http://www.gotelugu.com/issue254/686/telugu-serials/premiste-emavutundi/premiste-emavutundi/

(గత సంచిక తరువాయి)... ఇటివల కలుగుతున్న కొన్ని వికారాలు, శారీరక మార్పులు గమనిస్తుంటే  తను గర్భవతా అనుకుంటూనే ఉంది ...  భయంతో గజ, గజ వణికిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా తెలుస్తోంది ... గర్భవతి .... గర్భవతి... అయిపొయింది... ఇంక అమ్మ,  నాన్న తనని ఇంట్లోకి రానివ్వడం కల్ల ... వాళ్లకి, తనకి ఋణం తిరిపోయినట్టే...

ఇలా బలవంతపు కాపురం చేస్తూ గర్భం పొందడం అంత నరకం ఇంకోటి ఉందా... అసలు అతనితో కాపురమే రోత ... ఇప్పుడు అతని పిల్లలకి తల్లి అవడం ఇంకా రోత... ఎలా ఈ ఆపద గట్టెక్కడం ...

కళ్ళ ముందు క్రూర జంతువులూ, వాటి మధ్య తను, ఒక కీకారణ్యం లో పరుగులు పెడుతున్నట్టుగా ఏవో నీడలు ...గాయత్రికి కంపరంగా అనిపించసాగింది.

ఆమెకి అతను తన పక్కన పడుకున్నా, తన వంటి మీద చేయి వేసినా ఎలాంటి పులకింతలు లేవు.. ఆ రోజు మొదట సారి అతను తన చేయి పట్టుకోగానే నరనరానా వ్యాపించిన తీయటి అనుభూతి ఇప్పుడు లేదు.. ఏదో భయం, జుగుప్స ఒంటి నిండా పురుగులు పాకుతున్నట్టు , ఆ పురుగులను అతను తన నాలికతో తీసి వేస్తున్నట్టు భయంకరమైన అనుభూతి.

మొదటి రాత్రి ఏం చేయాలో తెలియని అయోమయంలో, ఏదో చేయాలన్న తపనతో, ఆరాటంతో, ఉద్రేకంతో ఆమె శరీరాన్ని నలిపి, నలిపి పెట్టాడు..ఆ తరవాత కూడా కొన్ని రోజులు అలాగే జరిగింది.. దాంతో ఆమెకి రాత్రి అవుతుందంటే భయం, అతను పక్కన చేరగానే జుగుప్సతో వణికిపోయింది.. ఇప్పుడు శృంగారంలో అతను చాలా పాఠాలు నేర్చుకున్నాడు.. అయినా ఇప్పటికి ఆమెకి అతను మీద చేయి వేస్తే జుగుప్స, కంపరం ...

అలాంటిది , ఒక జుగుప్సతో కూడిన రతి ద్వారా కలగబోయే సంతానానికి తను తల్లి కాబోతోందా? అదే నిజమైతే ఇంక ఈ రొంపిలో పూర్తిగా, ఎన్నటికీ బయటికి రానంతగా... ఉన్నట్టుండి భోరుమంది గాయత్రి.

రమేష్ ఆహటాత్ సంఘటనకు బిత్తరపోయాడు.

“ఏమైంది... ప్లీజ్ ఏడ్వకు.. నేను తోల్కపోత ... ఏడ్వకు” అని ఒదార్చసాగాడు.

తల అడ్డంగా ఆడిస్తూ వెక్కుతూ అంది గాయత్రి “లేదు వెళ్ళలేను.. అయిపొయింది... ఇంక నాకు వాళ్ళని చూసే అదృష్టం లేదు.. నేను, నేను గర్భవతిని. “

ఒక్కసారి అక్కడ కోటి నక్షత్రాల మెరుపులు మెరిసినట్టు అనిపించింది రమేష్ కి “ఏమన్నావు” అన్నాడు నమ్మకం లేనివాడిలా.
ఆమె తల ఊపింది.

రమేష్ గభాల్న ఆమెని దగ్గరకు లాక్కుని ముద్దులతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ అన్నాడు.. “ఎంత గుడ్ న్యూస్ చెప్పినవో. ఇంక చూడు నిన్ను నా పానం లెక్క జుసుకుంట ... నా కొడుకుని, నిన్ను నా కంటి రెప్పలేక్క జూసుకుంట ... గాయత్రి మనం అమ్మ, నాన్న ఐతున్నం ... ఇంక కష్ట పడత .. నరిసిమ్మ అన్నను నాకు మంచి పని ఇప్పియ్యమని అడుగుత ... ఏడ్వకు.. ఇంక ఏడ్వకు ... ప్రామిస్ నిన్ను మంచిగ చూసుకుంట ..

” ఏదో లోకంలో ఉన్న వాడిలా మత్తుగా, గమ్మత్తుగా అతను ఆమెని కౌగిట్లో నలిపేస్తూ చెప్పసాగాడు.

గాయత్రి అలసిపోయింది.. కూర్చున్న దగ్గరే స్పృహ తప్పినదానిలా పడుకుండిపోయింది. రమేష్ నుంచి పారిపోడానికి దారులు వెతికి నిస్సహాయంగా, నిస్తేజంగా, ఇంక ఈ బతుకింతే  అనుకుని సరిపెట్టుకుని నిస్సారంగా బతుకు ఈడవడానికి నిశ్చయించుకుంది గాయత్రి..
రమేష్ ఆమె గర్భవతి అని తెలిసిన మరుక్షణం ఏదైతే ప్రామిస్ చేసాడో అది నిలబెట్టుకోడానికి గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
నర్సిమ్మకి శుభవార్త చెప్పి తనకి అదనంగా పని ఇప్పించమని అడిగాడు.

రమేష్ ఇంత త్వరగా ఎంతో బాధ్యతగా ప్రవర్తించడం నర్సిమ్మకి అబ్బురంగా అనిపించింది. ఇంటికి వచ్చి గాయత్రిని అభినందించి, రమేష్ మంచితనాన్ని పొగిడి, “భవిషత్తులో చాలా సుఖంగా ఉంటావు.. ఇప్పుడు నువ్వు పడ్డ బాధ ఏమి కూడా అప్పుడు గుర్తు రాదు తల్లి..” అన్నాడు. గాయత్రి నిట్టూర్చింది.

నర్సిమ్మ రమేష్ తోటి పుట్టబోయే పిల్లల కోసం డబ్బు దాచడానికి బాంక్ అకౌంట్ ఓపెన్ చేయించమన్నాడు .. కానీ ఆదార్ కార్డ్ లేకుండా అకౌంట్ ఓపెన్ చేయడం కష్టం అని త్వరలో ఆదార్ కార్డ్ తీసుకుందాం అప్పటిదాకా గాయత్రికి ఇచ్చి దాచమని చెప్పు అన్నాడు నర్సిమ్మ.
తనకి  రోజూ వచ్చే ఆదాయంలో ఇంటి ఖర్చులకు, గాయత్రికి మందులు, బలాన్నిచ్చే టానిక్ లు, పండ్లు, మిఠాయిలు వీటన్నిటికి పోను మిగిలిన, వందో, రెండో వందలు గాయత్రి చేతిలో పెట్టి మన పిల్లల కోసం దాచిపెట్టు అని చెప్పాడు రమేష్.

నర్సిమ్మ సలహా మేరకు గాయత్రిని ప్రతి నెల డాక్టర్ చెక్ అప్ కి తీసుకు వెళ్తున్నాడు. ఆమె ఆటోలో ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా నడిపిస్తాడు కుదుపులు లేకుండా.

అతని ప్రేమని ఇప్పుడు కొంచెం, కొంచెం స్వీకరిస్తూ నెమ్మదిగా గాయత్రి ఆ జీవితానికి అలవాటు పడడం మొదలు పెట్టింది.   కాలం ఛక, చకా సాగిపోయింది. గాయత్రికి తొమ్మిదో నెల వచ్చింది. శనివారం ఉదయం, ఆరున్నరకి మంచి ఎండాకాలం అయిన మే నెల ఆరో తారీకు గాయత్రికి బాబు పుట్టాడు. రమేష్ కి కాళ్ళు భూమ్మీద నిలవలేదు.. నర్సిమ్మని, శ్రీనివాసుని, అతని భార్య సత్యవతిని తన ఆటోలో తీసుకొచ్చి బాబుని చూపించాడు.

తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. సత్యవతి గాయత్రి తల నిమురుతూ పోనిలే బిడ్డా.. పిల్లోడు మంచోడు నిన్ను మంచిగ చూసుకుంటుండు .. ఆడదానికి ఇంతకన్న ఏం కావలె చెప్పు.. ఇంక నువ్వు ఎసోంటి పికరు పెట్టుకోకు అంది. ఆడదానికి ఏం కావాలో ఆవిడకి ఏం తెలుసు... తనకి తెలియదు.. కాని ఈ జీవితం కాదని మాత్రం తెలుస్తోంది అనుకుంది గాయత్రి. ఎందుకో పిల్లాడిని చూస్తుంటే ఆమె హృదయం పెద్దగా స్పందించడం లేదు.. వాడు తెల్లగా ఉన్నాడు.. గాయత్రిలా ఉన్నాడు అన్నారు అందరు.. అయినా గాయత్రికి వాడి మీద పెద్దగా మమకారం, మమత పొంగిపోవడం లేదు.. నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయింది.

మూడో రోజు డిశ్చార్జి చేసారు.

ఆటోలో బాబుని, గాయత్రిని అపురూపంగా ఇంటికి తీసుకొచ్చాడు.

ఇరవై ఒకటో రోజు తనకి చేతనైనంతలో నామకరణ మహోత్సవం జరిపి, ఏడుకొండలవాడి దయతో పుట్టాడు కాబట్టి  బాబుకి వెంకన్న అని పేరు పెడదామన్నాడు.

గాయత్రి అయిష్టంగా చూసింది.. ఎంత దేవుడైనా వెంకన్న అని పెడితే రేపు వాడు పెద్దవాడు అయాక ఇదేం పేరు పెట్టారమ్మ అంటాడు.. కాబట్టి అ వెంకటేశ్వరుడి పేరే  విష్ణు అని పెడదాం  అంది.

నీ ఇష్టం గాయత్రి అదే పెడదాం అన్నాడు.

నర్సిమ్మ, శ్రీనివాసు కుటుంబం, చుట్టూ పక్కల ఇల్లవాళ్ళు అందరు కలిపి పాతికమంది వచ్చారు.

వచ్చే నెల వేరే ఇల్లు తీసుకుందాం ... రెండు రూమ్ లది అన్నాడు రమేష్ ఆ రాత్రి గాయత్రితో.

నీ ఇష్టం అంది గాయత్రి .

జీవితంలో అన్నీ అనుకున్నట్టు జరగవు.. జరిగేవి ఊహకి అందవు.

అందుకే ఓ మహాకవి అన్నాడు అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని 

గాయత్రి జీవితంలో కూడా అదే జరిగింది.

బాబుకి నెల దాటింది. అన్నట్టే రమేష్ రెండు గదులు, బాత్రూం, లావేటరి  సపరేట్ గా ఉన్న పోర్షన్ చూసి, అడ్వాన్స్ ఇవ్వడానికి ఉదయమే బయలు దేరి వెళ్ళాడు.

అయితే సరిగ్గా పదిన్నరకి నర్సిమ్మ ఆదరా, బదరా వచ్చాడు..

గాభరాగా, మొహం నిండా చెమటలు కారిపోతుంటే గుండెలు బాదుకుంటూ వచ్చిన నర్సిమ్మను నిర్ఘాంత పోయి చూసింది గాయత్రి.
అతను చెప్పిన వార్త విని కుప్పకూలిపోయింది.

రమేష్ ఆటకి యాక్సిడెంట్ అయింది.. హాస్పిటల్లో అడ్మిట్ చేసి గాయత్రిని తీసుకు వెడదామని వచ్చాడు నర్సిమ్మ.. రమేష్ పరిస్థితి ఆందోళనగా ఉంది.

కళ్ళముందు చీకట్లు కమ్ముతుంటే గాయత్రి స్పృహ తప్పింది.

 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
anveshana