Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
alaa gurtimpu pondadame naku ishtam

ఈ సంచికలో >> కథలు >> అనుకున్నామని జరగవు అన్నీ

anukunnaamani annee jaragavu annee

ఒంటరిగానే సిటిలో లేడీస్ బ్యూటీ పార్లర్కి వచ్చిందామిపుడు.ఎప్పుడూ వెళ్లని చోటు, పైగా అలవాటు లేని వ్యవహారం.అయినా సరే ధైర్యం తెచ్చుకుంది లక్ష్మి.లోనికి అడుగుపెట్టగానే ,అందమైన అమ్మాయిల బొమ్మలు గోడకి అంటించి ఉన్నాయి.వారి జుత్తూ ,వాటి అలంకరణా,చాలా బావుంది.వాటిని తదేకంగా చూస్తూ,వారి స్థానంలో తనని తానే ఊహించుకుంటూ ఉవ్విళ్లూరిపోసాగిందామె.అంతలో ఓ క్షణం తన భర్త మధు మాటలు గుర్తుకు వచ్చాయామెకి.వెంటనే ఒళ్ళు కంపరంగా అనిపించినా, నిగ్రహించుకుని స్తిమితపడిందామె.కానీ ఆ మాటలు వెంటాడాయి.పెళ్లి అయి సంవత్సరం కావొస్తోంది.ఇంకా అలా పాత కాలం హీరోయిన్లా ఉండిపోక అప్ డేట్ అవ్వవోయ్.ఆ జిడ్డు మొహంతో కాక కొంచెం ఫేషియల్ లాంటివి చేయించుకొవోయ్.కొంచెం గ్లో వస్తుంది.ఆ పెద్ద బొట్టు తగ్గించి,ముక్కు పుడక తీసేయొచ్చుగా.మరీ అమ్మోరిలా కనిపిస్తావు కొన్నిసార్లు.అనడం గుర్తొచ్చింది.ఆయన అన్నారని కాదు.నాకు మాత్రం అలా నేటి తరం అమ్మాయిల్లా మోడ్రెన్ గా ఉండాలని ఉండదా ఏంటి.పుట్టి పెరిగింది పల్లెటూళ్ళోనైనా ,పట్నం గాలి తగలగానే నన్నూ నాగరిక పోకడలు వెంటాడాయి.అందుకే నేను ఆయనికి నేటితరం హీరోయిన్స్ లా కనిపించాలని నిర్ణయించుకున్నాను.అని ఆమె ఆలోచించుకుంటుండగానే,యెస్ మేడమ్ అన్న పిలుపుతో ఈ లోకం లోకి వచ్చింది లక్ష్మి.ఎదురుగా, కుదురుగా,నుదురు విశాలంగా ఉన్న ఓ చక్కటి అమ్మాయి  చిరునవ్వుతో నిలబడింది.మళ్ళీ ఆ అమ్మాయే ,యెస్ మేడమ్ ,ఏం చేయమంటారు.ఫేషియల్ ,ఫేస్ పేక్ ,ఐబ్రోస్ ట్రిమ్మింగ్,హెయిర్ స్ట్రెయిట్నింగ్,పెడిక్యూర్ లేక మరేదైనా అడిగిందామె చిన్న స్వరంతో చిలకలా.

ఏం చెప్పాలో లక్ష్మికి తెలియలేదు.దాంతో ఓ క్షణం ఆలోచించి ,చూడండి ,నేనింతవరకూ ఇలాంటివి ఎప్పుడూ చేయించుకున్నది లేదు .నాకు తెలిసి అందంగా తయారవడమంటే,కుంకుళ్లతో కుదురుగా తలంటుకుని ,బారుగా జడేసుకుని ,తీరుగా కాటుక దిద్దుకుని,కొంచెం పసుపు రాసుకుని ,బొట్టు పెట్టుకుని ,పౌడర్ రాసుకుంటే చాలు.మా ఊళ్ళో అందరూ నన్ను లక్ష్మి నిజంగానే లక్ష్మీదేవిలా ఉంటుందనేవారు.కానీ ఇప్పుడు,మా చుట్టుపక్కల వాళ్ళూ ,మా ఆయనా అలా కాదంటున్నారు.నేను ఇంకా పాత చింతకాయ పచ్చడిలా తయారవుతున్నానట. అందుకే నేను కూడా కొంచెం స్టైలిష్ గా మారి ,ఆయనికి నచ్చినట్టుగా ఉందామని ఇలా మీ ముందుకొచ్చాను.చెప్పిందామే కొంచెం సిగ్గు పడుతూ.

ష్యూర్ అక్కా.తప్పకుండా.చెప్పిందా అమ్మాయి చిరునవ్వుతో.

అచ్చంగా మా చెల్లి సరస్వతిలానే పిలిచావు.మురిసిపోయింది లక్ష్మి,ఛైర్లో కూర్చుంటూ.

అక్కా.హెయిర్ని కొంచెం యు షేప్ లో కట్ చేసి ,ఐ బ్రోస్ ని తీన్ చేసి,ఫేషియల్ చేసి ,ఫేస్ ప్యాక్ వేస్తే చాలక్కా.మంచి లుక్కు  వచ్చేస్తుంది.అంటూ పని మొదలు పెట్టిందామె.కొద్ది సేపటి తర్వాత ,లక్ష్మి తన ముఖం అద్దం లో చూసుకున్నాక తెల్సింది అసలు మార్పు.చాలా ఉబ్బిపోయిందామె.బిల్లు పెద్దగా వేసినా సర్లే అనుకుందామె.థాంక్స్ చెప్పి ఆటొలో బయల్దేరి, దారిలో తనకి నచ్చిన చూడిదార్లు ,టాప్స్ ,లెగిన్స్ కొనుక్కుని ఇల్లు చేరింది.ఉన్న వాటిలోంచి ,మంచి స్టైలిష్ టాప్ ,లెగిన్ వేసుకుంది.ఇక భర్త ఆఫీసు నుండి రావడమే ఆలస్యం.ఆయన వచ్చీ రాగానే ,నన్ను చూసి సర్ప్రైస్ అయిపోతారు.లక్ష్మి సూపర్ గా కనిపిస్తున్నావ్.ఇప్పుడు నీకు ఏం కావాలో అడుగు అంటారు.అప్పుడు నేను,తడుముకోకుండా ,అయితే మొదట రెస్టారెంట్ లో డిన్నర్ చేసి,తర్వాత బీచ్ కి వెళ్ళి కొద్ది సేపు గడిపి,తర్వాత చివరిగా ఐనోక్స్ లో సినిమా చూద్దాం అంటాను.అప్పుడు ఇద్దరం బైక్ పై రై అంటూ వెళ్లిపోతాం.అని ఆమె ఏవేవో ఆన్లిమిటెడ్ గా ఆలోచిస్తుండగానే ఆమె ఫోన్ రింగైంది.లిఫ్ట్ చేసి ఏవండీ ,ఎక్కడున్నారు.ఆఫీసు నుండి బయల్దేరారా.అడిగిందామె ఉత్సాహంగా.లేదు ఇంకో గంట పడుతుంది.ముందు నేను చెప్పేది శ్రద్దగా విను.ఇంకో అరగంటలో మా పిన్ని ఒక్కతే ఈవినింగ్ ట్రైన్ లో వస్తోంది.మన ఇల్లు తెలీదు.కనుక నువ్వు వెళ్ళి రిసీవ్ చేసుకుని తీసుకురా.నీ ఫోటో ఆమెకి వాట్సప్ లో పంపాను.చాలా మెచ్చుకుంది.అచ్చం లక్ష్మిదేవిలా ఉన్నావంది.మన పెళ్ళిలో కూడా నిన్ను చూసి ,చాలా మెచ్చుకుంది.ఇప్పుడు కూడా ఆవిడ మీ చెల్లెల్ని వాల్లబ్బాయికి అడగడానికే వస్తోంట.నీ అభిప్రాయం అదీ కనుక్కున్నాక మనమందరం వెళ్ళి మీ అమ్మానాన్నలతో మాట్లాడదాం.కనుక నువ్వు ఎప్పటిలానే నీలా చక్కగా తయారయ్యి వెళ్ళు.అసలు నీ కట్టూ ,బొట్టూ తీరు చూసే మీ చెల్లెల్ని తన కొడలిగా కావాలని పట్టుబట్టిందట.అని అతనేదో చెప్పేంటలో,అది కాదండీ , మీరు నన్ను పాత చింతకాయ పచ్చడనేవారుగా.అందుకని ఇవాళ అని ఆమె ఇంకా ఏదో చెప్పేలోపే,

సరే ,సరే డియర్. నేను ఇదివరలో అన్నమాటలు వెనక్కి తీసుకుంటున్నాను.ఇప్పుడు ఇంకేం మాట్లాడకు.ఉంటాను.అంటూ ఫోన్ పెట్టేశాడు.దాంతో చేసేది లేక,చీర కట్టుకుని ముఖానికి చిటికెడు పసుపు రాసుకుని ,జడ అల్లుకుని,పెద్ద బొట్టు పెట్టుకుని ,కాటుక దిద్దుకుని,జడలో పూలు పెట్టుకుని,బయటికి వచ్చి.అటూ ఇటూ చూసి ఆటొ పిలిచిందామె.ఆ పక్క వీధిలో పెళ్లి జరుగుతోంది.ఆ మండపం నుండి లీలగా ,అనుకున్నదొక్కటి ,అయినది ఒక్కటి అంటూ పాత పాట విన్పించసాగింది.అనుకోకుండా నవ్వొచ్చిందామెకి.అలా నవ్వుతూనే ఆటొ ఎక్కి రైల్వే స్టేషన్ చెప్పిందామె.                                                           


                                                         

 

 

 

 

 

మరిన్ని కథలు