Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
marpu

ఈ సంచికలో >> కథలు >> ఔషదం

oushadam

‘డి.. ఓ.. ఎమ్.. ఎస్.. టి.. ఏ.. ఎల్.. డోమ్‍స్టాల్..’ అంటు ఆ ట్యాబ్లేట్ స్ట్రిప్‍ని పక్కన పెట్టి వేరే టాబ్లేట్ పేరు చదవడానికి ప్రయత్నిస్తూ ఉండగా,

‘ఏమ్మా... సారు వారు ఏరి?’ అంటూ అడిగాడు ఓ కష్టమర్.

‘సేఠ్‍జీ అర్జెంట్ పని మీద బయటకెళ్ళారు సారు..’ అని చెప్పాను.

‘అయ్యో.. ఎప్పటికల్లా వస్తారు బాబు?’

‘ఓ అరగంట పట్టొచ్చు సారు..’

‘అరెరె... ప్చ్’ అంటూ సారు దిక్కులు చూడసాగారు.

‘ఏమైనా అర్జెంటా సారు?’

‘అవును బాబు.. మా అమ్మగారికి ఒంట్లో బాగోలేదు.. ఇప్పుడు ఇంకా క్రిటికల్ అయ్యింది.. మందులు తీసుకోవాలనొచ్చాను’

‘అరే సారు... ఇవాల్టికి వేరే షాపు నుండి తీసుకోండి’

‘నేనుండేది రామాంతపూర్ కాలని బాబు..దగ్గరలో ఇదొక్కటే మెడికల్ షాపు.. అందుకే నెల నెలా మందులు మీ సేఠు దగ్గరే తీసుకుంటా..’

‘అయితే ఓ పని చెయ్యండి సారు... ఇక్కడే ఓ అరగంట కాలక్షేపం చెయ్యచ్చుగా?’ అని సలహా ఇచ్చాను.

‘లేదమ్మా... అక్కడ అమ్మకి ఎప్పుడైనా ఏదైనా అవసరం అయితే నన్నే కలవరిస్తూ ఉంటుంది. చూసుకోవడానికి నా భార్య ఉంది, కాని పాపం తను మాత్రం ఏమేం చూసుకుంటుంది చెప్పు? మాకు ఓ ఐదేళ్ళ కూతురు కూడా ఉంది. ప్రతి సారి కొన్ని ఎక్కువగానే మందులు కొని పక్కనుంచుకుంటాం, కాని ఈ సారి ఎందుకో అయిపోయాయి.. అందుకే ఈ తొందర!’

‘అయ్యో... అసలే రామాంతపూర్ అంటున్నారు.. మళ్లీ రాలేరు కూడా..’ అని చెప్పగానే కష్టమర్ సారు ముఖం దిగులుగా పెట్టుకున్నాడు.

‘మీకు మందుల పేర్లు ఏమైనా గుర్తున్నాయా సారు?’

‘పేర్లు పలకడానికే రావు బాబు... ఇంక ఏం గుర్తుంటుంది చెప్పు... నా దగ్గర ప్రిస్క్రిప్షన్ ఉంది!’

‘అయితే ఇంకేంటి సారు.. ఇక్కడియ్యండి... నేనిస్తాగా!’ అంటూ చెయ్యి చాపాను.

‘అదేంటి.. నువ్వు చదవగలవా?’ అంటూ వెంటనే తన చోక్కా జేబు నుంచి మందుల చీటీని తీసి అందించాడు.

‘ఏంటి సారు... మా ఇస్కూల్లో అందరికంటే ఇంగిలీసులో ఎక్కువ మార్కులు వచ్చేది నాకే.. ఐ.. నో.. ఇంగ్లీస్ గుడ్ సార్’ అంటు చీటిని చేతిలోకి తీసుకుని మందుల పేర్లని చదవసాగాను. 

అసలే ఇంగలీసు అంతంత మాత్రం వచ్చిన నాకు, డాక్టర్ చేతి రాతని అర్ధంచేసుకోవడం అస్సలే కష్టమనిపించింది. అయినా తిప్పలు పడుతూ ఒక్కో మందుని వెతికి పక్కన పెట్టసాగాను. ప్రతి మందు పేరు కింద ఎన్ని సున్నాలు ఉంటే రోజుకి అన్నిసార్లు ఆ మందులు వేసుకోవాలి అని నాకు ఓ డాక్టర్ సారు చెప్పడం గుర్తుండి, వాటిని నెలకి సరిపడా ఎక్కాలలో గణించి పక్కన పెట్టసాగాను. సేఠు ఉండి ఉంటే ఓ అర నిమిషంలో అన్నీ తీసిచ్చేసేవారు.. నాకు మాత్రం ఓ పది నిమిషాలు పట్టింది. నానా తిప్పలు పడి చివరికి చీటీలో ఉన్న మూడు మందులు తీసి ఇచ్చాను. అవి కాకుండా సారు ఓ రెండు మందులు తనకి కూడా కావాలని చెప్పగా, అవి కూడా తీసి మొత్తం ధర లెక్కించడం మొదలుపెట్టాను.

‘ఇదిగోండి సారు... మీ మందులు.. మొత్తం లెక్క ఒక వెయ్యి తొంభై అయింది.’ అంటు పక్కన నేను రాసుకున్న లెక్కలని చూస్తూ చెప్పాను.

‘ఇదిగో..’ అంటూ సారు నాకు పది వందలు చేతికందించారు.

‘సారు... మిగతా తొంభై?’ అని అడిగాను.

‘హహహ... ఏల్లకేల్లుగా ఇక్కడే మందులు తీస్కుంటున్నా బాబు.. మీ సేఠుకి ఓ సారి నా పేరు చెప్పి చూడు..’

నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు, ఇంతలోనే.. ‘నువ్వు ఇక్కడికి కొత్తగా చేరావా బాబు?’ అని అడిగారు ఆయన.

‘నేను ఇక్కడ ఉన్న అన్ని షాపులకి టీ అమ్ముతూ ఉంటాను సారు... ఈ పక్కకి వచ్చి ఓ మూడు నెలలు అయ్యింది..’ అన్నాను.

‘ఓహ్... అదే అనుకుంటున్నా... ఎప్పుడూ చూడలేదే అని.. పర్వాలేదులే...’ అంటూ మరో వంద రూపాయలు అందించబోయాడు సారు.

‘అయ్యో సారు.. పర్వాలేదండి.. సేఠుకి తెలిసినవాళ్ళంటున్నారుగా... పైగా అమ్మకోసం అంటున్నారు. నాకు కూడా కొద్దో గొప్పో పుణ్యం వచ్చినట్టే అనుకుంటాను సారు. నాకెలాగూ ఎవ్వరూ లేరు..’ అంటూ చెప్పగా, ఆయన నా తల నిమిరి బయలదేరబోయారు.

‘సారు!’ అని పిలవగా, ఆయన ఆగి వెన్నకి తిరిగి నన్ను చూశారు, ‘ఇంతకీ మీ పేరేంటి?’

‘రాం సాగర్’

***

‘ఏంటి? వెయ్యి రూపాయిల బోణియా? ఎలా?’ అని అడిగాడు సేఠు.

‘రాం సాగర్ సారు వచ్చి మందులు తీసుకున్నారు సారు... మొత్తం వెయ్యి తొంభై అయ్యింది... మీకు తెలిసిన వాళ్ళని వెయ్యికే తీసుకున్నారు.’  అని చెప్పాను.

‘ఓహ్... రాం సాగర్.. ఆ... పర్లేదులే... పాపం అతని తల్లి గారికి ఒంట్లో బాగుండట్లేదు.. ముసలితనంగా...’ అని సేఠు కళ్ళలో నీళ్ళు తిరిగే సమయానికి ఒక్కసారిగా, ‘ఇదిగో రా... షాప్ చూసుకునందుకు థ్యాంక్స్.. ఇది తీసుకో..’ అని నాకో యాభై రూపాయల నోటు అందించారు.

‘ఏంటి సేఠు మీరు కూడా... దీనికి కూడా డబ్బు తీసుకుంటానా ఏంటి? ఊరుకోండి’ వెంటనే సేఠు గట్టిగా నవ్వి, ‘సరె... అయితే ఒక కప్పు టి ఇవ్వు..నీ టీ తాగనిదే నాకు రోజు గడవదు’

నేను టీ గ్లాస్‍లో పోసి సేఠు కి అందిస్తూ ఉండగా, ‘అవును... ఇంతకి, నువ్వు మందులు ఎలా ఇచ్చావు రా?’ అని అడిగాడు సేఠు.

‘మీరు నాకు ఇంగలీసు రాదనుకున్నారు సేఠు... బట్ ఐ నో ఇంగలీస్ గుడ్’ అంటు కన్ను కొట్టి చెప్పాను.

‘వార్ని..’ అంటు టీ చేతికందుకుని, ‘అయినా... వెయ్యి ఎలా అయ్యింది? ఆయన తీసుకునేది- నోజాఫిల్ 200, మార్కోస్ట్రిప్ బి.టి’ అంటూ ఓ పక్క గుర్తుతెచ్చుకుంటూనే, మరో పక్క ధర లెక్కపడుతూ, ‘..కార్లోకాప్స్.. అన్ని కలిపితే ఓ ఎనిమిదొందలవుతుంది.. మిగతా రెండొందలు ఏం తీసుకున్నారు?’ అని అడిగాడు.

‘కార్లోకాప్స్ ఆ? కాని అది కర్డోక్యాప్స్ కదా?’ అని అడిగా ఆశ్చర్యంగా.

‘కాదు కాదు... కార్డోక్యాప్స్ అన్నది గుండె జబ్బు వాళ్ళకి... కార్లోక్యాప్స్ అన్నది విటమిన్ ట్యాబ్‍లేట్...’ అంటు ఒక్కసారిగా సేఠు లేచి నా మొహంలో మొహం పెట్టి ఇలా అడిగారు- ‘కొంపతీసి నువ్వు తప్పు ట్యాబ్‍లేట్ అయితే ఇవ్వలేదుగా?’

అంతే. నాకింక ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయ్యింది. ఒక్కసారిగా ఆ డాక్టర్ చీటీ గుర్తొచ్చింది. అందులో కలిపి ఉన్న అక్షరాలు- కార్లోక్యాప్స్ అనే రాసి ఉండడం గుర్తొచ్చింది. నేను మాత్రం అతనికి కచ్చితంగా కార్డోక్యాప్స్ ఇచ్చాను.

‘ఊకోండి సేఠు.. నేను ఆయనకి కార్లోక్యాప్స్ ఇచ్చాను. ఆయనే ఆ చీటి ని చదువుతూ ‘కార్డోక్యాప్స్’ అని చెప్పారు.. కాని నేను దాని స్పెల్లింగ్ అక్షరం అక్షరం చూసి, అది సారు వారు తప్పు చెప్పారని తెలుసుకున్నా’ అని ఏం చెప్పాలో తెలియక అబద్ధం చెప్పేసా. ‘పక్కానా?’

‘హా సేఠు పక్కా...’

‘హమ్మయ్య... లేకపోతే కొంపలు మునిగిపోయేవి.’

‘ఊకోండి సేఠు.. ఒక్క గోలీ మారిపోతే ఏమవుతుంది చెప్పండి...’

‘చచ్చిపోతాడు.’ అని వెంటనే చెప్పాడు సేఠు.

నాకు ఒక్క సెకండ్ పాటు మళ్ళీ గుండె ఆగినంత పని అయ్యింది.

‘కార్డోక్యాప్స్ అన్నది చాలా స్ట్రాంగ్ మందు... అది కేవలం గుండె జబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే వేసుకోవాలి... వేరే ఎవరు వేసుకున్నాఎలర్జెక్ రియాక్షన్స్ తో గంటలో చచ్చిపోతారు.’

నా చేతులు మెళ్లగా వణకడం మొదలుపెట్టాయి.

‘ఇంతకీ అతని బిల్ వెయ్యి ఎలా అయిందో చెప్పలేదు...’ అని అడిగాడు సేఠు.

‘అది...అది... ఆయన తనకంటు... ఈనో.. సారిడాన్... ఇంకొన్ని మందులు తీసుకున్నారు సేఠు...’ అని చెప్పా నా భయాన్ని కప్పిపుచ్చుకుంటూ, ‘సరే సేఠు... మరి నేనిక వెళ్ళొస్తా...’ అని చెప్పి బయలదేరా.

సేఠు నన్ను టీ డబ్బులివ్వడానికి పిలవడం, పక్కన ఉన్న మిగతా షాప్ వాళ్ళు నన్ను టీ కోసం పిలవడం వినిపించినా, నేను స్పందించలేకపోతున్నా! నా మూలంగా ఓ ముసలావిడ ప్రాణం ప్రమాదంలో పడేటట్టుందన్న ఆలోచనకే నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. చెమటలు పట్టసాగాయి.  ఏదో ఒకటి చెయ్యాలి. అప్పుడే పక్కనున్న ఓ టీ.వీ. షోరూంలో ఉన్న టీ.వీ. లో ‘గుప్పెడు మనసు’ అన్న ఓ సీరియల్ మొదలైంది. అది ప్రతిరోజూ రాత్రి ఎనిమిదిన్నారికి మొదలవుతుంది. వెంటనే నాకు డాక్టర్ చీటీలోని కార్లోక్యాప్స్ కింద రెండు సున్నాలు గుర్తొచ్చాయి. దానికర్థం రాత్రి తిన్నాక వేసుకోవాలని. హైదరాబాదులో తొమ్మిది-తొమ్మిదున్నారకల్లా అందరు తినేస్తారు. ఇంకో గంట లోపల నేను ఆవిడని ఆ మందు తీసుకోవడం ఎలాగైనా ఆపాలి.

వెంటనే రోడ్డు మీద వెళ్తున్న ఓ ఆటో ని అపాను.

‘అన్నా... అర్జెంటుగా రామాంతపూర్ కాలని వెళ్ళాలి..’

నన్ను ఆ ఆటో డ్రైవర్ పైనుంచి కిందకి ఓ సారి చూసి, ‘వంద అవుతుంది’ అని చెప్పాడు.

‘నా దెగ్గర అంత లేదన్నా... ఎంతో కొంత తగ్గించుకోరాదె!’ అని అడిగాను.

‘ఎంతిస్తావ్?’

నేను వెంటనే నా జేబులో ఉన్న చిల్లరని గుప్పెట్లో తీసుకుని లెక్కపెట్టడం మొదలుపెట్టాను. మొత్తం ముప్పై ఎనిమిది రూపాయిలు.
‘అన్నా... నా దగ్గర పద్దెనిమిది మాత్రమే ఉందన్నా... ఎలాగైనా నన్ను రామాంతపూర్ తీసుకెళ్ళన్నా.. నేను నీకు ఈ నెల మొత్తం రెండు పూట్లా చాయి ఫ్రీగా ఇస్తానన్నా...’ అని బ్రతిమాలుతూ ఉండగానే ఆటోవాడు ముఖం తిప్పేసి బండీ స్టార్ట్ చెయ్యబోయాడు.

‘అన్నా.. ఒక్క నిమిషం ఆగన్నా...’ అని చెప్పి వెంటనే సేఠు దెగ్గరికి పరుగుతీసాను.

‘సేఠు... మీరిందాక నాకు యాభై ఇస్తానన్నారు కదా... ఇప్పుడు ఇస్తారా?’

***

‘శ్రీ సాయి నిలయం’..‘రాయుడు భవనం’...‘ప్రతాప నిలయం’.... ఇలా ఒక్కో ఇల్లు బయట ఉన్న అక్షరాలని చదువుతూ తొందర తొందరగా ముందుకుసాగుతూ ఉన్నాను. ఒక ఇంటి నుంచి ‘స్వాతి’ సీరియల్ పాట బయట వరకు వినిపించింది. అది రాత్రి తొమ్మిదింటికి మొదలవుతుందని గుర్తురాగానే నేను మరింత వేగంగా పరుగులు తీయసాగాను. కొద్ది దూరంలో ఉన్న అపార్ట్మెంట్ దెగ్గర పడుతున్నాకొద్ది గుండె మరింత వేగంగా కొట్టుకోసాగింది. ఆయన గనక ఏదైనా అపార్ట్మెంట్‍లో ఉంటె ఇక వెతికి పట్టుకోవడం చాలా కష్టం. ‘దేవుడా...ఎలాగైనా వాళ్ళని వెతికేంతవరకు ఆ ముసలావిడని ఆ తప్పుడు మందు వేసుకోకుండా చూడు’ అంటూ ముందుకు వెళ్ళగాని అపార్ట్మెంట్ పక్కనే ఉన్న ఓ చిన్న ఇల్లు బయట పెద్ద అక్షరాలలో ‘రాంసాగర్ నిలయం’ అని కనబడింది. నేనిక వెంటనే గేటు తీసి లోపలికెల్లాను. తలుపు తట్టే సమయానికి లోపలనుంచి పెద్ద పెద్ద శబ్దాలు వినపడ్డాయి. ఒక్కసారిగ ఉలిక్కిపడి అక్కడికక్కడే ఆగిపోయా. భయంకరమైన అరుపులు, స్టీలు సామనులు కింద పడే శబ్దాలు. మెల్లగా పక్కనున్న ఓ కిటికీ కొద్దిగా తెరిచి లోపల చూశాను.

అది ఆయన ఇల్లే. ఆయన రాంసాగర్ సారే. సారు డైనింగ్ టేబుల్ మీద కూర్చున్ని అన్నం తింటూ కనపడ్డారు. హమ్మయ్యా, ఇక్కడ ఇంకా ఎవరి భోజనాలూ అవనట్టుంది...మొత్తానికి సమాయనికే చేరుకున్నాననుకుంట! వెంటనే  సారు తల్లిగారి కోసం వెతకడం మొదలుపెట్టాను. అదేంటి..? ముసలావిడ కింద కూర్చునుంది? కాదు కాదు... కింద పడి ఉంది. తన ముందు ఉన్న కంచం ఎక్కడో పడి ఉండి, అన్నం చుట్టూ చిందర వందరగా పడి ఉంది.

‘ఒసేయ్ ఇక్కడ రావే...’ అని రాంసాగర్ సారు గట్టిగా అరిచేసరికి ఒక్కసారికి ఉలిక్కిపడ్డాను. భయం భయంగా ఒకావిడ అతని వైపు నడుచుకుంటూ వచ్చింది. సారు భార్య అనుకుంటా.

‘నీకెన్ని సార్లు చెప్పానే? ఆ ముసలి దానికి తిండి పెట్టదని ఎన్ని సార్లు చెప్పాను?’ అని గట్టి గట్టిగా అరుస్తూ, ‘అది బ్రతికి ఉండడం వల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదు. మీ ఇద్దరినే పోషించలేక చస్తూ ఉంటే, ఈ ముసలిదాన్ని కూడా పోషించాలా?’ అంటూ గట్టి గట్టిగా అరిచాడు రాంసాగర్.

‘పాపం అండి. ముసలావిడ...’ అంది రాంసాగర్ భార్య భయంతో వణకుతూ.

‘కన్న కొడుకునైన నాకు లేని ప్రేమ నీకెందుకే?’ అంటూ పక్కనున్న గ్లాసుని కింద పడి ఉన్న ముసలావిడ మీదకి విసిరాడు. నాకసలేం అర్థం కావట్లేదు.

పక్క రూంలో ఉన్న ఓ చిన్న పాప ‘అమ్మ..అమ్మ’ అంటూ ఏడవడం వినపడగానే, ‘మెల్లగా చెప్పండి.. పాప ఉలిక్కిపడుతుంది’ అంటు వణకుతూ చెప్పింది ఆవిడ.

రాంసాగర్ ఒక్కసారిగా లేచి తన భార్యని గట్టిగట్టిగా కొట్టసాగాడు. భయంతో పాపం పాప ఏడుపాపేసి కళ్ళుమూసుకుంది.

‘ఇంకొక్క మాట మాట్లాడినా చంపేస్తా’ అంటూ ఓ బూతు తిట్టాడు, ‘రోజూ మిమ్మల్ని కొట్టి కొట్టి నాకు విసుకెత్తుతున్నా, కొట్టించుకునేందుకు మీకు రోత పుట్టట్లేదు’.

పాపం ఆవిడ వెంటనే తన గదిలోకి వెళ్ళి తన పాపని ఎత్తుకుని ఏడవసాగింది.

రాంసాగర్ మెల్లగా తన తల్లి వైపు బయలుదేరుతూ ఉండగా ఆ తల్లి భయంతో వెనక్కి జరుగుతూ ఉంది. నా గుండె చప్పుడు నాకే వినపడేంత వేగంగా కొట్టుకోసాగింది.

ఆయన వంగి, తన తల్లి జుట్టు పట్టుకుని ‘చచ్చిపోవే...నువ్వు బ్రతికుండడం వళ్ళ నాకే లాభం లేదు.’ అంటూ లేచి ఓ బూతు తిట్టాడు, నేను వినలేక చెవులు మూసుకున్నా. ఒక్కసారిగా ఆ ముసలవ్వని కాలితో గట్టిగా తన్నాడు రాంసాగార్.

నా కళ్ళలోంచి నీళ్ళు పారసాగయి. అసలు కొద్ది గంటల క్రితం చూసిన రాంసాగర్ సారేనా ఇలా నరరూప రాక్షసుడిలా కనిపిస్తోంది?
ఇంట్లో అందరూ భోరున వాళ్ళలో వాళ్ళే ఏడుస్తూ ఉన్నారు.. పాపం ముసలవ్వ దేవుడికి దణ్ణం పెట్టుకుంటూ ఉంది. రాంసాగర్ మాత్రం ఏదీ ఎరగనట్టు చెయ్యి కడుకున్నాడు. అప్పుడు తీసాడు ఆయన మందుల సంచి.  లోపలనుంచి మందులు తీసి, ఒక్కొక్క గోలిని అరచేతిలో తీసుకుంటూ ఉన్నాడు. అప్పుడే నాకు కార్డోక్యాప్స్ కనిపించింది. వెంటనే నేను అక్కడికి ఎందుకొచ్చానో గుర్తొచ్చింది. నేను గనక ఇప్పుడు ఆ గోలీని ముసాలావిడ వేసుకొవడం ఆపకపోతే, ఆ కిరాతకుడు కోరుకున్నట్టుగానే తను చనిపోతుంది. ఎలాగైనా ఆపాలి. ఎలా?
అప్పుడే ఆ గోలీలు రాంసాగార్ వేసుకోబోయాడు. అదేంటి? అది ముసలవ్వకి కద?

వేసుకునే ముందు ఒక్క సెకెండు ఆగి, కింద పడి ఉన్న తన తల్లి ని చూస్తూ, ‘నీ వల్ల నాకొచ్చే లాభమల్లా నీ పేరు చెబితే జాలితో నా మందులు మీద ఓ వంద తగ్గుతుంది. అంతకి మించి ఏం లేదు... ముసలి నక్క!’ అని తిడుతూ మందులు వేసుకోబోయాడు.
నేను ఆపలేదు.

అదేంటో, రాం సాగర్ అలా ఆ విషసమాన గోలి వేసి గుటకేయగానే నా ముఖాన ఓ చిరునవ్వు మొలిచింది. మనసు తేలికపడింది. నేను వెనక్కి తిరిగి, కళ్ళ నీళ్ళు తుడుచుకుని బయలదేరసాగాను.

అసలు ఎవరైన తన పెళ్ళం పిల్లలని అంత కృరంగా చూసుకుంటారా? అసలు కన్న తల్లిని అలా తిడతారా? చెయ్యిచేసుకుంటారా? కాలితో తంతారా? అది కూడా ఆ వయసులో!  వాడు మనిషే కాదు! రాక్షసుడు. అందుకేనేమొ..వాడిని సంహరించడానికి దేవుడు నన్ను సరైన సమయానికి సేఠు షాపులో కూర్చోపెట్టాడు. రేపటినుంచి ఈ ఇంట్లోకి ఇక ఎవ్వరికీ ఈ కిరాతకుడి బాధ ఉండదు.

ఇనాళ్ళుగా సేఠు రాంసాగర్ లాంటి రాక్షసుడికి సరైన మందు ఇచ్చి తప్పు చేశాడు... నేను ఒక్కసారి తప్పు మందు ఇచ్చి సరైన పని చేశాను.
ఇలాంటి రాక్షసులకి విషమే సరైన ఔషదం!

 

 

 

 

మరిన్ని కథలు