Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
maleshiya

ఈ సంచికలో >> శీర్షికలు >>

చమత్కారం - భమిడిపాటిఫణిబాబు

chamatkaaram

గుర్తుండే ఉంటుంది, చాలామందికి—ఒకానొకప్పుడు మన ఇళ్ళలో గృహిణులు,  ఏ పిండివంట/ ఫలహారం చేయాల్సొచ్చినా, దేనికీ బయటకు వెళ్ళేవారు కాదు… వాటి కి అవసరమైన పిండి, మొరుం, లాటివి ఇంట్లోనే ఉండే, ఏ తిరగలో, లేక ఓ రుబ్బురోలుతోనో పని కానిచ్చేసేవారు… అంతదాకా ఎందుకూ, దంపుడుబియ్యం చేసికోడానికి పొలంనుండి వచ్చిన ధాన్యాన్ని,   శుభ్రంగా ఓ రోకలితో దంచేసేవారు…  ఈ పనులవలన  శుభ్రమైన తిండీ ఉండేదీ, వంటికి కావాల్సిన వ్యాయామమూ దొరికేది. ఆరోగ్యంగా ఉండేవారు.

కాలక్రమేణా, ఆధునిక విజ్ఞానం అభివృధ్ధి చెందడంతో, ప్రతీదానికీ , యంత్రసాధనాలొచ్చాయి. వాటిలో మొదటవచ్చినది- సాధారణ మిక్సీ (  Mixer ). దానికి , పిండిరుబ్బుకోడానికి ఓ పెద్ద జారూ (  Jar ),  కొత్తిమిరికారంలాటివి తయారుచేసుకోడానికి, ఓ చిన్న జారూ, తో  మొదలెట్టి, ఇప్పుడు , వివిధ రకాల బ్లేడ్ల (  Blades )  తోనూ  Food Processors వచ్చాయి. ఏ ఇంట్లో చూసినా, ఇవిలేకుండా ఉండే కిచెన్ లేదు.   ఈ రెండింటికీ మధ్య,  హొటళ్ళలో ఇడ్లీ పిండి రుబ్బడానికి, మెషీన్స్ కూడా వచ్చాయి. వాటిని మనవాళ్ళు ముద్దుగా “ రుబ్బింగ్  మిషన్ “ అని నామకరణం చేసేసారు.. ఎలాగైనా మనవాళ్ళు కొత్తకొత్త పేర్లు సృష్టించడంలో ఘనాపాఠీలే.
ఈ కొత్త సాధనాల ఉపయోగమైతే చాలా ఉంది. కరెంట్ ఉన్నంతకాలమూ ఇవి లక్షణంగా పనిచేస్తాయి, కానీ అకస్మాత్తుగా ఆ కరెంట్ కాస్తా పోతే.. ఏం చేయాలీ? మరీ  చెక్కాముక్కాగా ఉన్న ఇడ్లీపిండితో ఇడ్లీలు రావాయే, ఆఖరికి రొట్టె ముక్కగాకూడా  వేయలేరు. అందుకే, ఏవో వాడడానికి సౌకర్యంగా ఉన్నాయి కదా అని, మన పాత రుబ్బురోళ్లని, తిరగళ్ళనీ అశ్రధ్ధ చేయకూడదు. అవే చివరకి మన  rescue  కి వచ్చేవి…     

ధాన్యం మరపట్టించడానికి , పెద్ద పెద్ద రైసు మిల్లులొచ్చాయి.  అలాగే చిన్న స్కేలులో, గోధుమలు, కాకపోతే మిగిలిన పప్పులు  పిండి కొట్టించడానికైతే, ప్రతీ రెండు మూడు వీధులకీ పిండి మరలు వెలిసాయి. సాధారణంగా ఏ గోధుమలో పిండి చేయించడానికి, మనం ఓ అల్యూమినియం గిన్నెలో  బాగుచేసిన గోధుమలు, ఆ పిండిమరవాడికి ఇచ్చేస్తే మన పని అయిపోతుంది. కానీ రోజంతా, ఆ పిండిమరలో పనిచేసే అబ్బాయి మాటేమిటీ? ఒళ్ళంతా ఆ పిండి, ముక్కులోకీ, నోట్లోకీ ఆ పిండీ… వాడి ఆరోగ్యం దెబ్బతినేస్తూంటుంది.
 ఈ గొడవలన్నీ పక్కకు పెట్టి, ఇప్పుడు ఎక్కడచూసినా, ప్రతీదానికీ  రెడీ మిక్స్  (  Ready Mix )  లు వచ్చేసాయి. ఇళ్ళల్లో ఎన్ని సాధనాలున్నా, మసాలాలూ, పచ్చళ్ళూ తయారుచేసుకునే ఓపిక, సహనం, టైమూ ఈరోజుల్లో ఉండడంలేదు. ప్రతీదీ  Instant  గా కావాలి.  చారుపొడి దగ్గరనుంచి, గరం మసాలాలదాకా అన్నీ రెడీ మిక్స్ లే.  ఆ కంపెనీవాడు, వీటిని తయారుచేయడంలో , ఏవేం కలిపాడోఆ దేవుడిక్కూడా తెలియదు. పేరున్న కంపెనీలైతే కొంతకాకపోతే కొంతైనా జాగ్రత్తలు తీసికుంటాయి. కానీ ఈ రెడీ మిక్స్ ల వ్యామోహంతో జనాలు, ఏవి చవగ్గా వస్తే వాటికే మొగ్గు చూపుతున్నారు. అది అలుసుగాతీసికుని, కొంతమందైతే, రంపంపొట్టుక్కూడా రంగువేసేసి, ఏదో మిక్స్ పేరుపెట్టి అమ్మేస్తున్నారు. వాటిని వాడి, జనాలుకూడా ఎక్కడలేనీ కొత్తకొత్త రోగాల బారిన పడుతున్నారు.
మార్పు అనేది తప్పకుండా ఉండాలి… కానీ మనం తినే ఆహారపదార్ధాల విషయంలో మాత్రం, ఎంత చెప్పినా పాతపధ్ధతులే   బావుండేవనిపిస్తోంది… కనీసం ఆ పచ్చళ్ళు, పౌడర్లలో ఏవేం వాడేమో తెలిసేది.

సర్వేజనాసుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
spandinche gunam