కళ్యాణ్‌రామ్ - కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం 'ఎమ్యెల్యే'. 'ఎమ్మెల్యే' అంటే 'మంచి లక్షణాలున్న అబ్బాయి' అని అర్ధం ఈ సినిమాలో. పాపం ఈ మంచబ్బాయికి ఓ మంచి హిట్ కావాలిప్పుడు. 'పటాస్' సినిమా తర్వాత ఆ స్థాయి హిట్ అందుకోలేకపోయాడు కళ్యాణ్‌రామ్. దాంతో కళ్యాణ్‌రామ్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయని చెప్పాలి. ఇక్కడ గమనించాల్సిందేమంటే ఈ అంచనాలకు అసలు కారణం ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ జత కడుతోంది చందమామ బ్యూటీ కాజల్‌తో. కాజల్‌కి అసలే ఇప్పుడు గుడ్ టైం నడుస్తోంది. కాజల్ ఏది పడితే అది బంగారమైపోతోంది. 'ఖైదీ' సినిమా నుండి కాజల్‌కి తిరుగే లేదు. వరుస విజయాలతో దూసుకెళ్తోంది.
ఈ సంగతి పక్కన పెడితే, తమ్ముడు ఎన్టీఆర్‌తో కాజల్ నటించిన 'టెంపర్' చిత్రం మంచి విజయం అందుకుంది. అప్పటిదాకా వరుస ఫెయిల్యూర్స్‌తో ఉన్న ఎన్టీఆర్‌కి ఆ సినిమాతోనే హిట్ కళ ఆవహించింది. ఆ తర్వాత ఎన్టీఆర్ వరుస హిట్స్‌తో దూసుకొస్తున్నాడు. ఎన్టీఆర్ కోసమే కాజల్ అగర్వాల్ 'జనతా గ్యారేజ్' సినిమాలో స్పెషల్ సాంగ్‌లో నటించింది. ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది ఎన్టీఆర్‌కి. ఆ రకంగా చూస్తే, కళ్యాణ్‌రామ్‌కి 'ఎమ్మెల్యే'తో హిట్ కొట్టే ఛాన్స్ పుష్కలంగా ఉందనే చెప్పాలి. మరి ఎన్టీఆర్‌లా కాజల్ లక్ కళ్యాణ్‌రామ్‌కి కలిసొస్తుందో లేదో చూడాలిక. అన్నట్లు కళ్యాణ్‌రామ్‌కి కాజల్‌తో గతంలో 'లక్ష్మీ కళ్యాణం' రూపంలో హిట్ ఉన్న సంగతిని గమనించాలి.
|