Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమిస్తే ఏమవుతుంది

premiste emavutundi?

గత సంచికలోని ప్రేమిస్తే ఏమవుతుంది సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి...http://www.gotelugu.com/issue255/687/telugu-serials/premiste-emavutundi/premiste-emavutundi/

 

(గత సంచిక తరువాయి)... గాయత్రికి జీవితం అంధకారం అయినట్టు అనిపించింది.

కంట్లో నీటి చుక్క లేనట్టు బిగుసుకు పోయి, బిత్తర పోయి ఓ విగ్రహంలా కూర్చుంది. ఒడిలో పిల్లవాడిని పెట్టుకుని శూన్యంలో దేని కోసమో వెతుక్కుంటున్న దానిలా ఆమె కళ్ళు దిక్కులు చూడ సాగాయి.

ఈ పసివాడితో ఇలా ఒంటరిగా బతకమని రాశావా దేవుడా అనుకుంది. ఆమె అలా కూర్చోడంతో నర్సిమ్మకి జాలితో హృదయం కరిగి పోయింది. నెమ్మదిగా బుజ్జగిస్తూ అన్నాడు.. " వాడిని ఇంటికి తోల్కొచ్చేనీకి లేదు బిడ్డా.. నువ్వు చూడ లేవు.. దవాఖానా నుంచి గాడికే తిస్క పోవాలే.. కానీ వాని తల్లి, తండ్రులకు చెప్పాలే... లేకుంటే నిన్ను జెండా ఎక్కిస్తారు."

ఆ విషయం తనకి తెలుసు అనుకుంది గాయత్రి.

రమేష్ మరణ వార్త తెలియగానే జరిగే రభస ఆమె కళ్ళ ముందు మెదులుతోంది. అత్త గారు తనని జుట్టు పట్టుకుని కొట్టినా కొడుతుంది. అది ఎలా ఉన్నా ముందు ఈ పిల్లవాడి భవిష్యత్తు ఏంటి? ఎలా బతకాలి.

అమ్మా, నాన్న కనీసం ఇప్పుడన్నా ఆదరిస్తారా..

లేదు.. అసలు ఆదరించరు..

ఏమో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తన ఖర్మానికి వదిలేసెంత నీచులు కారు తన తల్లి,తండ్రులు... తప్పకుండా ఆదరిస్తారు..
అమ్మ, నాన్నల మనసు బాధ పెట్టినందుకు, కుటుంబ పరువు, ప్రతిష్టలు దిగజార్చినందుకు దేవుడు తనకి ఇలా అనేక విధాలుగా శిక్షలు వేస్తున్నాడు. తనని ఈ స్థితిలో చూసి పంతాలకు పోయేంత దుర్మార్గులా..

నరిసిమ్మ శ్రినివాసులుని, అతని భార్యని పిలిపించాడు.

అందరు గాయత్రిని ఓదార్చి  రమేష్ తల్లి తండ్రులకు ఆ దుర్వార్త తెలియ చేయాలని గాయత్రి దగ్గర హైదరాబాద్ లోని రమేష్ ఇంటి అడ్రస్ తీసుకున్నారు. అలాగే తన తల్లి, తండ్రులకు కూడా తెలియ పరచమని వాళ్ళ అడ్రస్ కూడా ఇచ్చింది.

అయితే గాయత్రి తల్లి, తండ్రులు ఇల్లు ఖాళి చేయడంతో వాళ్ళకి తెలియ చేసే అవకాశం లభించ లేదు.

రమేష్ తల్లి, తండ్రి ఆగ మేఘాల మీద వచ్చారు..

వస్తూనే దుర్గమ్మ గాయత్రిని శాప నార్ధాలు పెడుతూ గట్టిగా శోకాలు పెట్ట సాగింది..

నాయనో నా కొడుకో ... ఇందుకోరకే గి పిల్లని పెండ్లి చేసుకుని వచ్చినావురా. గీ దరిద్రపు మొకం దాన్ని ఎందుకు చేసుకున్నవురా .. నీకు నూరేల్లు అయి పోయేనా ... అంటూ శోకాలు పెడుతూ గాయత్రిని నోటికి వచ్చిన బూతులు తిట్ట సాగింది.

గాయత్రి నిర్ఘాంత పోయి కూర్చున్న చోటే శిలలా బిగుసుకు పోయి పోయింది.

తనేం చేసింది.. రమేష్ చావుకి తనెలా కారకురాలు ఆమెకి అర్ధం కాలేదు.. ఆవిడ ఎన్ని తిడుతున్నా, ఎంతగా తిడుతున్నా, మధ్య, మధ్యలో మొట్టి కాయలు వేస్తున్నా మౌనంగా భరించింది.

అయితే మనసులో అనేక ప్రశ్నలు, సందేహాలు సుళ్ళు తిరుగుతూ అంతర్మధనం మొదలైంది.

గంగరాజు మాత్రం గంభీరంగా అన్నాడు. " ఇప్పుడు నిన్ను మా కోడలిగా ఇంటికి తీసుకు వెళ్ళడం లాంటివి నేను చేయను.. ఆ బాబు మా మనవడు కాబట్టి వాడిని మాకు ఇచ్చి, నీ దారిన నువ్వు బతుకు. మా ఇంటికి రావద్దు... మాతో నీకు ఎటువంటి సంబంధం లేదు."
గాయత్రి అదిరి పడి చూసింది. బాబుని ఇవ్వాలా?

వాడు పుట్టినప్పుడు ఉన్న నిర్లిప్తత ఇప్పుడు లేదు.. ఆ స్థానంలో ఇప్పుడు మాత్రుత్వపు మమకారం ఉంది. గుండెలకు హత్తుకుని పాలు ఇస్తుంటే తన పేగు తెంచుకుని పుట్టిన ఆ చిన్నారి తండ్రి పట్ల వాత్సల్యం పొంగి పొర్లుతోంది. వాడికి స్నానం చేయించడం, పౌడర్ రాయడం, ఆడించడం, పాలు పట్టడం ఇలాంటి పనులన్నీ చేస్తుంటే గుండెల్లో ఎన్నడూ ఎరుగని అపూర్వమైన అనుభూతులెన్నో ఉక్కిరి బిక్కిరి చేసేవి.. వీడు మన కొడుకు అని రమేష్ గర్వంగా చెబుతుంటే వాడి మీద హక్కు, అధికారం, అన్నీ నావే కదా అనే ఒక భావం ..

అలాంటిది ఇప్పుడు వాడిని తను నవ మాసాలు మోసి, ప్రాణాలు ధార పోసి కన్న కొడుకుని వాళ్ళకి ఇవ్వడమా .. ఎంత మాత్రం కుదరదు.
గంగ రాజు వైపు నిశ్చలంగా  చూసింది. ఇవ్వనండి.. వాడు నా కొడుకు.. బాబు లేకుండా నేనెలా బతకనండి.. బతికి ఎం చేయను.. దయ చేసి ఆ మాట అనకండి ...

దుర్గమ్మ చివ్వున లేచింది.. ఇయ్యవా... నువ్వెవతివే ఇయ్యనికి .. నా మనమడు.. వాడు మా సొంతం ... అంటూ గుడ్డ ఉయ్యాలలో నిద్ర పోతున్న బాబు వైపు వేగంగా కదిలింది.

గాయత్రి విషయం అర్ధం చేసుకున్నదానిలా విసురుగా తను కూడా ఉయ్యాల వైపు వెళ్లి దుర్గమ్మ కన్నా వేగంగా వాడిని ఎత్తుకుని గుండెలకి హత్తుకుని కళ్ళల్లో నీళ్ళు సుళ్ళు తిరుగుతుంటే అంది. ఇవ్వను.. నా ప్రాణం పోయినా ఇవ్వను... నాకు ఎవరూ లేరు.. వీడిని కూడా దూరం చేసుకుని బతక లేను.

దుర్గమ్మ బలవంతంగా గాయత్రి చేతి లోంచి పిల్లాడిని లాక్కోడానికి ప్రయత్నిస్తూ కసిగా అంది.. సావు.. గంగలో దూకి సావు.. నీకే తిండి, నీల్లు లేక పాయే నా మనవనికేం పెడతావు.. ఎట్ల సాక్తవు .. నీ బతుకు సెడ.. నా కొడుకుని సంపినావు.. నా మనవిన్ని కూడా సంపుతవ.
గాయత్రి గట్టిగా అరిచింది " వద్దు. ఇవ్వను... వీడు నా కొడుకు ... దూరం జరగండి.. దగ్గరకు రావద్దు.. " అని అరుస్తూ గభాల్న వంట గదిలో దూరి తలుపు వేసుకుంది.

దుర్గమ్మ గట్టిగా తలుపులు బాత్తూ " తియ్యవే ... పాపిష్టి దానా .. తియ్యవే... దొంగ......" అంటూ బూతులు తిట్ట సాగింది. జరుగుతున్న రభస గుడ్లప్పగించి చూస్తున్న నర్సిమ్మ, శ్రీనివాసులు గాయత్రి కొడుకుని తీసుకుని వంట గదిలో దూరడం, దుర్గమ్మ రచ్చ చేయడంతో అప్పుడే స్పృహలోకి వచ్చిన వాళ్ళలా గంగరాజు దగ్గరకు వెళ్లి నెమ్మదిగా నచ్చచెబుతున్నట్టుగా చెప్ప సాగారు.

" అన్నా... ఆమె దుఃఖం లో ఉన్నది.. జర గీ ఇచారం నుండి బైట పదినంక మేము మంచిగ సందాయించి చెప్పి బాబుని మీకు ఇప్పిస్తం ... ఆమె కూడా చిన్నామే ... ఎట్ల సాక్తది... పిల్ల గాడిని మీకిచ్చి పెండ్లి చేసుకుంటే జర బద్రంగుంటది. ఇప్పుడు గీ లొల్లి ఆపి మీ కొడుకుకి చేయ వలసిన కార్యక్రమాలు జూడున్ద్రి ... నడువండి దవాఖానకు పోవాలె.."

గంగ రాజు అంతా విని తలూపి దుర్గమ్మ దగ్గరకు వెళ్లి నడు... ఈ సంగతి ఎన్కసిరి చూద్దాం అన్నాడు. దుర్గమ్మ కొడుకు పేరు ఎత్తగానే తిరిగి శోకాలు పెడుతూ గంగారాజుని అనుసరించింది. వాళ్ళు వెళ్ళగానే గాయత్రి తలుపు తీసుకుని బయటకి వచ్చింది.

గబా, గబా రమేష్ తనకి ప్రతి నెలా దాచమని ఇచ్చిన దబ్బు మూట తనవి, బాబువి బట్టలు, వాడి బొమ్మలు, ఫోటోలు అన్నీ ఒక పెద్ద గుడ్డ సంచిలో పెట్టింది. వంట సామాను, చాప, దుప్పట్లు రెండు ఒక అట్ట పెట్టెలో పెట్టింది. ఒక్క సారి వీధి లోకి వెళ్లి నాలుగు వైపులా కలయ తిరిగి చూసింది. బాబుని ఎత్తుకుని, సంచి, అట్టపెట్టె తీసుకుని బయలు దేరింది.

(మిగతా కథ వచ్చే శుక్రవారం .....)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
anveshana