Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
jeevacchavam

ఈ సంచికలో >> కథలు >> లవ్వు కాదు లస్టు

love kadu lastu

హోటల్లో లంచ్ ముగించుకొని ఆఫీసుకు తిరిగొచ్చిన సెక్షన్ ఆఫీసరు పిచ్చేశ్వర్రావ్ పిచ్చి పిచ్చి ఆలోచనలతో వూహా జగత్తులో విహరిస్తూ గుమ్మంలో కాలు పెట్టబోయి అక్కడే ఆగి డోరుప్రక్కన నిలబడి లోపల స్టాపు మధ్య జరుగుతున్న సంభాషణలను విన సాగాడు.
లోపల....

"ఏరా!మన సెక్షనాఫీసరు పిచ్చేశ్వర్రావు మేడం శ్రీ ప్రియను అర్థ పూట శెలవు పెట్టించి బైకులో తీసుకెళ్ళింది చూశావుగా! ఎందుకైయుంటుంది?"అన్నాడు ఒకడు.

"బహుశా ఏదేని ప్రోగ్రామ్ వేసుకున్నారేమో!"ఇంకొకడు.

"చీ...అలా అనుకోకండి..మేడం గారిని వెంటనే రమ్మని వాళ్ళింటి నుంచి ఫోనొస్తే వెళ్ళింది పాపం" మరొకడు.

"నాకలా అనిపించటంలేదు బాస్ !.ఇద్దరి మధ్య ఏదో నడుస్తోంది.కాకపోతే ఇద్దరూ లంచ్ కని చెప్పి మనల్ని మభ్యపెట్టి బైకులో తుర్రుమంటారా? పిచ్చేశ్వర్రావ్ కు  ఆవిడమీద పిచ్చి" 

"అది నిజమే!కాకపోతే ఈవిడగారు .ఫైళ్ళన్నీ తీసుకెళ్ళి ఆయన గారి ముందు పడేస్తే ఆయనగారు  మనలా ఓ గుమాస్తా లెవల్లో చక్కగా డిస్ పోస్  చేస్తాడు"

"అది ఆవిడగారి  తెలివమ్మా!"

"నిజమేనేమో! కాని...వాళ్ళిద్దరూ  ఒకరినొకరు చూసుకోవడం చిన్నగా చిలిపిగా నవ్వుకోవడం తప్ప ఆ కోణంలో...అదే ఆ 'ప్రేమ' అన్న కోణంలో మాట్లాడుకున్నట్టు నేను చూడలేదు"

"ఏదేమైనా... మన ఆఫీసరు పిచ్చేశ్వర్రావుకు  శ్రీప్రియమేడంకు బ్రంహ్మండమైన లింకు,ప్రేమ,ప్యార్ , కాదల్ వుంది "అని మొదటి వాడు అంటూనే అందరూ నవ్వారు.

ఓ నిముషం  తరువాత ఒకడు"అదే నిజమైతే ఆ మేడంకు పండగే పండగ.ఆవిడ ఆఫీసుకు ఎప్పుడైనా రావచ్చు.ఎప్పుడైనా పోవచ్చు"మళ్ళీ నవ్వాడు.

"అవునా! అలా అని మేడం నీతో చెప్పిందా?" నాలుగోవాడు.

" వాలకం చూస్తే తెలియట్లా?నిజం చెపుతున్నా... ఆ అదృష్టం నన్ను వరించలేదని బాధ పడుతున్నారా! అవును.లవ్వాడ్డానిక్కూడా అదృష్టం కావాలమ్మా! నల్లగా, పళ్ళెత్తుగా, పొట్టిగా వున్న మన పిచ్చేశ్వర్రావుకి ఇది లక్కే మరి!"

నల్లగా,పొట్టిగా, పల్లెత్తుగా అన్న మాటలు గుమ్మం వద్ద నిలబడి వున్న పిచ్చేశ్వర్రావు చెవిన పడుతూనే తట్టుకోలే గట్టిగా దగ్గాడు.అది గమనించిన స్టాపు గబగబా వెళ్ళి వాళ్ళ సీట్లలో కూర్చొని ఫైళ్ళను ముందేసుకున్నారు.

పిచ్చేశ్వర్రావు హీరోలా పోజెట్టుకొని గంభీరంగా అందర్నీ చూస్తూ లోనికి నడిచి వెళ్ళి తన సీట్లో కూర్చొన్నాడు. తనకూ శ్రీప్రియకు లవ్వుందని స్టాపు అనుకోవడాన్ని మనసులోనే సమర్థించుకొని గర్వంగా ఫీలయ్యాడు.అది ఆఫీసన్న సంగతి ఒక్క నిముషం మరచిపోయి జేబులోని హాంకిని తీసుకొని ముఖం తుడుచుకొని  ఇంకో జేబులోంచి దువ్వెన తీసి తల దువ్వుకొని కాగితపు  మడతలో చుట్టుకొచ్చుకున్న పౌడరును ముఖానికి పూసుకొని  తీరుబడిగా తనకు స్టాపుకు మధ్య నారద పాత్రను వహించే  ప్రియ పాత్రుడు(పని తెలియని దద్దమ్మని అప్పుడప్పుడు దెప్పేస్తుంటాడు), స్థూలకాయుడైన శంకరాన్ని  టెండరు ఫైలు తీసుకొని క్యాబిన్ కు రమ్మని పిలిచాడు.ఈ తతంగాన్నంతా స్టాపు క్యాబిన్ అద్దాల్లోంచి చూస్తున్నారు.

శంకరం  ఫైలు తీసుకొని పాత తరం నటుడు రేలంగిలా  అడుగులో అడుగు వేసుకొంటూ తన వద్దకు వచ్చి ఫైలును టేబుల్ మీద వుంచాడు "టెండరు ఫైలుసార్ "అంటూ.

పిచ్చేశ్వర్రావు బ్రహ్మానందం లెవెల్లో నవ్వి టెండరు ఫైలును పక్కన పెట్టి  "నేను పిలిచింది ఫైలుకోసం కాదు శంకరం!ఇందాక మా ఇద్దరి గురించి...అదే నన్నూ, శ్రీప్రియను గురించి మీరంతా ఏం మాట్లాకున్నారో నువ్వు చెబితే వినాలని వుంది" అన్నాడు మెలికలు తిరిగి పోతూ.
శంకరం ' ఏరా!అందరి ముందు నన్ను పని తెలియని దద్దమ్మా అని అవమాన పరుస్తూ ఇప్పుడు నీకు శ్రీప్రియ మేడంమ్మీద అర్థాంతరంగా పుట్టుకొచ్చిన నీ ప్రేమను గూర్చి స్టాపు ఏమనుకొంటున్నారో చెప్పాలా? నీకు ఈ వయస్సులో లవ్వు.. అబ్బో !కాస్త అందంగా వుంటే ఆకాశంలో నడిచేవాడివే!స్టాపు మాట్లాడుకొంది నా నోటారా చెపితే వినాలా! చెబుతానురా దరిద్రుడా!...ఏదో ఒకటి చెప్పి ఆ మేడం చేత చెప్పుదెబ్బలు తినేలా కాకపోయినా... కనీసం చీవాట్లు పెట్టేలా చేస్తాను' అని మనసులో అనుకొని అటూ ఇటూ దిక్కులు చూసి  పిచ్చేశ్వర్రావుకి ఎదరే వున్న కుర్చీలో కూర్చొన్నాడు.మామూలప్పుడైతే నిలబడే వుంటాడు శంకరం.ఇప్పుడు పరిస్థితి వేరైనందున టీవిగా కూర్చొన్నాడు.ఏమీ అనలేక పోయాడు పిచ్చేశ్వర్రావు..

"చెప్పు శంకరం!ఏం మాట్లాడు కున్నారో ఈ చెవులకు కాస్త ఇంపుగా చెపుతావనుకుంటే మౌనంగా వున్నావేంటి?! నువ్వు  చెపితే వినాలని వుంది"అన్నాడు గోముగా సిగ్గుపడుతూ.

"అదే సార్ !శ్రీ ప్రియ మేడం మిమ్మల్ని ప్రేమిస్తోందని అందరూ అనుకొంటున్నారు!మీ ఇద్దరికి ఈ వయస్సులో  కురర్రాల్లకున్నంత వూపుందనుకొంటున్నారు"మెల్లగా చెప్పాడు శంకరం.

"అంటే మా లవ్వు అందరికీ తెలిసి పోయిందన్నమాట."

"ఆఁ...మీ ఆవిడకు, వాళ్ళాయనకు తప్ప"

"అబ్బా...మధ్యలో వాళ్ళ సోదెందుకూ!ఇదిగో... ఈ లవ్వు ఎలా మొదలైందంటావ్ !తను అప్పుడప్పుడు  ఫైళ్ళలో సందేహాలున్నాయ్  క్లియర్ చెయ్యండి సార్ అంటూ వస్తుంది.అలాంటి సమయాల్లో మా ఇద్దరి చేతులు రాసుకోవడాలతో ప్రారంభమై అదికాస్తా ముసిముసి నవ్వులు,చెణుకులతో, చిన్నచిన్న లవ్వు డైలాగులతో  వూపందుకొని ఆవిడ పైట జారడాలు నేను చూడడాలన్నంత  క్లోజ్ గా జరుగుతోందిప్పుడు.నేను కూడా ఎంతో నాజూగ్గా తగిలి తగలనట్టు, ముట్టి ముట్టనట్టు పొడి పొడిగా చిన్నచిన్న సెక్సు పదాలని వాడుతూ ఇందాక తెచ్చాను శంకరం !"

"డౌటే లేదు సార్! అది ప్రేమే!అది ఆల్ రెడీ మీ ఇద్దరి మధ్య నడుస్తోంది.ఏదేమైనా తను ఆడది కనుక మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు  ముందే చెప్పలేక పోతోంది. సార్ ! మీరే బరస్టుఅవ్వాలి...అంటే మీరే మొదట చెప్పాలి!"అన్నాడు శంకరం  తన మాటల్ని న్యాయ పరుస్తూ.

"ఎలా శంకరం?నాకూ భయంగా వుందోయ్ !"

"భయమెందుకు.వెరీ సింపుల్  సార్ !దానికి మీరో  కీలకమైన చిన్న టెస్టు పెట్టండి చాలు"

"టెస్టా!ఏమిటది?"

"నేను చెపుతానుగా! రేపు ఎవ్వరికీ తెలీకుండా ఓ గులాబిని, ఓ కాగితం ముక్కమీద ఒన్ ఫోర్ త్రీని రాసి రెంటిని ఆవిడ టేబుల్ మీద వుంచండి.తను ఆఫీసుకు వస్తూనే ఆ టేబుల్ మీదున్న గులాబిని తీసుకుని కాగితం  మీదున్న1,4,3ని చదువుకొని ఆ  గులాబిని తల్లో తురుముకొని మిమ్మల్ని చూసి  నవ్విందంటే ... అంతే... అంతా అయి పోయినట్టే! మీ లవ్వులో తను ఇరుక్కున్నట్టే!ప్రయత్నించండి సార్ !అన్నాడు శంకరం.

"భలే...ఎంచక్కా మంచి సలహానిచ్చావు శంకరం.ఇదిగో!ఇలా రాసి టేబుల్ మీద వుంచితే చాలా!"అంటూ పెన్నుతో చిన్న కాగితం ముక్కమీద 143 రాసి చూపాడు శంకరానికి.

"అయ్యో రామా! 1,4,3 కి అర్థం తెలియని మీరు ఎలా కాలేజీలో చదివారు సార్ ?,ఉద్యోగానికెలా వచ్చారు?,పెళ్ళెలా
చేసుకున్నారు?పిల్లల్నెలాకన్నారు సార్ ?"కాస్త వాల్యూం పెంచి ప్రశ్నలను సంధించాడు.

"ఇస్సు. అరవకయ్యా బాబూ! మేటర్ లీకై నలుగురి చెవినా పడుతుంది!"శంకర్ చేయి పట్టుకున్నాడు.

'అప్పుటికి వీరు శ్రీ ప్రియను ఆశ పడుతుంది ఎవరికీ తెలీనట్టు బోడి'అని మనసులో అనుకొని"ఒకే సార్! !ఇదిగో...1,4,3 అంటే ఐ.లవ్ .యూ. అని అర్థం.అని కాగితంమ్మీద ఇంగ్లీషులో రాసి చూపి నలిపి నోట్లో పెట్టుకొని నమిల మింగి"అర్థమైందా...ఎటూ కోడి కెలికినట్టు  చిందరవందరగా వుండే మీ దస్తూరి ఆవిడకు బాగా తెలుసు కనుక ఒకే ఒక్క గులాబి, ఐ.లవ్ .యూ అన్న ఈ ఎనిమిది అక్షరాలు మీ  ప్రేమను సక్సస్ చెస్తాయి.ఆ తరువాత చూడు  నా సామిరంగా ఆవిడ వాళ్ళాయన్ను, మీరు మీ ఆవిడ్ను బురిటీ కొట్టీ హోటళ్ళు, బీచీలు,పార్కులు,సినిమాలని తిరుగుడే తిరుగుడు. హేప్పీసే హేప్పీసు" అంటూ ఓ చిన్న వివరణ యిచ్చి వూపిరి పీల్చుకున్నాడు శంకరం.

"అబ్బా...నీ నోటిని తీపి చెయ్యాలి శంకరం"అంటూ వుత్తేజానికి గురై పై పళ్ళతో పెదాలను నొక్కుకొని బల్లను గుద్ది చెయ్య నొప్పెట్టగా 'అబ్బా' 'అని షుగరు డవునైతే  చప్పరించటానికి తెచ్చుకున్న చాక్ లెట్టొకటి శంకరం చేతికిచ్చాడు.

చాక్ లెట్టు తీసుకొన్న శంకరం నవ్వుకొంటూ తిరిగి చూడకుండా వెళుతుంటే పెద్దగా "థాంక్సు శంకరం" అన్నాడు పిచ్చేశ్వర్రావు.ఆ శబ్దానికి స్టాపు మొత్తం క్యాబిన్ వేపుకు చూశారు.సిగ్గు పడ్డాడు పిచ్చేశ్వర్రావు. తనెందుకు సిగ్గు పడ్డాడో స్టాపుకు అర్థమైంది.

మరుసటి రోజు....

యధా విధిగా అందరూ ఆఫీసు పనిలో నిమగ్నమై వుండగా పిచ్చేశ్వర్రావు పావుగంట లేటుగా వచ్చి దొంగలా  ఎవరైనా చూస్తారేమోనన్న భయంతో అటూ ఇటూ చూసి "ఐ.లవ్ . యూ, అన్న పదాలను ముందే రాసి వుంచిన  కాగితాన్ని జేబులోనుంచి తీసి శ్రీ ప్రియ టేబుల్ మీద వుంచి దానిపై ఓ గులాబి పూవ్వును పెట్టి త్వరత్వరగా వెళ్ళి తన క్యాబిన్లో కూర్చొన్నాడు.

మరో పావు గంట తరువాత శ్రీ ప్రియ ఆదరా బాదరా ఆఫీసులోకి ప్రవేశించింది.అప్పుడు ఆమె తల్లో తురుముకున్న బండెడు మల్లెపూల గుభాలింపు గది మొత్తం అలుముకోగా ఒక్కసారిగా స్టాపు మొత్తం ఆమేకేసి చూశారు. అందరికీ ఓ చిరునవ్వు విసిరి బ్యాగును ప్రక్కనున్న టీపాయి మీద పెట్టి సీట్లో కూర్చొని ఎదరే టేబుల్ మీదున్న గులాబీని,దాని క్రింద వున్న కాగితాన్ని చూసింది.చేతికి తీసుకొని  మనసులోనే ఆ మూడు పదాలను చదువుకోని వెంటనే వుగ్రురాలై పోయి లేచి స్టాపు మొత్తాన్ని ఒక్కసారి చూసింది. తమాయించుకొని  మౌనంగా కూర్చొంది.ఆ గులాబిని, మూడు పదాలను రాసి వుంచిన కాగితాన్ని తన టేబుల్ మీదవుంచింది పిచ్చేశ్వర్రావేనని కోడి కెలికినట్టు రాసిన అక్షరాలను చూసి  ఇట్టే గుర్తించింది.అప్పుడే క్యాబిను కెళ్ళి నిలదీసి నాలుగు చీవాట్లు పెట్టాలనుకొంది. ఆఫీసు సమయంలో అలా చేయడం సంస్కారం కాదనుకొని కూర్చుండి పోయింది.ఈ తతంగాన్నంతా అద్దాల్లోంచి దొంగ చూస్తున్నట్టు చూస్తున్న పిచ్చేశ్వర్రావు కిమ్మనకుండా తల వంచుకొని ఫైళ్ళను చూస్తూ వుండి పోయాడు ఎవ్వరినీ తన క్యాబిన్ కు పిలవకుండా.

శ్రీప్రియ కూడా రోజంతా మూడ్ అవుట్లో వుండి కనీసం లంచ్ కూడా తీసుకో కుండా మనసులోనే తిట్టుకొంటూ అప్పుడప్పుడు  క్యాబిన్ వేపే చూస్తూ వుండి పోయింది.

సాయంత్రం అయిదున్నరకల్లా ఆఫీసు ఖాళీ అయ్యింది.ఇక మిగిలి వుంది పిచ్చేశ్వర్రావు,ప్యూన్,శ్రీ ప్రియ.

శ్రీప్రియ అన్ని సర్దుకుంది.కుర్చీని బలంగా వెనక్కు నెట్టి పైకి లేచింది.ఆ శబ్దానికి భయపడి,బిత్తరపోయి అద్దాల్లోంచి బయటికి చూశాడు పిచ్చేశ్వర్రావు.అప్పుడు నిత్యం తన కళ్ళకు  ఎంతో అందగత్తెగా కనబడే శ్రీప్రియ మహంకాలైనట్టు అనిపించింది.

శ్రీప్రియ తిన్నగా గదిలోకి వచ్చింది.అలికిడికి తల పైకెత్తి చూశాడు పిచ్చేశ్వర్రావు.

"రా ప్రియా కూర్చో!ఇవ్వాలంతా నువ్విటు రాలేదేంటి?"అన్నాడు ఏమీ తెలియనట్టు.

"చాలు సార్ ! మీ లాలనతో కూడికొన్న తియ్యటి కబుర్లను ఇవాల్టితో ఆపండి.అసలు ఇవాళ మీరు చేసిన పనేంటి?"అడిగింది శ్రీప్రియ.

"నేనేం చేశాను?ఎందుకలా కోపంగా కటువుగా వున్నావ్ !"అమాకుడిలా అడిగాడు.

"అమాయకుడిలా అడక్కండి.నేను మీతో మంచిగా ప్రవర్తించాను.  ఎన్నోసార్లు మీతో లంచ్ కొచ్చాను. మా కుటుంబం విషయాలు మాట్లాడాను.కొన్ని సందర్భాల్లో నా భర్తతో  మనస్పర్థలు వస్తే వాటిని కూడా మీతో చెప్పుకోని మీ సానుభూతిని పొందాను.అంత మాత్రాన అదేదో నాకు సంసారంలో చెప్పుకోలేని బాధలున్నట్టు, నాకూ నా భర్తకు పడనట్టు వూహించుకొని, వాటిని అలుసుగా తీసుకొని మీకు లొంగి పోతానని మీకు మీరే భావించుకొని ఇవాళ పిచ్చిగా యిలా చేయటం బాగోలేదు.మీతో చనువుగా వుండి నా బాధలన్నీ చెప్పుకొన్నానంటే... మిమ్మల్ని నా అన్నయ్యగా భావించుకొనే!"

అంతలో"అదికాదు ప్రియా!నేను...."ఏదో చెప్పబోయాడు పిచ్చేశ్వర్రావు అప్పటికే చెమటలు పట్టిన ముఖాన్ని తుడుచుకొంటూ.
"బస్ !ఇంకేమీ మాట్లాడకండి సార్ !.మనిద్దరికి కాలేజీ చదువులకు వెళ్ళే పిల్లలున్నారు.మీ పిచ్చి కాకపోతే ఈ వయస్సులో మీకు నామీద లవ్వా...కాదుసార్ !దాన్ని లస్టంటారు..దయచేసి అలాంటి మీ పిచ్చి ఆలోచనలకు ఇప్పుడే సమాధి కట్టండి. స్టాపు మధ్య మంచి ఆఫీసరుగా పేరు తెచ్చుకొండి.నా పట్ల రక్తం పంచుకు పుట్టిన అన్నయ్యలా నడుచుకొండి.గతానికి ఈ క్షణమే పుల్ స్టాపు పెట్టండి"అంటూ బరబరా వెళ్ళి పోయింది శ్రీప్రియ.

అలాగే ఆమె వెళుతున్న వేపు చూస్తున్న పిచ్చేశ్వర్రావును ఎవరో గట్టిగా  చెంపలను వాయించి బుధ్ధి గరిపిట్టుగా ఫీలయి అలాగే సీట్లో కూర్చొని జరిగిందంతా ఒకసారి నెమరు వేసుకొని నిట్టూర్చి రేపటినుంచి మారిన మనసుతో కొత్త మనిషిగా ఆఫీసుకు రావాలని నిర్ణయం తీసుకున్నాడు.

మరిన్ని కథలు