Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అన్వేషణ

anveshana

గత సంచికలోని అన్వేషణ సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి... http://www.gotelugu.com/issue257/692/telugu-serials/anveshana/anveshana/

(గత సంచిక తరువాయి)... రెండో వాడు ముసలమ్మ గుండెల్లో కత్తి దించుతున్నాడనగానే మొదటి వాడు గబుక్కున క్రింద కూర్చుని ముసుగు తన్ని పడుకున్న ముసలవ్వని అలాగే ఒడిసి పట్టుకున్నాడు. నిస్సహాయంగా కాళ్ళు గిజ గిజా తన్నుకుంటూ చిన్న మూలుగు మూలిగి తల వాల్చేసింది ముసలవ్వ.

‘‘పద! ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండ కూడదు.’’ అంటూ రెండో వాడు ముసలమ్మ గుండెల్లో నుండి కత్తి సర్రున బయటకు లాగి కొండ దిగువకు వెళ్ళే మెట్ల దారి కేసి నడిచాడు.

‘‘ముసుగు తీసి చూద్దామా? చచ్చిందో...ఇంకా కొన ఊపిరితో ఉందో....’’ అన్నాడు మొదటి వాడు.

‘‘ఈ జగ్గు గాడు పొడిస్తే ఒక్క పోటే చాలు. అవతలి వాడు గిల గిలా తన్నుకు చావడానికి. ఇదో లెక్కా? నసక్కుండా రా.’’ అంటూ మొదటి వాడి చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళి పోతూ అన్నాడు రెండో వాడు.

ముసలమ్మని అతి కిరాతకంగా చంపడం చూస్తూనే భయంతో బిక్క చచ్చి పోయింది ఆమె. వాళ్ళ సంభాషణను బట్టి వచ్చిన వాళ్లిద్దరూ కిరాయి హంతకులని అర్ధమైంది ఆమెకి. ఎవరు వాళ్ళు?! ఎందుకు ముసలమ్మని అంత కిరాతంగా చంపేసారు! మనసులోనే మూగగా రోదించింది ఆమె. వాళ్ళిద్దరూ గబ గబా మెట్లు దిగి వెళ్లి పోవడం గమనిస్తూనే నెమ్మదిగా చెట్టు చాటు నుండి బయటకు వచ్చింది ఆమె.
అప్పటికే హంతకులు ఇద్దరూ ఆకాశ ధార దాటి క్రిందకు దిగి వెళ్లి పోయారు. నెమ్మదిగా ముసలవ్వ పడుకున్న చెట్టు దగ్గరకు వెళ్లింది. ముసమ్మ తల దగ్గర పడి ఉన్న తన నేత చీర తీసుకుని  ఉండలా చుట్టి చేత్తో పట్టుకుని అక్కడ నుండి క్రిందకు దిగింది.
ఏం చేయాలో? ఎటు వెళ్ళాలో అర్థం కావడం లేదు ఆమెకు. మెట్ల దారిలో, హంతకులిద్దరూ క్రిందకు దిగుతున్నారు. ఆ దారిలో వెళ్ళడం ప్రమాదం’ అనుకుంటూ కొండ బస్సు స్టాండ్‌ దగ్గరకు చేరుకుంది ఆమె.

కొండ బస్సు స్టాండ్‌ అంతా నిర్మానుష్యంగా ఉంది. అక్కడే నిలబడి ఒక్క క్షణం సింహాద్రి అప్పన్న స్వామి వారి గాలి గోపురం కేసి చూసింది ఆమె.

ఆలయం చుట్టూ వెలుగుతున్న హైమాక్స్‌ లైట్ల వెలుగులో గాలి గోపురం ప్రాంతం అంతా సుందరంగా దేదీప్యమానంగా కనిపిస్తోంది.
దూరంగా ఎక్కడో గూర్ఖా గస్తీ తిరుగుతున్నట్టున్నాడు. ఉండుండీ గట్టిగా ‘ఈల ’ ఊదుతున్న శబ్దం వినిపిస్తోంది.

ఇక కొండ మీద ఉండకూడదనుకుంది ఆమె. మెట్ల దారిలో దిగడం కూడా ప్రమాదమే అనుకుంటూ రోడ్డు మార్గంలో నడిచి వెళ్ళడమే మంచిదనుకుంటూ ఘాట్‌ రోడ్‌ కేసి నడిచింది ఆమె. బంతిలా గుండ్రంగా చుట్టిన చిరిగిన చీర చేత్తో పట్టుకుని ఘాట్‌ రోడ్‌లో కొండ దిగువకు నడక ప్రారంభించింది ఆమె. పాములా మెలికలు తిరిగి ఉన్న రోడ్డు మీద రోడ్డుకు అటూ ఇటూ ఉన్న కరెంటు స్తంభాల వెలుగులో నెమ్మదిగా నడుస్తూ ఆలోచిస్తోంది ఆలోచిస్తూ నడుస్తోందే గానీ ఆమె మనసు మనసులో లేదు. పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ ఆగి ఆగి నడుస్తోంది.
ఉన్నట్టుండి ఏదో గుర్తొచ్చినట్టు ఉలిక్కి పడి చేతిలో ఉన్న చీర కేసి చూసుకుంది ఆమె.

అంతే! ఉండలా చుట్టిన కాటన్‌ చీరని బంతిలా బంగా ఘాట్‌ రోడ్డును ఆనుకుని ఉన్న లోయలాంటి మామిడి తోట లోకి విసిరేసింది ఆమె.
ధ్యేయం నెరవేరే వరకూ...తన అన్వేషణ పూర్తయ్యే వరకూ.... ఏ శక్తీ తనని అడ్డుకో లేదు’ దృఢంగా మనసులో తనకి తనే ధైర్యం చెప్పుకుంటూ గుండెల్నిండా గాలి పీల్చుకుని ధీమాగా అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకి నడిచింది ఆమె.

******

తెల్లారే సరికి కొండ కొండంతా గుప్పుమంది. ఉదయాన్నే శ్రీస్వామి వారి సుప్రభాత సేవకు వచ్చిన అర్చకులు గర్భాలయంలో అడుగు పెట్టక ముందే  ఆ వార్త దావానలంలా కొండంతా ఆక్రమించేసింది.

రాత్రంతా వ్యాపారంలో అలసి సొలసిన వ్యాపారస్థులు కొందరు ఇళ్లకు వెళ్లి పోగా చాలా మంది తమ తమ దుకాణాల ముందే మేను వాల్చి సేద దీరుతున్నారు. ఉన్నట్టుండి గూర్ఖా గావు కేక సింహ గిరి శిఖరమంతా ప్రతిధ్వనించింది. దేవాలయం చుట్టూ ఆక్రమించిన కొండ కోనలన్నీ కంపించి పోయినట్టు అరిచాడు గూర్ఖా.

కొండ మీద ఆలయం చుట్టూ పహరా కాస్తూ తిరుగుతున్న గూర్ఖా అన్నదానం బిల్డింగ్‌ చుట్టు ముట్టి మర్రి చెట్టు దగ్గర కొచ్చేసరికి ఎవరిదో మూలుగు విన్పించింది. అనుమానంగా చెవులు రిక్కించి విన్నాడు.

అప్పటికే స్వామి వారి సుప్రభాత సేవకు ఆలయానికి అర్చకులు వచ్చే వేళయిందని త్వర త్వరగా పని ముగించుకుని ఆలయం దగ్గరకు చేరుకోవాలనుకున్నాడు గూర్ఖా. ఉండుండీ ‘ముసలమ్మ మూలుగు’ ఆ నిశ్శబ్ద నిశీధిలో అతి భయంకరంగా విన్పిస్తోంది.
మర్రి చెట్టు చుట్టూ కట్టిన సిమ్మెంటు చప్టా మీద ముసుగు తన్ని పడుకున్న వ్యక్తి ఎవరో మూలుగుతున్నారని గ్రహించాడు గూర్ఖా.
గాబరాగా అక్కడకు వెళ్లి టార్చి వేసి చూసాడు. టార్చి వెలుగులో ఎవరో శాలువా ముసుగార కప్పుకుని మూలగ లేక మూలుగుతున్నారు. చేతిలో ఉన్న పొడవాటి కర్రతో ‘శాలువా’ తొలగించి చూసాడు.

శాలువా కప్పుకున్న ముసలమ్మ బాధగా మూలుగుతూ కొన వూపిరితో కొట్టుకులాడుతోంది. అప్పటికే కత్తి పోటు వలన బాగా రక్తం స్రవించి సిమ్మెంటు చప్టా మీద రక్తం దారలా కారుతోంది. టార్చి వెలుగులో ముసలమ్మని తేరిపారా చూసాడు గూర్ఖా. అప్పటికే గూర్ఖా కేసి బేలగా చూస్తూ ప్రాణాలు వదిలేసింది ముసలమ్మ.

టార్చి వెలుగులో రక్తంతో తడిసి ముద్దయిన ముసలమ్మ వాలకం చూడగానే అదిరి పడి కెవ్వున అరిచాడు. గబ గబా కొండ బస్సు స్టాండ్‌ దగ్గరకు చేరుకుని వర్తకులందర్నీ కేకలేసి లేపాడు గూర్ఖా.   

అదే సమయంలో కొండ దిగువ నుండి అర్చకులను మోసుకుంటూ వచ్చి ఆగింది బస్సు. ముసలమ్మ చావు కబురు వినగానే అర్చకులు, వర్తకులు హుటాహుటిన పోలీసులకు ఫోన్‌ చేసారు. కొందరు కొండ దిగువనే ఉన్న దేవస్థానం అధికారులకు విషయం చేర వేసారు.
ముసలమ్మ గుండెల్లో ఎవరో కత్తితో పొడిచి చంపేసారన్న వార్త తెలియడంతో అందరూ భయంతో ఆ దరి దాపులకు వెళ్ళలేదు. దూరం నుండే గుంపులు గుంపులుగా నిలబడి చూస్తుండి పోయారు.

ముసలమ్మ శవాన్ని అక్కడ నుండి తరలించే వరకూ దేవాలయంలో పూజా పునస్కారాలు నిర్వహించ కూడదని అర్చకులు తిరిగి బస్సులో ఇళ్లకు వెళ్లి పోయారు.

ఆలయ ప్రాంగణంలో ఎవరు మరణించినా ఆ ‘శవం’ దహన సంస్కారాలు పూర్తయ్యే వరకూ గుడి తలుపులు తెరవరు. ఆ తర్వాత ఆలయమంతా సంప్రోక్షణ చేసాక గాని పూజాది కార్యక్రమాలు నిర్వహించరు. భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కలుగదు.
కొండ మీద హత్య జరిగిందన్న వార్త చేరడం తోనే గోపాలపట్నం పోలీస్‌ స్టేషన్‌ నుండి ఎస్సై, నలుగురు కానిస్టేబుల్స్‌ హుటాహుటిన వచ్చి చేరుకున్నారు. అప్పటికే తెల్లారి పోయింది. భక్తులు తండోపతండాలుగా మెట్ల దారిలో కొండ పైకి చేరుకుంటున్నారు. యాత్రీకులను ఎవరినీ మర్రి చెట్టు దరి దాపులకు రానివ్వకుండా పోలీసులు పహరా కాస్తున్నారు.

సిమ్మెంటు చప్టా మీద ఉంది ముసలమ్మ శవం. శాలువా అంతా రక్తసిక్తమై ఉంది. సిమ్మెంటు చప్టా మీద దారలా చారులు కట్టి వుంది రక్తం.
నలుగురు పోలీసులు చుట్టూ పహరా కాస్తున్నారు. ఎస్సై అక్బర్‌ ఖాన్‌ నేరుగా వెళ్లి ముసలమ్మ మీద కప్పి ఉన్న శాలువాని లాఠీతో పూర్తిగా తప్పించి చూసాడు.

‘డెబ్భై ఏళ్ళకి పైబడే ఉంటాయి ముసలమ్మకి’ అనుకున్నాడు. ఇలాంటి ముసలమ్మని చంపాల్సిన అవసరం ఎవరికుంది? మనసులోనే అనుకుంటూ చుట్టు ప్రక్కల అంతా నిశితంగా పరిశీలించి చూసాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

క్రిందంతా రాళ్లు తేలి ఉన్నాయి. అన్నదానం భవనం వెనుక గోప్యంగా ఉందా స్థలం. ఎత్తుగా ఎదిగిన చెట్లు గుబురుగా అల్లుకుని ఉన్నాయి. ఎస్సై అక్బర్‌ ఖాన్‌ వెనుకే వినయంగా నిలబడ్డాడు గూర్ఖా. ఎస్సై అడగక ముందే తాను చూసిన సంఘటన అంతా వివరిస్తూ చెప్తున్నాడు. గూర్ఖా చెప్పిందంతా వింటూనే పరిసరాలని సున్నితంగా గమనిస్తున్నాడు ఎస్సై.

అడుగులో అడుగు వేసుకుంటూ క్రిందంతా క్షుణ్నంగా పరిశీలిస్తూ ఆ ప్రాంతం అంతా కలియ తిరిగాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.
ఇంతలో దేవస్థానం ఈవో రాఘవేంద్ర స్వామి అక్కడకు వచ్చి చేరుకున్నారు. ఆయన వెనుక ఆలయ అధికారులు పేషికార్‌, ఖరోడా, హవల్దార్‌ను వెంటపెట్టుకు వచ్చారు.

ఈవో రాఘవేంద్ర స్వామి వస్తూనే ఎస్సై అక్బర్‌ ఖాన్‌తో అన్నాడు.

‘‘ఎస్సై గారూ! త్వరగా మీ ఫార్మాలిటీస్‌ అన్నీ పూర్తి చేసి శవాన్ని ఇక్కడ నుండి తరలించండి. ఆలయంలో స్వామి వారికి పూజా కార్యక్రమాలు ఆగిపోయి భక్తులకు దర్శనాలు ఆపేయ్యాల్సి వచ్చింది. దయ చేసి శవ పంచనామా త్వరగా పూర్తి చేయించండి.’’ అధికార దర్పంతో అన్నాడు.
‘‘సార్‌! ఈ ముసలమ్మది సహజ మరణమే అయితే మీరన్నట్టే వెంటనే పంచనామా పూర్తి చేసేవాళ్లం. కానీ, ఇది మర్డర్‌. ఒక అనాధని...అదీ భక్తుల దగ్గర బిచ్చం అడుక్కునే ఒక ముసలమ్మని చంపాల్సిన అవసరం ఎవరికుంది?! ఎలాంటి పరిశీలన...పరిశోథన చెయ్యకుండా శవానికి చాప చుట్టేస్తే ఆ తర్వాత మా పీకల మీదకొస్తుంది వ్యవహారం. దయచేసి మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి! వీలైనంత త్వరగా ఫార్మాలిటీస్‌ కంప్లీట్‌ చేయిస్తాను.’’ అంటూనే ఈవో రాఘవేంద్ర స్వామికి నమస్కారం చేసి గౌరవంగా సాగనంపాడు ఎస్సై అక్బర్‌ ఖాన్‌.

ఇంతలో ఫోరెన్సిక్‌ నిపుణులు వచ్చి చేరుకున్నారు. వారితో పాటే అంబులెన్స్‌ కూడా వచ్చి చేరుకుంది.

ఫోరెన్సిక్‌ నిపుణులు ముసలమ్మ శవం మీదున్న కత్తి పోటు, శాలువా, ముసలమ్మ తల క్రింద వున్న చిన్న మూట అన్నీ జాగ్రత్తగా పరిశీలించి వేలి ముద్రలు సేకరిస్తున్నారు.

క్లూ స్‌ టీమ్‌ పరిసరాలన్నీ క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నాయి. గుబురుగా వున్న మర్రి చెట్టు కేసి దాని చుట్టూ కట్టిన సిమ్మెంటు దిబ్బ కేసి చూస్తూ కొద్ది దూరంలో ఉన్న మరో చెట్టు చుట్టూ కట్టిన సిమ్మెంటు దిమ్మ కేసి చూస్తూ ఒక్కసారే ఉలిక్కిపడ్డాడు ఎస్సై అక్బర్‌ఖాన్‌.

........................................
..........................................
.........................................

ఎస్సై అక్బర్ ఖాన్ కి కనిపించిన దృశ్యం ఏమిటి? దుండగుల లక్ష్యం గురి తప్పి ముసలామె ప్రాణాలను పొట్టనపెట్టుకున్న విషయాన్ని పోలీసులు చేడించగలిగారా????

ఈ సస్పెన్స్ వీడాలంటే వచ్చే శుక్రవారం మధ్యాహ్న్నం ఒంటిగంటదాకా ఆగాల్సిందే.....

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
premiste emavutundi?