Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
chamatkaaram

ఈ సంచికలో >> శీర్షికలు >>

విహార యాత్రలు (థాయ్ లాండ్ ) - కర్రా నాగలక్ష్మి

thailand

బేంకాక్ ( రాజభవనం )

ఈ రాజభవనం మామూలు రాజభవనంలా కాక ( అంటే మనదేశం లోని రాజభవనాలు ఒకే పెద్ద భవంతిలా వుండి లోపల వుద్యానవనాలు వగైరాలు వుంటాయి ) నాలుగు గోడల మధ్య చాలా చిన్నా పెద్దా భవంతులు , వుద్యానవనాలు , పచ్చిక మైదానాలతో వుంటాయి . పక్కగా రాజభవనం నమూనా వుంటుంది . 200 సంవత్సరాల చక్రి రాజుల పరిపాలనలో ఒక్కోరాజు తమ అభిరుచికి తగ్గట్టుగా ఒకో భవన నిర్మాణం గావించుకోడం అలాగే పాత భవంతులకు మరమ్మత్తులు చేయించడం వల్ల మనకి యేదో పురాతనమైన కట్టడాన్ని చూస్తున్నామనే ఆలోచన రాదు .

థాయిలాండు రాజులకు రాముడు తమదేశం లోనే జన్మించేడని , తమది రామరాజ్యమని విశ్వాసం . అందుకే రాజభవనం చుట్టూరా వున్న గోడలమీద ‘ రామకథ ‘ చిత్రీకరించి వుంటుంది . రామాయణం లో వున్న ప్రతీఘట్టం గోడలమీద చిత్రీకరించేరు . ఈ దేశం లో వున్న ‘ అయోథియ ‘ లో రామ జననం జరిగిందని వీరి విశ్వాసం . వీరి రామాయణం రావణ సంహారానంతరం రామపట్టాభిషేకం తో ముగుస్తుంది .

గోడలమీది రామాయణ బొమ్మలను చూసుకుంటూ ఆ చిత్రకళకి మేం ఆశ్చర్య పడుతూ వుంటే చాలా మంది విదేశీయులు మీకు యీ కథ తెలుసా ? అని అడిగి తెలుసు అని అంటే మొత్తం అక్కడ వున్న బొమ్మలను చూపిస్తూ నా చేత రామాయణం చెప్పించుకున్నారు . ముందు నలుగురు వున్న శ్రోతలసంఖ్య రెండు నిముషాలలో నలభైకి చేరింది . నా వచ్చీరాని ఇంగిలి పీచుకి ( ఇంగ్లీషు) వారు యెంతో సంతోషించేరు . నాకు యెన్నో థాంక్సులు తినిపించేరు . గైడుగా తీసుకుంటాం మా సంస్థలో పనిచేస్తారా అని వో యిద్దరు ముగ్గరు పిలిచేరు . ఇది యెన్నో విజిట్ అని అడిగేరు . లేకపోతే యీ బొమ్మలను గురించి యింతచక్కగా యెలా చెప్పగలిగేరు అని ఆశ్చర్య పోయేరు . పాపం వారికేం తెలుసు మన యిళ్లల్లో నాలుగైదు సంవత్సరాల పిల్లలు కూడా రామాయణ , భారత కథలు తడుము కోకుండా చెప్పగలరని ? , బాబోయ్ మా బస్సుకి టైమవుతోంది అనేంత వరకు అలా చెప్పించు కుంటూనే వున్నారు .

సాధారణంగా మేము టూరు బస్సులలో వెళ్లం . థాయిలాండు కి ఓ యేడాది డెప్యుటేషను మీద రావడం తో అన్నీ సావకాశం చూసుకుందామని నిర్ణయించుకున్నాం .

రాజభవనం లో కొంత భాగమే పర్యాటకుల సందర్శనార్ధం అందుబాటులో వుంటుంది , చాలా భాగం రాజపరివారం నివాసానికి , ఆఫీసులకు వాడు తున్నారు . మ్యూజియం లో మొదటి తరం నుండి రాజులు వాడిన పాత్రలు దుస్థులనుండి కిరీటాలు , కత్తులు , కవచాలు , శిరఃస్థ్రాణాలు వున్నాయి . అవన్నీ చూస్తూ వుంటే రెండువందల సంవత్సరాలకిందటి నాగరికత యెలా వుండేదో అవగతమౌతుంది . రాజపరివారపు దుస్తులు , నగలు వారి దర్పానికి ప్రతీకలుగా వున్నాయి . దుస్తులు నగలు దర్పంగా వున్నా రాజపుత్ రాజుల దుస్తులకు నగలకు  డిజైన్లలో తేడా బాగా తెలుస్తూ వుంటుంది . అలాగే చిత్రకళలో కూడా తేడా వుంది . రాముడు , లక్ష్మణుడు , సీత , హనుమంతుడు యిలా పురాణ పాత్రలు , సింహం , నంది ,

గరుడుడు మొదలైన జంతువుల చిత్రాలు చాలా తేడాగా వుంటాయి .

అన్నట్టు మరిచి పోయా థాయు వంటకాలు ప్రపంచ ప్రసిధ్ది పొందాయి , నేను రుచి చూసిన కూర అన్ని రకాల కాయగూరలూ వేసి కొబ్బరి పాలతో వుడికించి చాలా పసందుగా వుండేది . వీరి వంటలు యెక్కువగా మాంసాహారాలు కావడం వల్ల మరేమీ మేము తినడానికి సాహసించలేదు . అయితే థాయి మసాలాలు చాలా బాగుంటాయి . మరేమీ లేదు మనం మరచిపోయిన దంచడం వారు యింకా చేస్తున్నారు . దంపిన మసాలాల రుచేవేరు . మా చిన్నప్పుడు అంటే మిక్సీలు రాని రోజులలో మా అమ్మమ్మలు , అమ్మలు చేసిన మసాలాల రుచి థాయి మసాలాలలో చూసేను .

రాజ భవన సముదాయాలలోనే వున్న మరో ముఖ్యమైన ఆకర్షణ ‘ ఎమరాల్డ్ బుద్ద ‘ మందిరం . సుమారు 94 చదరపు హెక్టార్ల విస్తీరణంలో కట్టబడ్డ మందిరం , ఈ మందిరానికి అనుబంధంగా బౌద్ద విహారం , బిక్షువుల  నివాసస్థలాలు వందకు పైగా గదులు వున్నాయి . యీ మందిర ద్వారాలపై చక్కని నగిషీలు , పైన  పాలరాతి పలకలతో చెక్కిన ఆర్చీలు ఆకర్షణీయంగా వుంటాయి . లోపల బయట వున్న స్థంభాలు బంగారు రంగు పలకలతో చెక్కేరు ,  పైకప్పు నారింజ , అకుపచ్చ రంగుల పలకలతో తీర్చి దిద్దేరు . ద్వారానికి యిరువైపులా ద్వారపాలకులుగా 5మీటర్ల యెత్తున్న యక్షిణుల విగ్రహాలు కళ్లు తిప్పుకోనివ్వవు . లోపలి గదులలో బుద్దుని జీవితచరిత్రకు సంభందించిన బొమ్మలు వుంచేరు .పడమటి వైపున వున్న మూడు గదులను ‘ ప్ర క్రొమానిసోర్న్ ‘ కొన్నాళ్లు థాయి వారితో స్నేహం చేసిన తరువాత బాగా వారి ఉఛ్చారణను పరికిస్తే ‘ ప్ర ‘ అంటే  ‘ పరః ‘ అని ‘ క్రొమానిసోర్న్ ‘ అంటే ‘ కర్మాను సారిణి ‘ గా అర్దమైంది . ఉత్తరం వైపున వున్న బౌద్ద విగ్రహాలు ‘ అయోథియ ‘ రాజుల జ్ఞాపకార్దం ప్రతిష్ఠించేరు . గర్భగుడిలో వున్న చిత్రాలు 19 వ శతాబ్దంలో ‘ ఖృవ యిన్ ఖోవ్ ‘ అనే చిత్రకారుడు చిత్రించేడు .

ఎమరాల్డ్ బుద్ద ( జాతిపచ్చ ) అంటే నిజంగా జాతి పచ్చతో చెక్కినది కాదు . ఆకుపచ్చరంగులో వుండటం వల్ల , థాయి ప్రజలు ఆకుపచ్చ రంగుని యెమరాల్డ్ రంగు అని అనడం వల్ల విదేశీయులలో యిది నిజంగా జాతి పచ్చ రాయితో చెక్కినదనే నమ్మకం బలపడింది . ఈ విగ్రహం 26 అంగుళాల యెత్తు 19 అంగుళాల వెడల్పు ( మఠం వేసుకొని కూర్చున్న ఆకారంలో ఆముణుకు దగ్గరనుంచి యీ ముణుకు వరకు ) గల విగ్రహం . విగ్రహానికి వున్న జ్ఞాననేత్రం బంగారంతో చేసి తాపబడింది . బుద్దుడు యోగముద్రలో వున్నట్టుగా చెక్కేరు , యీ ముద్రని ‘ విరాసన ‘ ముద్ర అనికూడా అంటారు . దీనిని  ఎత్తైన మండపం మీద ప్రతిష్ఠించేరు . ఈ మండపాన్ని మోస్తూ  కాళ్లతోను , ముక్కుతోను నాగులని పట్టుకొని వున్న గురుడ విగ్రహాలను చెక్కేరు . ప్రతీ కాలంలోనూ యీ విగ్రహానికి కట్టిన దుస్తులను స్వయంగా రాజు మారుస్తారు . దానికి తగ్గట్టుగా దీపాలకాంతిని అమరిస్తారు . వేసవికాలం , వర్షాకాలం , శీతాకాలం వేరువేరు అలంకరణలో వుంటాడు యీ ఎమరాల్డ్ బుద్దుడు . రాజుకి తప్ప వేరెవరికీ యీ విగ్రహాన్ని తాకే అర్హతలేదు . మేం వెళ్లినప్పుడు యే కాలమో గుర్తులేదు కాని ఓ సారి బంగారు దుస్తులతోను , బంగారు కిరీటం తోను , మరోమారు బంగారు అంచున్న వంగపువ్వు  రంగు దుస్తులతోను , బంగారు గొడుగుతోను చూసేం .

విగ్రహాన్ని చూస్తూవుంటే నిజంగా బుద్దుడేమో విగ్రహం కాదేమో అనే భ్రాంతికలిగింది .

ఈ విగ్రహం గురించిన చరిత్ర చెప్పుకుందాం .

ఈ విగ్రహం నిర్మింపబడ్డ కాలం సరిగ్గా చరిత్రకారులు చెప్పలేక పోయేరు . కాని యీ విగ్రహం మనదేశంలోనే నిర్మింపబడి వుండొచ్చని , పాటలీపుత్రంలో వుండే ‘ నాగసేన ‘ అనే శిల్పి నిర్మించేడని అంటారు . ఈ  ప్రాంతాలను పరిపాలించిన అప్పటి చక్రవర్తికి విష్ణుమూర్తి గరుడవాహనం మీద వచ్చి ఆకుపచ్చ రాతితో విగ్రహం చేయించి పూజించమని చెప్పినట్లు , పచ్చరంగురాయి వలన రాజ్యం సుభిక్షంగా వుంటుందని కలలో చెప్పినట్లుగా ఓకథ . అయితే విగ్రహం భారతదేశంలో తయారు చెయ్యబడింది అనడానికి విగ్రహాకృతే రుజువు .

విగ్రహ నిర్మాణం వల్ల రాజ్యం సుభిక్షంగా మారిందో లేదో కాని యీ విగ్రహం సొంతం చేసుకోవాలనే దురాశతో యెన్నో యుధ్దాలు జరిగినట్లు చరిత్ర చెప్తోంది . ఈ విగ్రహం రాజ్యాలు మారుతూ శ్రీలంక , లావోస్ , బర్మ , కంబోడియా లు చేరి 14 వ శతాబ్దంలో తిరిగి అయోథియ రాజులచేతికి వచ్చింది . 14వ శతాబ్దంలో యీ విగ్రహం బయట పడ్డప్పుడు ఆకుపచ్చ రంగు కనబడకుండా సున్నపులేపనంతో కనబడింది . రాజ్యం మారుతున్నప్పుడు విగ్రహం పైన వున్నపూత విరిగి లోపలి ఆకుపచ్చరంగు బయటపడడంతో రంగుచూసి అది జాతిపచ్చతో చెయ్యబడ్డదని భావించేరు . 14వ శతాబ్దం నుంచి బర్మ థాయి దేశాలమధ్య యుధ్దాలు జరుతూనే వున్నాయి , యీ విగ్రహం దేశాలు మారుతూనే వుంది . ఆఖరుగా 18 వ శతాబ్దంలో రామ-1 రాజు సుస్థిర రాజ్యం యేర్పరచుకొని బేంకాక్ ను రాజధానిగా చేసుకొన్నతరువాత యిప్పుడున్న ప్రదేశంలో ప్రతిష్టించేరు . తరువాతి కాలంలో రామ-3 , రామ-5 మొదలైన రాజులు భవంతిని పెంచడం మరమ్మత్తులు చెయ్యడం వల్ల యివాళ యింత కనువిందైన మందిరం మనకి , మనతరవాతి తరాలకు దక్కింది .

ఈ మద్యకాలంలో బుద్దుని విగ్రహం చెయ్యబడ్డ రాయి యేమిటి అని పరిశోధిస్తే అది జాతి పచ్చకాదని తక్కువ రకానికి చెందిన ‘ జేడ్ ‘ జాతికి చెందినదని తేలింది . ఏది యేమైనా యీ విగ్రహాన్ని యిప్పటికీ ‘ ఎమరాల్డ్ బుద్ద ‘ అని అంటారు .

వచ్చేవారం థాయిలాండ్ లోని మరికొన్ని ప్రదేశాలగురించి చదువుదాం అంతవరకు శలవు .

మరిన్ని శీర్షికలు
varam varam vari vari phalalu