Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
anveshana

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమిస్తే ఏమవుతుంది?

premiste emavutundi?

గత సంచికలోని ప్రేమిస్తే ఏమవుతుంది సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి....http://www.gotelugu.com/issue257/691/telugu-serials/premiste-emavutundi/premiste-emavutundi/

 

(గత సంచిక తరువాయి)... శరణ్య ఉదయమే బయలుదేరి నందిగామ వెళ్ళకుండా విజయవాడలో ఎం ఆర్ వో ఆఫీస్ కి బయలుదేరింది. వెళ్లేముందు ఎం ఆర్ వో  సనత్ కుమార్ కి ఫోన్ చేసి వస్తున్నానని చెప్పింది. ఆమె వెళ్లేసరికి సనత్ కుమార్ తన ఛాంబర్ లో ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు.

“గుడ్ మార్నింగ్ సర్” చిరునవ్వుతో చెప్తూ లోపలికి వెళ్ళింది.

“ఎలా ఉంది మీ జాబ్” అడిగాడు కూర్చోమని కుర్చీ చూపిస్తూ .. నవ్వింది సమాధానంగా .. అతనూ నవ్వుతూ “అర్ధమైంది” అన్నాడు.“మీరెలా అక్కడినుంచి ఇక్కడిదాకా ప్రయాణం చేశారో ఆశ్చర్యంగా ఉంది” అంది అదే నవ్వుతో.

“మీలాగే” అన్నాడు.

“కానీ .... మాకున్న సహనం మీకు ఉండదు కదా.. “

“అదా” గట్టిగా నవ్వి అన్నాడు “నెల తిరగాగానే చేతికి అందే జీతం తలచుకుంటే సహనం అదే వస్తుంది.”

“అఫ్ కోర్స్” నవ్వింది.

“చెప్పండి ఎనీ థింగ్ ఇంపార్టెంట్” ఆమె ఉదయాన్నే వచ్చిన కారణం అడిగాడు.

అప్పటిదాకా నవ్వుతున్న శరణ్యకి ఆయన అలా అడగగానే ఒక్క క్షణం ఇబ్బందిగా అనిపించింది.

అప్పుడే లీవా అంటాడేమో .... లీవ్ తీసుకుంటే ఎలా కుదరదు అంటాడేమో మొహమాటంగా తలవంచుకుని వేళ్ళు లెక్కపెట్టుకుంటున్న ఆమె వైపు చూస్తూ “లీవ్ కావాలా” అడిగాడు.

గభాల్న తలెత్తి చూసింది మీకెలా తెలుసు అన్న ప్రశ్న కనిపించింది..

“లీవ్ కోసం ఇలాగే ఇబ్బంది పడతారు మీ ఆడపిల్లలు ... ఐ నో” అన్నాడు.

ఒక సన్న నవ్వు పెదాల మీద చిందులేస్తుంటే “అవును సార్ అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం వచ్చింది ఒక్క రోజు చాలు ఫ్రైడే ఈ వినింగ్ వెళ్లి ప్రొబబ్ లీ మండే వచ్చేస్తాను ...” అంది.

“మీరు సి ఎల్ హాపిగా అవైల్ చేసుకోవచ్చు..వెళ్ళండి.. బై ద బై ఎలా వెళ్తున్నారు ..”

“ఇంకా ఆ విషయం ఆలోచించలేదు.. ముందు మీరు పర్మిట్ చేస్తారో లేదో అని ... “ సందేహంగా అంది.

“సి ఎల్ ఈజ్ యువర్ రైట్ ...జస్ట్ ఒక పేపర్ మీద అప్లికేషను రాసి నాకు పంపించేస్తే చాలు ఎప్పుడైనా కుదరక పొతే ఏదన్నా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే నేను రిజెక్ట్ చేసినా మీరు బాధపడకూడదు.”

“అయ్యో నేనేం బాధపడనులెండి” అంది.

“మీకు అభ్యంతరం లేకుంటే నేను కార్ లో వెళ్తాను .. మీరు కూడా రావచ్చు.”

“మీరు కూడా హైదరాబాద్ వెళ్తున్నారా ...”

“నా ఫ్యామిలీ అక్కడే ఉన్నారు.. నా వైఫ్ కి డెలివరి అయింది... “

“ఓ ఐసి ఎప్పుడు? పాపా  బాబా ...”

“పాప .... ఫస్ట్ బాబు ... వాడికి టూ ఇయర్స్ .. సరిత పేరెంట్స్ హైదరాబాద్ లో అమీర్ పేట్ లో ఉంటారు.”

“నేను ఎవ్రీ వీక్ వెళ్తాను..కాకపోతే సాటర్డే ఈవినింగ్ వెళ్తాను... ఈ వీక్ నాకు కూడా ఆఫీస్ లో పెద్దగా పని లేదు ఒకరోజు ముందు వెళ్తే బాగుంటుంది అనిపిస్తోంది.. ఇఫ్ యు ఆర్ ఓ కే ... కలిసి వెళ్దాము... జర్నీ బోర్ కొట్టకుండా ఉంటుంది. “

శరణ్యకి అతని మాటల్లో ఎలాంటి సందేహానికి తావు కనిపించలేదు.. స్నేహంగా మాట్లాడుతున్నాడు.. వయసు నలభై ఉంటుంది.. మనిషి హుందాగా ఉన్నాడు.. అతని కళ్ళల్లో నిర్మలత్వం , మాటల్లో సిన్సియారిటి స్పష్టంగా కనిపిస్తున్నాయి .

అవును కలిసి వెళ్తే ప్రయాణం బోర్ కొట్టదు ...

“ఆలోచిస్తున్నారేంటి ...” అడిగాడు అతను ..

“అబ్బే ఆలోచన ఏంలేదు  వస్తాను” అంది.

“ఓకే ఇవాళ  గురువారం అంటే రేపు ఈవినింగ్ నేను మిమ్మల్ని మీ ఆఫీస్ దగ్గర పిక్ అప్ చేసుకుంటాను .... మీరు ప్రిపెరేడ్ గా వెళ్ళండి ఆఫీస్ కి. “

“ ఓకే సర్ థాంక్స్ వస్తాను ...”

“ఓకే రెడీ గా ఉండండి జీప్ ఆఫీస్ లో వదిలేసి వెళ్దాము” అన్నాడు.

“అలాగే” అతని దగ్గర సెలవు తీసుకుని బయటికి వచ్చేసింది. అనుకున్నట్టే శుక్రవారం సాయంత్రం విజయవాడ నుంచి బయలుదేరి తన వ్యక్తిగత కార్ లో శరణ్య ని ఆమె ఆఫీస్ దగ్గర పిక్ అప్ చేసుకున్నాడు సనత్ కుమార్. శరణ్య చిన్న బాగ్ లో రెండు డ్రెస్ లు పెట్టుకుని తెచ్చుకుంది.

అతనిది హోండా కార్ ... స్వయంగా డ్రైవ్ చేస్తున్నాడు. సరదా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తుంటే ఎంతో సన్నిహితంగా , ఎప్పటినుంచో స్నేహం ఉన్న వ్యక్తిలా ఆత్మీయంగా అనిపించాడు. మాటల మధ్యలో అప్రయత్నంగా తను హైదరాబాద్ వెళ్తున్న కారణం చెప్పేసింది.. తేజ గురించి చెప్పేసింది. అతను చాలా సంతోషించాడు ..

“సో త్వరలో మీ పెళ్లి సందడి ఉందనమాట ..” అన్నాడు.

కొంచెం సిగ్గుగా నవ్వింది.

“నేను అమీర్ పేట బిగ్ బజార్ నుంచి లెఫ్ట్ దాదాపు శ్రీనగర్ కాలనీ వైపు వెళ్తాను మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలి” అడిగాడు.

“ఇప్పుడే తేజాని అడిగి చెప్తా” అంటూ తేజకి వాట్స్ అప్ లో మెస్సేజ్ పెట్టింది..

“అక్కడే ఆపుకో నిన్ను పిక్ అప్ చేసుకోడానికి నేను రెడీ గా ఉంటా” అని రిప్లై ఇచ్చాడు.

తేజ వెంటనే రెస్పాండ్ అవడం చూసి మీది మంచి సెలక్షన్ అన్నాడు ..

ప్రశ్నార్ధకంగా చూసింది.

“చాలా కన్సేర్న్ గా ఉన్నాడు అది ఇంపార్టెంట్” అన్నాడు.

అతని పరిశీలనకి ముగ్దురాలైంది శరణ్య. మంచివాడు, సంస్కారవంతుడు కాబట్టి తేజ లోని ఔన్నత్యాన్ని లిప్తపాటులో గుర్తించాడు అనుకుంది.

అతను సాధారణంగా కనిపించే ఇతర ప్రభుత్వ అధికారుల్లా అనిపించలేదు. సంతకానికి ఇంత అని బోర్డ్ పెట్టుకుని కక్కుర్తిగా సంపాదించే అవినీతి పరుడు కాదు..  ఆఫీస్ పనికి తప్ప వ్యక్తిగత అవసరాలకి ఆఫీస్ కార్ వాడడు ... ఆఖరికి డ్రైవర్ సేవలు  కూడా తన అవసరానికి వాడుకోకపోవడం అతని వ్యక్తిత్వాన్ని తెలియచేస్తోంది.

ఇతని దగ్గర నేను చాలా నేర్చుకోవాలి అనుకుంది శరణ్య . మధ్యలో ఒకసారి టి కోసం, ఒకసారి డిన్నర్ కి కార్ ఆపాడు. డిన్నర్ చేసాక తనే బిల్ పే చేశాడు.

బిగ్ బజార్ దగ్గర తేజ చెప్పినట్టే సిద్ధంగా ఉన్నాడు.

ఇద్దరికీ ఒకరిని ఒకరికి పరిచయం చేసింది.

ఎంతో ఆత్మీయంగా మాట్లాడుకున్నారు ఇద్దరూ. పరస్పరం విజిటింగ్ కార్డ్స్ ఇచ్చుకున్నారు.

సరిగ్గా ఐదు నిమిషాలు మాత్రం మాట్లాడి “ మీ ఫ్రెండ్ ని మీకు జాగ్రత్తగా అప్పచెప్పాను నాకు ఇంక సెలవా” అన్నాడు సనత్ .

థంక్ యు షేక్ హ్యాండ్ ఇచ్చాడు తేజ .

అతని కార్ కదిలాక తేజ శరణ్య భుజం చుట్టూ చేతులు వేసి తన కార్ పార్క్ చేసిన వైపు కదిలాడు.

“ఏంటిది” అంది అతనలా భుజం చుట్టూ చేతులు వేయడం చూసి.

“నువ్వు నా భార్యవి... యు ఆర్ మైన్ ఈ విషయం లోకానికి చెప్పాలిగా” అన్నాడు.

“ఒక డప్పు కూడా తేక పోయావా” అంది.

“ఒక్క డప్పు ఏంటి ... పెద్ద బ్యాండ్ మేళంతో టముకు వేస్తాను” అన్నాడు.

పరవశంగా మరి కొంచెం అతనికి దగ్గరగా జరిగింది.

తేజ కార్ లో అతని రూమ్ కి వెళ్ళింది.

తేజ పేరెంట్స్ మణికొండలో కొత్త ఇంటికి మారిపోడంతో అతను తనకి వీలుగా ఉండడం కోసం బంజారా హిల్స్ లో ఒక ఫ్లాట్ అద్దెకి తీసుకున్నాడు. అది ఆఫీస్ కం అకామడేషన్ ...

త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్ ... విశాలంగా, అధునాతనంగా ఉంది ఫ్లాట్. ఓపెన్ కిచెన్, విశాలమైన హాలు ఎల్ షేపులో ఉండి డైనింగ్ ఏరియా .. ఫ్రెంచ్ విండో ... బాల్కనిలో అందమైన మొక్కలున్న కుండీలు, ఖరీదైన ఫర్నిచర్ ..

“ఎలా ఉంది?”  కళ్ళు విశాలం చేసుకుని చూస్తున్న శరణ్య దగ్గరగా వచ్చి ఆమె భుజం మీద చుబుకం ఆన్చి అడిగాడు.

కొద్దిగా తల అతనివైపు వంచి కళ్ళల్లోంచి నవ్వుతూ” ప్రేమమందిరంలాగా ఉంది” అంది.

“ నా ప్రేమ మందిరం ... నా ప్రేమ దేవత కోసం ఏర్పాటు చేసిన మందిరం ..”

“ఎవరో ఆ ప్రేమ దేవత ...” అతనికి అభిముఖంగా తిరిగి కళ్ళల్లోకి చూస్తూ అడిగింది.

“చూస్తావా” అడిగాడు.

“ఊ “

“అయితే ఇలా నా గుండె మీద నీ కళ్ళు పెట్టి చూడు.. కనిపిస్తుంది” అంటూ ఆమెని దగ్గరగా లాక్కున్నాడు. గభాల్న అతని గుండెలమీద వాలిపోయింది.

రెండు చేతులతో గట్టిగా బంధిస్తూ “ఎప్పుడెప్పుడు నీ మేడలో మూడు ముళ్ళు వేసి నా స్వంతం చేసుకుంటానా  అని ఎదురు చూస్తున్నాను

...” అన్నాడు.

“అవునూ పెళ్లి అయాక నేను ఇక్కడ ఉండను కదా నువ్వు కూడా నా దగ్గరకు వస్తానన్నావుగా ..” గోముగా అతని గుండెల మీద కుడి చేతి చూపుడు వేలితో సున్నాలు చుడుతూ అడిగింది.

“అవునూ కాదన్నానా..”

“మరి ఈ వైభోగం ఎందుకు ...”

“మనం హైదరాబాద్ వస్తూ ఉండమా ... విజయవాడలోనే ఉండిపోతావా... నువ్వు జాయింట్ కలెక్టర్ గా హైదరాబాద్ వస్తావు.. అందాకా ఇది మన గెస్ట్ హౌస్...నాకు ఎంతో నచ్చింది.. వీలైతే కొనేస్తా... నా ఫ్రెండ్ యూ ఎస్ వెళ్ళాడు...వాడిదే ఈ ఫ్లాట్..వాడు అమ్మాలని ప్లాన్ చేస్తున్నాడు. “

అతని నుంచి దూరం జరుగుతూ హాలు కలయ చూస్తూ “చాలా బాగుంది కాని రెంట్ ఎంత” అడిగింది.

“ఎంతో కొంత .... ఎంత అయినా ఐ డోంట్ కేర్...” మళ్లి ఆమెని దగ్గరకు లాక్కుని చెంప మీద ముద్దు పెట్టుకుంటూ అన్నాడు.. “ఈ దేవత కోసం నా సర్వస్వం ..”

అతని మాటలు పూర్తీ కాకుండానే అతని క్రాఫ్ చెరిపేస్తూ “బొత్తిగా పాత సినిమా డైలాగులు” అంది.

ఆమెని మరింత గట్టిగా హత్తుకుని “అయితే  కొత్త సినిమా స్టైల్ లో ప్రేమించుకుందాం”  అంటూ చటుక్కున ఆమె పెదాలు అందుకున్నాడు ...
ఒక్కసారిగా సృష్టి స్తంభించినట్టు అయింది శరణ్యకి. వెచ్చటి అతని ఊపిరి ముక్కుకి, నుదుటికి తగులుతోంది. రెండు చేతులతో ఆమెని వెనక్కి వంచి ఎంతో తపనగా ఆమె అధరాలు చప్పరిస్తూన్న తేజ నుండి దూరం జరగాలని ఉన్నా జరగలేకపోయింది.

ఊహించని ఆ చర్యకి ఉక్కిరి బిక్కిరి అవుతూ అప్రయత్నంగానే ఆ తీయదనం అనుభవిస్తూ ఉండిపోయింది. దాదాపు అరవై సెకన్ల తరవాత ఇద్దరికీ స్పృహ వచ్చినట్టు అయి ఇద్దరూ కొంచెం దూరం జరిగారు.

“ఏంటిది తేజా...” రెండు అరచేతులతో మొహం కప్పుకుని అంది.

“సారీ ...” అన్నాడు.

“తప్పు చేయడం సారీ చెప్పడం..” చిరు కోపంగా అంది.

“విరహం భరించి, భరించి నువ్వు కనిపించడంతో ఆగలేకపోయాను శరణ్యా.. సారీ” అన్నాడు తిరిగి ఆమెని చేయి పట్టి దగ్గరకు లాక్కుంటూ ..
“చాలు చెప్పిన సారీ .... ఇప్పటికే బాగా లేట్ అయింది ని రూమ్ కి నువ్వు వెళ్ళు.. నా రూమ్ కి నేను వెళ్తాను” అంది విడిపించుకుని బెడ్ రూమ్ వైపు వెళ్తూ.

రాక్షసి నీకసలు హృదయం లేదు అన్నాడు కోపంగా.,

వెనక్కి తిరిగి భుజాల మీంచి అతన్ని చూసి మనోహరంగా నవ్వి పెళ్లి అయిందాకా నా హృదయం లాకర్ లో పెట్టేసాలే.. అంటూ లోపలికి వెళ్లి తలుపు మూస్తూ గుడ్ నైట్ అంది.

 

 

 

 

మిగతా కథ వచ్చే శుక్రవారం ఒంటిగంటకు చదవండి.....

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్